ప్రతీకాత్మక చిత్రం
ర్యాంకులు, గ్రేడ్‌లు, పర్సెంటైల్స్ ఏవో ఉంటాయి.. అవన్నీ ధైర్యంగా ఇంట్లోంచి బయటికి వెళ్లి చదివొచ్చినందుకు అనిపిస్తుంది ఫలితాలు వెల్లడైన రోజు తల్లిదండ్రులకు. వాళ్లనింకా పిల్లలనే అనాలి. ఇంటర్‌లోకి అడ్మిషన్ తీసుకున్నారు కనుక ఫస్ట్ డే, ఫస్ట్ బెల్‌తోనే పెప్పర్ స్ప్రేని పట్టుకోవడం చేతనౌతుందా! ఇన్నాళ్లూ ఇంటి దగ్గరి స్కూలు. ఇప్పుడు ఊరికి దూరంగా ఉండే కాలేజి. భద్రంగా వెళ్లి రావాలన్నది ఇంట్లో ఫస్ట్ లెసన్. బయట కుదురుగా ఉండాలనేది నాన్–డీటెయిల్డ్. అమ్మ చెబుతుంది ఒంటి మీది బట్టలు సరిచేస్తూ.. డీటెయిల్స్ అవసరం లేని పాఠం. పిల్లలకూ అర్థం కానిదేం కాదు. లోకంలో జరిగేవి వింటూనే, చూస్తూనే కదా రోజూ ధైర్యంగా స్కూల్‌కి వెళ్లొస్తున్నారు, టెన్త్ పూర్తి చేస్తున్నారు, ధైర్యంగా ఇంటర్‌లో జాయిన్ అవుతున్నారు, ధైర్యంగా కాలేజ్‌కి వెళ్లొస్తున్నారు. ధైర్యం కావాలిప్పుడు ఆడపిల్లలకు సర్టిఫికెట్ చేతిలోకి రావడానికి. ర్యాంకులు, గ్రేడ్‌లు, పర్సెంటైల్స్ ఏవో ఉంటాయి.. అవన్నీ ధైర్యంగా ఇంట్లోంచి బయటికి వెళ్లి చదివొచ్చినందుకు అనిపిస్తుంది ఫలితాలు వెల్లడైన రోజు తల్లిదండ్రులకు.
గ్రేటర్ నోయిడాలో ఇద్దరు పిల్లలు కాలేజ్‌కి వెళ్లేందుకు బస్సెక్కారు. ప్రైవేటు బస్సు. రోజూ వెళ్లొచ్చే రూట్‌లోనే చేతికి అందిన బస్సు. బస్సులో వీళ్లిద్దరు ఉన్నారు. వీళ్ల ముందు సీట్లలో నలుగురు అబ్బాయిలు ఉన్నారు. ఆ అబ్బాయిలు ఈ ఇద్దరు అమ్మాయిల కన్నా వయసులో కొంచెం పెద్దవాళ్లు. కాలేజ్‌మేట్స్ కాదు. ఎవరో. బస్సు ఎక్కినప్పట్నుంచీ ఆపకుండా వీళ్లపై కామెంట్స్ చేస్తూనే ఉన్నారు. ‘చిక్కావు చేతిలో చిలకమ్మా..’ టైప్ కామెంట్స్. అమ్మాయిలకు భయం వేసింది. చూసి చూసి ఇక ధైర్యంగా ఉండలేక బస్సు ఆపమని డ్రైవర్ దగ్గరికి వెళ్లి రిక్వెస్ట్ చేశారు. ‘ఎక్కడపడితే అక్కడ ఆగదమ్మా..’ అన్నాడు డ్రైవర్. కనీసం బీరంపూర్ బస్టాప్‌లోౖనైనా బస్సును ఆపాలి. ఆ స్టాప్‌లో బస్ ఎక్కడం కోసం ఈ ఇద్దరమ్మాయిల క్లాస్‌మేట్స్ నిలబడి ఉన్నారు. ‘అంకుల్ ఆపండి ప్లీజ్..’ అన్నారు వీళ్లు. అక్కడా ఆపలేదు. ఆ స్టాప్ దాటితే బులంద్‌షహర్ స్టాప్. వీళ్లు దిగాల్సింది బులంద్ షహరే. ఇంకా కొంత దూరం ఉంది. బస్సు పోతూనే ఉంది. బస్సు ఆపమని వీళ్లు అడుగుతుండడం, డ్రైవర్ ఆపకపోవడం చూసి అబ్బాయిలకు ఉత్సాహం వచ్చేసింది.
‘ఈరోజు బస్సు ఆగదు’ (‘ఆజ్ తో నహీ రుకేగీ బస్’) అని ఒక అబ్బాయి అన్నాడు. అప్పుడు మొదలైంది ఈ పిల్లలకు వణుకు. ఆగని బస్సుల్లో ఏం జరిగే ప్రమాదం ఉంటుందో వాళ్ల ఊహకు వచ్చి ఉండాలి. ‘అంకుల్.. బస్ ఆపండి’ అని పెద్దగా అరిచారు. బస్సు ఆగలేదు. వేగం తగ్గలేదు. ఆ వేగంలోనే బస్ డోర్ నెట్టుకుని ఒకరి వెనుక ఒకరు బయటికి దూకేశారు! వాళ్లలో ఒకమ్మాయి తలకు, నడుముకు బలమైన దెబ్బలు తగిలాయి. పాదం, మణికట్టు నలిగిపోయాయి. ఇంకో అమ్మాయి కాలు, చెయ్యి ఫ్రాక్చర్ అయ్యాయి. అదృష్టం.. వీళ్లు కిందపడ్డ క్షణంలో వెనుక నుంచి వాహనాలేమీ రాలేదు.
పెద్దవాళ్లొచ్చి పిల్లల్ని ఆసుపత్రికి తీసుకెళ్లారు. పిల్లల్ని ఏడిపించిన అబ్బాయిలు దొరకలేదు. బస్సు ఆపని డ్రైవర్ మీద ఎఫ్.ఐ.ఆర్. రిజిస్టర్ అయింది. ఐపీసీ లోని ఓ మూడు సెక్షన్‌ల కింద కేసు పెట్టారు. బండిని వేగంగా నడపడం, తీవ్ర గాయాలకు కారణమవడం, వ్యక్తులకు దెబ్బలు తగిలించడం.. సెక్షన్ 279, 338, 337. కామెంట్స్ చేసిన ఆ మగపిల్లలపై కేసులు వద్దనుకున్నారు ఆడపిల్లల పేరెంట్స్. మళ్లీ ఆ దారిలోనే కదా పిల్లలు రోజూ వెళ్లిరావాలి! లోకంలోకి అప్పుడప్పుడే అడుగు పెడుతున్న ఇద్దరు ఆడపిల్లలు ఏ కారణంగానో భయపడి బస్సును ఆపమని బతిమాలినా ఆపకుండా బస్సును పోనిచ్చినందుకు అంటూ డ్రైవర్‌పై పెట్టడానికి ఐపీసీలో ప్రత్యేకంగా ఒక సెక్షన్ ఉండదు. ఉన్న సెక్షన్లలోనే కాస్త దగ్గరగా ఉన్న వాటిని చూసి ఆ సెక్షన్‌ల కింద డ్రైవర్‌ను అరెస్టు చేస్తారు. నోయిడా పోలీసులూ అంతవరకే చేయగలిగారు. అసలైతే డ్రైవర్‌పై ‘నిర్భయ’ కేసు పెట్టాలి. ఎనిమిదేళ్ల క్రితం ఢిల్లీలో రాత్రి 10 గంటలకు బస్సులో జరిగిన ఆ ఘటనకు, వారం క్రితం నోయిడాలో పగలు 10 గంటలకు బస్సులో జరిగిన ఈ ఘటనకు తేడా ఏం లేదు. ‘ఈరోజు బస్సు ఆగదు’ అన్నాక, ఆ మగపిల్లల్లో ఇంకొకరు ‘మజాగా ఉంటుందిక’ (‘మజా ఆగయా’) అనడం విని డ్రైవర్‌కి కూడా మజా వచ్చి ఉంటే బస్సు ఏ ఒంటరి ప్రదేశం లోనికో మలుపు తిరిగి ఉండేది.
మహిళల రక్షణకు, భద్రతకు చట్టం గట్టి కాపలాల్నే పెట్టింది. బయటే కాదు, సొంత ఇంట్లోనైనా ఆమెపై ఏదైనా జరగబోతుంటే ఒక్క కాల్‌తో పోలీసులు వచ్చేస్తారు. అమ్మాయిలకు రెస్పెక్ట్ ఇచ్చేలా అబ్బాయిల్ని పెంచే తల్లిదండ్రుల ‘న్యూ ఎరా’ ఒకటి కూడా ఆల్రెడీ గర్ల్స్‌కి బాయ్స్ చేత నమస్తే పెట్టిస్తోంది. మరింకేంటి?! గట్టి చట్టం, బుద్ధి కలిగిన బాయ్స్. హ్యాపీనే కదా. కాదు! స్టీరింగ్ గర్ల్స్ చేతుల్లో ఉండాలి. లెజిస్లేచర్, జుడీషియరీ, ఎగ్జిక్యూటివ్, ప్రెస్ అనే ఫోర్–వీలర్ స్టీరింగ్‌ని గర్ల్స్ తమ చేతుల్లోకి తీసుకోవాలి. నోయిడాలో ఆ బస్సు స్టీరింగ్ ఒక మహిళ చేతిలో ఉండి ఉంటే ఏం జరిగి ఉండేదో ఊహించండి. అమ్మాయిల్ని వేధించినందుకు.. ‘బస్ ఆపండి ఆంటీ ప్లీజ్.. దిగిపోతాం’ అని అబ్బాయిలు ప్రాధేయపడుతుండేవాళ్లు.. బస్సు పోలీస్ స్టేషన్ వైపు మలుపు తిరుగుతుంటే. – మాధవ్ శింగరాజు
Comments
Please login to add a commentAdd a comment