JNTU College of Engineering
-
ఇంజనీరింగ్, ఫార్మసీ లకు ఆన్లైన్ తరగతులు
సాక్షి, హైదరాబాద్: ఇంజనీరింగ్, ఫార్మసీ తదితర వృత్తి సాంకేతిక విద్యా కోర్సుల్లో ఆన్లైన్ బోధనను ప్రారంభించాలని జేఎన్టీయూ నిర్ణయించింది. ప్రస్తుత కరోనా పరిస్థితుల్లో ప్రత్యక్ష బోధనపై ప్రభుత్వం ఇంకా నిర్ణయం తీసుకోలేదు. ఈ నేపథ్యంలో ప్రథమ సంవత్సరంలో చేరిన విద్యార్థులకు ఆన్లైన్లో బోధన ప్రారంభించేందుకు చర్యలు చేపట్టింది. ఈ మేరకు సోమవారం పూర్తిస్థాయి షెడ్యూల్‌ను జారీ చేసింది. ఆన్లైన్ విద్యా బోధనతోపాటు పరీక్షలు, సెలవులు ఇతరత్రా అన్ని వివరాలను పొందుపరిచింది. -
రోడ్డెక్కిన జేఎన్టీయూ విద్యార్థులు
విజయనగరం అర్బన్: పట్టణంలోని జేఎన్టీయూ ఇంజినీరింగ్ విద్యార్థులకు కోపం వచ్చింది. కళాశాల నిర్వాహణ లోపాలను సరిద్దాలని కొన్ని నెలలుగా చెబుతున్నా... ప్రిన్సిపాల్ పట్టించుకోకపోవడంతో వారిలో నిరసన పెల్లుబికింది. ఓపిక నశించి ఒక్కసారిగా రోడ్డెక్కారు. మంగళవారం ఉదయం నుంచి పచ్చి మంచినీళ్లు తాగకుండా రాత్రి పొద్దుపోయే వరకు ప్రధాన గేట్ ఎదుట బైఠాయించారు. మండుటెండలో సిమెంట్ గ్రౌండ్‌పై రోజంతా మౌనప్రదర్శన చేశారు. మధ్యలో కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ జి.సరస్వతి, వైస్ ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ శ్రీనివాసరావు నిరసన ప్రాంగణానికి వచ్చి సముదాయించారు. సమస్యలు రాసిస్తే టైమ్ బాండ్ పెట్టి పరిష్కరిస్తామని నిరసన మానుకోవాలని కోరారు. అయితే గత కొద్ది నెలలుగా మీ దృష్టికి తీసుకొచ్చిన సమస్యలేనని ప్రత్యేకించి రాసివ్వాల్సిన సమస్యలు లేవని విద్యార్థులు ఖరాకండిగా చెప్పారు. ఒక్కొక్కరుగా వెళ్లి చెబుతుంటే భయపెట్టి పరిష్కరించకుండా నిర్లక్ష్యం చేస్తున్నారని, అందుకే సామూహికంగా నిరసనలు చేపడుతున్నామని తేల్చి చెప్పారు. కళాశాల నిర్వహణంలో ప్రిన్సిపాల్ విఫలమయ్యారని ప్రభుత్వం కల్పిస్తున్న సౌకర్యాలను కూడా విద్యార్థులకు అందించలేకపోతున్నారని విద్యార్థులు ధ్వజమెత్తారు. బోధన, పరిశోధనశాలల నిర్వహణ సామగ్రి కోసం గత ఏడాది విడుదల చేసిన రూ.కోట్ల నిధులు ఇప్పటికీ వినియోగించడం లేదని దాని వల్ల నాణ్యమైన విద్యను అందుకోలేక పోతున్నామని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు. వసతిగృహం విద్యార్థుల సమస్యలు పట్టించుకోరని ఆవేదన వ్యక్తం చేశారు. నిత్యం అవసరం పడే స్టేషనరీ దుకాణం గత కొద్ది నెలలుగా లేదని, ఏ అవసరం వచ్చినా ఆరు కిలోమీటర్ల దూరంలోని పట్టణంలోకి వెళ్లాల్సి వస్తుందని విలపించారు. వైద్య సదుపాయాలు కళాశాల ప్రాంగణంలో లేకపోవడంతో ఇబ్బందులు పడుతున్నామని ఇలాంటి సమస్యలన్నింటినీ ప్రిన్సిపాల్ పరిష్కారమార్గాన్ని చూడకుండా నిర్లక్ష్యాన్ని వహిస్తున్నారనే ఉద్దేశంతో యూనివర్సిటీ వైస్ చాన్సలర్ స్వయంగా వచ్చి పరిష్కరించాలనే లక్ష్యంగా సామూహికంగా నిరసనలు చేపడుతున్నామని చెబుతున్నారు. మధ్యాహ్నం 3.00 గంటల సమయంలో యూనివర్సిటీ ప్రధాన కార్యాలయానికి ఆందోళన విషయాన్ని తెలియజేశారు. నిరసనలోని విద్యార్థులతో యూనివర్సిటీ ఉన్నతాధికారులు ఫోన్ ద్వారా మాట్లాడారు. అయితే వచ్చిన ఫోన్ కాల్ వైస్‌చాన్సలర్ నుంచి కాకపోవడంతో విద్యార్థులు సంతృప్తి చెందలేదు. బైఠాయింపు కొనసాగిస్తామని అధికారులతో చెప్పారు. దాంతో పొద్దుపోయినా గేట్ వద్ద బైఠాయింపు కొనసాగించారు. -
జేఎన్టీయూలో క్యాంపస్ నియామకాలు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని ఇంజనీరింగ్ కాలేజీల్లో క్యాంపస్ నియామకాలు మొదలయ్యాయి. ఇందులో భాగంగా జేఎన్టీయూ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ ప్లేస్మెంట్ సెల్లో కోర్ అండ్ డ్రీమ్ స్టేటస్ క్యాంపస్ నియామకాలు ఈ నెల 17, 18 తేదీల్లో జరిగాయి. అందులో మైక్రోసాఫ్ట్‌తో పాటు పలు కంపెనీలు పాల్గొన్నాయి. ఇందులో మైక్రోసాఫ్ట్ అత్యధికంగా ఓ విద్యార్థికి ఏడాదికి రూ.36 లక్షల వేతనాన్ని, మరో విద్యార్థికి రూ.24 లక్షల వేతనాన్ని ఆఫర్ చేసింది. మ్యాథ్ వర్క్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ మరో ముగ్గురు ఎంటెక్ విద్యార్థులకు రూ.17 లక్షల చొప్పున వేతనంతో నియమించుకుంది. రూ.14.5 లక్షల చొప్పున వేతనంతో ఏడుగురు బీటెక్ విద్యార్థులను ఎంపిక చేసుకుంది. మరో 10 మంది విద్యార్థులకు జోహో కంపెనీ రూ.6.6 లక్షల ప్యాకేజీ చొప్పున ఇచ్చింది. టెరడాట కంపె నీ రూ.8.28 లక్షల చొప్పున వేతనంతో పలువురు విద్యార్థులను ఎంపిక చేసినట్లు జేఎన్టీయూ వీసీ వేణుగోపాల్‌రెడ్డి వెల్లడించారు. -
జేఎన్టీయూ కళాశాలకు ఎన్బీఏ గుర్తింపు
పులివెందుల రూరల్ : పులివెందులలోని జేఎన్టీయూ ఇంజనీరింగ్ కళాశాలకు నేషనల్ బోర్డు ఆఫ్ అక్రిడేషన్ (ఎన్బీఏ)గా గుర్తింపు ఇస్తూ ఢిల్లీలోని ఎన్బీఏ మెంబర్ సెక్రటరీ డాక్టర్ అనిల్‌కుమార్ నాసా ఉత్తర్వులు జారీ చేశారు. ఈ ఉత్తర్వులు సోమవారం సాయంత్రం కళాశాలకు అందగా, మంగళవారం ప్రిన్సిపాల్ గోవిందరాజులు విలేకరులకు విషయాన్ని తెలిపారు. గతేడాది నవంబర్ 28, 29, 30వ తేదీలలో ఎన్బీఏ బోర్డు చైర్మన్ అగర్వాల్ ఆధ్వర్యంలో 9 మంది కమిటీ సభ్యులు కళాశాలలోని మౌలిక వసతులపై అధ్యయనం చేశారు. కళాశాలను మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి 2006లో ప్రారంభించారు. అనతికాలంలోనే ఎన్బీఏ గుర్తింపు రావడంపై పలువురు విద్యావేత్తలు హర్షం వ్యక్తం చేశారు. కళాశాలలోని మెకానికల్, కంప్యూటర్ సైన్స్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ విభాగాలకు ఎన్బీఏ గుర్తింపు కోసం ప్రతిపాదనలు పంపగా.. ఈ నాలుగు విభాగాలకు ఆమోదం లభించింది. విద్యార్థులకు ఎంతో మేలు : జేఎన్టీయూ కళాశాలకు నేషనల్ బోర్డు అక్రిడేషన్(ఎన్బీఏ) గుర్తింపు రావడం విద్యార్థులకు ఎంతో మేలు. కళాశాలకు ఎన్బీఏ గుర్తింపుతో ప్రముఖ కంపెనీలు క్యాంపస్ ఇంటర్వ్యూలు నిర్వహించే అవకాశం ఉంది. మౌలిక వసతుల కోసం రూ.3 కోట్ల నుంచి 5 కోట్ల నిధులు విడుదలవుతాయి. దీంతో విద్యార్థులకు నాణ్యమైన విద్య అందనుంది. బీటెక్ అనంతరం ప్రముఖ కంపెనీలలో ఉపాధి అవకాశాలకు ఎంతో దోహద పడుతుంది. - గోవిందరాజులు (కళాశాల ప్రిన్సిపాల్), పులివెందుల