‘పెట్రోల్, డీజిల్ 100 మార్కు దాటబోతోంది’
సాక్షి, విజయవాడ : ఆంధ్రప్రదేశ్లో ప్రజలు అష్టకష్టాలు పడుతుంటే రాజకీయ నాయకులు మాత్రం ఫలితాల కోసం బెట్టింగులలో తేలియాడుతున్నారని ఏపీ పీసీసీ ఉపాధ్యక్షుడు తులసీరెడ్డి మండిపడ్డారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. వర్షాభావ పరిస్ధితులలో భూగర్భజలాలు అడుగంటాయని, నీళ్లు లేక ప్రజలు అష్టకష్టాలు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో కరువు విలయతాండవం చేస్తోందన్నారు. పెనుగాలులు, వడగండ్ల వానల వలన చేతికొచ్చిన పంట నాశనమవ్వడంతో రైతులు తీవ్రంగా నష్టపోయారని తెలిపారు. మే 23 తర్వాత పెట్రోల్, డీజిల్ ధరలు 100 రూపాయల మార్కు దాటబోతోందని చెప్పారు. టీడీపీ పార్టీ అధికారంలోకి వచ్చినా రాష్ట్ర ప్రజలకు ఒరిగేదేమీలేదని, ప్రత్యేక హోదా ఏమైనా తేగలరా ? వెనుక బడిన జిల్లాలకు నిధులేమైనా తేగలరా ? అని ప్రశ్నించారు. టీడీపీ, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలు ప్రజలకు మేలు చేసే పార్టీకే కేంద్రంలో మద్దతివ్వాలని కోరారు.
రాష్ట్రంలో గవర్నర్ వ్యవస్ధ నిర్వీర్యమైపోయింది
రాష్ట్రంలో గవర్నర్ వ్యవస్ధ నిర్వీర్యమయిపోయిందని కాంగ్రెస్ నేత జంగా గౌతమ్ వ్యాఖ్యానించారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఏపీలో రాష్ట్రపతి పాలన దిశగా కేంద్రం వ్యవహరిస్తోందని, ప్రజాస్వామ్యంలో మరొక ప్రభుత్వం వచ్చే వరకు ఉన్న ప్రభుత్వం పాలించొచ్చని తెలిపారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య వైవిధ్యం వస్తే గవర్నర్ ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. ఏపీ ప్రజల మీద ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వం కక్ష్యపూరితంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు.