నాన్న రియల్లీ సారీ.. నిన్ను సంతోషపెట్టలేకపోయాను. టెన్త్, ఇంటర్‌లో... ఎప్పుడూ మీకు హ్యాపీ ఫీలింగ్ ఇవ్వలేకపోయా. డబ్బులు అన్నీ వేస్ట్ చేశా. అయినా కూడా నన్ను అంత బాగా చూసుకున్నారు. ఏం అడిగినా కాదనలేదు... సారీ అమ్మా నీ కష్టాన్ని వేస్ట్ చేస్తున్నందుకు..
అక్కా నువ్వు నాకోసం ఎంతో త్యాగం చేశావు. నేను మాత్రం నీకు ఏమీ ఇవ్వలేకపోయాను. నీ మ్యారేజ్‌కి చాలా మంచి బహుమతి ఇద్దామనుకున్నా..కానీ సారీ.. అమ్మా, నాన్నను బాగా చూసుకో..
బై.. ఫ్రెండ్స్ ఇంక మిమ్మల్ని కలవను. ఇలా తల్లిదండ్రులకు, సోదరికి, తన రూమ్మేట్స్‌కు టెక్స్ మెసేజ్ పంపిన ఓ ఇంజినీరింగ్ స్టూడెంట్ వర్సిటీ భవనం పైనుంచి కిందకు దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన గురువారం అనంతపురం జేఎన్‌టీయూ క్యాంపస్‌లో చోటుచేసుకుంది.
అనంతపురం శ్రీకంఠం సర్కిల్: శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా ఉదయగిరికి చెందిన రమణారెడ్డి, విజయ దంపతులకు ఒక కుమారుడు, కుమార్తె సంతానం. కుమార్తె గీతారెడ్డి హిమాచల్ ప్రదేశ్‌లో ఎన్‌ఐటీలో చదువుతోంది. కుమారుడు చాణిక్య నందరెడ్డి (19) అనంతపురం జవహర్‌లాల్ నెహ్రూ టెక్నలాజికల్ యూనివర్సిటీ కేంపస్‌లో బీటెక్ (ఈసీఈ) ద్వితీయ సంవత్సరం చదువుతున్నాడు. ప్రతిభ గల విద్యారి్థగా గుర్తింపుపొందిన చాణిక్య నందరెడ్డి అధ్యాపకులతో చాలా చనువుగా మసలేవాడు. తోటి విద్యార్థులతో కలిసి ఎల్లోరా హాస్టల్ భవనంలోని రూంలో ఉండేవాడు.
రూమ్‌మేట్స్, అధ్యాపకులతో తప్ప మిగతా వారెవరితో కూడా పెద్దగా మాట్లాడే వాడుకాదు. ఈ క్రమంలోనే బుధవారం రాత్రి 12 గంటల దాకా స్నేహితులతో కబుర్లు చెప్పాడు. గురువారం తెల్లవారుజాము 5.40 సమయంలో తన గదిలోని మిత్రులకు బై అంటూ సెల్‌ఫోన్‌లో సందేశం పంపి క్షణాల వ్యవధిలోనే కంప్యూటర్ సెంటర్ మేడపైనుంచి కిందకు దూకి ప్రాణాలు తీసుకున్నాడు. పెద్ద శబ్ధం రావడంతో విద్యార్థులు వెళ్లి చూశారు. రక్తపు మడుగులో పడి ఉన్న యువకుడిని చూసి ఆందోళన చెందారు. చాణిక్య గదిలో ఉంటున్న విద్యార్థులు దుస్తులు చూసి అతన్ని గుర్తించారు.
వార్డెన్ ద్వారా విషయం తెలుసుకున్న ప్రిన్సిపాల్ సుజాత వన్‌టౌన్ పోలీసులకు సమాచారం అందించగా, పోలీసు మృతదేహాన్ని పరిశీలించారు. చాణిక్య భవనం పైనుంచి బోర్లా పడటంతో ముఖం పూర్తిగా ఛిద్రమైందని, చెవుల నుంచి తీవ్ర రక్తస్రావమై శరీరంలోని ఎముకలు సైతం విరిగిపోయాయని గుర్తించారు. హాస్టల్ గదిలో ఉంటున్న విద్యార్థులతో విచారించారు. సెల్‌ఫోన్‌లకు పంపిన సందేశాన్ని పరిశీలించి వాటిని స్వా«దీనం చేసుకున్నారు. ‘నా చావుకు సీనియర్లు, జూనియర్లు ఎవరూ కారకులు కాదు’అని టైప్ చేసి పెట్టుకున్నట్లు సీఐ రవిశంకరరెడ్డి తెలిపారు. మృతదేహాన్ని ప్రభుత్వాస్పత్రిలోని మార్చురీకి తరలించారు.
కన్నీరుమున్నీరైన తల్లిదండ్రులు..
చాణిక్య నందరెడ్డి ఆత్మహత్య గురించి తెలుసుకున్న రమణారెడ్డి, విజయ దంపతులు వెంటనే అనంతపురం చేరుకున్నారు. విగతజీవిగా ఉన్న బిడ్డను చూసి గుండెలవిసేలా రోదించారు. ఉదయం తన ఫోన్‌కు సారీ నాన్న...అమ్మ అని సందేశం పంపాడని, నిద్రలేచి చూసుకునేలోపు ఇక్కడి విద్యార్థులు ఫోన్‌లు చేశారని చెప్పారంటూ విలపించారు. తన సోదరి హిమాచల్ ప్రదేశ్‌కు వెళ్తుండటంతో ఆమెను పలకరించేందుకు డిసెంబరు 24న ఉదయగిరికి వచ్చాడని, మూడు రోజులు తమతో సంతోషంగా గడిపాడని వారు తెలిపారు. రూ.60 వేలు స్కాలర్ షిప్ వస్తే తన ఖాతాకే బదిలీ చేశాడని తండ్రి గుర్తు చేసుకున్నారు. తమకు అండగా ఉంటాడనుకున్న బిడ్డను భగవంతుడు ఇలా తీసుకుపోయాడంటూ వారు విలపించిన తీరు స్థానికులను కన్నీళ్లు పెట్టించింది. వారి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment