బీజింగ్ : 1947లో వేర్వేరు దేశాలుగా అవతరించిన తర్వాత భారత్, పాకిస్తాన్‌లు తొలిసారిగా సంయుక్త సైనిక విన్యాసాల్లో పాలుపంచుకుంటున్నాయి. సెప్టెంబర్‌లో రష్యాలో జరగనున్న శాంతి ప్రక్రియ కసరత్తులో భాగంగా ఈ అద్భుత దృశ్యం ఆవిష్కృతం కానుంది. షాంఘై సహకార సంస్థ (ఎస్‌సీఓ)లో ఇతర సభ్య దేశాలతో కలిసి భారత్, పాక్‌లు ఈ విన్యాసాల్లో పాల్గొంటాయి. బీజింగ్‌లో 15వ ఎస్‌సీఓ రక్షణ మంత్రుల సదస్సులో రక్షణ మంత్రి నిర్మలా సీతారామన్ పీస్ మిషన్ 2018లో భారత్ పాల్గొంటుందని ప్రకటించారు.
అణు సామర్ధ్యం కలిగిన దక్షిణాసియా దేశాలు ఈ తరహా సంయుక్త సైనిక విన్యాసాల్లో పాల్గొనడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. రష్యా, చైనా సహా ఎస్‌సీఓ సభ్య దేశాలన్నీ ఈ విన్యాసాల్లో పాల్గొంటాయి. ఎస్‌సీఓలో గత ఏడాది భారత్, పాకిస్తాన్‌లు పూర్తిస్థాయి సభ్యత్వాన్ని స్వీకరించాయి. గతంలో ఆఫ్రికా దేశాల్లో జరిగిన పలు ఐరాస శాంతి మిషన్స్‌లో భాగంగా భారత్, పాక్ సైనికులు కలిసి పనిచేసినా సంయుక్త సైనిక విన్యాసాల్లో పాల్గొనడంమాత్రం ఇదే తొలిసారి. రక్షణ రంగంలో దక్షిణాసియా ప్రాంత దేశాలతో పరస్పర ద్వైపాక్షిక సహకారానికి భారత్ కట్టుబడి ఉందని ఈ సందర్భంగా నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు. మరోవైపు సైనిక విన్యాసాల్లో పాకిస్తాన్ పాల్గొంటుందని పాక్ అధికారులు ధృవీకరించారు.
Comments
Please login to add a commentAdd a comment