గుమ్మఘట్ట : సమృద్ధిగా వర్షాలు కురిసి, ఖరీఫ్ పంటలు వంద శాతం చేతికంది, రైతులు, ప్రజలు సుఖశాంతులతో ఉండేలా కరుణించు శివయ్యా అంటూ గుమ్మఘట్ట మండలం కేపీదొడ్డి, కలుగోడు గ్రామాల్లో సోమవారం చేపట్టిన వరుణయాగం జనజాతరను తలపించింది. అడిగుప్ప, రంగసముద్రం, ఆర్.కొత్తపల్లి, గౌనికుంట తదితర గ్రామాల నుంచి మహిళలు పెద్ద ఎత్తున కేపీదొడ్డి గ్రామానికి తరలివచ్చి గంగాజలం నింపిన 1001 కుంభాలను తలపై మోస్తూ ఊరేగింపు చేపట్టారు.
ఊరేగింపు ముందు భాగంలో వీరభద్రస్వామి వేషధారణలతో పలువురు నృత్యాలు చేస్తూ ఆకట్టుకున్నారు. ఉపవాస దీక్షతో మహిళలు తెచ్చిన కుంభాలతో చంద్రమౌళేశ్వర స్వామికి జలాభిషేకం నిర్వహించారు. అనంతరం రుద్రాభిషేకం, మహామంగళ హారతి, వేలాది మంది భక్తులకు అన్నదానం నిర్వహించారు. కలుగోడు గ్రామంలో శివయ్యకు రుద్రాభిషేకం నిర్వహించి ప్రసాదాలు పంచిపెట్టారు. మాజీ ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి వైఎస్సార్‌సీపీ నాయకులతో కలసి రెండు గ్రామాల్లోని ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు.
కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ రైతు విభాగం రాష్ట్ర కార్యదర్శి గౌని ఉపేంద్రరెడ్డి, నాయకులు పాటిల్ సదాశివారెడ్డి, పార్టీ మండల కన్వీనర్ గౌని కాంతారెడ్డి, బీసీ సెల్ రాష్ట్ర కార్యదర్శి ఎన్‌టీ సిద్దప్ప, జిల్లా స్టీరింగ్ కమిటీ సభ్యులు మహేష్, కేపీదొడ్డి రమేష్, విశ్వనాథ్‌రెడ్డి, శ్రీనివాస్‌రెడ్డి, ఎంపీటీసీ లింగన్న, జీ నాగరాజు. రేవణ్ణ, జడెప్ప, శివణ్ణ, గోవిదంప్ప, రాఘవేంద్ర, చంద్రన్న, మల్లప్ప, కలుగోడు «సహకార సంఘం అధ్యక్షులు తిప్పేస్వామి, సూరయ్య, జనార్ధనరెడ్డి, రాజయ్య, నాగేంద్రప్ప, ధనుంజయ్య తదితరులు పాల్గొన్నారు.