JNTU (Anantapur)
-
నాన్న రియల్లీ సారీ.. అక్కా.. అమ్మానాన్నను బాగా చూసుకో
నాన్న రియల్లీ సారీ.. నిన్ను సంతోషపెట్టలేకపోయాను. టెన్త్, ఇంటర్లో... ఎప్పుడూ మీకు హ్యాపీ ఫీలింగ్ ఇవ్వలేకపోయా. డబ్బులు అన్నీ వేస్ట్ చేశా. అయినా కూడా నన్ను అంత బాగా చూసుకున్నారు. ఏం అడిగినా కాదనలేదు... సారీ అమ్మా నీ కష్టాన్ని వేస్ట్ చేస్తున్నందుకు.. అక్కా నువ్వు నాకోసం ఎంతో త్యాగం చేశావు. నేను మాత్రం నీకు ఏమీ ఇవ్వలేకపోయాను. నీ మ్యారేజ్‌కి చాలా మంచి బహుమతి ఇద్దామనుకున్నా..కానీ సారీ.. అమ్మా, నాన్నను బాగా చూసుకో.. బై.. ఫ్రెండ్స్ ఇంక మిమ్మల్ని కలవను. ఇలా తల్లిదండ్రులకు, సోదరికి, తన రూమ్‌మేట్స్‌కు టెక్స్ మెసేజ్ పంపిన ఓ ఇంజినీరింగ్ స్టూడెంట్ వర్సిటీ భవనం పైనుంచి కిందకు దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన గురువారం అనంతపురం జేఎన్టీయూ క్యాంపస్‌లో చోటుచేసుకుంది. అనంతపురం శ్రీకంఠం సర్కిల్: శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా ఉదయగిరికి చెందిన రమణారెడ్డి, విజయ దంపతులకు ఒక కుమారుడు, కుమార్తె సంతానం. కుమార్తె గీతారెడ్డి హిమాచల్ ప్రదేశ్‌లో ఎన్ఐటీలో చదువుతోంది. కుమారుడు చాణిక్య నందరెడ్డి (19) అనంతపురం జవహర్లాల్ నెహ్రూ టెక్నలాజికల్ యూనివర్సిటీ కేంపస్‌లో బీటెక్ (ఈసీఈ) ద్వితీయ సంవత్సరం చదువుతున్నాడు. ప్రతిభ గల విద్యారి్థగా గుర్తింపుపొందిన చాణిక్య నందరెడ్డి అధ్యాపకులతో చాలా చనువుగా మసలేవాడు. తోటి విద్యార్థులతో కలిసి ఎల్లోరా హాస్టల్ భవనంలోని రూంలో ఉండేవాడు. రూమ్మేట్స్, అధ్యాపకులతో తప్ప మిగతా వారెవరితో కూడా పెద్దగా మాట్లాడే వాడుకాదు. ఈ క్రమంలోనే బుధవారం రాత్రి 12 గంటల దాకా స్నేహితులతో కబుర్లు చెప్పాడు. గురువారం తెల్లవారుజాము 5.40 సమయంలో తన గదిలోని మిత్రులకు బై అంటూ సెల్ఫోన్లో సందేశం పంపి క్షణాల వ్యవధిలోనే కంప్యూటర్ సెంటర్ మేడపైనుంచి కిందకు దూకి ప్రాణాలు తీసుకున్నాడు. పెద్ద శబ్ధం రావడంతో విద్యార్థులు వెళ్లి చూశారు. రక్తపు మడుగులో పడి ఉన్న యువకుడిని చూసి ఆందోళన చెందారు. చాణిక్య గదిలో ఉంటున్న విద్యార్థులు దుస్తులు చూసి అతన్ని గుర్తించారు. వార్డెన్ ద్వారా విషయం తెలుసుకున్న ప్రిన్సిపాల్ సుజాత వన్‌టౌన్ పోలీసులకు సమాచారం అందించగా, పోలీసు మృతదేహాన్ని పరిశీలించారు. చాణిక్య భవనం పైనుంచి బోర్లా పడటంతో ముఖం పూర్తిగా ఛిద్రమైందని, చెవుల నుంచి తీవ్ర రక్తస్రావమై శరీరంలోని ఎముకలు సైతం విరిగిపోయాయని గుర్తించారు. హాస్టల్ గదిలో ఉంటున్న విద్యార్థులతో విచారించారు. సెల్ఫోన్లకు పంపిన సందేశాన్ని పరిశీలించి వాటిని స్వా«దీనం చేసుకున్నారు. ‘నా చావుకు సీనియర్లు, జూనియర్లు ఎవరూ కారకులు కాదు’అని టైప్ చేసి పెట్టుకున్నట్లు సీఐ రవిశంకరరెడ్డి తెలిపారు. మృతదేహాన్ని ప్రభుత్వాస్పత్రిలోని మార్చురీకి తరలించారు. కన్నీరుమున్నీరైన తల్లిదండ్రులు.. చాణిక్య నందరెడ్డి ఆత్మహత్య గురించి తెలుసుకున్న రమణారెడ్డి, విజయ దంపతులు వెంటనే అనంతపురం చేరుకున్నారు. విగతజీవిగా ఉన్న బిడ్డను చూసి గుండెలవిసేలా రోదించారు. ఉదయం తన ఫోన్‌కు సారీ నాన్న...అమ్మ అని సందేశం పంపాడని, నిద్రలేచి చూసుకునేలోపు ఇక్కడి విద్యార్థులు ఫోన్లు చేశారని చెప్పారంటూ విలపించారు. తన సోదరి హిమాచల్ ప్రదేశ్‌కు వెళ్తుండటంతో ఆమెను పలకరించేందుకు డిసెంబరు 24న ఉదయగిరికి వచ్చాడని, మూడు రోజులు తమతో సంతోషంగా గడిపాడని వారు తెలిపారు. రూ.60 వేలు స్కాలర్ షిప్ వస్తే తన ఖాతాకే బదిలీ చేశాడని తండ్రి గుర్తు చేసుకున్నారు. తమకు అండగా ఉంటాడనుకున్న బిడ్డను భగవంతుడు ఇలా తీసుకుపోయాడంటూ వారు విలపించిన తీరు స్థానికులను కన్నీళ్లు పెట్టించింది. వారి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
ఇంజినీరింగ్ కాలేజీల ‘లీలలు’.. షోకాజ్ నోటీసులు జారీ!
అనంతపురం: ఇంజినీరింగ్ కళాశాలలు మాయ చేస్తున్నాయి. నిజనిర్ధారణ కమిటీ తనిఖీల్లో అధ్యాపకులు ద్విపాత్రాభినయం బయటపడింది. ఒక్కో అధ్యాపకుడి పేరు రెండు కళాశాలల్లో నమోదు కావడం నివ్వెరపరుస్తోంది. ఇంజినీరింగ్ విద్యలో నాణ్యత ప్రమాణాలకు జేఎన్టీయూ (ఏ) యాజమాన్యం పెద్ద పీట వేస్తోంది. నిబంధనలు విస్మరిస్తూ, నామమాత్రంగా నడుపుతున్న కళాశాలలపై కన్నెర్ర చేస్తోంది. బోధన ప్రమాణాలు పాటించకపోవడంతో పాటు తక్కువ అడ్మిషన్లతో నెట్టుకొస్తున్న 30 ఇంజినీరింగ్ కళాశాలల గుర్తింపు రద్దు చేయడం యూనివర్సిటీ చరిత్రలో ప్రథమం. అనుబంధ ఇంజినీరింగ్ కళాశాలల్లో వసతులు, విద్యార్థి – అధ్యాపక నిష్పత్తి, క్యాంపస్ పరిస్థితి, ఆటస్థలం, గ్రంథాలయ సదుపాయం, ల్యాబ్ తదితర అంశాలను యూనివర్సిటీ ఏటా నిజనిర్ధారణ కమిటీల ద్వారా పరిశీలిస్తోంది. ఏ కళాశాలకు ఎన్ని సీట్లు