Inter girl student
-
బస్సాపండంకుల్ ప్లీజ్..!
ర్యాంకులు, గ్రేడ్లు, పర్సెంటైల్స్ ఏవో ఉంటాయి.. అవన్నీ ధైర్యంగా ఇంట్లోంచి బయటికి వెళ్లి చదివొచ్చినందుకు అనిపిస్తుంది ఫలితాలు వెల్లడైన రోజు తల్లిదండ్రులకు. వాళ్లనింకా పిల్లలనే అనాలి. ఇంటర్లోకి అడ్మిషన్ తీసుకున్నారు కనుక ఫస్ట్ డే, ఫస్ట్ బెల్తోనే పెప్పర్ స్ప్రేని పట్టుకోవడం చేతనౌతుందా! ఇన్నాళ్లూ ఇంటి దగ్గరి స్కూలు. ఇప్పుడు ఊరికి దూరంగా ఉండే కాలేజి. భద్రంగా వెళ్లి రావాలన్నది ఇంట్లో ఫస్ట్ లెసన్. బయట కుదురుగా ఉండాలనేది నాన్–డీటెయిల్డ్. అమ్మ చెబుతుంది ఒంటి మీది బట్టలు సరిచేస్తూ.. డీటెయిల్స్ అవసరం లేని పాఠం. పిల్లలకూ అర్థం కానిదేం కాదు. లోకంలో జరిగేవి వింటూనే, చూస్తూనే కదా రోజూ ధైర్యంగా స్కూల్‌కి వెళ్లొస్తున్నారు, టెన్త్ పూర్తి చేస్తున్నారు, ధైర్యంగా ఇంటర్లో జాయిన్ అవుతున్నారు, ధైర్యంగా కాలేజ్‌కి వెళ్లొస్తున్నారు. ధైర్యం కావాలిప్పుడు ఆడపిల్లలకు సర్టిఫికెట్ చేతిలోకి రావడానికి. ర్యాంకులు, గ్రేడ్లు, పర్సెంటైల్స్ ఏవో ఉంటాయి.. అవన్నీ ధైర్యంగా ఇంట్లోంచి బయటికి వెళ్లి చదివొచ్చినందుకు అనిపిస్తుంది ఫలితాలు వెల్లడైన రోజు తల్లిదండ్రులకు. గ్రేటర్ నోయిడాలో ఇద్దరు పిల్లలు కాలేజ్‌కి వెళ్లేందుకు బస్సెక్కారు. ప్రైవేటు బస్సు. రోజూ వెళ్లొచ్చే రూట్లోనే చేతికి అందిన బస్సు. బస్సులో వీళ్లిద్దరు ఉన్నారు. వీళ్ల ముందు సీట్లలో నలుగురు అబ్బాయిలు ఉన్నారు. ఆ అబ్బాయిలు ఈ ఇద్దరు అమ్మాయిల కన్నా వయసులో కొంచెం పెద్దవాళ్లు. కాలేజ్‌మేట్స్ కాదు. ఎవరో. బస్సు ఎక్కినప్పట్నుంచీ ఆపకుండా వీళ్లపై కామెంట్స్ చేస్తూనే ఉన్నారు. ‘చిక్కావు చేతిలో చిలకమ్మా..’ టైప్ కామెంట్స్. అమ్మాయిలకు భయం వేసింది. చూసి చూసి ఇక ధైర్యంగా ఉండలేక బస్సు ఆపమని డ్రైవర్ దగ్గరికి వెళ్లి రిక్వెస్ట్ చేశారు. ‘ఎక్కడపడితే అక్కడ ఆగదమ్మా..’ అన్నాడు డ్రైవర్. కనీసం బీరంపూర్ బస్టాప్లోౖనైనా బస్సును ఆపాలి. ఆ స్టాప్‌లో బస్ ఎక్కడం కోసం ఈ ఇద్దరమ్మాయిల క్లాస్మేట్స్ నిలబడి ఉన్నారు. ‘అంకుల్ ఆపండి ప్లీజ్..’ అన్నారు వీళ్లు. అక్కడా ఆపలేదు. ఆ స్టాప్ దాటితే బులంద్‌షహర్ స్టాప్. వీళ్లు దిగాల్సింది బులంద్ షహరే. ఇంకా కొంత దూరం ఉంది. బస్సు పోతూనే ఉంది. బస్సు ఆపమని వీళ్లు అడుగుతుండడం, డ్రైవర్ ఆపకపోవడం చూసి అబ్బాయిలకు ఉత్సాహం వచ్చేసింది. ‘ఈరోజు బస్సు ఆగదు’ (‘ఆజ్ తో నహీ రుకేగీ బస్’) అని ఒక అబ్బాయి అన్నాడు. అప్పుడు మొదలైంది ఈ పిల్లలకు వణుకు. ఆగని బస్సుల్లో ఏం జరిగే ప్రమాదం ఉంటుందో వాళ్ల ఊహకు వచ్చి ఉండాలి. ‘అంకుల్.. బస్ ఆపండి’ అని పెద్దగా అరిచారు. బస్సు ఆగలేదు. వేగం తగ్గలేదు. ఆ వేగంలోనే బస్ డోర్ నెట్టుకుని ఒకరి వెనుక ఒకరు బయటికి దూకేశారు! వాళ్లలో ఒకమ్మాయి తలకు, నడుముకు బలమైన దెబ్బలు తగిలాయి. పాదం, మణికట్టు నలిగిపోయాయి. ఇంకో అమ్మాయి కాలు, చెయ్యి ఫ్రాక్చర్ అయ్యాయి. అదృష్టం.. వీళ్లు కిందపడ్డ క్షణంలో వెనుక నుంచి వాహనాలేమీ రాలేదు. పెద్దవాళ్లొచ్చి పిల్లల్ని ఆసుపత్రికి తీసుకెళ్లారు. పిల్లల్ని ఏడిపించిన అబ్బాయిలు దొరకలేదు. బస్సు ఆపని డ్రైవర్ మీద ఎఫ్.ఐ.ఆర్. రిజిస్టర్ అయింది. ఐపీసీ లోని ఓ మూడు సెక్షన్ల కింద కేసు పెట్టారు. బండిని వేగంగా నడపడం, తీవ్ర గాయాలకు కారణమవడం, వ్యక్తులకు దెబ్బలు తగిలించడం.. సెక్షన్ 279, 338, 337. కామెంట్స్ చేసిన ఆ మగపిల్లలపై కేసులు వద్దనుకున్నారు ఆడపిల్లల పేరెంట్స్. మళ్లీ ఆ దారిలోనే కదా పిల్లలు రోజూ వెళ్లిరావాలి! లోకంలోకి అప్పుడప్పుడే అడుగు పెడుతున్న ఇద్దరు ఆడపిల్లలు ఏ కారణంగానో భయపడి బస్సును ఆపమని బతిమాలినా ఆపకుండా బస్సును పోనిచ్చినందుకు అంటూ డ్రైవర్‌పై పెట్టడానికి ఐపీసీలో ప్రత్యేకంగా ఒక సెక్షన్ ఉండదు. ఉన్న సెక్షన్లలోనే కాస్త దగ్గరగా ఉన్న వాటిని చూసి ఆ సెక్షన్ల కింద డ్రైవర్‌ను అరెస్టు చేస్తారు. నోయిడా పోలీసులూ అంతవరకే చేయగలిగారు. అసలైతే డ్రైవర్‌పై ‘నిర్భయ’ కేసు పెట్టాలి. ఎనిమిదేళ్ల క్రితం ఢిల్లీలో రాత్రి 10 గంటలకు బస్సులో జరిగిన ఆ ఘటనకు, వారం క్రితం నోయిడాలో పగలు 10 గంటలకు బస్సులో జరిగిన ఈ ఘటనకు తేడా ఏం లేదు. ‘ఈరోజు బస్సు ఆగదు’ అన్నాక, ఆ మగపిల్లల్లో ఇంకొకరు ‘మజాగా ఉంటుందిక’ (‘మజా ఆగయా’) అనడం విని డ్రైవర్‌కి కూడా మజా వచ్చి ఉంటే బస్సు ఏ ఒంటరి ప్రదేశం లోనికో మలుపు తిరిగి ఉండేది. మహిళల రక్షణకు, భద్రతకు చట్టం గట్టి కాపలాల్నే పెట్టింది. బయటే కాదు, సొంత ఇంట్లోనైనా ఆమెపై ఏదైనా జరగబోతుంటే ఒక్క కాల్‌తో పోలీసులు వచ్చేస్తారు. అమ్మాయిలకు రెస్పెక్ట్ ఇచ్చేలా అబ్బాయిల్ని పెంచే తల్లిదండ్రుల ‘న్యూ ఎరా’ ఒకటి కూడా ఆల్రెడీ గర్ల్స్‌కి బాయ్స్ చేత నమస్తే పెట్టిస్తోంది. మరింకేంటి?! గట్టి చట్టం, బుద్ధి కలిగిన బాయ్స్. హ్యాపీనే కదా. కాదు! స్టీరింగ్ గర్ల్స్ చేతుల్లో ఉండాలి. లెజిస్లేచర్, జుడీషియరీ, ఎగ్జిక్యూటివ్, ప్రెస్ అనే ఫోర్–వీలర్ స్టీరింగ్‌ని గర్ల్స్ తమ చేతుల్లోకి తీసుకోవాలి. నోయిడాలో ఆ బస్సు స్టీరింగ్ ఒక మహిళ చేతిలో ఉండి ఉంటే ఏం జరిగి ఉండేదో ఊహించండి. అమ్మాయిల్ని వేధించినందుకు.. ‘బస్ ఆపండి ఆంటీ ప్లీజ్.. దిగిపోతాం’ అని అబ్బాయిలు ప్రాధేయపడుతుండేవాళ్లు.. బస్సు పోలీస్ స్టేషన్ వైపు మలుపు తిరుగుతుంటే. – మాధవ్ శింగరాజు -
జుట్టు మందు వికటించి ఇంటర్ విద్యార్థిని మృతి
సాక్షి, ఎమ్మిగనూరు : వైద్యం వికటించి ఓ విద్యార్థిని మృతిచెందిన ఘటన పట్టణంలో ఆదివారం చోటుచేసుకుంది. మృతురాలి బంధువులు తెలిపిన వివరాలు.. పట్టణంలోని హరిజనవాడకు చెందిన కదిరికోట నరసన్న, రామేశ్వరమ్మ కుమార్తె మౌనిక(19) స్థానిక ప్రభుత్వ బాలికల జూనియర్ కాలేజీలో ఇంటర్మీడియట్ రెండో సంవత్సవరం చదువుతోంది. తల జుట్టు రాలుతుండటంతో పాటు, వెంట్రుకలు ఒత్తుగా రావడానికి శివ సర్కిల్లోని పల్లవి పాలీ క్లినిక్ మెడికల్‌షాప్‌కు కర్నూల్ నుంచి వస్తున్న డాక్టర్ శరత్చంద్ర వద్ద 2 నెలల క్రితం చూపించుకుంది. డాక్టర్ ఇచ్చిన మందులు వాడటంతో శరీరంపై బొబ్బలు వచ్చాయి. ఇదే విషయాన్ని మెడికల్ షాప్ నిర్వాహకుల దృష్టికి తీసుకెళ్లారు. డాక్టర్‌ను రప్పించాలని లేదా ఫోన్లో విషయం చెప్పాలని వేడుకున్నారు. అయినా వారు తొందర పడొద్దని, తగ్గిపోతుందని, నిర్లక్ష్యంగా సమాధానం ఇచ్చి ఇంటికి పంపేశారు. మూడు రోజులుగా మెడికల్‌షాప్ వద్దకు తిరుగున్నా పట్టించుకోకపోవటంతో ఆదివారం రాత్రి విద్యార్థినికి ఆరోగ్యం విషమించి మృతి చెందింది. దీంతో కుటుంబ సభ్యులు ఆగ్రహంతో సోమవారం మెడికల్ షాప్ దగ్గకు చేరుకొని ఆందోళనకు దిగారు. మెడికల్ షాప్‌కు తాళం వేసి, పోలీసుకుల సమాచారం ఇచ్చారు. డాక్టర్‌పైనా, మెడికల్ షాపు నిర్వాహకులపైనా చర్యలు తీసుకోవాలని మృతురాలు కుటుంబ సభ్యులు కోరారు. -
విద్యార్థిని ఆత్మహత్య.. యువకుని ఇంటి ముందు ధర్నా
సాక్షి, జయశంకర్ భూపాలపల్లి : ప్రేమ పేరుతో మోస పోయానని మనస్థాపం చెందిన ఓ ఇంటర్మీడియట్ విద్యార్థిని పురుగుల మందు తాగి ఆత్మహత్యకు ఘటన జయశంకర్ జిల్లాలో కలకలం రేపింది. పోలీసులు, స్థానికులు చెప్పిన వివరాల ప్రకారం.. వెంకటాపూర్ మండలం పాలంపేట గ్రామానికి చెందిన బోడ సింధుజా ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం చదువుతోంది. ఇదే గ్రామానికి చెందిన కొండ బత్తుల రమేష్ అనే యువకుడు ప్రేమ పేరుతో సింధుజాను మోసం చేశాడు. దీంతో మనస్థాపం చెందిన సింధుజా పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడింది. ఇంట్లో విగతజీవిగా పడిఉన్న కూతుర్ని చూసి తల్లిదండ్రులు కన్నీరుమున్నీరయ్యారు. తమ కూతుర్ని మోసం చేసిన వ్యక్తిని కఠినంగా శిక్షించాలంటూ పార్థివ దేహంతో యువకుడి ఇంటి ముందు ధర్నాకు దిగారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని పరిస్థితిని సమీక్షించారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా చర్యలు తీసుకుంటున్నారు. నిందితుడు పరారిలో ఉన్నాడని పోలీసులు పేర్కొన్నారు. -
'మా కూతుర్ని వేధిస్తున్నారు.. శిక్షించండి'
తిరుపతి: తమ కూతురిని ప్రేమ పేరుతో వేధించిన ఓ ఇద్దరు యువకులను కఠినంగా శిక్షించాలని ఇంటర్ విద్యార్థిని తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటన బుధవారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళితే.. చంద్రిక అనే ఇంటర్ విద్యార్థినిని ఓ ఇద్దరు యువకులు ప్రేమ పేరుతో వేధించసాగారు. యశ్వంత్, నవీన్ అనే ఇద్దరు యువకులు ప్రతిరోజూ ఆమెను ప్రేమిస్తున్నామంటూ వేధిస్తూ వెంటబడేవారు. ఈ క్రమంలో వారి మాట వినలేదని ఆమెను బైక్‌తో ఢీకొట్టించారు. దాంతో విద్యార్థినికి తీవ్రగాయాలయ్యాయి. ఇప్పుడా ఆ విద్యార్థిని మంచానికే పరిమితమైంది. వాళ్లు చాలా అమానుషంగా వ్యవహరించారని బాధితురాలు చంద్రిక వాపోయింది. ఇదే విషయాన్ని ఆమె తల్లిదండ్రులకు చెప్పింది. దాంతో చంద్రిక తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ కేసులో తిరుపతి పోలీసులు ఆలస్యంగా మేల్కొన్నారు. బాధితురాలు చంద్రిక డీఎస్పీ మురళీకృష్ణ, సీఐ అంజూ యాదవ్‌లకు జరిగిన విషయాన్ని అంతా వివరించింది. చంద్రిక స్టేట్మెంట్ ను డీఎస్పీ రికార్డు చేశారు. తమకు న్యాయం చేయాలని చంద్రిక తల్లిదండ్రులు పోలీసులను వేడుకున్నారు. యశ్వంత్, నవీన్ ఇద్దరు యువకులను కఠినంగా శిక్షించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. తల్లిదండ్రుల ఫిర్యాదుతో అలిపిరి పోలీసులు కేసు నమోదు చేశారు. విద్యార్థినిని వేధించిన నవీన్, యశ్వంత్‌లను పోలీసులు అరెస్ట్ చేసి నిర్భయ చట్టం కింద కేసు నమోదు చేశారు. -
విద్యార్థినిపై లెక్చరర్ కీచక పర్వం
కర్నూలు: జిల్లా బనగానపల్లి ప్రభుత్వ జూనియర్ కాలేజీలో ఓ లెక్చరర్ కీచకపర్వానికి తెరతీశాడు. తండ్రి వయస్సున్న లెక్చరర్ ఓ ఇంటర్ విద్యార్థినిని లైంగికంగా వేధిస్తూ పెళ్లి చేసుకుంటానంటూ వెంటపడ్డాడు. ఆ విద్యార్థిని ఎన్నిసార్లు తిరస్కరించినా అతడి ప్రవర్తనలో మార్పు రాకపోవడంతో తల్లిదండ్రులకు ఫిర్యాదు చేసింది. దీంతో కుటుంబ సభ్యులు, బంధువులు ఆ లెక్చరర్‌కు దేహ శుద్ధి చేశారు. తర్వాత పోలీసులకు అప్పగించారు. సదరు లెక్చరర్‌పై ఇదివరకు కూడా ఆరోపణలు ఉన్నాయని తెలుస్తోంది. విద్యార్థినులతో ఆయన వ్వవహర శైలిపై కూడా ఫిర్యాదులు వచ్చాయి. కేసు నమోదుచేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. -
తల్లి మందలించిందని ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్య
తవణంపల్లె(చిత్తూరు): తల్లి మందలించిందనే మనస్తాపంతో చిత్తూరులో ఆదివారం ఓ విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడింది. ఈ సంఘటన సోమవారం వెలుగుచూసింది. ఆమె బంధువుల కథనం మేరకు వివరాలివీ...తవణంపల్లె మండలం దిగువ మాఘం గ్రామానికి చెందిన కె.శివప్రసాద్, వాణి దంపతులు చిత్తూరు నగరంలోని దుర్గానగర్ కాలనీలో ఉంటున్నారు. వారికి కుమార్తెలు అభి, అనుష్న ఉన్నారు. చిన్న కుమార్తె అనుష్న ఇంటర్ ద్వితీయ సంవత్సరం (బైపీసీ) చదువుతోంది. మొదటి సంవత్సరంలో రాష్ట్రస్థాయి ర్యాంకు సాధించింది. ఆమెను పైచదువులు చదివించే విషయమై ఆదివారం తల్లిదండ్రులు మాట్లాడుతుండగా తాను మెడిసిన్ చదువుతానని అనుష్న చెప్పింది. తమకు అంత ఆర్థిక స్తోమత లేదని తల్లి వాణి మందలించింది. తర్వాత భార్యభర్తలిద్దరూ ఓ కార్యక్రమానికి హాజరు కావడానికి కీనాటంపల్లెకు వెళ్లారు. తల్లి మందలించడంతో తీవ్ర మనస్తాపానికి గురైన అనుష్న ఇంట్లో ఫ్యాన్‌కు ఉరివేసుకుంది. బయటకు వెళ్లిన శివప్రసాద్, వాణి ఇంటికి ఫోన్ చేశారు. రింగ్ అవుతున్నా ఎత్తలేదు. వారు ఇంటికి వచ్చి చూడగా అప్పటికే కుమార్తె అనూష్న(17) శవమై ఉండడంతో కుప్పకూలిపోయారు. సోమవారం తమ స్వగ్రామం దిగువమాఘంలో దహనక్రియలు చేశారు. -
ఇంటర్ విద్యార్థినిపై ఇద్దరు యువకుల అత్యాచారం
ముజప్పర్ నగర్: ఇంటర్ విద్యార్థినిపై ఇద్దరు యువకులు అత్యాచారానికి పాల్పడిన ఘటన శనివారం వెలుగులోకి వచ్చింది. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని ముజప్ఫానగర్లో సివిల్ లైన్స్ ప్రాంతంలో శుక్రవారం చోటుచేసుకున్నట్టు పోలీసులు పేర్కొన్నారు. వివరాల్లోకి వెళితే.. ఇంటర్ ద్వితీయ సంవత్సరం చదువుతున్న ఓ విద్యార్థినిని రాహుల్, శివం అనే ఇద్దరు యువకులు కాలేజీ నుంచి అపహరించారు. అనంతరం ఆ విద్యార్థిని సమీపంలోని ఓ ఇంట్లోకి తీసుకెళ్లి అత్యాచారం చేసినట్టు పోలీసులు పేర్కొన్నారు. అయితే తమ కూతురిని ఇద్దరు యువకులు అపహరించి అత్యాచారానికి పాల్పడ్డారంటూ బాధితురాలి తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. దాంతో ఆమె ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుల కోసం గాలిస్తున్నారు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
ఇంటర్ విద్యార్థినిపై కీచక లెక్చరర్ అకృత్యం...
ఒంగోలు(ప్రకాశం): గురువే ప్రత్యక్ష దైవం అంటారు. అలాంటి పవిత్రమైన ఆ గురువు స్థానానికి తీరని మచ్చను తెచ్చాడో కీచక లెక్చరర్. విద్యాబుద్ధులు నేర్పించాల్సిన గురువే.. దారితప్పి ప్రవర్తించాడు. పాఠాలు చెప్పాల్సిన పంతులు ఇంటర్ విద్యార్థినిని లైంగిక వేధింపులకు గురిచేశాడు. విద్యార్థిని నిరాకరించడంతో ఇంటర్ ప్రాక్టికల్స్‌లో ఫెయిల్ చేస్తానంటూ బెదిరించి రూమ్‌కు తీసుకెళ్లి ఆమెపై పలుమార్లు అత్యాచారం చేశాడు. దాంతో ఆమె తనను పెళ్లిచేసుకోవాలంటూ లెక్చరర్‌ను నిలదీసింది. అందుకు మొదట్లో పెళ్లికి సరేనన్న.. చివరకు లెక్చరర్ మోహం చాటేశాడు.. అతడి మాటలు నమ్మిన విద్యార్థిని చివరకు మోసపోయానని తెలుసుకుంది. ఈ ఘటన ప్రకాశం జిల్లాలోని లింగసముద్రం మండలంలో వెలుగుచూసింది. అయితే తనకు న్యాయం చేయాలంటూ విద్యార్థిని పోలీసులను ఆశ్రయించింది. కీచక లెక్చరర్‌పై ఫిర్యాదు చేసింది. కానీ పోలీసులు పట్టించుకోలేదంటూ బాధితురాలు వాపోయింది. ఫిర్యాదు చేసినా కూడా పోలీసులు లెక్చరర్‌ను అరెస్ట్ చేయలేదంటూ విద్యార్థినీ ఆవేదనను వెలిబుచ్చింది. -
విజయవాడలో ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్య
విజయవాడ: ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన సోమవారం స్థానికంగా కలకలం రేపింది. విజయవాడ శివారులోని ఓ కార్పొరేట్ కాలేజీలో ఇంటర్ చదువుతున్న విజయ అనే విద్యార్థిని ఆత్మహత్య పాల్పడింది. విజయ కృష్ణాజిల్లాలోని జగ్గయపేట చిల్లకల్లు మండలానికి చెందిన విద్యార్థినిగా పోలీసులు గుర్తించారు. విజయ ఆత్మహత్యకు గల కారణాలు తెలియరాలేదు.