ఆర్మీ క్యాంప్‌పై ఆత్మాహుతి దాడి
జమ్మూ/శ్రీనగర్/న్యూఢిల్లీ: జమ్మూకశ్మీర్‌లో ఉగ్రమూకలు పేట్రేగిపోయాయి. ఆదివారం ప్రధాని మోదీ పర్యటన నేపథ్యంలో ఆర్మీ క్యాంప్‌పై ఆత్మాహుతి దాడికి దిగాయి. దాన్ని భద్రతా బలగాలు విజయవంతంగా అడ్డుకుని, ఇద్దరు సూసైడ్ బాంబర్లను హతమార్చాయి. ఎదురుకాల్పుల్లో సీఐఎస్ఎఫ్ అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్ ఎస్పీ పటేల్ నేలకొరిగారు. 9 మందికి గాయాలయ్యాయి. సంజ్వాన్ సమీపంలోని చద్దా ఆర్మీ బేస్ వద్ద ఎన్‌కౌంటర్‌కు దారితీసిన క్రమాన్ని డీజీపీ దిల్బాగ్ సింగ్ వెల్లడించారు.
పాక్ కేంద్రంగా పనిచేసే జైషే మొహమ్మద్‌కు చెందిన ఇద్దరు సూసైడ్ బాంబర్లు గురువారం ఆర్ఎస్ పురా సెక్టార్లో సరిహద్దులు దాటారు. శుక్రవారం ఉదయం 4.25 గంటలప్పుడు ఆర్మీ బేస్ వద్దకు చేరుకున్నారు. జవాన్లు వారిని గమనించి అప్రమత్తమయ్యారు. అదే సమయంలో తర్వాతి షిఫ్టు కోసం 15 మంది సీఐఎస్ఎఫ్ జవాన్లతో వస్తున్న బస్సుపైకి ఉగ్రవాదులు కాల్పులకు దిగారు. గ్రెనేడ్లు ప్రయోగిస్తూ దగ్గర్లోని జనావాసాల్లోకి పారిపోయారు. జవాన్లు ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టారు. ఉగ్రవాదులు ఓ ఇంట్లో నక్కి కాల్పులకు దిగడంతో జవాన్లు అందులోని వారందరినీ సురక్షితంగా బయటకు తీసుకువచ్చారు. 5 గంటలపాటు సాగిన ఎన్కౌంటర్లో ఇద్దరు బాంబర్లు హతమయ్యారు.
సకాలంలో స్పందించడంతో...
ఉగ్రవాదులు భారీగా పేలుడు పదార్థాలున్న జాకెట్‌ను ధరించారని డీజీపీ దిల్బాగ్ సింగ్ చెప్పారు. వారి వద్ద పెద్ద మొత్తంలో ఆయుధాలు, మందుగుండు సామగ్రి లభించిందన్నారు. భారీగా నష్టం కలిగించి, ప్రధాని పర్యటనకు అవాంతరం కలిగించేందుకు జైషే కుట్ర పన్నినట్లు తెలుస్తోందన్నారు. సకాలంలో స్పందించడంతో పెనుప్రమాదం తప్పిందని చెప్పారు. సంఘటన ప్రాంతంలో రెండు ఏకే–47 రైఫిళ్లు, గ్రెనేడ్ లాంఛర్, శాటిలైట్ ఫోన్ కూడా స్వాధీనం చేసుకున్నామన్నారు. ఘటన నేపథ్యంలో ముందుజాగ్రత్తగా ఆ ప్రాంతంలో మొబైల్ ఇంటర్నెట్ సేవలను బంద్ చేశారు. ఇదే ఆర్మీ క్యాంప్‌పై 2018లో జైషే మొహమ్మద్ ఉగ్రవాదులు జరిపిన దాడిలో ఆరుగురు జవాన్లు మృతి చెందారు.
బారామూల్లాలో మరో ఉగ్రవాది హతం
బారాముల్లా జిల్లాలో మాల్వాలో గురువారం నుంచి కొనసాగుతున్న ఎదురుకాల్పుల్లో నాలుగో ఉగ్రవాదిని మట్టుబెట్టినట్లు అధికారులు తెలిపారు. సుదీర్ఘకాలంగా కశ్మీర్లో పలు ఉగ్రదాడులకు కారకుడైన లష్కరే టాప్ కమాండర్ యూసుఫ్ కట్రూతోపాటు ముగ్గురు ఉగ్రవాదులు గురువారం హతమైన విషయం తెలిసిందే.
మోదీ పర్యటనకు భారీ భద్రత
జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవం సందర్భంగా ఈ నెల 24న కశ్మీర్‌లోని సాంబ జిల్లా పాలి గ్రామాన్ని ప్రధాని మోదీ సందర్శించనున్నారు. 2019లో కశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తి రద్దు తర్వాత ఆయన అక్కడికి వెళ్లడం ఇదే తొలిసారి. ఈ నేపథ్యంలో ఉగ్రవాదులు రెచ్చిపోవడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. సాంబ, పరిసరాల్లో మూడంచెల రక్షణ వ్యవస్థను ఏర్పాటు చేశారు. హై అలర్ట్ ప్రకటించారు. మోదీ పాల్గొనే సభా ప్రాంతానికి చేరుకునే మార్గాల్లో చెక్పాయింట్లు పెట్టారు. అత్యాధునిక నిఘా వ్యవస్థను నెలకొల్పినట్లు సీనియర్ అధికారి ఒకరు తెలిపారు.