ట్రింగ్..ట్రింగ్... ట్రింగ్!!!
మూడు బెల్లులు బాగానే మోగేటట్లున్నాయి.సినిమాకి స్టార్టింగ్ బెల్... ఇంటర్వెల్ బెల్...అయిపోయిందన్న బెల్. కథకి విలన్ బెల్... హీరో బెల్...ఎంటర్టైన్మెంట్ బెల్. ఫ్యాన్ల బెల్... ప్రొడ్యూసర్ల బెల్... డిస్ట్రిబ్యూటర్స్బెల్... అన్నీ మోగేలానే ఉన్నాయి.మంచి కాన్ఫిడెన్స్‌లో ఉన్న చిన్న ఎన్టీఆర్ ఇంటర్వ్యూ అంతా బెల్లులు మోగిస్తూనే ఉన్నాడు! రెండు రోజులు ఆగితే ఈలలు మోగాలి, చప్పట్లు మోగాలి, వసూళ్లు మోగాలనే నమ్మకంతో ఉన్నారు.
► మూడు పాత్రలు చేయాలని ఈ సినిమా మొదలుపెట్టలేదు. చేద్దామని మొదలుపెడితే కాదు కూడా! కథ రాసేవాళ్లు ఉండాలి. కథ రాసుకునే కెపాసిటీ నాకుంటే?.. నేనే కథ రాసుకుని, డైరెక్షన్ చేసేవాణ్ణి. అప్పుడు ఎవరూ ఏమీ అనరు కదా! బహుశా... ఎన్టీఆరే కథ రాశాడు, డైరెక్షన్ చేస్తున్నాడనే ఫోకస్ ఎక్కువ ఉండేదేమో! ఏకేయడానికో... పొగడడానికో... అందరూ రెడీగా ఉండేవాళ్లు. అంత ప్రతిభే ఉండుంటే... ఎప్పుడో దర్శకుణ్ణి, రచయితను అయ్యేవాణ్ణి. త్రిపాత్రాభినయం చేయాలనే కోరిక ఎప్పుడూ మనసులో లేదు. ఏ సినిమా చేయాలనే మీమాంశలో కథలు వింటునప్పుడు బాబీ ఈ కథతో వచ్చాడు. తను నాకు కథ చెప్పినప్పుడే... తన మైండ్‌లో ‘జై లవకుశ’ టైటిల్ ఉంది. కథలో మూడు పాత్రలున్నాయి.
► ఎప్పట్నుంచో కల్యాణ్ అన్న, నేనూ ఓ సినిమా చేయాలనుకుంటున్నాం. యాదృశ్చికమో? మరొకటో? అన్నదమ్ములు కలసి చేస్తున్న సినిమాకు అన్నదమ్ముల కథే దొరికింది. మా అదృష్టమది. బయట సంస్థకి, అన్నయ్య సంస్థలో చేస్తున్న సినిమాకు తేడా ఏంటంటే... ఈ సిన్మాను మా పేరెంట్స్‌కి గిఫ్ట్‌గా ఇవ్వాలనుకున్నాం. అందువల్ల, మాపై ఒత్తిడి ఉండేది. ఆ ఒత్తిడి వల్లే ఏమో? నేనూ, అన్నయ్య, మా టీమ్ ఎక్కువ కష్టపడ్డాం. మా ఫ్యామిలీకి ఇంకా సినిమా చూపించలేదు. మీరంతా (ప్రేక్షకులు) సినిమా విడుదలైన రోజే, ఉదయమే చూస్తారు. మేం 20వ తేదీ రాత్రి చూస్తాం లేదా 21 రాత్రి చూస్తాం!
► మూడు పాత్రలు తీసి పక్కన పడేస్తే... బాబీ చెప్పిన కథే నాకు నచ్చింది. అమ్మప్రేమను చెప్పే సినిమాలు ఎన్నో చూశాం. నాన్న గురించి ఎన్నో సినిమాలొచ్చాయి. నేనే ఓ సినిమా (నాన్నకు ప్రేమతో) చేశా. కానీ, ఎక్కడా అన్నదమ్ముల అనుబంధం గురించి పెద్దగా రాలేదు. తాతగారు చేసిన ‘భలే తమ్ముడు’, ‘మైఖేల్ మదన కామరాజు’ వంటి చిత్రాల్లో మాత్రమే అరుదుగా చూశాం. ఎప్పుడైతే అలాంటి సినిమా చేసే ఛాన్స్ నాకు వచ్చిందో? వెంటనే ఒప్పేసుకున్నా. బహుశా... నేను మా అన్నయ్యకు (కల్యాణ్‌రామ్)కు ఎక్కువ ఎటాచ్ కావడం ఈ సినిమా ఒప్పుకోవడానికి ఓ కారణం.
► ముగురిలో ‘జై’ విలన్, ‘లవ’ హీరో, ‘కుశ’ కమెడియన్ అనుకుంటే... ఈ ‘జై లవకుశ’ చిత్రకథ చెడుపై మంచి గెలవడమో? మంచిపై చెడు గెలవడమో? కాదు. ఓ తల్లి కడుపున ముగ్గురు కవలలు పుట్టారు. తల్లి కోరికకు పూర్తి విరుద్ధంగా వాళ్ల జీవితాలు తయారవుతాయి. బయట పరిస్థితుల ప్రభావం వల్ల ఓ తల్లి కన్నటువంటి కల చెదురుతుంది. ఆ తల్లి కల నిజమవుతుందా? రావణ రామ లక్ష్మణులు మళ్లీ రామ లక్ష్మణ భరతులు అవుతారా? అనేది కథ. ఇదొక ఎమోషనల్ డ్రామా. అమ్మగా పవిత్రా లోకేష్ బాగా చేశారు.
► మీకు నచ్చిన పాత్ర ఏది? అని ఎన్టీఆర్‌ను అడిగితే... ‘‘ఒక పాత్ర పేరు చెబితే పక్షపాతం అవుతుంది. దేని గురించైనా మనం ఎక్కువ కష్టపడితే.. దానిపై ఇష్టం పెరుగుతుందని చెబుతారు. ‘జై’ కోసం ఎక్కువ కష్టపడ్డా కాబట్టి ఆ పాత్రంటే నాకిష్టం! కానీ, మూడు పాత్రల్లో ఏ ఒక్కటి తీసేసినా కథకు పరిపూర్ణత ఉండదు. ‘కుశ’ పాత్ర ఎక్కడో ‘యమదొంగ’లో నేనే చేసినట్టు, ‘లవ’ పాత్ర ‘నాన్నకు ప్రేమతో’లో నేనే చేసినట్టుంటుంది. ఆ రెండు పాత్రలకు రిఫరెన్సులున్నాయి. ‘జై’ పాత్రకు లేదు. పైగా ఇది నెగటివ్ షేడ్ క్యారెక్టర్. దాంతో నా కష్టం ఎక్కువైంది. విలన్‌గా చేయడం నచ్చింది.
► మెంటల్లీ, ఫిజికల్లీ బాగా ఎక్కువ కష్టపెట్టిన చిత్రమిది. టెక్నాలజీ ఎంత పెరిగినా నటించాల్సింది నేనే కదా! నటనలో టెక్నాలజీ లేదు కదా! నటీనటులు ఓల్డ్ స్కూల్ ఆఫ్ మెథడ్ యాక్టింగ్‌ను ఫాలో కావల్సిందే. అందుకే, నా హోమ్‌వర్క్ నేను చేశా. ఒక్కోరోజు మూడు పాత్రలు చేయాల్సి వచ్చినప్పుడు ఇబ్బందిగా ఉండేది. ముఖ్యంగా ‘జై’ క్యారెక్టర్ నుంచి బయటకు రావడానికి ఎక్కువ టైమే పట్టింది. అదృష్టవశాత్తూ... నాకు ‘బిగ్ బాస్’ కొంచెం హెల్ప్ చేసింది. వీకెండ్లో ‘బిగ్ బాస్’కి వెళ్లినప్పుడు నాలా నేను ఉండేవాణ్ణి. ఈ సినిమా ఎంత ఇబ్బంది పెట్టినా... ఇలాంటి అవకాశం ఇంకెవరికి వస్తుందనే ఆశతో చేశా. నేనేంటో నిరూపించుకోవాలనుకున్నా. అరుదుగా ఇలాంటి అవకాశాలు వస్తాయి.
