Internet ban
-
నూహ్ అల్లర్ల కేసు: కాంగ్రెస్ ఎమ్మెల్యే అరెస్టు.. ఇంటర్నెట్ బంద్..
చండీగఢ్: నూహ్ అల్లర్ల కేసులో కాంగ్రెస్ ఎమ్మెల్యే మమ్మన్ ఖాన్‌ను గురువారం అరెస్టు చేశారు పోలీసులు. మమ్మన్ ఖాన్ అరెస్టు నేపథ్యంలో జిల్లాలో ఆందోళనలు చెలరేగకుండా మొబైల్ ఇంటర్నెట్ సేవలను ప్రభుత్వం నిలుపుదల చేసింది. బిగ్ ఎస్ఎమ్ఎస్ సేవలను కూడా బంద్ చేసింది. 48 గంటల పాటు ఈ నిలుపుదల ఉత్తర్వులు అమలులో ఉండనున్నాయి. జిల్లాలో 144 సెక్షన్‌ను కూడా ప్రభుత్వం విధించింది. శుక్రవారం జరగాల్సిన ప్రార్థనలు కూడా ఇంటి నుంచే చేసుకోవాలని ప్రజలను కోరింది. సెప్టెంబర్ 15 ఉదయం 10:00 గంటల నుంచి సప్టెంబర్ 16 రాత్రి 11:59 వరకు జిల్లాలో ఇంటర్నెట్ సేవల నిలుపుదల సహా 144 సెక్షన్ అమలులో ఉంటుందని డిపార్ట్మెంట్ ఆఫ్ అడిషనల్ చీఫ్ సెక్రటరీ టీ వీ ఎస్ ఎన్ ప్రసాద్ చెప్పారు. శాంతిభద్రతలకు భంగం వాటిల్లకుండా ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు. ప్రజలు సంయమనం పాటించాలని, ఎలాంటి అల్లర్లకు పాల్పడకూడదని కోరారు. ఆందోళనలకు పాల్పడితే కఠిన చర్యలు ఉంటాయని తెలిపారు. జులై 31న నూహ్ జిల్లాలో విశ్వ హిందూ పరిషత్ ర్యాలీ సందర్భంగా రెండు వర్గాల మధ్య అల్లర్లు చెలరేగాయి. ఆ తర్వాత రాష్ట్రమంతటా ఆందోళనలు జరిగాయి. నిరసనకారులు పలు వాహనాలకు నిప్పుపెట్టారు. ప్రభుత్వ, ప్రైవేటు ఆస్తులను ధ్వంసం చేశారు. ఈ అల్లర్లలో ఆరుగురు మరణించారు. ఈ కేసులో ఎమ్మెల్యే మమ్మన్ ఖాన్ నిందితుడిగా ఉన్నారు. తనపై అక్రమంగా కేసు నమోదు చేశారని మమ్మన్ ఖాన్ ఆరోపిస్తున్నారు. అల్లర్లు జరిగిన రోజు తాను జిల్లాలో లేనని చెప్పారు. అయినప్పటికీ పోలీసులు ఎలాంటి ఆధారాలు లేకుండానే అరెస్టు చేశారని అన్నారు. అల్లర్లలో మమ్మన్ఖాన్ నిందితుడిగా ఉన్నారని పోలీసులు కోర్టుకు తెలిపారు. ఫోన్ కాల్స్‌తో సహా పలు కీలక ఆధారాలున్నాయని వెల్లడించారు. నూహ్ అల్లర్ల కేసులో దర్యాప్తు బృందాల ముందు హాజరు కావాలని ఎమ్మెల్యే మమ్మన్ ఖాన్‌కు ఇప్పటికే రెండు సార్లు సమన్లు అందాయి. కానీ వైరల్ జ్వరం కారణంగా చూపుతూ ఆయన హాజరు కాలేదు. గురువారం అరెస్టు చేయగా.. శుక్రవారం న్యాయస్థానం ముందు ఆయన్ను హాజరు పరచనున్నారు. ఇదీ చదవండి: అది మాకు తెలుసు.. లాయర్ లూథ్రాతో సుప్రీం ధర్మాసనం -
మణిపూర్‌లో మరోసారి ఇంటర్నెట్ వినియోగంపై ఆంక్షలు
ఇంఫాల్: మణిపూర్‌లో రెండు నెలల క్రితం పేట్రేగిన హింసాకాండ రాష్ట్రానికి తీవ్ర నష్టాన్ని మిగిల్చింది. ప్రాణనష్టం తోపాటు ఆస్తినష్టం కూడా భారీగా జరగడంతో మణిపూర్ ఎప్పటికి కోలుకుంటుందన్నదే ఇప్పుడు అసలు ప్రశ్న. ఇక అన్నాడు ఇంటర్నెట్ సేవలను నిషేధించి ప్రభుత్వం చాలావరకు అల్లర్లను కట్టడి చేసింది. ఇటీవల ఆంక్షలు ఎత్తివేసిన నిముషాల్లోనే ఫార్వార్డ్ మెసేజులతో ప్రజల్లో భావోద్వేగాలు రెచ్చగొట్టిన కారణంగా మరోసారి అంతర్జాల వినియోగంపై ఆంక్షలు విధించింది మణిపూర్ ప్రభుత్వం. అనవసర ఫార్వార్డ్ సందేశాలతో శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తున్నారన్న కారణంతో మొదట మొబైల్ ఇంటర్నెట్ వినియోగాన్ని నిషేధించింది. కేవలం బ్రాడ్ బ్యాండ్ సేవలు, స్టాటిక్ ఐపీ ద్వారా ఇంటర్నెట్ సర్వీసు ప్రొవైడర్ అందించే సేవలను మాత్రమే వినియోగించుకోవాలని సూచించింది. అల్లర్లు జరుగుతున్న సమయంలో ఆనాడు ప్రభుత్వం ఇంటర్నెట్ సేవలను పూర్తిగా నిలిపివేయడం వల్లనే చాలా వరకు హింసాత్మక సంఘటనలు తగ్గుముఖం పట్టాయి. లేదంటే చరవాణుల్లో సందేశాల ద్వారా ఎదుటివారి భావోద్వేగాలను సులువుగా రెచ్చగొట్టేవారు. ఇటీవల ఆంక్షలను ఎత్తివేయడంతో అల్లర్ల నాటి వీడియోలను ఫార్వార్డ్ చేస్తూ మరోసారి ఉద్రిక్త వాతావరణాన్ని సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మొబైల్ ఇంటర్నెట్ సేవలకు అడ్డుకట్ట వేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. హాట్ స్పాట్, వైఫై సేవలను కూడా నిషేధించింది. ఒకవేళ ఎవరైనా వీటిని వినియోగించినట్లు తెలిస్తే సదరు సర్వీస్ ప్రొవైడర్ పై చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది ప్రభుత్వం. ఇది కూడా చదవండి: రెండు రోజుల్లో మణిపూర్‌లోకి 718 మంది మయన్మార్ దేశస్తులు.. -
ఈ ఇంటర్నెట్ మాకొద్దు బాబోయ్..!
జకార్తా: స్మార్ట్ ఫోన్లు, సోషల్ మీడియాలొచ్చాక ప్రపంచమే మారిపోయింది. ఎప్పుడు ఎవరిని చూసినా అన్ని పనులు మానేసి తమ ఫోన్ల్లో తలదూర్చి కాలం గడిపేస్తున్నారు. ఈ ఆన్లైన్ ప్రపంచం జనంపై చూపిస్తున్న వ్యతిరేక ప్రభావం నుంచి తమని తాము కాపాడుకోవడానికి ఇండోనేసియాలోని జావా దీవుల్లో నివసించే ఒక స్థానిక తెగ అసలు ఇంటర్నెట్ వద్దని నినదిస్తోంది. బాంటెన్ ప్రావిన్స్‌లో 26 వేల మంది వరకు ఉండే బదూయీ అనే వర్గం ప్రజలు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం తమకి వద్దే వద్దని అంటున్నారు. ఈ తెగ ప్రజలు మొత్తం మూడు గ్రామాల్లో నివసిస్తారు. తమ ప్రాంతంలో ఉండే టెలికాం టవర్లను తొలగించాలని అప్పుడు సిగ్నల్స్ రాక తాము ఆన్లైన్ ఉచ్చులో ఇరుక్కోమని వారి వాదనగా ఉంది. ఈ మేరకు గ్రామ పెద్దలు ప్రభుత్వ అధికారులకు ఒక లేఖ కూడా రాశారు. స్మార్ట్ ఫోన్ వల్ల దుష్ప్రభావాలు తమ జీవితంపై లేకుండా ఉండడానికే తాము ఈ ప్రయత్నాలు చేస్తున్నామన్నారు. ఇంటర్నెట్ అందుబాటులో ఉంటే యువత అందులో కూరుకుపోతారని, ఇది వారి నియమబద్ధమైన జీవితంపై ప్రభావం చూపిస్తుందని ఆ లేఖలో ఆందోళన వ్యక్తం చేశారు. వారి ఆందోళనను గుర్తించిన లెబాక్ జిల్లా అధికారులు ఈ విషయాన్ని ఇండోనేసియా సమాచార శాఖ దృష్టికి తీసుకువెళ్లారు. ప్రజలు ఏం కోరుకుంటే అదే తాము ఇస్తామని, వారి సంప్రదాయాలు, స్థానికతను కాపాడడమే తన లక్ష్యమని ప్రభుత్వ అధికారి ఒకరు చెప్పారు. -
ఇంటర్నెట్ షట్‌డౌన్: నెంబర్ 1 గా నిలిచిన భారత్
సాక్షి, న్యూఢిల్లీ: ఇంటర్నెట్ లేకుండా రోజు గడవని పరిస్థితులు నెలకొన్నాయి. చిన్నా పెద్దా తేడా లేకుండా అందరూ ఫోన్లకు అతుక్కు పోతున్నారు. ఇంటర్నెట్తో సాంకేతికంగా ఎన్నో అద్భుతాలు చోటుచేసుకుంటున్నప్పటికీ అంతే స్థాయిలో మానవ సంబంధాలపై చెడు ప్రభావం పడుతోంది. ఇక కరోనా పుణ్యామాని గతేడాది అందరికీ కష్టంగా గడిచింది. అడుగు బయట పెట్టని పరిస్థితుల్లో అధిక స్థాయిలో ఇంటర్నెట్ వినియోగం జరిగింది. అయితే, 2020లో భారత్ అత్యధికంగా ఇంటర్నెట్ షట్డౌన్లను చూసినట్టు ఓ నివేదిక వెల్లడించింది. శాంతి భద్రతల పరిరక్షణ, ఇతర కారణాలతో భారత్‌లో ఇంటర్నెట్ను నిలిపివేసినట్టు తెలిపింది. పోయిన ఏడాది అత్యధికంగా ఇంటర్నెట్ షట్‌డౌన్ చేసిన 29 దేశాల జాబితాలో భారత్ అగ్రస్థానంలో ఉంది. ఇంటర్నెట్ నిలుపుదల సంఘటనలు మన దేశంలో జరగగా, కొన్ని మధ్యప్రాచ్య దేశాలు, ఆఫ్రికాలోని కొన్ని ప్రాంతాల్లో ఎక్కువగా ఇంటర్నెట్ సేవలు నిలిపివేశారు. ప్రపంచవ్యాప్తంగా మొత్తం 155 ఇంటర్నెట్ షట్డౌన్లు విధించగా, వీటిలో 109 ఇంటర్నెట్ షట్ డౌన్లు కేవలం భారత్‌లోనే ఉన్నాయి. యాక్సెస్ నౌ నివేదిక ప్రకారం, 2019లో కూడా అత్యధికంగా 121 సార్లు ఇంటర్నెట్ నిలిపివేయగా, వెనిజులాలో 12 , యెమెన్‌లో 11, ఇరాక్ లో 8, అల్జీరియాలో 6, ఇథియోపియాలో 4 సార్లు ఇంటర్నెట్ను నిలిపివేశారు. భారత ప్రభుత్వం 2020లో 109 సార్లు ఇంటర్నెట్ను నిలిపివేయగా, గత రెండేళ్ళలో పోల్చితే ఈ సంఖ్య తక్కువగా ఉంది. జమ్మూ కాశ్మీర్లో ఆగస్టు 2019 నుంచి శాశ్వతంగా ఇంటర్నెట్ను నిలిపివేయగా తిరిగి ఇంటర్నెట్ను 18 నెలల తరువాత పునరుద్ధరించారు. ముఖ్యంగా, పశ్చిమ బెంగాల్లో, పశ్చిమ బెంగాల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ రాష్ట్ర ప్రభుత్వ హోంశాఖ గతంలో మాధ్యమిక్ (మాధ్యమిక పాఠశాల) పరీక్షల సమయంలో కర్ఫ్యూ తరహా ఇంటర్నెట్ బ్లాక్అవుట్ను ప్రవేశపెట్టింది, ప్రతిరోజూ కొన్ని గంటలపాటు ఇంటర్నెట్ సదుపాయాన్ని నిలిపారు. ఈ ఇంటర్నెట్ కర్ఫ్యూ తొమ్మిది రోజులకు పైగా కొనసాగిందని నివేదిక పేర్కొంది. భద్రతా పరంగా సున్నిత ప్రాంతమైన జమ్మూ కాశ్మీర్లో దాదాపు రెండేళ్లుగా హైస్పీడ్ ఇంటర్నెట్ లేకుండా పోయింది. ఫిబ్రవరి 2021 లో జమ్మూ కాశ్మీర్లో 4 జి ఇంటర్నెట్ సేవలు పునరుద్ధరించారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 370 ను రద్దు చేస్తున్నట్లు ప్రకటించే ముందు జమ్మూ కాశ్మీర్లో ఇంటర్నెట్ సేవలను నిలిపివేశారు. ఆ సమయంలో, కశ్మీర్ ప్రజలు 2 జి ఇంటర్నెట్ సేవలను మాత్రమే పొందగలిగారు. -
కశ్మీరే కాదు, విదేశాల్లో కూడా నెట్ కట్!
సాక్షి, న్యూఢిల్లీ : ఆర్టికల్ 370 రద్దు నేపథ్యంలో కశ్మీర్లో గత వారం రోజులుగా ల్యాండ్ ఫోన్ సర్వీసులు సహా మొబైల్ ఫోన్, నెట్ సర్వీసులను పూర్తిగా నిలిపివేసిన విషయం తెల్సిందే. 2017లో కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కమ్యూనికేషన్ల చట్టం నిబంధనల ప్రకారం అత్యయిక పరిస్థితులు, ప్రజల భద్రతను దృష్టిలో పెట్టుకొని వీటి సేవలను నిలిపివేయవచ్చు. ఒక్క భారత దేశంలోనే కాకుండా ప్రపంచంలో, పలు దేశాల్లో ఇలా కమ్యూనికేషన్ సర్వీసులను నిలిపివేసిన సందర్భాలు ఉన్నాయి. ఇక ల్యాండ్‌లైన్ ఫోన్ల సర్వీసులను అత్యయిక పరిస్థితుల్లో నిలిపివేసిన దేశాలు చైనా, మయన్మార్, సిరియా, ఇజ్రాయెల్ మాత్రమే. ఈసారి కశ్మీర్లో ల్యాండ్‌లైన్ ఫోన్ సర్వీసులను నిలిపివేయడం ద్వారా భారత్ కూడా ఆ దేశాల సరసన చేరింది. గాజాలో 2011, 2017 పాలస్తీనాలోని గాజా ప్రాంతానికి మిగతా ప్రపంచంతో కమ్యూనికేషన్ సంబంధాలను తెంపేయాలనే ఉద్దేశంతో ఇజ్రాయెట్ సైన్యం సరిహద్దు వెంబడి కమ్యూనికేషన్ కేబుళ్లను బుల్డోజర్లతోని తొలగించి వేసింది. మొబైల్, ఇంటర్నెట్ సర్వీసులతోపాటు ల్యాండ్‌లైన్ సర్వీసులు కూడా నిలిచిపోయాయి. పాలస్తీనాకు సొంత టెలిఫోన్ కంపెనీలు ఉన్నప్పటికీ వాటికి సంబంధించిన పరికరాల కోసం ఇజ్రాయెల్‌పైనే ఆధారపడాల్సి ఉంది. అందుకనే 2017లో బ్యాకప్ జనరేటర్ పేలిపోవడంతో మరోసారి ల్యాండ్‌లైన్ సర్వీసులు నిలిచిపోయాయి. ఆంక్షల కారణంగా ఇజ్రాయెల్ నుంచి మరో జనరేటర్‌ను పాలస్తీనా కొనుగోలు చేయలేక పోయింది. టిబెట్‌లో 2012 టిబెట్ ప్రాంతంపై చైనా ఆధిపత్యానికి వ్యతిరేకంగా 2012లో టిబెట్‌కు చెందిన బౌద్ధ సన్యాసులు సామూహిక ఆత్మహత్యకు పాల్పడినప్పుడు టిబెట్ ప్రాంతంలో టెలిఫోన్ సర్వీసులు నిలిచిపోయాయి. సిరియాలో 2012 సిరియాలో యుద్ధ పరిస్థితులు కొనసాగుతున్నప్పుడు ఇంటర్నెట్, మొబైల్ సర్వీసులు నిలిపి వేశారు. ముఖ్యంగా సైనిక దాడులు ప్రారంభం కాకముందు ‘బషర్ అల్ అసద్’ ప్రభుత్వం కమ్యూనికేషన్ సర్వీసులను ఎక్కువగా నిలిపి వేసింది. 2015లో ఇంటర్నెట్, మొబైల్ ఫోన్ సర్వీసులను ప్రభుత్వమే నిలిపివేసింది. మయన్మార్‌లో 2013 బౌద్ధులు, ముస్లింల మధ్యన పెద్ద ఎత్తున హింసాకాండ చెలరేగడంతో మొబైల్, ఇంటర్నెట్ సర్వీసులను నిలిపివేశారు. 144వ సెక్షన్ కింద నిషేధాజ్ఞలు కూడా విధించారు. -
అక్కడ పెద్ద నోట్లు, ఇంటర్నెట్ సేవలు రెండూ బంద్!
ఓ వైపు పెద్ద నోట్ల రద్దు.. మరోవైపు ఇంటర్నెట్ సేవలు బంద్. మరి ప్రజలు పరిస్థితేమిటి? ప్రస్తుతం కశ్మీర్ వ్యాలీలో ప్రజలు ఎదుర్కొంటున్న కష్టాలివే. సాధారణ ప్రజానీకం నుంచి రాజకీయ నాయకుల వరకు అందరూ ఇదే పరిస్థితిని చవిచూస్తున్నారు. జమ్మూకశ్మీర్‌కు మాజీ ముఖ్యమంత్రి ఫరూక్ అబ్దుల్లా కూడా లాల్ చౌక్‌లో ఓ దుకాణంలో అప్పు చేసి మరీ తనకు కావాల్సిన సరుకులు కొనుకున్నారట. 500, 1000 నోట్ల రద్దుతో పాటు, మరోవైపు మొబైల్ ఇంటర్నెట్ సేవలు కూడా కశ్మీర్ వ్యాలీలో నిలిచి ఉండటంతో ప్రజలు దారుణ పరిస్థితులు ఎదుర్కొంటున్నట్టు తెలుస్తోంది. ఉన్న ఏటీఎంలు కూడా అవుట్ ఆఫ్ సర్వీసు అనే బోర్డులను వేలాడదీస్తూ ఉండటంతో, ప్రజల కనీస అవసరాలకు నగదు కరువవుతోంది. కశ్మీర్ వ్యాలీలో ఇంటర్నెట్ సేవలు జూలై 8 నుంచి నిలిచిపోయిన సంగతి విదితమే. హిజ్బుల్ మెహిద్దీన్ మిలిటెండ్ బుర్హాన్ వానీ ఎన్కౌంటర్లో మరణించడంతో రగిలిన నిరసనలు, ఘర్షణలతో అక్కడ ఇంటర్నెట్, మొబైల్ సేవలను బంద్ చేశారు. ఆ తర్వాత ప్రభుత్వం ల్యాండ్ లైన్ ఇంటర్నెట్ కనెక్షన్లను పునరుద్ధించినప్పటికీ, అక్కడ 6వేల కంటే తక్కువగానే బ్రాండ్‌బ్యాండ్ సబ్స్క్రైబర్లే ఉన్నారు. మొబైల్ ఇంటర్నెట్ సేవలు నిలవడంతో, జమ్మూకశ్మీర్, హెచ్డీఎఫ్సీ బ్యాంకులు సిమ్ కార్డుల ద్వారా అందిస్తున్న పీఓఎస్ మిషన్ల సేవలు నిలిచిపోయాయి. దీంతో డెబిట్, క్రెడిట్ కార్డుల ద్వారా లావాదేవీలు జరుగడం లేదు. లాల్ చౌక్, రెసిడెన్సీ రోడ్‌లోని శ్రీనగర్ బిజినెస్ హబ్‌లో కేవలం ఒకే ఒక్క డిపార్ట్మెంటల్ స్టోర్ డెబిట్, క్రెడిట్ కార్డులను అనుమతిస్తోంది. వ్యాలీలోని 100కు పైగా పెట్రోల్ పంప్స్‌లో కూడా ఒకే పెట్రోల్ పంప్లో బ్రాండ్ బ్యాండ్ ఇంటర్నెట్ యాక్సెస్ ఉంది. చాలామంది ప్రజల దగ్గర డెబిట్ కార్డులు ఉన్నప్పటికీ, కనీసం అవి పనికిరాకుండా మారాయని అసహనం వ్యక్తంచేస్తున్నారు. పాలు, కూరగాయాలు వంటి కనీస అవసరాలకు తమకు నగదు కావాలని ప్రజలు అభ్యర్థిస్తున్నారు. ప్రజల అభ్యర్థనలు సహేతుకమైనవిగా భావించిన, ఆ రాష్ట్ర ప్రభుత్వం ఈ విషయాలను కీలకంగా తీసుకున్నట్టు ప్రభుత్వ అధికార ప్రతినిధి, విద్యామంత్రి నయీమ్ అక్తర్ తెలిపారు. ఈ సమస్యల గురించి ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీకి తెలియజేయనున్నట్టు పేర్కొన్నారు.