'పాకిస్థాన్‌తో సైనిక విన్యాసాలా.. మీకు తగదు'
పాకిస్థాన్‌తో కలిసి సైనిక విన్యాసాలు చేయడం సరికాదని రష్యాకు భారతదేశం గట్టిగా చెప్పింది. ఉగ్రవాదాన్ని వాళ్లు ప్రభుత్వ విధానంగా భావించి దానికి మద్దతు ఇస్తారని, అలాంటి దేశంతో కలిసి మెలిసి తిరగడం అంత మంచిది కాదని స్పష్టం చేసింది. వార్షిక ద్వైపాక్షిక సదస్సుకు ముందు మాస్కోలో భారత రాయబారి పంకజ్ శరణ్ రష్యా వార్తాసంస్థ రియా నొవోస్టీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ వ్యాఖ్యలు చేశారు. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఈనెల 14వ తేదీన గోవాకు రానున్నారు. అక్కడ ప్రధాని మోదీకి, ఆయనకు మధ్య ద్వైపాక్షిక సదస్సు ఒకటి జరగనుంది. దాంతోపాటు ఈ నెల 16వ తేదీన జరిగే బ్రిక్స్ సదస్సులో కూడా పుతిన్ పాల్గొంటారు.
పాకిస్థాన్‌తో కలిసి రష్యా సంయుక్త సైనిక విన్యాసాలు ప్రారంభించడంపై భారతదేశం తన అసంతృప్తిని బహిరంగంగానే వెల్లడించింది. కానీ తాము ఆసియాలోని ఇతర దేశాలతో కలిసి కూడా సైనిక విన్యాసాలు చేస్తున్నామంటూ రష్యా మన మాటలను పెద్దగా పట్టించుకోలేదు. అయితే.. బ్రిక్స్ దేశాలు తప్పనిసరిగా దృష్టిపెట్టాల్సిన అంశాలు కొన్ని ఉన్నాయని శరణ్ చెప్పారు. బ్రిక్స్ గ్రూపులోని అన్ని దేశాలూ ఉగ్రవాదం బారిన పడ్డవేనని ఆయన అన్నారు. అందువల్ల ఈ అంశంపై కూడా బ్రిక్స్ సదస్సులో చర్చ గట్టిగా సాగుతుందన్నారు.
భారత, రష్యా దేశాల మధ్య చాలా కాలంగా ప్రత్యేకమైన వ్యూహాత్మక భాగస్వామ్యం ఉందని.. అందులో ఎలాంటి మార్పు లేదని శరణ్ స్పష్టం చేశారు. ప్రపంచ శాంతి కోసం ఇరుదేశాల భాగస్వామ్యం గట్టిగా కృషిచేస్తోందన్నారు. మన దేశం కూడా రష్యాతో కలిసి తరచు సైనిక విన్యాసాలు చేస్తుంటుందని.. అవి ఇక ముందు కూడా కొనసాగుతాయని తెలిపారు.