Jalabhishekam
-
నూహ్‌లో ప్రశాంతంగా పూజలు
నూహ్(హరియాణా): సర్వజాతీయ హిందూ మహాపంచాయత్ సంస్థ సోమవారం నూహ్‌లో తలపెట్టిన శోభాయాత్రను అధికారులు అడ్డుకున్నారు. జూలై 31న నూహ్‌లో మత కలహాలు చెలరేగిన నేపథ్యంలో హరియాణా ప్రభుత్వం తాజాగా శోభాయాత్రకు అనుమతి నిరాకరించింది. మల్హర్, ఝిర్, శింగార్ శివాలయాల్లో పూజలు మాత్రం చేసుకోవచ్చని తెలిపింది. దీంతో, అధికారులు ఢిల్లీ–గురుగ్రామ్ సరిహద్దుల నుంచి నూహ్ వరకు అయిదు ప్రధాన చెక్ పాయింట్లను పోలీసులు ఏర్పాటు చేశారు. శోభాయాత్రలో పాల్గొనేందుకు అయోధ్య నుంచి బయలుదేరిన జగద్గురు పరమహంస ఆచార్య తదితరుల బృందాన్ని సోహ్నా వద్ద ఘమోర్జ్ టోల్ ప్లాజా వద్ద నిలిపివేశారు. అనంతరం అధికారులు నూహ్ జిల్లాలోకి అనుమతించిన 15 మంది సాధువులు, ఇతర హిందూ నేతలు సుమారు 100 మంది నల్హర్‌లోని శివాలయంలో జలాభిక పూజలు చేశారు. అక్కడ్నుంచి ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన బస్సుల్లో ఫిరోజ్‌పూర్‌లోని ఝిర్కా ఆలయానికి వెళ్లి పూజలు చేశారు. శింగార్ ఆలయానికి కూడా వెళ్లారని అధికారులు తెలిపారు. ఎటువంటి అవాంఛ నీయ ఘటనలు జరగలేదని పోలీసులు వెల్లడించారు. ఇలా ఉండగా, సోమవారం సోహ్నా నుంచి నూహ్ వరకు పరిసరాలు నిర్మానుష్యంగా మారాయి. దుకాణాలేవీ తెరుచుకోలేదు. అధికారులు ముందు జాగ్రత్తగా విద్యాసంస్థలు, బ్యాంకులకు సెలవు ప్రకటించారు. మొబైల్ ఇంటర్నెట్ సేవలను నిలిపివేశారు. -
హర హర ‘మా’హా దేవా!
హరిద్వార్‌లో ఒక యువ భక్తుడు ఒక భుజాన తల్లిని, మరోభుజాన గంగానది జలం ఉన్న బిందెలను మోసుకువెళుతున్న వీడియో వైరల్ అయింది. కన్వర్ యాత్రలో భాగంగా భక్తులు గంగాజలాన్ని మోసుకు వస్తారు. దేశంలోని జ్యోతిర్లింగాలకు ఈ పవిత్రమైన నీటితో జలాభిషేకం చేస్తారు. పదకొండు సెకండ్ల ఈ వీడియో క్లిప్‌ను చూస్తూ కొందరు పురాణాలలోని శ్రవణకుమారుడిని గుర్తు తెచ్చుకున్నారు. ‘ఈ కాలంలో ఇలాంటి దృశ్యం చూడడం అపురూపంగా ఉంది’ ‘కడుపులో నవ మాసాలు మోసిన తల్లిని భుజాన మోయడం అదృష్టం’... ఇలా రకరకాలుగా స్పందించారు నెటిజనులు. -
అమరుల స్తూపానికి కాళేశ్వరం జలాలతో అభిషేకం
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ఏర్పాటు దిశగా కేంద్ర ప్రభుత్వం ప్రకటన చేసి పదేళ్లు పూర్తయిన సందర్భంగా టీఆర్ఎస్ నేతలు కాళేశ్వరం జలాలతో అమరుల స్తూపానికి అభిషేకం చేశారు. డిసెంబర్ 9 ప్రకటనను గుర్తు చేసుకుంటూ రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ తన అనుచరులతో కలసి సోమవారం గోదావరిఖని నుంచి గోదావరి నీటితో భారీ ర్యాలీగా అసెంబ్లీ ఎదురుగా ఉన్న గన్‌పార్కుకు చేరుకున్నారు. టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్, టీఎస్ఐఐసీ చైర్మన్ గ్యాదరి బాలమల్లు తదితరులతో కలసి అమరుల స్తూపానికి జలాభిషేకం చేశారు. గోదావరి జలాలను తెలంగాణకు తీసుకురావాలనే లక్ష్యంతో కేసీఆర్ కాళేశ్వరం ప్రాజెక్టు చేపట్టడం ద్వారా అమరుల కల నెరవేరిందని ఈ సందర్భంగా కర్నె ప్రభాకర్ పేర్కొన్నారు. -
1001 కుంభాలతో జలాభిషేకం
గుమ్మఘట్ట : సమృద్ధిగా వర్షాలు కురిసి, ఖరీఫ్ పంటలు వంద శాతం చేతికంది, రైతులు, ప్రజలు సుఖశాంతులతో ఉండేలా కరుణించు శివయ్యా అంటూ గుమ్మఘట్ట మండలం కేపీదొడ్డి, కలుగోడు గ్రామాల్లో సోమవారం చేపట్టిన వరుణయాగం జనజాతరను తలపించింది. అడిగుప్ప, రంగసముద్రం, ఆర్.కొత్తపల్లి, గౌనికుంట తదితర గ్రామాల నుంచి మహిళలు పెద్ద ఎత్తున కేపీదొడ్డి గ్రామానికి తరలివచ్చి గంగాజలం నింపిన 1001 కుంభాలను తలపై మోస్తూ ఊరేగింపు చేపట్టారు. ఊరేగింపు ముందు భాగంలో వీరభద్రస్వామి వేషధారణలతో పలువురు నృత్యాలు చేస్తూ ఆకట్టుకున్నారు. ఉపవాస దీక్షతో మహిళలు తెచ్చిన కుంభాలతో చంద్రమౌళేశ్వర స్వామికి జలాభిషేకం నిర్వహించారు. అనంతరం రుద్రాభిషేకం, మహామంగళ హారతి, వేలాది మంది భక్తులకు అన్నదానం నిర్వహించారు. కలుగోడు గ్రామంలో శివయ్యకు రుద్రాభిషేకం నిర్వహించి ప్రసాదాలు పంచిపెట్టారు. మాజీ ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి వైఎస్సార్సీపీ నాయకులతో కలసి రెండు గ్రామాల్లోని ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ రైతు విభాగం రాష్ట్ర కార్యదర్శి గౌని ఉపేంద్రరెడ్డి, నాయకులు పాటిల్ సదాశివారెడ్డి, పార్టీ మండల కన్వీనర్ గౌని కాంతారెడ్డి, బీసీ సెల్ రాష్ట్ర కార్యదర్శి ఎన్టీ సిద్దప్ప, జిల్లా స్టీరింగ్ కమిటీ సభ్యులు మహేష్, కేపీదొడ్డి రమేష్, విశ్వనాథ్‌రెడ్డి, శ్రీనివాస్‌రెడ్డి, ఎంపీటీసీ లింగన్న, జీ నాగరాజు. రేవణ్ణ, జడెప్ప, శివణ్ణ, గోవిదంప్ప, రాఘవేంద్ర, చంద్రన్న, మల్లప్ప, కలుగోడు «సహకార సంఘం అధ్యక్షులు తిప్పేస్వామి, సూరయ్య, జనార్ధనరెడ్డి, రాజయ్య, నాగేంద్రప్ప, ధనుంజయ్య తదితరులు పాల్గొన్నారు. -
వర్షాల కోసం జలాభిషేకం...
వర్షాల కోసం సోమేశ్వరునికి జలాభిషేకం... పూడూరు: వర్షాలు కురియాలని కోరుతూ పూడూరు మండల కేంద్రంలోని సోమేశ్వర ఆలయంలో ఉన్న శివలింగానికి గురువారం జలాభిషేకం చేశారు. ఆలయంలోని ప్రధాన ద్వారాన్ని తాత్కాలికంగా మూసేసి నీటిని నింపారు. ఈ సందర్భంగా స్థానికులు మాట్లాడుతూ పంటలు పూత, కాత వచ్చే సమయంలో వర్షలు కురియడం లేదన్నారు. నెల రోజులు దాటినా వరుణుడు కరుణించడంలేదని ఆవేదన వ్యక్తం చేశారు. పంటలు చేతికొచ్చే తరుణంలో వరుణుడు మొహం చాటేయడంతో పంటలు ఎండుదశలో ఉన్నాయని, జలాభిషేకం చేస్తే వరుణుడు కరుణిస్తాడనే నమ్మకంతో పూజలు చేస్తున్నట్లు వారు తెలిపారు. గ్రామస్తులంతా కలిసి ప్రత్యేక పూజలు చేసి, లింగానికి జలాభిషేకం చేశౠరు. ఈ కార్యక్రమంలో బీజేపీ యువ మోర్చా మండల అధ్యక్షుడు అనీల్ యాదవ్, ఆలయ చైర్మన్ చంద్రశేఖర్, బీజేవైఏం నాయకులు రాజు, నరేందర్, పాండు, భజన భక్తులు బుచ్చన్న, సుభాన్, అనంతయ్య, కిష్టయ్య, శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.