కేటాయించాలనే దానికి కమిటీ నివేదికే ప్రామాణికం. నివ్వెరపోయే వాస్తవాలు.. జేఎన్టీయూ అనంతపురం పరిధిలోని ఇంజినీరింగ్ కళాశాలల యాజమాన్యాల గారడీని నిజనిర్ధారణ కమిటీ తమ పరిశీలనలో బహిర్గతం చేసింది. ఒకే కళాశాలలో పనిచేస్తున్న అధ్యాపకుడి పేరు మరో ఇంజినీరింగ్ కళాశాలలోనూ నమోదైనట్లు గుర్తించింది. ఇలాంటివి 40 ఇంజినీరింగ్ కళాశాలల్లో బయటపడ్డాయి. ఒక అధ్యాపకుడు రెండు చోట్ల ఎలా పని చేస్తున్నారో వివరణ ఇవ్వాలని ఆయా కళాశాలలకు షోకాజ్‌లు జారీ చేసింది. కొన్ని సబ్జెక్టుల్లో పీహెచ్డీ పూర్తి చేసిన అభ్యర్థుల కొరత అధికంగా ఉంది. ఈ నేపథ్యంలో ఒకరి పేరునే రెండు, మూడు కళాశాలల్లో పనిచేస్తున్నట్లు ఆయా యాజమాన్యాలు చూపించాయి. మరో వైపు కొన్ని కళాశాలల్లో ఫ్యాకల్టీ నియమించుకోకుండా అర్హులైన అధ్యాపకుల పేర్లను మాత్రమే చూపించాయి. పది రోజుల్లో సరైన వివరణ ఇవ్వాలని షోకాజ్‌లో పేర్కొంది. -
జూనియర్లను వేధించిన 20 మంది సీనియర్లపై కఠిన చర్యలు
అనంతపురం విద్య: జేఎన్టీయూ(అనంతపురం) ఇంజినీరింగ్ కళాశాల ఉన్నతాధికారులు ర్యాగింగ్‌పై ఉక్కుపాదం మోపారు. జూనియర్లపై వికృత చేష్టలకు పాల్పడిన సీనియర్ విద్యార్థులపై కఠిన చర్యలు తీసుకున్నారు. ర్యాగింగ్ వ్యవహారంపై ప్రొఫెసర్ల కమిటీ బాధిత విద్యార్థులను, ర్యాగింగ్‌కు పాల్పడిన విద్యార్థులను విచారించింది. అనంతరం నివేదిక తయారు చేసి వర్సిటీ అధికారులకు అందజేసింది. ఈ క్రమంలో మంగళవారం జేఎన్టీయూ (ఏ) ఇంజినీరింగ్ కళాశాల మెయిన్ బిల్డింగ్‌లో ప్రిన్సిపాల్ పి. సుజాత, వైస్ ప్రిన్సిపాల్ బి.దుర్గాప్రసాద్ ఆధ్వర్యంలో సమావేశమైన కాలేజ్ అకడమిక్ కమిటీ నివేదికను పరిశీలించింది. ర్యాగింగ్‌కు పాల్పడిన 20 మంది విద్యార్థులను సస్పెండ్ చేయాలన్న ప్రొఫెసర్ల కమిటీ ప్రతిపాదనకు ఆమోదం తెలిపింది. అయితే ర్యాగింగ్ పాల్పడిన వారిని మూడు కేటగిరీలుగా విభజించారు. మొదటి కేటగిరీ వారికి ఒక సెమిస్టర్ కాలం, రెండో కేటగిరీలోని వారిని నాలుగు వారాలు, మూడో కేటగిరీలోని వారిని రెండు వారాల పాటు సస్పెండ్ చేశారు. శిక్ష కాలంలో తరగతులు, హాస్టల్‌కు అనుమతి లేదని స్పష్టం చేశారు. -
అనంతపురం జేఎన్టీయూ వీసీకి బెదిరింపు కాల్స్
అనంతపురం : తమ కళాశాలకు అనుమతి ఇవ్వకుంటే అంతుచూస్తామని అనంతపురం జేఎన్టీయూ వీసీకి బెదిరింపు కాల్స్ వచ్చాయి. విద్యా ప్రమాణాల దృష్ట్యా ఇంజినీరింగ్ కళాశాలల్లో నిబంధనలను ప్రభుత్వం కఠినతరం చేసింది. ఈ నేపథ్యంలో దాదాపు ఐదు జిల్లాల్లోని 63 ఇంజినీరింగ్ కాలేజీల అనుమతులు ప్రశ్నార్ధకంగా మారాయి. దీంతో తమ కాలేజీలకు అనుమతులు దక్కవేమోనని కొందరు ఇంజినీరింగ్ కాలేజీ యాజమాన్యాలు బెదిరింపులు పాల్పడుతున్నట్లు అధికారుల దృష్టికి వచ్చింది. -
ఇంటి దొంగల బాగోతం బట్టబయలు
అనంతపురం విద్య: జేఎన్టీయూ అనంతపురంలోని సెంట్రల్ కంప్యూటర్ ల్యాబ్‌లో 24 ఇన్వర్టర్ల బ్యాటరీలను తరలిస్తున్న అవుట్సోర్సింగ్ ఉద్యోగులు శుక్రవారం పట్టుబడ్డారు. కంప్యూటర్ సైన్స్ విభాగం ఆధ్వర్యంలో నడుస్తున్న సెంట్రల్ కంప్యూటర్ ల్యాబ్‌లో వందలాదిగా కంప్యూటర్లు, ఇన్వర్టర్లు ఉన్నాయి. ముగ్గురు అవుట్సోర్సింగ్ ఉద్యోగులు వీటిని ఎత్తుకెళ్లేందుకు పన్నాగం పన్నారు. సెంట్రల్ ల్యాబ్ తాళాలను పోలిన తాళాలను తయారు చేయించారు. కళాశాల తెరవక ముందే మరో తాళం చెవితో తలుపులు తీసి రోజూ రెండు ఇన్వర్టర్లను తీసుకెళ్లారు. ఇదే తరహాలోనే శుక్రవారం తాళం వేసినట్లుగానే ఉంది. కానీ ఇన్వర్టర్లను తీసుకెళ్తున్న వైనంపై సెంట్రల్ ల్యాబ్ పక్కన ఉన్న కోవిడ్ సెంటర్లో ఉంటున్న బాధితులకు అనుమానం వచ్చింది. దీంతో శుక్రవారం ఉదయం సెల్‌ఫోన్‌తో ఫొటోలు తీసి జేఎన్టీయూ అనంతపురం ఇంజినీరింగ్ కళాశాల ప్రిన్సిపాల్‌కు పంపారు. వెంటనే అప్రమత్తమైన అధికారులు.. కళాశాలకు వచ్చి సీసీ కెమెరాల పుటేజీలను పరిశీలించగా ఇంటి దొంగల బోగోతం బట్టబయలైంది. ఇటీవల 24 కొత్త ఇన్వర్టర్ల బ్యాటరీలను బై బ్యాక్ ఆర్డర్ ఇచ్చారు. బై బ్యాక్ అంటే పాతవి వెనక్కి తీసుకొని కొత్త ఇన్వర్టర్లు ఇస్తారు. దీంతో పాత ఇన్వర్టర్ బ్యాటరీలన్నీ ఒకేచోట ఉంచారు. వీటిని రోజూ తీసుకెళ్తూ చివరి రోజు దొరికిపోయారు. ఈ వ్యవహారంపై జేఎన్టీయూ అనంతపురం ఇంజినీరింగ్ కళాశాల ప్రిన్సిపాల్‌కు ఫిర్యాదు చేసినట్లు కంప్యూటర్ సైన్సెస్ విభాగాధిపతి తెలిపారు. కలికిరిలోనూ నాలుగు ల్యాప్‌టాప్‌లు మాయం .. కలికిరి ఇంజినీరింగ్ కళాశాలలోనూ నాలుగు హైకాన్ఫిగరేషన్ గల ల్యాప్‌టాప్ కంప్యూటర్లు మాయమయ్యాయి. ఒక్కో ల్యాప్‌టాప్ రూ. లక్ష విలువ చేస్తాయి. మొత్తం రూ.4 లక్షలు విలువ చేసే ల్యాప్‌టాప్‌లు దసాల్ట్ ల్యాబ్‌లో కనిపించలేదనే అంశంపై వర్సిటీ ఉన్నతాధికారులకు ఫిర్యాదు అందింది. దీంతో వెంటనే విచారణకు ఆదేశించారు. -
ఎందుకిలా..?
జేఎన్టీయూ: జేఎన్టీయూ అనంతపురంలో నూతనంగా ఫార్మసీ కళాశాలకు ప్రిన్సిపాల్‌ను నియమించారు. అయితే నిబంధనలకు విరుద్ధంగా నియామకం జరగడంతో వివాదస్పదమవుతోంది. పాలక మండలి అనుమతి లేకుండానే ఏకంగా ప్రిన్సిపాల్‌ను నియమించడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. నిర్ణయాత్మకమైన పదవి కావడంతో నిబంధనలు అనుసరించకుండా భర్తీ చేయడం అనుమానాలకు తావిస్తోంది. పొంతన లేని పీహెచ్డీ ఫార్మసీ కళాశాల ప్రిన్సిపాల్‌కు తప్పనిసరిగా సంబంధిత సబ్జెక్టులో పీహెచ్డీ ఉండాలి. కానీ తాజాగా ఎంపిక చేసిన ప్రిన్సిపాల్‌కు బయోటెక్‌లో పీహెచ్డీ చేశారు. సాధారణంగా ఇంజినీరింగ్ , ఫార్మసీ అధ్యాపకులకే ఎంటెక్, ఎంఫార్మసీ కచ్చితంగా ప్రథమ శ్రేణితో ఉత్తీర్ణులైనవారిని ఎంపిక చేస్తారు. ఫార్మసీ కళాశాల ప్రిన్సిపాల్‌గా నియామించే వ్యక్తికి కచ్చితంగా ఎంఫార్మసీ ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణులై, పీహెచ్డీ ఫార్మసీ సబ్జెక్టు మీదే పూర్తీ చేసి ఉండాలి. కానీ ఎంఫార్మసీ రెండో శ్రేణిలో ఉత్తీర్ణులై, బయోటెక్‌లో పీహెచ్డీ పూర్తీ చేసిన వారిని ప్రిన్సిపాల్‌గా ఎంపిక చేశారు. ఏదైనా కీలక నియాయం చేసేటపుడు తప్పనిసరిగా పాలక మండలి అనుమతితోనే నియామక పత్రాన్ని అందచేయాలి. కనీసం పాలక మండలికి సమాచారం ఇవ్వకుండానే నేరుగా ఫార్మసీ కళాశాల ప్రిన్సిపాల్‌గా నియమించారు. గడువు ముగియకుండానే పీహెచ్‌డీలు జేఎన్టీయూ (ఏ)లో నిబంధనలకు విరుద్ధంగా, అర్హత లేని వారిని ప్రిన్సిపాల్‌గా నియమించారు. మరోవైపు పీహెచ్డీ కోర్సు అంశంలోనూ అక్రమాలకు తెరలేపారు. సాధారణంగా ప్రీపీహెచ్‌డీ సెమినార్ మూడేళ్ల కనీస కాలవ్యవధి పూర్తయిన తరువాత నిర్వహించాలి. కానీ గడువుకు ముందే సెమినార్లు నిర్వహించుకోవడానికి అనుమతి మంజూరు చేశారు. కెమిస్ట్రీ, ఇంగ్లీష్ సబ్జెక్టులకు సంబంధించి ముగ్గురు పీహెచ్డీ అభ్యర్థులకు మూడేళ్ల కోర్సు కాల వ్యవధి పూర్తీ కాకుండానే అవకాశం కల్పించారు. కోర్సు మార్గదర్శకాలు, నియమ నిబంధనల ప్రకారం కచ్చితంగా నిర్ధేశించిన విధివిధానాలు పాటించాలి. నాణ్యమైన పరిశోధనలే విశ్వవిద్యాలయం గుర్తింపుకు గీటురాయి. ఈ క్రమంలో పీహెచ్డీ కోర్సు అంశంలో నాణ్యతా ప్రమాణాలు పాటించాలి. గడువు ముగియకుండానే పీహెచ్డీ థీసీస్ సమర్పించడానికి అవకాశం కల్పించడంపై పరిశోధన విద్యార్థులు అందరూ తమకూ అవకాశం కల్పించాలని కోరుతున్నారు. దీంతో ఉన్నతాధికారులు నివ్వెరపోతున్నారు. పరిశీలిస్తాం గడువుకు ముందే ప్రీపీహెచ్‌డీ సెమినార్, సబ్మిషన్కు అవకాశం ఇవ్వడం నిబంధనలకు విరుద్ధం. అలా జరిగి ఉంటే వాటిని పరిశీలిస్తాము. గతంలో జరిగిన అంశాలు కాబట్టి సబ్జెక్టుల వారీగా పరిశీలిస్తాం. –ఏ. ఆనందరావు, నూతన రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ డైరెక్టర్ -
ఫుడ్ టెక్నాలజీ కోర్సుకు గ్రీన్‌సిగ్నల్
జేఎన్టీయూ : జేఎన్టీయూ అనంతపురం కానిస్టిట్యూట్ కళాశాల అయిన జేఎన్టీయూ కలికిరిలో నూతనంగా బీటెక్ ఫుడ్ టెక్నాలజీ కోర్సును ప్రవేశపెడుతున్నారు. 2018–19 విద్యాసంవత్సరం నుండి ఈ కోర్సు అందుబాటులోకి రానుంది. మొత్తం 60 సీట్లు భర్తీ చేసేందుకు ఏఐసీటీఈ బుధవారం అనుమతి ఇచ్చింది. ఈ మేరకు ఉత్తర్వులు కూడా అందాయి. ఇంటర్ మీడియట్లో ఎంపీసీ పూర్తీ చేసి , ఎంసెట్‌లో ర్యాంకు వచ్చిన వారికి మెరిట్ ప్రాతిపదికగా బీటెక్ ఫుడ్ టెక్నాలజీ కోర్సులో అడ్మిషన్ కల్పిస్తారు. కర్రికులమ్ ఖరారు బీటెక్ (ఫుడ్ టెక్నాలజీ) కోర్సు ఆంధ్రప్రదేశ్‌లో తొలిసారిగా ప్రవేశపెడుతున్నారు. కర్రికలమ్ ( విద్యా ప్రణాళిక) , సిలబస్ రూపకల్పన పూర్తయింది. ఇందుకోసం బోర్డ్ఆఫ్ స్టడీస్ సభ్యులను, ఛైర్మన్లను ఇప్పటికే నియమించారు. కోర్సుకు సంబంధించిన అడ్వైయిజరీ కమిటీని నియమించారు. బీఎస్సీ (అగ్రికల్చర్) కోర్సుకు దీటుగా ఈ సిలబస్‌ను రూపొందించారు. 28న లెక్చరర్ ఉద్యోగాల భర్తీకి ఇంటర్వ్యూలు ఈ నెల 28న అడ్హాక్ లెక్చరర్ పోస్టుల భర్తీకి సంబంధించిన ఇంటర్వ్యూలు జేఎన్టీయూ అనంతపురం పాలక భవనంలో జరగనున్నాయి. శాశ్వత ప్రాతిపదికన ఉద్యోగాల భర్తీని త్వరలో పూర్తిచేయనున్నారు. 50 సంవత్సరాలు ఫుడ్ ప్రాసెసింగ్‌లో అనుభవం గల ప్రొఫెసర్ రామకృష్ణను విజిటింగ్ ప్రొఫెసర్‌గా నియమించారు. సాంకేతిక మానవ వనరులు అవసరం కలికిరి చుట్టు పక్కల తిరుపతి, చిత్తూరు, మదనపల్లి ప్రాంతాల్లో ఇప్పటికే 200 పుడ్ ప్రాసెసింగ్ కంపెనీలు ఉన్నాయి. ఇందులో నిష్ణాతులైన సాంకేతిక మానవ వనరులు అవసరం. ఫుడ్ ప్రాసెసింగ్‌లో ఇండస్ట్రీ కోర్సులు నిర్వహిస్తే ఉపాధి అవకాశాలు లభిస్తాయి. ఇందుకోసమే బీటెక్ ఫుడ్ టెక్నాలజీ కోర్సును అందుబాటులోకి తీసుకొచ్చాం. – ప్రొఫెసర్ ఎస్ .శ్రీనివాస్ కుమార్,వీసీ, జేఎన్టీయూ అనంతపురం. -
9న ఏపీ ఈసెట్
జేఎన్టీయూ (అనంతపురం): ఆంధ్రప్రదేశ్ ఇంజినీరింగ్ కామన్ ఎంట్రెన్స్ టెస్ట్ (ఏపీ ఈసెట్)- 2016ను మే 9న నిర్వహిస్తున్నట్లు సెట్ చైర్మన్ ఆచార్య ఎం.సర్కార్, కన్వీనర్ ఆచార్య పీఆర్ భానుమూర్తి తెలిపారు.ఈ వివరాలను సోమవారం వారు విలేకరులకు వెల్లడించారు. ఈసెట్‌కు 36,809 మంది దరఖాస్తు చేసుకున్నట్లు తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా 68 పరీక్షా కేంద్రాల్లో రాత పరీక్ష నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు.