అసలేం.. జరిగింది!
కోరుట్ల, న్యూస్‌లైన్ : ఆదివారం రాత్రి 9.30 గంటల సమయం. కోరుట్ల ఠాణాలో పోలీసుల హడావుడి. ఒక్కసారిగా పోలీస్‌స్టేషన్ మెయిన్‌గేటు మూసేశారు. పట్టణంలోని ఓ పాఠశాలలో జరిగిన దొంగతనం కేసులో పట్టుకొచ్చిన ముగ్గురు మైనర్లను విడిపించుకునేందుకు అప్పుడే వెళ్లిన వారి బంధువులను పోలీసులు బయటకు పంపించారు.
వెంటనే ఠాణాలో లాకప్‌లో ఉన్న ముగ్గురు పిల్లలను వదిలేశారు. అంతలో తీవ్ర గాయాలతో ఉన్న వ్యక్తిని కారులో స్థానికంగా ఉన్న ఓ ఆసుపత్రికి తరలించారు. అప్పటికే ఆ వ్యక్తి ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్టాడుతున్నాడు. అతడు ఎవరో కాదు.. సాన చంద్రయ్య.
రెండు రోజులుగా ఇంటరాగేషన్
రెండు రోజులుగా చంద్రయ్యను కోరుట్ల ఠాణాలో ఇంటరాగేషన్ చేస్తున్నారు. ఆదివా రం మధ్యాహ్నం పోలీసుల ఇంటరాగేషన్ తట్టుకోలేని చంద్రయ్య ఠాణా మొదటి అంతస్తు నుంచి కిందికి పరిగెత్తుకుంటూ వచ్చినట్లు సమాచారం. అయినప్పటికీ వదలకుండా చంద్రయ్యను మళ్లీ పైఅంతస్తుకు తీసుకెళ్లి తమ తరహాలో విచారించారు. రాత్రి మరోసారి ఇంటరాగేషన్ చేశారు. ఆ దెబ్బలతో నడవలేని స్థితిలో ఉన్న చంద్రయ్యను ఠాణా రెండో అంతస్తుపైకి ఎక్కించి దెబ్బల బాధ తగ్గడానికి కాసేపు నడవమని చెప్పినట్లు సమాచారం.
గుట్టుచప్పుడు కానివ్వలేదు..
చంద్రయ్య ఠాణా రెండవ అంతస్తు నుంచి కిందనున్న సిమెంట్ గచ్చుమీద పడడంతో తల, కాళ్లు, చేతులకు తీవ్రగాయాలయ్యాయి. పోలీసులు గుట్టచప్పుడు కాకుండా వ్యవహరించి ఠాణాలో ఉన్న వారిని బయటకు పంపించారు. ఠాణా సమీపంలోకి బయట వారు రాకుండా జాగ్రత్తపడ్డారు. కింద పడ్డ చంద్రయ్యను పరిశీలించి వైద్యులను పిలి పించారు.
అంతలోపు చంద్రయ్యను సంఘటన స్థలం నుంచి పక్కకు జరిపి గచ్చు మీద ఏర్పడ్డ రక్తం మరకలను నీళ్లతో కడిగేశారు. చంద్రయ్య పరిస్థితి విషమంగా ఉండడంతో స్థానికంగా ఉన్న ఓ ఆసుపత్రికి తరలించారు. అనంతరం చంద్రయ్యను అంబులెన్స్‌లో కరీంనగర్‌కు తరలిస్తుండగా మార్గమధ్యంలో చనిపోయినట్లు తెలిసింది.
ఇంత జరగుతు న్నా.. స్థానికంగా ఎవరికి ఈ విషయం తెలియలేదంటే పోలీసులు ఎంత గోప్యంగా వ్యవహరించారో ఇట్టే అర్థమవుతుంది. ఒకవేళ చం ద్రయ్య తనకు తాను ఠాణాపై నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంటే.. పోలీసులు ఎందుకు ఇంత గుట్టుచప్పుడు కాకుండా వ్యవహరించారన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి.