international olympic commitee
-
2036 ఒలింపిక్స్ ఆతిథ్యానికి భారత్ సిద్ధం!
2036 ఒలింపిక్స్‌కు ఆతిథ్యం ఇవ్వడానికి భారత్ సిద్ధంగా ఉన్నదని టైమ్స్ ఆఫ్ ఇండియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో కేంద్ర క్రీడాశాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ తెలిపారు. దీన్ని సాధించేందుకు ఇండియన్ ఒలింపిక్ కమిటీ (ఐఓసీ)కి రోడ్‌మ్యాప్ ఇస్తామని చెప్పారు. జీ 20 ప్రెసిడెన్సీని భారత్ ఇంత పెద్ద స్థాయిలో నిర్వహించగలిగినప్పుడు..ఐఓఏతో కలిపి కేంద్ర ప్రభుత్వం ఒలింపిక్స్ నిర్వహించగలదని భావిస్తున్నట్లు అనురాగ్ ఠాకూర్ తెలిపారు. ఒలింపిక్స్‌కు పూర్తిగా సిద్ధమైన తర్వాతనే భారత్ బిడ్ వేస్తుందని ఆశిస్తున్నామన్నారు. భారత ఒలింపిక్ సంఘం (ఐఓఏ) క్రీడల నిర్వహణకు ప్రభుత్వం మద్దతు ఇస్తుందని.. గుజరాత్ రాజధాని అహ్మదాబాద్ ప్రపంచ స్థాయి క్రీడా మౌలిక సదుపాయాలతో ఆతిథ్య నగరంగా మారుతుందని ఠాకూర్ చెప్పారు. గతంలో 1982 ఆసియా క్రీడలు, 2010 కామన్వెల్త్ క్రీడలకు భారత్ ఆతిథ్యం ఇచ్చిందని కేంద్ర మంత్రి గుర్తుచేశారు. ఇప్పుడు ఒలింపిక్స్‌కు ఆతిథ్యం ఇవ్వడానికి భారత్ సిద్ధమైందన్నారు. -
ఐఓఏ తాత్కాలిక అధ్యక్షుడిగా వైదొలిగిన అనిల్ ఖన్నా
స్పోర్ట్స్ సీనియర్ అథారిటీ అనిల్ ఖన్నా బుధవారం ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్(ఐఓఏ) తాత్కాలిక అధ్యక్ష పదవి నుంచి తప్పుకున్నాడు. తాత్కాల్కిక అధ్యక్షునిగా అనిల్ ఖన్నాను గుర్తించలేమని అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ(ఐవోసీ) గతంలో స్పష్టం చేసింది. ఈ మేరకే ఆయన అధ్యక్ష పదవి నుంచి తప్పుకుంటున్నట్లుగా నిర్ణయం తీసుకున్నాడు. ఇక డిసెంబర్ కల్లా ఎన్నికల ప్రక్రియను పూర్తి చేయకపోతే భారత్ నిషేధిస్తామని ఐఓసీ ఈ నెల 8న హెచ్చరించింది. అనిల్ ఖన్నా మాట్లాడుతూ.. ''ఐవోసీ ఒప్పుకోకపోవడంతో తాత్కాలిక అధ్యక్ష పదవి నుంచి వైదొలుగుతున్నా. ప్రస్తుతం ఐఓఏ క్లిష్ట పరిస్థితిలో ఉంది. ఐఓఏ కార్యకలాపాలను సాధారణ స్థితికి తేవడానికి ప్రభుత్వం చిత్తశుద్ధితో కృష్టి చేస్తోంది. త్వరలోనే ఎన్నికల ప్రక్రియ నిర్వహిస్తారని ఆశిస్తున్నా'' అంటూ తెలిపాడు. -
తేజస్విన్‌కు అనుమతి
న్యూఢిల్లీ: ప్రతిష్టాత్మక కామన్వెల్త్ గేమ్స్‌లో పాల్గొనేందుకు భారత హైజంప్ ప్లేయర్ తేజస్విన్ శంకర్‌కు నిర్వాహకులు అనుమతించారు. ఒకే ఈవెంట్లో వైదొలిగిన ప్లేయర్ స్థానంలో మరొకరికి అనుమతి ఇస్తామని గతంలో తేజస్విన్ ఎంట్రీని నిర్వాహకులు తోసిపుచ్చారు. అయితే శుక్రవారం డెలిగేట్ రిజిస్ట్రేషన్ మీటింగ్ ముగిశాక తేజస్విన్ ఎంట్రీకి పచ్చజెండా ఊపారు. స్వదేశంలో సెలెక్షన్ టోర్నీలో తేజస్విన్ బరిలోకి దిగలేదు. అయితే అతను కామన్వెల్త్ గేమ్స్ అర్హత ప్రమాణాన్ని అమెరికాలో నేషనల్ కాలేజియట్ అథ్లెటిక్స్ మీట్లో నమోదు చేశాడు. కానీ భారత అథ్లెటిక్స్ సమాఖ్య (ఏఎఫ్ఐ) తేజస్విన్ ప్రదర్శనను పరిగణనలోకి తీసుకోకుండా అతనిని ఎంపిక చేయలేదు. దాంతో తేజస్విన్ ఢిల్లీ హైకోర్టులో కేసు వేశాడు. చివరకు ఢిల్లీ హైకోర్టు ఆదేశాలతో ఏఎఫ్ఐ అధికారులు తేజస్విన్ పేరును కామన్వెల్త్ గేమ్స్ నిర్వాహకులకు పంపించారు. -
అభిమానులకు షాక్.. వచ్చే ఒలింపిక్స్‌లో ఆ క్రీడ డౌటే
స్విట్జర్లాండ్: వెయిట్ లిఫ్టింగ్ అభిమానులకు ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీ(ఐవోసీ) షాక్ ఇవ్వనుంది. 2024 పారిస్ ఒలింపిక్స్ నుంచి వెయిట్ లిఫ్టింగ్ క్రీడను ఎత్తివేసేందుకు ప్రణాళికను సిద్దం చేస్తుంది. దీనిపై ఇప్పటికే చర్చలు జరిపినట్లు.. త్వరలోనే దీనికి ఆమోదముద్ర వేయనున్నట్లు ఐవోసీ ఒక ప్రకటనలో తెలిపింది. వెయిట్ లిఫ్టింగ్‌లో పాల్గొంటున్న అథ్లెట్లలో చాలామంది డోపింగ్‌కు పాల్పడినట్లు తెలిసిందంటూ ఐవోసీ పేర్కొంది. ముఖ్యంగా కొంతమంది ఆటగాళ్లు బరువులు ఎత్తడానికి నిషేదిత డ్రగ్స్ వాడుతున్నట్లు వాదనలు వినిపించాయి. అంతేగాక డ్రగ్స్ వాడుతూ తమ కెరీర్‌ను కొనసాగిస్తున్నారని తేలింది. దీనిపై గతంలోనే ఇంటర్నేషనల్ వెయిట్‌లిఫ్టింగ్ ఫెడరేషన్ (ఐడబ్ల్యూఎఫ్)కు ఐవోసీ హెచ్చరికలు సైతం జారీ చేసింది. వెయిట్ లిఫ్టింగ్‌లో పెద్ద ఎత్తున డోపీలు పట్టుబడుతుండడంతో ఐవోసీ కఠిన చర్యలకు సిద్ధమైంది. ఈ నేపథ్యంలోనే వచ్చే పారిస్ ఒలింపిక్స్ నుంచి వెయిట్ లిఫ్టింగ్‌ను సస్పెండ్ చేయడంపై నిర్ణయం తీసుకోనుంది. అయితే తాము పేర్కొన్న సంస్కరణల అమలుపై ఐడబ్ల్యూఎఫ్ చర్యలు తీసుకుంటే.. 2028 లాస్ ఏంజిల్స్ ఒలింపిక్స్‌లో వెయిట్ లిఫ్టింగ్‌ను తిరిగి చేర్చే అంశాన్ని పరిశీలిస్తామని ఐవోసీ వెల్లడించింది. ఇక టోక్యో ఒలింపిక్స్‌లో వెయిట్ లిఫ్టింగ్ విభాగంలో భారత అథ్లెట్ మీరాబాయి చాను రజతం గెలుచుకున్న సంగతి తెలిసిందే. వెయిట్‌లిఫ్టింగ్ 49 కేజీల విభాగంలో పోటీపడింది. మొత్తమ్మీద 202 కేజీలు ఎత్తిన మీరాబాయి.. స్వర్ణం కోసం జరిగిన మూడో అటెంప్ట్‌లో మాత్రం విఫలమైంది. క్లీన్ అండ్ జెర్క్‌లో 117 కేజీలు ఎత్తే క్రమంలో తడబడింది. కాగా ఒలింపిక్స్ ప్రారంభమైన రెండో రోజే దేశానికి పతకం అందించి చరిత్ర సృష్టించింది. ఇక వెయిట్ లిఫ్టింగ్ విభాగంలో కరణం మల్లీశ్వరీ(కాంస్యం, 2000 సిడ్నీ ఒలింపిక్స్) తర్వాత దేశానికి రెండో పతకం అందించిన మహిళగా మీరాబాయి నిలిచింది. -
టోక్యో వాయిదా... మాకూ భారమే: ఐఓసీ
టోక్యో: ఈ ఏడాది ఒలింపిక్స్ వచ్చే ఏడాదికి వాయిదా పడటం వల్ల అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ (ఐఓసీ)పై కూడా భారం పడుతుందని ఐఓసీ చీఫ్ థామస్ బాచ్ చెప్పారు. ఓ జర్మన్ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ... వాయిదా వల్ల మాకూ వందల కోట్ల నష్టం (వందల మిలియన్ డాలర్లు) వస్తుంది. ఇక మిగతాదంతా జపానే భరించాల్సి ఉంటుంది. ఇదే విషయాన్ని ‘ఆతిథ్య ఓప్పందం’లో స్పష్టంగా తెలియజేశాం. జపాన్ ప్రధాని సమక్షంలోనే ఈ ఒప్పందం జరిగింది. అదనపు భారంలో సింహభాగాన్ని ఆతిథ్య దేశం భరించాల్సిందేనని నియమ నిబంధనల్లో ఉంది. కొంత నష్టాన్ని ఐఓసీ భరిస్తుంది’ అని అన్నారు. తాజా అంచనాల ప్రకారం 2 నుంచి 6 బిలియన్ డాలర్లు (రూ.15 వేల కోట్ల నుంచి రూ.45 వేల కోట్లు) వరకు ఈ భారం ఉంటుంది. అంటే మొత్తం నిర్వహ ణకు అయ్యే వ్యయంలో ఇంచు మించు సగమన్నమాట! ఇప్పటి వరకు జపాన్ ప్రతిష్టాత్మకంగా నిర్వహించాలనుకున్న టోక్యో ఈవెంట్ కోసం రూ. 92 వేల కోట్లు (12.6 బిలియన్ డాలర్లు) ఖర్చు చేసింది. అయితే ఇటీవల టోక్యో ఆర్గనైజింగ్ కమిటీ సీఈఓ తోషిరో ముటో వచ్చే ఏడాది కూడా జరిగేది సందేహాస్పదమేనన్నారు. ‘అప్పటికల్లా మహమ్మారి అదుపులోకి వస్తుందని ఎవరైనా చెప్పగలరా’ అని అన్నారు. దీనిపై బాచ్ మాట్లాడుతూ స్పష్టమైన జవాబు ఇచ్చే పరిస్థితిలో తాను లేనని... అయితే మరో వాయిదాకు అవకాశమైతే లేదని జపాన్ వర్గాలు చెప్పినట్లు వెల్లడించారు. -
పదేళ్లయినా పట్టేస్తారు
డోపీలపై ఐఓసీ చేతిలో సరికొత్త అస్త్రం సోచి: డోపీల భరతం పట్టేందుకు అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ (ఐఓసీ) నడుంబిగించింది. సరికొత్త సాంకేతిక పరిజ్ఞానంతో డోపీలను ఇప్పుడు కాకపోయినా పదేళ్ల కాలంలో ఎప్పుడైనా పట్టుకునేందుకు తమ ప్రణాళికలకు పదునుపెట్టింది. నిషిద్ధ ఉత్ప్రేరకాలు తీసుకొన్నప్పటికీ ప్రస్తుత పరీక్షల్లో డోపీలుగా తేలకపోతే సదరు ఆటగాళ్లు నిశ్చింతగా ఉండటానికి వీళ్లేదు. ఎందుకంటే ఒకసారి తీసుకున్న రక్త, మూత్ర నమూనా (శాంపిల్స్)లను పదేళ్ల దాకా భద్రపరిచి వీలుచిక్కినప్పుడల్లా క్షుణ్నంగా పరీక్షించనున్నారు. దీంట్లో ఎప్పుడు దోషిగా తేలినా శిక్ష తప్పదన్న మాట. తాజాగా ఇక్కడ జరుగుతున్న వింటర్ ఒలింపిక్స్‌లో ప్రపంచ డోపింగ్ నిరోధక సంస్థ (వాడా) తీసుకుంటున్న శాంపిల్స్‌ను కూడా పదేళ్ల పాటు భద్రపరిచి