ఐటీ@ వైఎస్
* వైఎస్ హయాంలోనే అసలైన అభివృద్ధి
* ‘బాబు’దంతా గోబెల్స్ ప్రచారమే
* 2004 తరువాతే ఐటీ ఎగుమతుల్లో గణనీయ వృద్ధి
* గణాంకాలు చెప్పే వాస్తవం ఇదే
స్వాతి: ఐటీ సృష్టికర్త నేనేనంటాడు.. మీకందరకీ ఉద్యోగాలు నా పుణ్యమేనంటాడు.. హైదరాబాద్‌లో ఐటీ కళ నా పుణ్యమేనంటాడు.. బిల్‌గేట్స్, బిల్ క్లింటన్ల పేర్లు వల్లె వేస్తుంటాడు.. వైఎస్ ఐటీనసలే పట్టించుకోలేదంటాడు.. వైఎస్ హయాంలో ఐటీ రంగ ఎగుమతులు కుంటుపడ్డాయంటాడు.. ఇవన్నీ నిజాలేనా?.. లేక చంద్రబాబు మార్కు ప్రచార ప్రధాన, ఊదరగొట్టు, ఊకదంపుడు గోబెల్స్ వాఖ్యలా?.. ఎవరి హయాంలో ఐటీ రంగం వాస్తవంగా ప్రగతిపథాన నడిచింది? ప్రచార ఆర్భాటం లేకుండా మిగతా రంగాలతో సమానంగా ఐటీకి ప్రాధాన్యత ఇచ్చిందెవరు?.. ఈ గణాంకాలు చూడండి.. వాస్తవాలు తెలుస్తాయి.
ఐటీ పాలసీని ప్రభుత్వం 25-05-1999న ప్రకటించింది. దీనిని 27-06-2002న ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ (ఐసీటీ) పాలసీగా మార్చారు. ఆ తర్వాత ఐసీటీ విధానం (2005-2010) తేదీ 21-03-2005 నుండి అమలులోకి వచ్చింది. 1999లో ఐటీ రంగంలో 12 వేల ఉద్యోగాల కల్పన జరిగితే, 2009 నాటికి అది 20 రెట్లు పెరిగి 2,51,786కు చేరింది. 1999లో రూ.284 కోట్లుగా ఉన్న ఐటీ ఎగుమతుల టర్నోవర్ 2009 నాటికి రూ. 32, 509 కోట్లకు పెరిగింది.
- చంద్రబాబు హయాంతో పోల్చితే వైఎస్ హయాంలో 110 రెట్లు ఐటీ ఎగుమతులు పెరిగాయి.
- 2003-04లో రూ. 5025 కోట్ల రూపాయలు విలువజేసే ఐటీ ఎగుమతులు మాత్రం ఉండేవి. నాటి ముఖ్యమంత్రి చంద్రబాబు హైటెక్ సీఎం అన్న పేరు ఉన్నప్పటికీ నిజానికి వైఎస్ హయాంలోనే ఐటీ అద్భుతమైన ప్రగతిని సాధించినట్లు ప్రభుత్వ లెక్కలే చెబుతున్నాయి.
- 2003లో ఐటీ రంగం ద్వారా 71,445 మందికి ఉద్యోగాలు కల్పిస్తే 2009లో ఇది 2,51,786కు పెరిగింది.
- ఐటీ రంగం ప్రగతి వైఎస్ మరణానంతరం కుంటుపడింది. 2010-11లో ఐటీ ఉత్పత్తుల విలువ రూ.36వేల కోట్లే.
- ఐటీ అభివృద్ధి తనవల్లే జరిగిందని చెప్పే చంద్ర బాబు పాలనకు ముందే 1987లోనే హైదరాబాద్‌లో సత్యం కంప్యూటర్ సర్వీసెస్ ఏర్పడింది. చంద్రబాబు ఐటీ అభివృద్ధికి ఆద్యుడు కాదన్న విషయం దీన్నిబట్టే అర్థమవుతుంది.
- ప్రపంచపటంలో హైదరాబాద్‌కు చోటు కల్పించానని చెప్పుకునే చంద్రబాబుది కేవలం ప్రచార పటాటోపం మాత్రమే. చంద్రబాబు తొమ్మిదేళ్ల పాలనలో ఐటీ రంగంలో 81 వేల ఉద్యోగాలు కల్పిస్తే, వైఎస్ఆర్ పాలనలో కొత్తగా 1.53 లక్షల ఉద్యోగాలు కల్పించడం జరిగింది.
- భారత ఐటీ ఎగుమతుల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వాటా 15 శాతం. ఐటీలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానిది దేశంలో నాలుగో స్థానం.
- ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఇన్వెస్ట్మెంట్ రీజియన్(ఐటీఐఆర్)ను హైదరాబాద్‌లో ఏర్పాటు చేయడానికి కేంద్ర ప్రభుత్వం రాష్టానికి సూత్రప్రాయమైన తుది ఆమోదం తెలిపింది. దీంతో వచ్చే 25 ఏళ్లలో 50 వేల ఎకరాల్లో రెండు దశల్లో ఐటీఐఆర్‌ను అభివృద్ధి చేస్తారు. దీనికి రూ. 2.19 లక్షల కోట్లు ఖర్చు చేస్తారు. 15 లక్షల మందికి దీని వల్ల ఉద్యోగాలు లభిస్తాయని అంచనా. ఐటీఐఆర్‌లో సెజ్‌లు, ఇండస్ట్రియల్ పార్కులు, ఫ్రీ ట్రేడ్ జోన్లు, వేర్ హౌజింగ్ జోన్లు, ఎగుమతి సంస్థలు ఉంటాయి.
- ఐటీఐఆర్ ఏర్పాటులో హైదరాబాద్‌కే తొలి అవకాశం లభించింది. ఐటీఐఆర్‌తో ప్రస్తుతం ఉన్న 50వేల కోట్ల ఎగుమ తులను 2.35 లక్షల కోట్లకు పెంచడమే ప్రభుత్వ లక్ష్యం. ఎలక్ట్రానిక్ హార్డ్‌వేర్ ఉత్పత్తుల రంగం ప్రస్తుతం ఉన్న రూ. 6 వేల కోట్ల నుంచి రూ. 80 వేల కోట్లకు వృద్ధి చెందుతుందని అంచనా. హైదరాబాద్‌లోని మాదాపూర్, గచ్చిబౌలి, కొండాపూర్‌లలో ఐటీ కంపెనీలు కేంద్రీకృతమయ్యాయి. ఇదంతా వైఎస్ తీసుకున్న చర్యల వల్ల సాధ్యమైంది. వైఎస్ ప్రభుత్వం ఎన్నడూ ఐటీ విషయంలో ప్రచారపటాటోపం ప్రదర్శించలేదు. ఐటీని రాష్ట్రంలో పరుగులు పెట్టించినా వైఎస్ రైతుజన బాంధవుడిగానే ఉండటానికి ఇష్టపడ్డారు.