joint military exercises
-
వాగ్నర్ అనుభవంతో బెలారస్ బలోపేతం!
మిన్స్క్ (బెలారస్): ఉక్రెయిన్‌లో రష్యా తరఫున యుద్ధంలో పాల్గొన్న ప్రైవేట్ సైన్యం వాగ్నర్ గ్రూప్ అనుభవాన్ని వాడుకోవాలని బెలారస్ భావిస్తోంది. వాగ్నర్ సేన శనివారం ఆ దేశంలో బెలారస్లో అడుగుపెట్టింది. ఇరు సైన్యాల మధ్య సమన్వయం కోసం సంయుక్త సైనిక విన్యాసాలు తదితరాలకు రంగం సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. మెరుపువేగంతో షూటింగ్, ప్రథమ చికిత్సలో బెలారస్ సైనికులకు వాగ్నర్ గ్రూప్ బలగాలు తరీ్ఫదునిస్తున్న వీడియో వైరల్‌గా మారింది. -
దక్షిణ కొరియా సైనిక విన్యాసాలు
సియోల్: ఉత్తరకొరియా ఖండాంతర బాలిస్టిక్ క్షిపణి ప్రయోగం జరిపిన నేపథ్యంలో ఆదివారం దక్షిణ కొరియా, అమెరికా సంయుక్త సైనిక విన్యాసాలు ప్రారంభించాయి. ఆదివారం జరిపిన ఈ విన్యాసాల్లో అమెరికా వ్యూహాత్మక బాంబర్లు పాల్గొన్నాయి. అమెరికా బి–1బి బాంబర్లకు దక్షిణ కొరియా ఎఫ్–35ఏ, ఎఫ్–15ఏ, అమెరికా ఎఫ్–16 రక్షణగా నిలిచాయి. రెండు మిత్ర దేశాలు ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు తమకున్న రక్షణ సంసిద్ధతను ప్రదర్శించాయని దక్షిణ కొరియా ఒక ప్రకటనలో తెలిపింది. జపాన్‌తో కలిసి అమెరికా సంయుక్త వైమానిక విన్యాసాలు జరుపనుందని జపాన్ వార్తా సంస్థ తెలిపింది. ఉత్తరకొరియా శనివారం రాజధాని ప్యాంగ్యాంగ్ నుంచి లాంగ్–రేంజ్ క్షిపణిని జపాన్ సముద్రం తీరంలోకి ప్రయోగించింది. ఈ క్షిపణి గంటలో 900 కిలోమీటర్లు (560 మైళ్లు) ప్రయాణించింది. జపాన్‌కు చెందిన ఓషిమా దీవికి 200 కిలోమీటర్ల దూరంలోని సముద్ర జలాల్లో క్షిపణి కూలిపోయినట్లు సమాచారం. -
Yudh Abhyas: చైనాకు స్ట్రాంగ్ కౌంటర్
వాషింగ్టన్: డ్రాగన్ కంట్రీ చైనాకు మరో స్ట్రాంగ్ కౌంటర్ పడింది. ఉత్తరాఖండ్‌లో భారత్-అమెరికా సంయుక్త సైనిక విన్యాసాలపై చైనా అభ్యంతరాలను వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. దీనికి భారత్ ఘాటైన కౌంటర్ ఇచ్చింది. ఇప్పుడు ఈ వ్యవహారంలో చైనాకు మరో పంచ్ పడింది. ఈ వ్యవహారంలో తాము భారత్ వెంటే నిలుస్తామని అమెరికా ప్రకటించింది. భారత్ చెప్పిన దానితో ఏకీభవిస్తూ.. ఇది చైనా ఏమాత్రం సంబంధం లేని విషయం.. అని అమెరికా వ్యవహారాల ప్రతినిధి ఎలిజబెత్ జోన్స్ ఇవాళ ఒక ప్రకటన చేశారు. శుక్రవారం జర్నలిస్టులతో జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో ఆమె ఈ వ్యాఖ్య చేశారు. చైనా సరిహద్దుకు వంద కిలోమీటర్ల దూరంలోని ఔలి దగ్గర.. భారత్-అమెరికా దళాలు సంయుక్తంగా యుద్ధ్ అభ్యాస్ పేరుతో విన్యాసాలు చేపట్టాయి. ఇది ఇరు దేశాల ఒప్పందాలను ఉల్లంఘించినట్లేనని పేర్కొంటూ భారత్‌ను ఉద్దేశించి చైనా ఒక ప్రకటన విడుదల చేసింది. అయితే గురువారం చైనాకు భారత్ గట్టి కౌంటర్ ఇచ్చింది. విదేశాంగ శాఖ స్పందిస్తూ.. భారత్ ఎవరితో సైనిక విన్యాసాలు నిర్వహించుకోవాలన్నది సొంత నిర్ణయమని, ఈ వ్యవహారంలో మూడో దేశానికి సర్వాధికారమేమీ కట్టబెట్టలేదని వ్యాఖ్యానించింది. ఇక విదేశాంగ ప్రతినిధి అరిందమ్ బాగ్చీ స్పందిస్తూ.. చైనాతో 1993, 1996లో చేసుకున్న ఒప్పందాలకు.. ఎలాంటి భంగం వాటిల్లలేదని తెలిపారు. యుద్ధ్ అభ్యాస్ పేరుతో భారత్-అమెరికా బలగాలు.. 18వ సంయుక్త సైన్య విన్యాసాలు చేపట్టాయి. వాస్తవ నియంత్రణ రేఖకు వంద కిలోమీటర్ల దూరంలో.. ఉత్తరాఖండ్ ఔలి దగ్గర ఈ విన్యాసాలు జరుగుతున్నాయి. ఇదీ చదవండి: అందుకు అమెరికా ఒప్పుకుంటే చర్చలకు రెడీ! -
దశాబ్ధాల తర్వాత దాయాదులు తొలిసారిగా..