దోషుల్ని దొరకబుచ్చుకుంటారు. సరికొత్త సాంకేతిక పరిజ్ఞానం ‘హ్యూమన్ గ్రోత్ హార్మోన్’ (హెచ్‌జీహెచ్) పరీక్ష ద్వారా డోపీల భరతం పడతారు. దీనిపై ఐఓసీ మెడికల్ కమిషన్ చైర్మన్ ఆర్నే జుంగ్‌క్విస్ట్ మాట్లాడుతూ ‘అథ్లెట్లు ఉత్ప్రేరకాలు తీసుకుంటే ఇప్పుడు కాకపోయినా తర్వాతైనా పట్టుకుంటాం. ఈ సంగతిని గుర్తుంచుకుని మసలుకుంటే మంచిది’ అని చురకంటించారు. -
కుస్తీ ఖుషీ
బ్యూనస్ ఎయిర్స్: ఒలింపిక్స్‌లో రెజ్లింగ్ తన స్థానాన్ని నిలబెట్టుకుంది. 2020, 2024 ఒలింపిక్స్‌లో 26వ క్రీడగా రెజ్లింగ్‌ను కొనసాగిస్తున్నట్లు ఆదివారం అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ (ఐఓసీ) ప్రకటించింది. పోటీలో నిలిచిన బేస్‌బాల్/సాఫ్ట్‌బాల్, స్క్వాష్లను ఓటింగ్‌లో వెనక్కి నెట్టి రెజ్లింగ్ తన స్థానాన్ని ఖాయం చేసుకుంది. మొత్తం 95 ఓట్లలో రెజ్లింగ్‌కు అనుకూలంగా 49 ఓట్లు వచ్చాయి. స్క్వాష్‌కు 22 ఓట్లు మాత్రమే రాగా, అనూహ్యంగా బేస్‌బాల్/సాఫ్ట్‌బాల్‌కు 24 ఓట్లు పడ్డాయి. ఒలింపిక్స్ క్రీడల్లో భారత్‌కు నాలుగు పతకాలు అందించిన రెజ్లింగ్‌ను ఈ ఏడాది ఫిబ్రవరిలో క్రీడల జాబితా నుంచి ఐఓసీ తొలగించింది. దాంతో తన స్థానం నిలబెట్టుకునేందుకు మరోసారి రెజ్లింగ్ పోటీ పడాల్సి వచ్చింది. ఓటింగ్‌కు ముందు ఆదివారం ఈ మూడు ఆటలకు సంబంధించిన ప్రతినిధులు 20 నిమిషాల పాటు ప్రజెంటేషన్ ఇచ్చారు. కొత్తగా చేరిన రగ్బీ సెవెన్, గోల్ఫ్‌లతో కలిసి 2016 రియోడిజనిరో ఒలింపిక్స్‌లో మొత్తం 28 క్రీడాంశాల్లో పోటీలు జరుగుతాయి. ‘మా ఆటను బతికించినందుకు కృతజ్ఞతలు. 3 వేల ఏళ్ల చరిత్ర గల మా క్రీడలో ఇదో కీలక రోజు. రెజ్లింగ్ ఆట నిలబడాలంటే ఒలింపిక్స్‌లో ఉండటం తప్పనిసరి’ అని అంతర్జాతీయ రెజ్లింగ్ సమాఖ్య (ఫిలా) అధ్యక్షుడు నేనాద్ లాలోవిక్ స్పందించారు. రెజ్లర్ల ఆనందం... ఒలింపిక్స్‌లో రెజ్లింగ్‌ను కొనసాగించడం పట్ల భారత స్టార్ రెజ్లర్ సుశీల్ కుమార్ సంతోషం వ్యక్తం చేశాడు. ‘రెజ్లింగ్ సమాజానికి ఇదో శుభవార్త. కుర్రాళ్లు ఈ ఆటను ఎంచుకునేందుకు తాజా నిర్ణయం తోడ్పడుతుంది. ప్రాచీన క్రీడను ఒలింపిక్స్‌లో కొనసాగించడం సంతోషకరం. రాబోయే ఒలింపిక్స్‌లో మన ఆటగాళ్లు మరిన్ని పతకాలు సాధిస్తారు’ అని సుశీల్ చెప్పాడు. మరో ఒలింపిక్ మెడలిస్ట్ యోగేశ్వర్ కూడా ఆనందాన్ని ప్రకటించాడు. ‘రెజ్లర్ల మెడలపై కత్తి వేలాడుతూ ఉంది. ఇప్పుడు అది పోయింది. నేను మరో పతకం గెలిచినట్లుగా అనిపిస్తోంది. దీనికి సహకరించినవారికి కృతజ్ఞతలు’ అని దత్ అన్నాడు. -
టోక్యోకే పట్టం
