కొడుకు కోసం పేపర్ లీక్
జవహర్ నవోదయ విద్యాలయంలోఇంటర్ పేపర్ లీక్
వైస్ ప్రిన్సిపాల్ రుక్మిణీదేవి సస్పెన్షన్
ప్రిన్సిపాల్ నిర్వాకంతో గాడి తప్పిన పాలన
ఎమ్మిగనూరు : జవహార్ నవోదయ విద్యాలయం వివాదాల కేంద్రబిందువుగా మారింది. విద్యాలయంలో ఏళ్ల తరబడి తిష్టవేసిన అధికారయంత్రాంగం అక్రమాలు, విద్యార్థుల పట్ల నిర్లక్ష్యం .. జాతీయస్థాయిలో చర్చకు దారితీసింది. 1987లో కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు మండలం బనవాసి దగ్గర జవహార్ నవోదయ విద్యాలయం ఏర్పాటైంది. ప్రస్తుతం 468 మంది విద్యార్థులకు 25 మంది బోధన, 16మంది బోధనేతర సిబ్బంది పనిచేస్తున్నారు. ఈ క్రమంలో నవోదయ మూడేళ్లుగా వివాదాలకు కేంద్ర బిందువుగా మారింది. ప్రిన్సిపాల్ పూర్ణచంద్రరావు వేధిస్తున్నాడంటూ ఏడాది క్రితం విద్యార్థులు, ఉపాధ్యాయులు రోడ్డెక్కా రు. వారికి వివిధ విద్యార్థి సంఘాలు భాసటగా నిలిచి వారం పాటు ఆందోళన చేశారు. అప్పటి జిల్లా కలెక్టర్ సుదర్శన్‌రెడ్డి చొరవ తీసుకుని సమస్య జఠిలం కాకుండా చూశారు. అయితే ఈ ఆందోళనలు డిల్లీస్థాయిలో మారుమోగాయి. గత నెలలో 7వ తరగతి విద్యార్థి దినేష్ ఎత్తులో ఉన్న మంచంపై నుంచి పడి మృతి చెందగా, రాజస్తాన్‌కు చెందిన మరో విద్యార్థికి తీవ్రగాయాలయ్యాయి. విద్యార్థుల తల్లిదండ్రులు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయడంతో నవోదయ యంత్రాంగం ఉలిక్కిపడింది. అయితే నవోదయలో విద్యార్థులు కిందపడి గాయపడటం ఇది మొదటిసారికాదనీ పదిమందికిపైగానే ఉన్నారంటూ ప్రిన్సిపాల్ పూర్ణచంద్రరావు మీడియాతో పేర్కొనడం గమనార్హం.
కొడుకు కోసం..
నవోదయ విద్యాలయంలో ఇంటర్ ద్వితీయ సంవత్సరం పరీక్షలు రాస్తున్న కొడుకు కోసం వైస్ ప్రిన్సిపాల్ రుక్మిణీదేవి ఏకంగా ప్రశ్నపత్రాన్నే లీక్ చేశారు. మార్చి 9న కెమిస్ట్రి ప్రశ్నపత్రం బండిల్‌ను పరిశీలించిన అసిస్టెంట్ కమిషనర్ ఎంఎస్ రెడ్డి అందులో ఒకటి మిస్సయినట్లు గుర్తించారు. తన కుమారుడి కోసం ప్రశ్నపత్రాన్ని రుక్మిణీదేవి తీసుకెళ్లినట్లు కార్యాలయ సిబ్బంది లిఖితపూర్వకంగా సమాధానం చెప్పడంతో ఉన్నతాధికారులు ఈ నెల 23న ఆమెను సస్పెండ్ చేసి పాట్నా రీజియన్‌కు అటాచ్ చేశారు.
ఈ నెల 26 నుంచి ప్రిన్సిపాల్ పూర్ణచంద్రరావు సెలవులో వెళ్లడంతో పి.శ్రీనివాసులు ఇన్చార్జి బాధ్యతలు తీసుకున్నారు. అయితే ఆఫీసు స్టాఫ్‌కుగానీ, ఇన్‌ఛార్జి ప్రిన్సిపాల్‌కు గానీ ఆఫీసు తాళాలు ఇవ్వకుండా సస్పెన్షన్‌కు గురైన భార్య రుక్మిణీ కోసం ఆయన బీహార్ వెళ్లినట్లు తెలిసింది. దీంతో మూడు రోజులుగా ఉద్యోగులు హాజరు పట్టికలో సంతకాలు కూడా చేయడంలేదంటే నవోదయలో అడ్మినిస్ట్రేషన్ ఏస్థాయిలో ఉందో..ఎవరి కనుసన్నల్లో వ్యవహారాలు జరుగుతున్నాయో ఇట్టే తెలుస్తోంది. బుధవారం మీడియా ప్రతినిధులు వస్తున్నారనీ తెలుసుకున్న ఇన్‌ఛార్జి ప్రిన్సిపాల్ శ్రీనివాసులు ఏకంగా ఆఫీసు తాళాలే పగలగొట్టి సంతకాలు చేయించేశారు.
సమన్వయలోపంతోనే..
ప్రిన్సిపాల్ పూర్ణచంద్రరావు సెలవులో వెళ్తూ తాళాలను లైబ్రేరియన్ సతీష్ చేతికి ఇచ్చారని ఇన్చార్జ్ ప్రిన్సిపాల్ తెలిపారు. సతీష్.. వాళ్ల బంధువులు చనిపోయింటే కోవెలకుంట్లకు వెళ్లడంతో కీస్ అందుబాటులో లేవన్నారు. దీంతో హాజరుపట్టికలో సంతకాలు చేయ లేకపోయామన్నారు. మీడియా ప్రతి నిధులు వస్తున్నారని తెలిసే ఆఫీసు తాళాలు పగలగొట్టి హాజరుపట్టికలో సంతకాలు చేస్తున్నారా అని ప్రశ్నించగా మౌనం వహించారు.