10 వారాల్లో తేల్చండి
► కాంట్రాక్టు లెక్చరర్ల ‘క్రమబద్ధీకరణ’పై ఉమ్మడి హైకోర్టుకు ‘సుప్రీం’ సూచన
► స్టే ఎత్తివేయాలన్న కాంట్రాక్టు లెక్చరర్ల విజ్ఞప్తి తిరస్కరణ
సాక్షి, న్యూఢిల్లీ: కాంట్రాక్టు జూనియర్ లెక్చరర్ల సర్వీసు క్రమబద్ధీకరణకు సంబంధించిన పిటిషన్ను 10 వారాల్లోగా పరిష్కరించాలని ఉమ్మడి హైకోర్టుకు సుప్రీంకోర్టు సూచించింది. క్రమబద్ధీకరణపై హైకోర్టు ఇచ్చిన స్టేను ఎత్తివేసేందుకు నిరాకరించింది. రాష్ట్ర ప్రభుత్వం కాంట్రాక్టు జూనియర్ లెక్చరర్ల సర్వీసు క్రమబద్ధీకరణకు నిర్ణయం తీసుకోగా.. దానిపై హైకోర్టు స్టే విధించిన విషయం తెలిసిందే. ఆ స్టేను ఎత్తివేయాలంటూ ఆర్జేడీ కాంట్రాక్టు లెక్చరర్ల సంఘం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఈ పిటిషన్ను పరిశీలించిన ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దీపక్ మిశ్రా నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం విచారణ జరిపేందుకు నిరాకరించింది.
పిటిషనర్ తరఫున సీనియర్ న్యాయవాది సంజయ్ హెగ్డే వాదనలు ప్రారంభించబోగా... హైకోర్టు విచారణ జరుపుతుండగా తాము జోక్యం చేసుకోవడం సరికాదని పేర్కొంది. అయితే ‘క్రమబద్ధీకరణ’పిటిషన్ను 10 వారాల్లోగా పరిష్కరించాలని మాత్రం సూచన చేస్తున్నామని స్పష్టం చేసింది. కాంట్రాక్టు లెక్చరర్ల సంఘం అధ్యక్షుడు రమణారెడ్డి, ప్రధాన కార్యదర్శి సురేశ్, ఆర్జేడీ కాంట్రాక్టు లెక్చరర్ల సంఘం అధ్యక్షుడు గాదె వెంకన్న, ప్రధాన కార్యదర్శి కుమారస్వామి తదితరులు సుప్రీం ఎదుట పిటిషన్ విచారణకు హాజరయ్యారు.