బ్యూనస్ ఎయిర్స్: విశ్వ క్రీడా సంబరం ఒలింపిక్స్ క్రీడలను రెండో సారి నిర్వహించే అవకాశం జపాన్ రాజధాని నగరం టోక్యోకు దక్కింది. భారత కాలమానం ప్రకారం ఆదివారం తెల్లవారు జామున 2 గంటలకు ఇక్కడ జరిగిన అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ (ఐఓసీ) సమావేశంలో 2020 ఒలింపిక్స్ వేదికగా టోక్యోను ప్రకటించారు. ఇందు కోసం జరిగిన ఓటింగ్‌లో టోక్యో 24 ఓట్ల తేడాతో ఇస్తాంబుల్ (టర్కీ)పై స్పష్టమైన ఆధిక్యం సాధించింది. టోక్యోకు మొత్తం 60 ఓట్లు పోల్ కాగా, ఇస్తాంబుల్‌కు 36 మాత్రమే దక్కాయి. పోటీలో నిలిచిన స్పెయిన్ రాజధాని మాడ్రిడ్ తొలి రౌండ్లోనే వెనుదిరిగింది. ఈ రౌండ్లో జపాన్‌కు 42 ఓట్లు రాగా, ఇస్తాంబుల్, మాడ్రిడ్‌లకు సమానంగా 26 ఓట్లు వచ్చాయి. అయితే టైబ్రేకర్‌లో 49-45 తేడాతో మాడ్రిడ్‌ను ఓడించి ఇస్తాంబుల్ ముందంజ వేసింది. ఒక దశలో ఇస్తాంబుల్ నెగ్గిందనుకొని కొందరు అభిమానులు సంబరాలు కూడా చేసుకున్నారు. అయితే అది రెండో రౌండ్లోకి మాత్రమే ప్రవేశించిందని తర్వాత తెలిసింది. 1964లో కూడా టోక్యో ఒలింపిక్స్ నిర్వహించింది. రెండో సారి అవకాశం దక్కించుకున్న తొలి ఆసియా నగరం ఇదే కావడం విశేషం. అందుకే అవకాశం... రెండు ఖండాలు-రెండు సంస్కృతులు అంటూ ఇస్తాంబుల్ చేసిన ప్రచారం వృథా కాగా... మాంద్యం కారణంగా బలహీనంగా మారిన స్పెయిన్ ఆర్ధిక స్థితిపై అపనమ్మకం మాడ్రిడ్‌కు అవకాశాన్ని దూరం చేసింది. 2020 ఒలింపిక్స్ నిర్వహించే అవకాశం దక్కించుకున్న టోక్యోకు ఐఓసీ అధ్యక్షుడు జాక్వస్ రోగె అభినందలు తెలిపారు. ఈ మంగళవారంతో రోగె 12 ఏళ్ల పదవీ కాలం పూర్తి కానుంది. ‘టోక్యో బిడ్ సాంకేతికంగా చాలా బలంగా ఉంది. మూడు నగరాలకు కూడా క్రీడలను నిర్వహించే సత్తా ఉన్నా... చివరకు ఐఓసీ సభ్యులలో ఎక్కువ మందిని టోక్యో బిడ్ ఆకట్టుకుంది. రాబోయే తరానికి ఒలింపిక్ విలువలు, క్రీడల ఫలితాలు అందించే క్రమంలో అద్భుతమైన, సురక్షితమైన క్రీడలను నిర్వహిస్తామంటూ (డిస్కవర్ టుమారో) పేరుతో జపాన్ ఇచ్చిన పిలుపు టోక్యో నగరానికి అవకాశం కల్పించింది’ అనిరోగె వెల్లడించారు. సంతోషం... ఫకుషిమా న్యూక్లియర్ ప్లాంట్ నుంచి వెలువడుతున్న రేడియో ధార్మికత జపాన్ ఒలింపిక్ బిడ్‌కు అడ్డంకిగా మారవచ్చని వినిపించింది. అయితే పరిస్థితి అదుపులో ఉందంటూ, భవిష్యత్తులోనూ ఎలాంటి ఆరోగ్య సమస్యలు తలెత్తవని జపాన్ బృందం తగిన వివరణ ఇచ్చింది. టోక్యోను ఎంపిక చేయగానే ఆ దేశ ప్రజలు నగర వీధుల్లోకి వచ్చి సంబరాలు జరుపుకున్నారు. తమ దేశానికి మళ్లీ ఒలింపిక్స్ నిర్వహించే అవకాశం రావడం పట్ల ఆ దేశ ప్రధాని షిన్జో ఆబె ఆనందం వ్యక్తం చేశాడు. ‘ఒలింపిక్ ఉద్యమంలో ఉన్నవారందరికీ నా కృతజ్ఞతలు. మేం ఈ క్రీడలను అద్భుతంగా నిర్వహిస్తాం. రెండేళ్ల క్రితం సునామీ సమయంలో మాకు అండగా నిలిచిన ప్రపంచానికి రుణపడి ఉన్నాం. ఒలింపిక్స్‌తో ఆ అప్పుడు కూడా తీర్చేస్తాం’ అని ఆయన వ్యాఖ్యానించారు. గత 15 ఏళ్లుగా ఒడిదుడుకులకు లోనైన జపాన్ ఆర్ధిక స్థితికి ఒలింపిక్స్ నిర్వహణ ఊపు తెస్తుందని ప్రధాని అభిప్రాయపడ్డారు. బిడ్‌కు నేతృత్వం వహించిన జపాన్ ఒలింపిక్ కమిటీ అధ్యక్షుడు సునేకాజు తకేడా మాట్లాడుతూ...‘టోక్యో ఎంపిక కావడం గొప్ప గౌరవంగా భావిస్తున్నాం. జపాన్ వెళ్లగానే మా దేశ ప్రజలకు కృతజ్ఞతలు తెలపడమే నేను చేసే మొదటి పని’ అని వ్యాఖ్యానించారు. ప్రకృతి వైపరీత్యాల నుంచి కోలుకొని కొత్త ఉత్సాహంతో టోక్యో ముందుకు వెళ్లేందుకు ఒలింపిక్స్ తోడ్పడతాయని నగర గవర్నర్ ఇనోస్ చెప్పారు. టోక్యో 2020 విశేషాలు ఒలింపిక్స్ చరిత్ర: 1964లో టోక్యో తొలిసారి ఈ క్రీడలకు ఆతిథ్యం ఇచ్చింది. సపోరో (1972), నగానో (1998)లలో రెండు సార్లు వింటర్ ఒలింపిక్స్ కూడా జపాన్ నిర్వహించింది. 2020లో టోక్యోలోనే పారాలింపిక్స్ కూడా జరుగుతాయి. అంచనా వ్యయం: రూ. 54 వేల 87 కోట్లు (సుమారు) ప్రతిపాదిత వేదికలు: మొత్తం 36 (ప్రస్తుతం 15, కొత్తవి 11, తాత్కాలికం 10) ప్రధాన స్టేడియం: 1964 క్రీడలు జరిగిన చోటే పాతదానిని పునరుద్ధరించి 80 వేల సామర్ధ్యంతో కొత్త స్టేడియం నిర్మాణం. రవాణా: ఇప్పటికే చక్కటి సౌకర్యం ఉన్న నగరంలో కొత్తగా ఎలాంటి మౌలిక సౌకర్యాలూ అభివృద్ధి చేయడం లేదు. వసతి: 50 కిలోమీటర్ల నగర పరిధిలో 1,40,000 హోటల్ గదులు, 9,500 ఇతర గదులు అందుబాటులో ఉన్నాయి. ఫైవ్ స్టార్ గదుల గరిష్ట అద్దె రూ. 1 లక్షా 6 వేలు. భద్రతా సిబ్బంది: 50 వేల మంది (ఇందులో 14 వేలు ప్రైవేట్ సెక్యూరిటీ) షాక్‌కు గురయ్యాను.... ఒలింపిక్స్ నిర్వహణ కోసం మాడ్రిడ్‌కు అవకాశం దక్కకపోవడం పట్ల స్పెయిన్ స్టార్ టెన్నిస్ క్రీడాకారుడు రాఫెల్ నాదల్ విస్మయం వ్యక్తం చేశాడు. మాడ్రిడ్ బిడ్ తరఫున నాదల్ సుదీర్ఘ కాలంగా ప్రచారం చేస్తున్నాడు. ఇది తనను తీవ్ర నిరాశకు గురి చేసిందని అతను అన్నాడు. ‘స్పెయిన్ రాజధాని పట్ల ఐఓసీ సరిగా వ్యవహరించలేదు. ఒలింపిక్స్ అవకాశం దక్కించుకునేందుకు మా దేశ ప్రజలు ఎన్నో ఏళ్లు శ్రమించారు. మాకా అర్హత ఉందని మేం భావించాం. ప్రచారంలో కూడా మేం ముందున్నాం కాబట్టి తాజా నిర్ణయం తీవ్రంగా నిరాశ పరచింది’ అని నాదల్ వ్యాఖ్యానించాడు. -
‘పట్టు’ నిలబడేనా!
ఒలింపిక్స్‌లో చోటు కోసం స్క్వాష్‌తో రెజ్లింగ్ పోటీ బరిలో బేస్‌బాల్/సాఫ్ట్‌బాల్ కూడా నేడు ఖరారు చేయనున్న ఐఓసీ న్యూఢిల్లీ: ఒలింపిక్స్‌లో భారత్‌కు నాలుగు వ్యక్తిగత పతకాలు అందించిన రెజ్లింగ్ భవితవ్యం మరికొన్ని గంటల్లో తేలనుంది. 2020 ఒలింపిక్స్‌లో చేర్చాల్సిన ఒక క్రీడ కోసం బ్యూనస్ ఎయిర్స్లో ఆదివారం అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ (ఐఓసీ) ఎగ్జిక్యూటివ్ బోర్డు సమావేశం కానుంది. ఏ క్రీడను చేర్చాలో నిర్ణయించేందుకు ఈ సమావేశంలో ఓటింగ్ జరుగుతుంది. 2020 ఒలింపిక్స్‌లో చోటు కోసం రెజ్లింగ్‌తో పాటు స్క్వాష్, బేస్‌బాల్/సాఫ్ట్‌బాల్ (సంయుక్తంగా) పోటీ పడుతున్నాయి. ప్రేక్షకులకు మరింత చేరువయ్యేందుకు ఐఓసీ సూచించిన సవరణలు పాటించి రెజ్లింగ్ తమ అవకాశాలు మెరుగుపర్చుకోగా... చక్కటి టీవీ ప్రజెంటేషన్‌తో స్క్వాష్ కూడా గత ఐఓసీ సమావేశంలో ఆకట్టుకుంది. పేరుకు మూడు ఆటలు ఉన్నా ప్రధానంగా రెజ్లింగ్, స్క్వాష్ మధ్యే గట్టి పోటీ ఉంది. ఈ నేపథ్యంలో ఈ మూడు క్రీడలకు ఉన్న అవకాశాలను పరిశీలిస్తే... రెజ్లింగ్ 1900వ సంవత్సరంలో మినహా ప్రతీసారి రెజ్లింగ్ ఒలింపిక్స్‌లో భాగమైంది. ప్రాచీన సాంప్రదాయాన్ని కొనసాగిస్తున్న ఆటగా కుస్తీకి పోటీ ఉంది. ఏడు నెలల క్రితం ఒలింపిక్స్ నుంచి రెజ్లింగ్‌ను తొలగిస్తున్నామని ఐఓసీ ప్రకటించిన తర్వాత అంతర్జాతీయ రెజ్లింగ్ సమాఖ్య ఈ క్రీడలో కొత్త మార్పులతో ముందుకు వచ్చింది. ఒలింపిక్స్‌లో మహిళల కోసం కూడా మరిన్ని కేటగిరీలు పెంచేందుకు సిద్ధమైంది. దీని వల్లే రెజ్లింగ్ తుది జాబితాలో నిలిచింది. ఆరు ఖండాలకు చెందిన 177 దేశాల్లో ప్రాచుర్యంలో ఉండటం... గత లండన్ ఒలింపిక్స్‌లో 71 దేశాలు పాల్గొనడంతో పాటు 29 దేశాలకు చెందిన వారు పతకాలు గెల్చుకోవడం రెజ్లింగ్‌కు అనుకూలాంశం. రష్యా అధ్యక్షుడు పుతిన్, ఇరాన్ అధ్యక్షుడు నెజాది ఈ ఆటను కొనసాగించాలని బహిరంగంగా మద్దతు పలికారు. స్క్వాష్ ఇప్పటి వరకు స్క్వాష్ ఒలింపిక్స్‌లో లేదు. ఒలింపిక్స్‌లో చోటు పొందేందుకు గత పదేళ్లుగా పోరాడుతున్నట్లు స్క్వాష్ సమాఖ్య ప్రతినిధులు తెలిపారు. ఈ ఆటకు ప్రస్తుతం 185 దేశాల్లో ఆదరణ ఉందని, కొత్త తరం ఆటగా ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని స్క్వాష్ ప్రతినిధులు చెబుతున్నారు. ఈ క్రీడ ఇప్పటికీ టీవీలో గానీ, ప్రత్యక్షంగా గానీ చూసే ప్రేక్షకులకు కావాల్సిన మజాను అందించలేకపోతోంది. ‘స్క్వాష్ ప్రతినిధులు తమ ఆట గురించి అద్భుతమై ప్రజెంటేషన్ ఇచ్చారు’ అని ఐఓసీ ఎగ్జిక్యూటివ్ బోర్డు సభ్యుడు రీడీ వ్యాఖ్యానించడం అనుకూల పరిణామం. భారత క్రికెటర్లు సచిన్, సెహ్వాగ్‌లతో పాటు ఫెడరర్, ముర్రేలాంటి టెన్నిస్ దిగ్గజాలు ఈ ఆటకు మద్దతుగా నిలిచారు. బేస్‌బాల్/సాఫ్ట్‌బాల్ ఒలింపిక్స్‌లో చోటు కోసం రెండు క్రీడలూ కలిసి సంయుక్తంగా పోటీ పడుతున్నాయి. ప్రపంచ బేస్‌బాల్, సాఫ్ట్‌బాల్ సమాఖ్య తమకు అవకాశం కల్పించాలంటూ బరిలో నిలిచింది. బేస్‌బాల్‌కు అమెరికాలో అమిత జనాదరణ ఉండగా, సాఫ్ట్‌బాల్‌ను 140 దేశాల్లో ఆడతారు. ఈ ఆటలో కొన్ని నిబంధనలు ఒలింపిక్ స్ఫూర్తికి విరుద్ధంగా ఉన్నాయి. తాము స్థానం దక్కించుకోవడం అంత సులువు కాదని సంబంధిత వర్గాలే అనుమానం వ్యక్తం చేశాయి. బేస్‌బాల్, సాఫ్ట్‌బాల్ కలిసి బిడ్ వేయడం పట్ల కూడా చాలా మందిలో అసంతృప్తి ఉంది. 1996 ఒలింపిక్స్‌లో తొలి సారి ప్రవేశించిన సాఫ్ట్‌బాల్‌ను ఆ తర్వాత తొలగించారు. -
ఐఓఏ తీరుపై బింద్రా ధ్వజం
న్యూఢిల్లీ: చార్జిషీట్ దాఖలైన వారు ఎన్నికల్లో పోటీ చేయరాదనే నిబంధనను భారత ఒలింపిక్ సంఘం (ఐఓఏ) పట్టించుకోకపోవడాన్ని ప్రఖ్యాత షూటర్ అభినవ్ బింద్రా తప్పుపట్టాడు. ఈ విషయంలో అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ (ఐఓసీ) పట్టుదలతో ఉండాలని సూచించాడు. ఆదివారం జరిగిన ఐఓఏ జీబీఎంలో రెండేళ్లకు పైగా శిక్ష పడినవారినే ఎన్నికలకు దూరంగా ఉంచాలని సభ్యులు తీర్మానించిన విషయం తెలిసిందే. ‘ఇప్పటికే ఈ విషయంలో గట్టిగా ఉండాల్సిందిగా నేను ఐఓసీని అడిగాను. భారత క్రీడారంగానికి, అథ్లెట్లకు ఈ నిబంధన మేలు చేస్తుంది. ప్రత్యేక జీబీఎంకు హాజరైన ఐఓఏ సభ్యుల్లో 50 శాతం కన్నా ఎక్కువ మందిపై కోర్టులో కేసులున్న విషయం ఐఓసీ అర్థం చేసుకోవాలి. అయితే ఐఓఏ తీసుకున్న నిర్ణయం నన్ను నిరాశపరిచినా ఆశ్చర్యానికి గురి చేయలేదు. కానీ ఇంత పెద్ద దేశం ఐఓసీ నుంచి ఎందుకు సస్పెండ్ అయ్యిందని అంతర్జాతీయ ఈవెంట్స్‌లో పాల్గొన్నప్పుడు చాలా మంది ఇతర దేశ అథ్లెట్లు అడిగినప్పుడు అవమానంగా అనిపిస్తుంటుంది’ అని బింద్రా పేర్కొన్నాడు.