ఉద్యోగులపై స్పష్టత ఇవ్వాలి
ఆదిలాబాద్ రూరల్/నిర్మల్ అర్బన్, న్యూస్‌లైన్ : జూన్ 2న ఏర్పాటయ్యే తెలంగాణ రాష్ట్రం కంటే ముందే రాష్ట్రంలో తెలంగాణ ఉద్యోగులపై స్పష్టత ఇవ్వాలని టీఎన్జీవో రాష్ట్ర అధ్యక్షుడు, జేఏసీ కన్వీనర్ దేవీప్రసాద్ అన్నారు. బుధవారం ఆదిలాబాద్‌లోని సెంట్రల్ గార్డెన్లో నిర్వహించిన ‘తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం ఉద్యోగుల విభజన, పరిణామాలు, కింకర్తవ్యం’పై ఉద్యోగుల సమావేశానికి హాజరయ్యారు. ఆదిలాబాద్‌కు వస్తూ నిర్మల్‌లోని టీఎన్జీవో సంఘ భవనంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మాట్లాడారు.
ఉద్యోగుల విభజనపై స్పష్టత ఇవ్వకుండా తెలంగాణ ప్రాంత ఉద్యోగులకు అన్యాయం జరిగితే సహించేది లేదని స్పష్టం చేశారు. ఏమాత్రం అన్యాయం జరిగినా, సచివాలయంలో మళ్లీ ఆంధ్ర పాలన వచ్చినా మలి దశ ఉద్యమానికి పిలుపునిస్తామని హెచ్చరించారు. ఉద్యోగుల విభజనలో పారదర్శకత లోపిస్తోందని, స్థానికత ఆధారంగానే విభజించాలని పేర్కొన్నారు. తెలంగాణ ప్రజలకు అన్యాయం జరగకుండా చూడాల్సిన బాధ్యత రాజకీయ పార్టీలపై ఉందన్నారు. ప్రత్యేక రాష్ట్రంలో ప్రజల సంక్షేమం కోసం ప్రభుత్వ ఉద్యోగులు అదనంగా రెండు గంటలు పనిచేస్తారని తెలిపారు. అమరుల కోసం రూ.200కోట్లతో ప్రొఫెసర్ జయశంకర్ ట్రస్టు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. తెలంగాణ పునర్నిర్మాణం కోసం వాచ్‌డాగ్‌లా పనిచేస్తామని చెప్పారు.
రాష్ట్ర పునర్నిర్మాణం కోసం 22 అంశాలతో కూడిన ఎజెండాను రాజకీయ పార్టీ ముందుంచామని తెలిపారు. జూన్ 2న తెలంగాణ ఏర్పాటు దినోత్సవాన్ని ఘనంగా జరుపుకోవాలని ఉద్యోగ సంఘ నాయకులకు పిలుపునిచ్చారు. ఈ సమావేశాల్లో టీఎన్జీవో మహిళా చైర్పర్సన్ రేచల్, టీఎన్జీవో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రవీందర్‌రెడ్డి, జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు అశోక్, వనజారెడ్డి, అసోసియేట్ అధ్యక్షుడు జైరాం, విలాస్, వేణుమాధవ్, భాగ్యలక్ష్మీ, మొయినొద్దీన్, వి ద్యాసాగర్ తదితరులు పాల్గొన్నారు. కాగా, జేఏసీ కన్వీనర్‌గా ఎన్నికైన తర్వాత తొలిసారిగా నిర్మల్‌కు వచ్చిన దేవీప్రసాద్‌ను టీఎన్జీవో నాయకులు పూలమాల, శాలువాతో సన్మానించారు. వేణుమూరి మృతికి సంతాపం వ్యక్తం చేస్తూ రెండు నిమిషాలు మౌనం పాటించారు.