'ఆ కమిషన్‌ను బాబు సర్కార్ అవమానిస్తోంది'
అమరావతి : ఎస్సీల హక్కులను కాపాడాల్సిన కమిషన్‌ను సీఎం చంద్రబాబు రాజకీయ రొచ్చులోకి లాగడం దారుణమని పీసీసీ ప్రధాన కార్యదర్శి జంగా గౌతం పేర్కొన్నారు. మంగళవారం ఆంధ్రరత్న భవన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ టీడీపీ ప్రభుత్వానికి ఎస్సీ, ఎస్టీలపై గౌరవం లేదని అందుకే కమిషన్ నియామకంలో నిబంధనలను పట్టించుకోలేదన్నారు.
ఎస్సీ, ఎస్టీ కమిషన్ నియామకాన్ని హైకోర్టు తప్పుపట్టినా వాటిని సరిదిద్దుకునే ప్రయత్నం చేయకుండా న్యాయవాదులను పెట్టి వాదించడం టీడీపీ వైఖరికి నిదర్శనమన్నారు. కారెం శివాజీతో చంద్రబాబు ఓటు బ్యాంకు అవసరాలు ఉంటే ఆయనకు ఏదైనా రాజకీయ పదవి ఇవ్వాలని సూచించారు. రాజ్యాంగ బద్దంగా నియమించాల్సిన ఎస్సీ, ఎస్టీ కమిషన్‌ను ప్రభుత్వం అవమానిస్తూ కమిషన్ స్థాయి తగ్గించే ప్రయత్నం చేయడం తగదని హితవు పలికారు. ఈ కమిషన్ల నియామకాన్ని రాజకీయాలకతీతంగా చేయాల్సి ఉన్నా ప్రభుత్వం విరుద్ధంగా వెళ్లిందని జంగా గౌతం ఆరోపించారు.