బ్యాంకులకు ప్రభుత్వం కీలక ఆదేశాలు
న్యూఢిల్లీ : పెద్ద నోట్లను రద్దు చేస్తున్నట్టు ప్రకటించిన అనంతరం ప్రభుత్వం నగదు రహిత లావాదేవీలపై ఎక్కువగా దృష్టిసారించింది. ఈ నేపథ్యంలో డిజిటల్ లావాదేవీలకు అవరోధంగా మారిన సైబర్ అటాక్స్పై ఉక్కుపాదం మోపేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. బ్యాంకు ఐటీ సిస్టమ్స్‌లో ఏదైనా ఉల్లంఘన జరిగినట్టు గుర్తిస్తే రెండు గంటల్లోగా తమకు సమాచారం అందించాలని ఆయా బ్యాంకర్లను ప్రభుత్వం ఆదేశించింది. ఈ మేరకు దేశీయ ప్రముఖ బ్యాంకులు స్టేట్ బ్యాంకు ఆఫ్ ఇండియా, పంజాబ్ నేషనల్ బ్యాంకు, ఐసీఐసీఐ, హెచ్డీఎఫ్సీ వంటి అన్ని బ్యాంకులకు ఆదేశాలు పంపింది. ద్రవ్య లాభాల కోసం ఆర్థిక మధ్యవర్తులు పాల్పడే ఈ దొంగతనాలపై వెంటనే కఠిన చర్యలు తీసుకోవడానికి ప్రభుత్వంతో వెంటనే ఈ సమాచారం పంచుకోవాలని ఐటీ కార్యదర్శి అరుణా సుందరాజన్ చెప్పారు.
వినియోగదారుల అనుమతి లేకుండా వారికి సంబంధించిన సమాచారం ఎవరికి తెలుపవద్దని తెలిపారు. లీకేజీకి పాల్పడితే కఠిన చర్యలు, భారీ జరిమానాలు వంటి వాటిని ఎదుర్కోవాల్సి వస్తుందని, దీనికి సంబంధించి ప్రభుత్వం చట్టాలు రూపొందించేందుకు సన్నద్ధమవతుందని చెప్పారు. నవంబర్ 8న పాత నోట్లను రద్దు చేస్తున్నట్టు ప్రధాని మోదీ ప్రకటించిన అనంతరం డిజిటల్, నగదు రహిత కార్యకాలాపాలు విపరీతంగా పెరిగిన సంగతి తెలిసిందే. మొబైల్ వాలెట్స్, క్రెడిట్, డెబిట్ కార్డు, ఇతర పాయింట్ ఆఫ్ సేల్ పద్ధతులు అమాంతం ఎగిశాయి. బ్యాంకు అకౌంట్లతో లింక్ అయ్యే ఆధార్ ఆధారిత పేమెంట్ విధానాన్ని ప్రభుత్వం లాంచ్ చేసింది. ఈ నేపథ్యంలో ఆర్థిక లావాదేవీల దొంగతనంపై ప్రభుత్వం కఠిన చర్యలకు సిద్ధమవుతోంది.