రూ.2 లక్షల కోట్లతో భారీ రిఫైనరీ!
♦ మహారాష్ట్రలో ఏర్పాట్లు
♦ చేతులు కలిపిన ఐవోసీ, బీపీసీఎల్, హెచ్పీసీఎల్
న్యూఢిల్లీ: ప్రభుత్వరంగంలోని ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (ఐవోసీ), భారత్ పెట్రోలియం కార్పొరేషన్ (బీపీసీఎల్), హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ (హెచ్పీసీఎల్) సంస్థలు సంయుక్తంగా మహారాష్ట్రలోని రత్నగిరి జిల్లాలో భారీ ఆయిల్ రిఫైనరీని ఏర్పాటు చేయనున్నాయి. ఈ మేరకు బుధవారం ఒక ఒప్పందంపై సంతకాలు జరిగాయి.
60 మిలియన్ టన్నుల రిఫైనరీ సామర్థ్యంతో ఏర్పాటు చేసే ఈ ప్రాజెక్టు అంచనా వ్యయం రూ.2 లక్షల కోట్లు. ఒక్క ఐవోసీయే ఇందులో సగం వాటా తీసుకోనుంది. మిగిలిన రెండు సంస్థలు మరో సగం పెట్టుబడులతో 50 శాతం వాటాను పొందుతాయి.