బీజింగ్ : 1947లో వేర్వేరు దేశాలుగా అవతరించిన తర్వాత భారత్, పాకిస్తాన్‌లు తొలిసారిగా సంయుక్త సైనిక విన్యాసాల్లో పాలుపంచుకుంటున్నాయి. సెప్టెంబర్‌లో రష్యాలో జరగనున్న శాంతి ప్రక్రియ కసరత్తులో భాగంగా ఈ అద్భుత దృశ్యం ఆవిష్కృతం కానుంది. షాంఘై సహకార సంస్థ (ఎస్సీఓ)లో ఇతర సభ్య దేశాలతో కలిసి భారత్, పాక్‌లు ఈ విన్యాసాల్లో పాల్గొంటాయి. బీజింగ్‌లో 15వ ఎస్సీఓ రక్షణ మంత్రుల సదస్సులో రక్షణ మంత్రి నిర్మలా సీతారామన్ పీస్ మిషన్ 2018లో భారత్ పాల్గొంటుందని ప్రకటించారు. అణు సామర్ధ్యం కలిగిన దక్షిణాసియా దేశాలు ఈ తరహా సంయుక్త సైనిక విన్యాసాల్లో పాల్గొనడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. రష్యా, చైనా సహా ఎస్సీఓ సభ్య దేశాలన్నీ ఈ విన్యాసాల్లో పాల్గొంటాయి. ఎస్సీఓలో గత ఏడాది భారత్, పాకిస్తాన్‌లు పూర్తిస్థాయి సభ్యత్వాన్ని స్వీకరించాయి. గతంలో ఆఫ్రికా దేశాల్లో జరిగిన పలు ఐరాస శాంతి మిషన్స్‌లో భాగంగా భారత్, పాక్ సైనికులు కలిసి పనిచేసినా సంయుక్త సైనిక విన్యాసాల్లో పాల్గొనడంమాత్రం ఇదే తొలిసారి. రక్షణ రంగంలో దక్షిణాసియా ప్రాంత దేశాలతో పరస్పర ద్వైపాక్షిక సహకారానికి భారత్ కట్టుబడి ఉందని ఈ సందర్భంగా నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు. మరోవైపు సైనిక విన్యాసాల్లో పాకిస్తాన్ పాల్గొంటుందని పాక్ అధికారులు ధృవీకరించారు. -
'పాకిస్థాన్‌తో సైనిక విన్యాసాలా.. మీకు తగదు'
పాకిస్థాన్‌తో కలిసి సైనిక విన్యాసాలు చేయడం సరికాదని రష్యాకు భారతదేశం గట్టిగా చెప్పింది. ఉగ్రవాదాన్ని వాళ్లు ప్రభుత్వ విధానంగా భావించి దానికి మద్దతు ఇస్తారని, అలాంటి దేశంతో కలిసి మెలిసి తిరగడం అంత మంచిది కాదని స్పష్టం చేసింది. వార్షిక ద్వైపాక్షిక సదస్సుకు ముందు మాస్కోలో భారత రాయబారి పంకజ్ శరణ్ రష్యా వార్తాసంస్థ రియా నొవోస్టీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ వ్యాఖ్యలు చేశారు. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఈనెల 14వ తేదీన గోవాకు రానున్నారు. అక్కడ ప్రధాని మోదీకి, ఆయనకు మధ్య ద్వైపాక్షిక సదస్సు ఒకటి జరగనుంది. దాంతోపాటు ఈ నెల 16వ తేదీన జరిగే బ్రిక్స్ సదస్సులో కూడా పుతిన్ పాల్గొంటారు. పాకిస్థాన్‌తో కలిసి రష్యా సంయుక్త సైనిక విన్యాసాలు ప్రారంభించడంపై భారతదేశం తన అసంతృప్తిని బహిరంగంగానే వెల్లడించింది. కానీ తాము ఆసియాలోని ఇతర దేశాలతో కలిసి కూడా సైనిక విన్యాసాలు చేస్తున్నామంటూ రష్యా మన మాటలను పెద్దగా పట్టించుకోలేదు. అయితే.. బ్రిక్స్ దేశాలు తప్పనిసరిగా దృష్టిపెట్టాల్సిన అంశాలు కొన్ని ఉన్నాయని శరణ్ చెప్పారు. బ్రిక్స్ గ్రూపులోని అన్ని దేశాలూ ఉగ్రవాదం బారిన పడ్డవేనని ఆయన అన్నారు. అందువల్ల ఈ అంశంపై కూడా బ్రిక్స్ సదస్సులో చర్చ గట్టిగా సాగుతుందన్నారు. భారత, రష్యా దేశాల మధ్య చాలా కాలంగా ప్రత్యేకమైన వ్యూహాత్మక భాగస్వామ్యం ఉందని.. అందులో ఎలాంటి మార్పు లేదని శరణ్ స్పష్టం చేశారు. ప్రపంచ శాంతి కోసం ఇరుదేశాల భాగస్వామ్యం గట్టిగా కృషిచేస్తోందన్నారు. మన దేశం కూడా రష్యాతో కలిసి తరచు సైనిక విన్యాసాలు చేస్తుంటుందని.. అవి ఇక ముందు కూడా కొనసాగుతాయని తెలిపారు.