► నాకు తాతగారి (ఎన్టీఆర్) ‘భలే తమ్ముడు’ సినిమా బాగా ఇష్టం. అందులో ఆయన విలన్ని కూడా హీరోలా ప్రజెంట్ చేయగలిగారు. ఆయన ఆహార్యంతో, రూపురేఖలతో, నటనతో! రామారావుగారు రెండు వేషాలు వేస్తే మనం ఇంకెవర్నీ చూడం. ఆయన్నే చూస్తుంటాం. ఎక్కడో నా మనసులో దాగున్న ఈ విషయాలన్నీ ‘జై లవ కుశ’ చేసేలా చేశాయి. ‘దానవీరశూరకర్ణ’ మాకు స్ఫూర్తే. కానీ, కథ ప్రకారం కాదు. కృష్ణుడి నుంచి దుర్యోధనుడికి, దుర్యోధనుడి నుంచి కర్ణుడి పాత్రకు ఎలా షిఫ్ట్ అయ్యారు? పాత్రల మధ్య ఎలాంటి డిఫరెన్స్ చూపించారు? ఎలా బ్యాలెన్స్ చేశారు? అనేవి మాకు స్ఫూర్తిగా నిలిచాయి.
► ‘జై’ పాత్ర కోసం నత్తితో మాట్లాడడానికి కోచింగ్ తీసుకున్నారా? అని ఎన్టీఆర్‌ను ప్రశ్నించగా... ‘‘నథింగ్! కోచింగ్ సిస్టమ్‌ను నమ్మను. నత్తి అంటే ఏంటి? మనం ఏం మాట్లాడాలో మన మైండ్‌కి తెలుసు. కానీ, మైండ్ మనల్ని బ్లాక్ చేస్తుంది. ఓ పదాన్ని పూర్తిగా పలకనివ్వకుండా బ్లాక్ చేస్తుంది. సాధారణంగా నత్తిగా మాట్లాడాలంటే ‘ద్ద... ద్ద... ధైర్యం’ అనాలి. అలా కాకుండా ధైర్యంలో ‘ద’ను మింగేసి ‘ద్ధ... ద్ధ... ఐర్యం’ అని పలికా’’ అన్నారు.
► భవిష్యత్తుల్లో రాజకీయాల్లోకి నేను రావొచ్చు. రాకపోవచ్చు. ప్రస్తుతానికి నా దృష్టి సినిమాలపైనే.. ఇప్పుడు రాజకీయాల గురించి మాట్లాడం ఇష్టం లేదు. ఒకవేళ మాట్లాడితే తొందరపాటు అవుతుంది. ప్రపంచంలో ప్రతి మనిషి వెళ్తున్న దారిలోంచి కొంచెం పక్కకు వెళ్తాడు. నేనూ వెళ్లాను (రాజకీయాలను ఉద్దేశించి). అయితే మళ్లీ సరైన దారిలోకి రావడం నా అదృష్టం. నా ఫ్యాన్స్ వల్ల, దర్శకుల వల్ల నేను వెనక్కి రాగలిగా. గతంలో చేసిన తప్పుల నుంచి నేర్చుకున్నా.
► తాతగారి లెగస్సీని సినిమాల్లో ముందుకు తీసుకువెళ్తున్నానని అనుకుంటారా? అని ఎన్టీఆర్‌ని అడగ్గా... ‘‘ముందు నేను లెగస్సీని నమ్మను. వారసత్వం కరెక్ట్ కాదని నా ఫీలింగ్. నేను హీరోనని... రేపు కచ్చితంగా నా కొడుకు (అభయ్‌రామ్) హీరో కావాలంటే కుదరదు. సినిమా వాతావరణంలో పెరగడం వల్ల తను సహజంగా ఈ రంగం పట్ల ఆకర్షితుడు కావొచ్చు. అంతే తప్ప... నేను మాత్రం అభయ్‌ను ఫోర్స్ చేయను. మా నాన్నగారు, అమ్మగారు నన్ను హీరో అవ్వమని ఫోర్స్ చేయలేదు. హీరో అవ్వాలని నాకు అనిపించింది. అయ్యాను. తెలుగు సినిమా ఇండస్ట్రీలో 25 నుంచి 30 మంది హీరోలున్నారు. అందరికీ వారసత్వం ఉందా? ప్రతిభే ఇక్కడ మాట్లాడుతుంది. నేను దాన్నే నమ్ముతా’’ అని చెప్పారు.
అభయ్‌కి జై నచ్చాడు!
‘మా అబ్బాయి అభయ్‌కి ‘జై’ బాగా నచ్చేశాడు. ‘జై జై రావణా...’ అని పాడుతున్నాడు. మా అమ్మగారు ఇప్పట్నుంచి వాడికి రామాయణ, మహాభారత ఇతిహాసలను వివరించి చెబుతున్నారు. దాంతో అభయ్‌కి కొంచెం కొంచెం అవగాహన ఏర్పడుతోంది.
ఒక్క మాస్క్ కూడా వాడలేదు!
ఇందులో మూడు పాత్రలు చేశా. ఒక్కో ఫ్రేమ్‌లో మూడు లేయర్స్ ఉంటాయి. ఫోకస్ లేయర్ ఒకటి. నాన్ ఫోకస్ లేయర్స్ రెండు. మూడుసార్లు షూటింగ్ చేయడం ఎందుకు? నాన్ ఫోకస్ లేయర్స్‌కి మాస్కులు వేయొచ్చు కదా అనే ఆలోచనతో హాలీవుడ్ మేకప్ ఆర్టిస్ట్ వాన్స్ హార్ట్‌వెల్‌ని పిలిచాం. ప్రోస్థెటిక్ మేకప్ మాస్కులను రెడీ చేయించాం. కానీ, చివరకు ఒక్క మాస్క్ కూడా వాడలేదు. సినిమాలోని ప్రతి ఫ్రేమ్‌లోనూ రెండుంటే రెండు, మూడుంటే మూడు పాత్రలను నేనే చేశా. డూప్‌లను పెట్టి మేనేజ్ చేయలేదు.
బాబీ సత్తా ఉన్న దర్శకుడు!
రచయితగా బాబీ ఎన్నో సినిమాలు రాశాడు. తనకు కొత్తగా అర్హతలు ఏవీ అవసరం లేదు. దర్శకుడిగా తను తీసిన రెండు సిన్మాల్లోనూ ఎగ్జిక్యూషన్ పరంగా ఫెంటాస్టిక్. హిట్టూఫ్లాపులు పక్కన పెడితే... దర్శకుడిగా తనలో సత్తా ఉంది. నిరూపించుకున్నాడు కూడా. ఎక్కడా అతన్ని ప్రశ్నించే ఇది లేదు. కానీ, తనకు కావల్సిన సపోర్ట్‌ని ఇవ్వడంలో మాత్రం కల్యాణ్ అన్న ఫెంటాస్టిక్! మూడు పాత్రలను డీల్ చేయాలి కాబట్టి... మంచి టెక్నీషియన్లను కల్యాణ్ అన్న సినిమాకు తీసుకున్నారు. ఇది బాబీ కెరీర్లో గుర్తుండిపోయే చిత్రమవుతుంది. నటుడిగా నాకు, నిర్మాతగా అన్నయ్యకు కూడా! నేను బాక్సాఫీస్ రిజల్ట్స్ గురించి, కలెక్షన్స్ గురించి మాట్లాడడం లేదు. మాకు ఈ సినిమా ఎంత పేరు తీసుకొస్తుందనే అంశం గురించే చెబుతున్నా!
నేను టీచర్ని కాదు!
‘మీరు ఇంత బాగా నటిస్తారు కదా! టిప్స్ చెప్పండి’ అని నన్ను చాలామంది చాలాసార్లు అడిగారు. నేను టీచర్ని కాదు, ఇంకా లెర్నర్నే. ఎవరికైనా ఎలా నటించాలో మనం ఎలా చెప్పలగం? అసలు, ‘ఎవరైనా మొదటిసారి ఎప్పుడు నటించుంటారో తెలుసా?’ ఒక్కసారి ఆలోచించండి. తల్లితండ్రులకు అబద్ధం చెప్పినప్పుడు. ‘లేటుగా వచ్చావేంటి?’ అని ఇంట్లో అడగ్గానే... ఈ సిట్యువేషన్ లోంచి ఎలాగైనా బయటపడాలని అబద్ధాన్ని ఎంతో అందంగా చెబుతాం కదా. నటనంటే అదేనని నా ఫీలింగ్.
నో ఫైనాన్షియల్ డిస్కషన్స్!
ఇప్పటివరకూ కల్యాణ్‌రామ్ నిర్మించిన సినిమాలు ఆయనకు నష్టాల్నే మిగిల్చాయి. ‘జై లవకుశ’తో ఆయన గట్టెక్కేశారు! అనే వార్తలపై ఎన్టీఆర్‌ను ప్రశ్నించగా... ‘‘కల్యాణ్ అన్న కష్టాల్లో ఉన్నారు! నాతో సినిమా చేసి ఆయనకు సుఖం వచ్చేసింది’ అనుకోవడం లేదు. అలాంటి చర్చ గురించి కామెంట్ చేయాల్సిన అవసరమూ లేదనుకుంటున్నా. అన్నయ్య కష్టాల్లో ఉంటే ఇన్ని సినిమాలు ఎలా నిర్మిస్తాడు? ‘జై లవకుశ’ ఎలా తీస్తాడు? సింపుల్ లాజిక్... ‘టెంపర్, నాన్నకు ప్రేమతో, జనతా గ్యారేజ్’ లేవనుకోండి! నాకు మూడు సూపర్‌హిట్స్ ఉండవు. అయినా సినిమాలు చేస్తా కదా! ఆయనేంటో నాకు తెలుసు’’ అన్నారు. ‘కల్యాణ్‌రామ్‌కి, మీకు మధ్య ఫైనాన్షియల్ డిస్కషన్స్ జరగలేదా?’ అనడిగితే ‘‘ఏ సినిమాకీ దర్శక–నిర్మాతలతో ఫైనాన్షియల్ మ్యాటర్స్ డిస్కస్ చేయను. వేరే నిర్మాతలతోనే డిస్కస్ చేయనప్పుడు అన్నయ్యతో ఎందుకు చేస్తా’’ అన్నారు.
దర్శకుడి సలహాతోనే...
తమన్నా ముందు నుంచి స్పెషల్ సాంగ్స్ చేస్తూ వస్తున్నారు. ‘ఊసరవెల్లి’ తర్వాత మళ్లీ ఇప్పుడు ఆమెతో నేను వర్క్ చేశా. అయితే... ఈసారి స్పెషల్ సాంగ్ చేశా. ‘జనతా గ్యారేజ్’లో కాజల్‌తో కలసి స్టెప్పులేశా. ఈసారి తమన్నాతో చేస్తే బాగుంటుందని దర్శకుడు సలహా ఇవ్వడంతో ఆమెను తీసుకున్నాం! పాట కూడా బాగా వచ్చింది. హీరోయిన్లుగా నటించిన రాశీఖన్నా, నివేథా థామస్లకు స్పెషల్ థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే... ఒక్కో రోజు మూడు పాత్రలు చేయాల్సి వచ్చినప్పుడు నేనెప్పుడైనా డల్ అయితే వాళ్లు ఎంతో ఉత్సాహపరిచేవారు.