Justice RM Lodha committee
-
ప్రక్షాళనలో తొలి అడుగు
సర్వోన్నత న్యాయస్థానం జోక్యం చేసుకున్నాకైనా తమకలవాటైన పాత ఆటలకు స్వస్తి చెప్పక తప్పదని గుర్తించలేని భారత క్రికెట్ నియంత్రణ బోర్డు(బీసీసీఐ) సారథులకు ఇదొక షాక్ ట్రీట్మెంట్! బోర్డు ప్రక్షాళనకు ససేమిరా సిద్ధపడని బీసీసీఐ అధ్యక్ష, కార్యదర్శులు అనురాగ్ ఠాకూర్, అజయ్ షిర్కేలను పదవులనుంచి తప్పిస్తూ సుప్రీంకోర్టు సోమవారం తీసుకున్న కఠిన నిర్ణయం ఆ సంస్థ పరివర్తనకు దోహదపడే చర్య. కోట్లాదిమంది అభిమానులను సమ్మోహనపరిచే క్రికెట్ క్రీడను మన దేశంలో రాజకీయ ప్రముఖులు, ఉన్నతాధికార గణం హైజాక్ చేసి దాన్ని భ్రష్టు పట్టిస్తున్న వైనాన్ని, నాశనం చేస్తున్న తీరును కేంద్రంలోని ప్రభుత్వాలు చూసీ చూడనట్టు ఊరుకున్నాయి. దాంట్లో జోక్యం తమ బాధ్యత కాదన్నట్టు ప్రవర్తిం చాయి. క్రికెట్‌ను కేవలం ‘వినగలిగే’ రోజుల్లో సైతం ఆ ఆటకు అసంఖ్యాక క్రీడా భిమానులుండేవారు. క్రికెట్ సిరీస్ సాగుతున్న సమయంలో రేడియో ఉన్నవారి వద్దకు పరుగులెత్తి ‘స్కోరెంత...?’ అని ఆదుర్దాగా ప్రశ్నించేవారు. అలాంటి క్రీడకు కళ్లముందే చెదలు పడుతున్నా ప్రభుత్వాలు పట్టించుకోకపోవడమంటే జరుగు తున్న నేరంలో భాగం కావడమే. ఆ నింద మోయడానికైనా ప్రభుత్వాలు సిద్ధపడ్డా యిగానీ జోక్యానికి ససేమిరా అన్నాయి. ట్వంటీ–ట్వంటీ క్రికెట్ ఆ క్రీడకు అప్పటికే ఉన్న ఆకర్షణను పెంచితే ఐపీఎల్ వచ్చాక అది శిఖరాగ్రానికి చేరింది. ఐపీఎల్‌కు కనీవినీ ఎరుగని రీతిలో కాసులు రాలడం మొదలయ్యాక దానికి అనుబంధంగా బెట్టింగ్‌ల జోరు, మ్యాచ్ ఫిక్సింగ్‌ల హోరు కూడా పెరిగింది. ప్రధాన నగరాలే కాదు... మారుమూల గ్రామాలకు కూడా ఈ బెట్టింగ్ ముఠాల ప్రభావం విస్తరిం చింది. ఇలాంటి ధోరణులను అరికట్టడానికి బీసీసీఐ తానుగా చేసిందేమీ లేదు. సరికదా అక్కడ చేరిన రాజకీయ నాయకులు, ఉన్నతాధికారులు ముఠాలు కట్టి దాన్ని రాజకీయమయం చేశాయి. రాష్ట్ర స్థాయిల్లో ఉండే క్రీడా సంఘాలు కూడా ఈ ముఠా రాజకీయాలకు బ్రాంచి ఆఫీసుల్లా మారాయి! ఇలాంటి పరిస్థితుల్లో బిహార్ క్రికెట్ సంఘ కార్యదర్శి బెట్టింగ్ కేసులను బీసీసీఐ పెద్దలే నీరుగారుస్తున్నారని సుప్రీంకోర్టుకెక్కారు. పర్యవసానంగా సర్వోన్నత న్యాయస్థానం ఆ సంస్థను ప్రక్షాళన చేసి తీరాలన్న సంకల్పంతో ముందుకు కదిలింది. అందువల్లే 2015 జనవరిలో జస్టిస్ ఆర్ఎం లోథా ఆధ్వర్యంలో ముగ్గురు సభ్యుల కమిటీని నియమించి బీసీసీఐ సంస్థాగత మార్పులకు అవసరమైన సూచనలు చేయమని కోరింది. ఆ కమిటీ అదే సంవ త్సరం ఏప్రిల్‌లో పని ప్రారంభించాక ఎంతో శ్రమించింది. బీసీసీఐ పనితీరు, దానికి జరిగే ఎన్నికల ప్రక్రియ ఏ విధంగా ఉంటుందో, దానికి అనుబంధంగా ఉండే కమిటీల ఏర్పాటు, వాటి నిర్వహణ ఎలా కొనసాగుతున్నదో, ఆటగాళ్ల సంక్షే మానికి తీసుకునే చర్యలేమిటో ఆరా తీసింది. కూలంకషంగా అధ్యయనం చేసింది. నిరుడు జనవరి మొదటి వారంలో అనేక విలువైన ప్రతిపాదనలు చేసింది. వాటిపై మీ స్పందనేమిటని బీసీసీఐని సుప్రీంకోర్టు అడిగింది. సరిగ్గా నెలరోజులు వేచి చూశాక మార్చి నెల 3 లోగానైనా జవాబివ్వాలని ఆదేశించింది. ఆ పరిస్థితుల్లో తప్పనిసరై బీసీసీఐ జవాబిచ్చింది. లోథా కమిటీ సిఫార్సుల్లో కొన్ని మాత్రమే తమకు ఆమోదయోగ్యమని చెబుతూ ఫలానా ప్రతిపాదనలు ఆచరణయోగ్యం కాదంటూ తిరస్కరించింది. బీసీసీఐకి నచ్చని సిఫార్సుల్లో ‘ఒక రాష్ట్రానికి ఒక ఓటు’, ఏడు పదుల వయసు వచ్చినవారు పాలనా పగ్గాలు వదిలిపోవాలనడం, జోడు పదవుల నిర్వహణ కుదరదని చెప్పడం వగైరాలున్నాయి. దీనిలోని ఆంతర్యం అందరికీ తెలిసిందే. మహారాష్ట్ర, గుజరాత్ వంటి రాష్ట్రాలు బహుళ ఓట్లతో బీసీసీఐని కబ్జా పెట్టాయి. ఆ రాష్ట్రాలు ఎవరిని అందలం ఎక్కించదల్చు కుంటే వారిదే రాజ్యమవుతున్నది. ఈ మాదిరి ధోరణుల వల్ల ఇతర రాష్ట్రాలకు అన్యాయం జరుగుతోంది. వారి మాటకు విలువ లేకుండా పోతోంది. ఈ సిఫా ర్సులు ఆచరణయోగ్యం కాదనుకుంటే ఎందుకు కాదో బీసీసీఐ సుప్రీంకోర్టుకు వివరంగా చెప్పి ఉండాల్సింది. అది ఆ పని చేయలేదు. అందువల్లే ఆరు నెలల్లోగా లోథా కమిటీ సిఫార్సులు అమల్లోకి తీసుకురావాల్సిందేనని నిరుడు జూలైలో సుప్రీంకోర్టు ఆదేశాలిచ్చింది. బీసీసీఐ ప్రభుత్వాలిచ్చే గ్రాంట్లపైన నడవకపోవచ్చు. కానీ అది ఎవరి ప్రయో జనాలో నెరవేర్చడానికుద్దేశించిన ప్రైవేటు సంస్థేమీ కాదు. ఈ దేశ పౌరులకు అది జవాబుదారీగా ఉండాలి. ఇక్కడి చట్టాలకు లోబడి పనిచేయాలి. దాని పనితీరు పారదర్శకంగా ఉండాలి. దాని నిర్వహణ ప్రజాస్వామ్యయుతంగా ఉండాలి. బీసీ సీఐకి జవాబుదారీతనం లేని పర్యవసానంగా బెట్టింగ్‌లు విజృంభించి, దేశ భద్రతకు ముప్పు కలిగించే దావూద్ ఇబ్రహీం ముఠా జోక్యం కూడా అందులో పెరిగి క్రికెట్ క్రీడతో నేరం పెనవేసుకుపోయే స్థితి ఏర్పడింది. ఇప్పుడు బీసీసీఐ అధ్యక్షుడు అనురాగ్ ఠాకూర్, కార్యదర్శి అజయ్ షిర్కేలను తొలగించడం ద్వారా సంస్థ ప్రక్షాళన విషయంలో తనకున్న తిరుగులేని సంకల్పాన్ని సుప్రీంకోర్టు వెల్ల డించింది. ఇకపై ఆ సంస్థ తీరుతెన్నులను సర్వోన్నత న్యాయస్థానం ఎలా పర్య వేక్షిస్తుందో, అందులో పారదర్శకతను పునరుద్ధరించేందుకు ఏం చర్యలు తీసుకుం టుందో వేచి చూడాల్సి ఉంది. 70 ఏళ్ల వయసు నిండిన రాజకీయ నాయకులు నాయకత్వ స్థానాల్లో ఉండటం కుదరదని జస్టిస్ లోథా కమిటీ తేల్చి చెప్పిన నేపథ్యంలో ఇకపై బీసీసీఐ ఎలా ఉండబోతుందన్న ఆసక్తి ప్రతి ఒక్కరిలోనూ ఉంది. వృద్ధ నేతలు మౌనంగా నిష్క్రమిస్తారా, లేక తమ తమ వర్గాలను వెనకుండి నడి పిస్తారా అన్నది కూడా చూడాల్సి ఉంటుంది. అలాగే ఒక రాష్ట్రానికి ఒక ఓటు విధానం అమలైతే సంస్థ నాయకత్వం పగ్గాలు ఎవరికి దక్కుతాయన్నది కూడా ఆసక్తికరమే. ఏదేమైనా బీసీసీఐ మళ్లీ ఉన్నత ప్రమాణాలతో, ఉత్కృష్ట విలువలతో విరాజిల్లాలని... ఆరోపణలొచ్చినప్పుడు స్పందించి సరిదిద్దుకునే వ్యక్తిత్వం ఉండా లని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. ఇవన్నీ సాధ్యమైతే క్రికెట్ మళ్లీ ‘మర్యాదస్తుల ఆట’గా మన్నన పొంది నిజమైన క్రీడాభిమానులను అలరిస్తుంది. దేశంలో క్రీడా స్ఫూర్తి వెల్లివిరుస్తుంది. -
అన్నింటినీ అంగీకరించం
లోధా ప్యానెల్ ప్రతిపాదనలపై బీసీసీఐ కోర్టులో పోరాటానికే సిద్ధం న్యూఢిల్లీ: జస్టిస్ ఆర్ఎం లోధా కమిటీ సూచించిన సంస్కరణల అమలుపై బీసీసీఐ మరోసారి పోరాటానికే సిద్ధమవుతోంది. ప్యానెల్ సూచించినట్టుగా అన్నింటినీ అమలు చేయాల్సిందేనని ఇప్పటికే సుప్రీం కోర్టు తేల్చి చెప్పినా కూడా భారత క్రికెట్ బోర్డు మాత్రం తమ పట్టు వీడడం లేదు. శనివారం జరిగిన తమ ప్రత్యేక సర్వసభ్య సమావేశంలోనూ సభ్యుల మధ్య ఇదే అభిప్రాయం వ్యక్తమైంది. ముఖ్యంగా ఒక రాష్ట్రం ఒక ఓటు, ఒక వ్యక్తికి ఒకే పదవి, గరిష్ట వయస్సు పరిమితి, కూలింగ్ ఆఫ్ పీరియడ్ నిబంధనలపై బోర్డు సభ్యుల్లో వ్యతిరేకత వ్యక్తమవుతోంది. మరోవైపు సోమవారం ఈ ప్రతిపాదనల విషయంలో సుప్రీం కోర్టు తుది తీర్పునివ్వనుంది. ‘ప్యానెల్ పేర్కొన్న కొన్ని సంస్కరణలు వాస్తవికంగా అమలుకు వీలు కాకుండా ఉన్నారుు. ఇదే విషయమై సోమవారం మా లీగల్ కౌన్సిల్ కపిల్ సిబల్ కోర్టులో వాదనలు కొనసాగిస్తారు’ అని సీనియర్ బోర్డు అధికారి ఒకరు తెలిపారు. అలాగే అనురాగ్ ఠాకూర్ సోమవారం తన అఫిడవిట్ దాఖలు చేస్తారని చెప్పారు. ఇదిలావుండగా సస్పెన్షన్‌లో ఉన్న రాజస్తాన్ క్రికెట్ సంఘం డిప్యూటీ ప్రెసిడెంట్ మెహమూద్ అబ్ది ఎస్‌జీఎంలో పాల్గొనడంతో పాటు కార్యదర్శి షిర్కేను కలుసుకున్నారు. -
అన్ని క్రికెట్ సంఘాలు అమలు చేయాల్సిందే..
లోధా ప్యానెల్ ప్రతిపాదనలపై సుప్రీం కోర్టు న్యూఢిల్లీ: దేశంలోని అన్ని క్రికెట్ సంఘాలు తప్పనిసరిగా జస్టిస్ ఆర్ఎం లోధా కమిటీ సూచించిన ప్రతిపాదనలు అమలు చేయాల్సిందేనని దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీం కోర్టు తేల్చి చెప్పింది. ‘ఒకసారి బీసీసీఐ వీటిని అమలు చేస్తే ఇక అన్ని రాష్ట్ర సంఘాలు కూడా ఇదే పద్దతి అనుసరిస్తాయి. మ్యాచ్ ఫిక్సింగ్, స్పాట్ ఫిక్సింగ్ నేపథ్యంలో ఏర్పాటైన ఈ కమిటీని ఆషామాషీగా తీసుకోవాల్సిన అవసరం లేదు. అన్ని అంశాలను నిశితంగా గమనించి నిపుణు లైన కమిటీ సభ్యులు చేసిన సూచనలివి. వీటిని కేవలం ప్రతిపాదనలే అనే కోణంలో చూడకూడదు’ అని చీఫ్ జస్టిస్ టీఎస్ ఠాకూర్ స్పష్టం చేశారు. అంతకుముందు లోధా ప్యానెల్ సూచనలు ఆమోదయోగ్యం కాదని హర్యానా క్రికెట్ సంఘం చేసిన అభ్యంతరాలపై కోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది. మరోవైపు గరిష్ట వయస్సు ప్రతిపాదనపై కూడా కర్ణాటక క్రికెట్ సంఘం అభ్యంతరం వ్యక్తం చేసింది. ప్యానెల్ సూచనలు కొన్ని అమలు పరిచే విధంగానే ఉన్నా కొన్ని మాత్రం ఆమోదయోగ్యంగా లేవని పేర్కొంది. -
70 ఏళ్లకు ఎందుకు తప్పుకోరు?
బీసీసీఐ సభ్యులకు సుప్రీం ప్రశ్న న్యూఢిల్లీ: జస్టిస్ ఆర్ఎం లోధా కమిటీ పేర్కొన్న గరిష్ట వయస్సు ప్రతిపాదనను బీసీసీఐ వ్యతిరేకిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ రోజుల్లో రాజకీయ నాయకులు 70 ఏళ్లకు రిటైర్మెంట్ తీసుకుంటుండగా బోర్డు ఆఫీస్ బేరర్లు మాత్రం ఆ నియమాన్ని ఎందుకు పాటించరని దేశ అత్యున్నత న్యాయస్థానం ప్రశ్నించింది. లోధా ప్యానెల్ సూచించిన కొన్ని ప్రతిపాదనలను అమలు చేయడం సాధ్యం కాదని తమిళనాడు క్రికెట్ సంఘం తరఫు వాదనలపై సుప్రీం విచారణ జరిపింది. అసలు 60 ఏళ్లకే పదవి నుంచి వైదొలగాలి. ప్రస్తుతం నాయకులను బలవంతంగానైనా 70 ఏళ్లకు రిటైర్ అయ్యేలా చేస్తున్నారు. మరి బీసీసీఐ అధికారులు మాత్రం ఎందుకు ఇలా చేయరు. అంతకుమించి వయస్సు కలిగిన వారు తమ అనుభవంతో సలహాదారుని పాత్ర పోషిస్తే చాలు. దాల్మి యా 75 ఏళ్ల వయస్సులో అసలు సరిగా మాట్లాడే స్థితిలో కూడా లేరు. ఇలాంటి స్థితిలో బోర్డు కార్యకలాపాలు ఎలా సాగుతాయి?’ అని చీఫ్ జస్టిస్ టీఎస్ ఠాకూర్‌తో కూడిన బెంచ్ ప్రశ్నించింది. -
ప్రక్షాళనకు మార్గం
ఎవరి అజమాయిషీ లేకుండా, ఎవరికీ జవాబుదారీకాకుండా కొందరు పెద్దల ఇష్టారాజ్యంగా సాగుతున్న భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ)పై జస్టిస్ ఆర్ఎం లోధా నేతృత్వంలోని కమిటీ కొరడా ఝళిపించింది. నిలువెల్లా లోపాలతో లుకలుకలాడుతున్న బోర్డు సమూల ప్రక్షాళనకు విలువైన సూచనలు చేస్తూ సుప్రీంకోర్టుకు సవివరమైన నివేదికను సమర్పించింది. ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)లో బయటపడి సంచలనం రేపిన స్పాట్ ఫిక్సింగ్ కుంభకోణం నేపథ్యంలో సుప్రీంకోర్టు నిరుడు జనవరిలో ఈ కమిటీని నియమించింది. కమిటీ ఇచ్చిన 159 పేజీల నివేదిక అనేక అంశాలను స్పృశించింది. క్రియకొచ్చేసరికి వీటిలో ఎన్ని సిఫార్సులు అమల్లోకొస్తాయి...ఏమేరకు బోర్డు బాగుపడుతుందన్న సంగతలా ఉంచితే కమిటీ ప్రస్తావించిన అనేక అంశాలు విస్తృతమైన చర్చకు దోహదపడతాయి. వాటిలో కొన్నయినా అమలు చేయగలిగితే ఆ క్రీడకు విశ్వసనీయత లభిస్తుంది. అయితే బెట్టింగ్‌ను చట్టబద్ధం చేయాలన్న సిఫార్సు వివాదాస్పదమైనదే. ‘మర్యాదస్తుల ఆట’గా మన్నన పొందిన క్రికెట్ క్రీడలోకి ప్రతిభావంతుల్ని ఆకర్షించి అంతర్జాతీయంగా మన దేశానికి కీర్తిప్రతిష్టలు తీసుకు రావడానికి కృషి చేయాల్సిన బోర్డు పెద్దలు...నిరంతరం ఎత్తులూ పెయైత్తులతో తమ తమ పీఠాలను పటిష్టం చేసుకోవడానికే శ్రమిస్తున్నారన్నది వాస్తవం. ఒక్కమాటలో దేశం పరువుతో వారు ఇష్టానుసారం ఆడుకుంటున్నారు. ఫలితంగా కుంభకోణాలు గుప్పుమంటున్నాయి. బోర్డును ముసురుకున్న అనేకానేక ఆరోపణలపై లోధా కమిటీ దృష్టిసారిం చింది. వాటికి దారితీసిన పరిస్థితులను మార్చడానికి అనువైన విధివిధానాలను సూచించింది. బీసీసీఐలోగానీ, రాష్ట్ర స్థాయి క్రికెట్ సంఘాల్లోగానీ 70 ఏళ్ల వయసు పైబడినవారి సారథ్యం ఉండరాదన్నది ముఖ్యమైన సిఫార్సు. ఒక రాష్ట్రానికి ఒక సంఘం ఉండాలి తప్ప నగరం పేరిటో, ప్రాంతం పేరిటో సంఘాలు, వాటికి ఓటింగ్ హక్కులూ కుదరవని చెప్పింది. బోర్డు కార్యనిర్వాహక పదవుల్లో దేనికైనా ఒక సభ్యుడు గరిష్టంగా మూడుసార్లు మాత్రమే ఎన్నిక కావొచ్చుననీ, కానీ ప్రతి దఫాకూ విరామం పాటించాలనీ సూచించింది. అధ్యక్ష పదవికి సంబంధించినం తవరకూ ఆ పదవిలో మూడేళ్ల చొప్పున రెండు దఫాలు మాత్రమే ఎవరైనా ఉండొచ్చునని, ఆ తర్వాత వారు మరే పదవీ చేపట్టరాదని పేర్కొంది. ఒక వ్యక్తి బహుళ పదవుల్ని ఏకకాలంలో చలాయించడం చెల్లదని చెప్పింది. మంత్రులుగా ఉండేవారూ, ఇతరత్రా ప్రభుత్వ పదవుల్లో ఉండేవారూ బీసీసీఐలో ఎలాంటి పదవులూ స్వీకరించరాదని తెలిపింది. జాతీయ ఎంపిక కమిటీలో ముగ్గురు సభ్యు లుండాలనీ, వారు మాజీ టెస్ట్ క్రికెటర్లే అయి ఉండాలనీ స్పష్టం చేసింది. బీసీసీఐని సమాచార హక్కు చట్టం పరిధిలోకి తీసుకురావాలని సూచించింది. బోర్డు నిర్వ హణ కంపెనీ స్థాయిలో ఉండాలని, రోజువారీ వ్యవహారాల కోసం సీఈఓను నియమించాలన్నది. అధ్యక్షుడికి ఇప్పుడుండే మూడు ఓట్లకు బదులు రెండు ఓట్లే ఉండాలనీ...తాను ప్రాతినిధ్యంవహించే సంఘం తరఫున ఉండే ఓటు కాక ఫలితం టై అయినప్పుడు మరో ఓటు వినియోగించుకోవచ్చునని తెలిపింది. అధ్యక్షత వహించినందుకుండే ఓటు రద్దు చేయాలని ప్రతిపాదించింది. ఈ సిఫార్సులన్నీ ఎంతో కీలకమైనవి. వీటిల్లో చాలా భాగం ఇప్పుడు పీఠాధిపతులుగా ఉంటున్న వారికి ఎసరు తెచ్చేవే. 70 ఏళ్ల వయో పరిమితిని ఒప్పుకుంటే శరద్ పవార్, శ్రీనివాసన్, నిరంజన్ షా, ఐఎస్ బింద్రా వంటివారు బోర్డు వైపు కన్నెత్తి చూడలేరు. రాష్ట్రానికొక క్రికెట్ సంఘం ఉండాలనడమూ ముఖ్యమైనదే. అలాగే ఇంతవరకూ బీసీసీఐకి కలలోనైనా రాని ఆలోచనను కమిటీకి తెరపైకి తీసుకొచ్చింది. బోర్డులో మహిళలకు కూడా తగిన స్థానం ఇవ్వాలని సిఫార్సు చేసింది. మన మహిళా క్రికెటర్లు ఆటలో ఎంతో ప్రతిభను ప్రదర్శిస్తున్నారు. దేశానికి పేరుప్రతిష్టలు తీసు కొస్తున్నారు. అయినా మహిళా క్రికెటర్లకు ఇవ్వాల్సిన ప్రోత్సాహం గురించీ, అందు కవసరమైన చర్యలగురించీ దృష్టిపెట్టే దిక్కులేదు. అయితే బెట్టింగ్‌ను చట్టబద్ధం చేయాలన్న కమిటీ చేసిన ప్రతిపాదన వివా దాస్పదమైనది. ఇది అమలైనంత మాత్రాన మ్యాచ్ ఫిక్సింగ్, స్పాట్ ఫిక్సింగ్ వంటివి పోతాయనుకోవడం భ్రమే. బెట్టింగ్‌లవల్ల ఫిక్సింగ్‌లు పోవడం మాట అటుంచి అవి మరింత వికృతరూపం తీసుకోవచ్చుకూడా. ఇప్పటికే గుర్రప్పం దాలూ, లాటరీల వంటి బెట్టింగ్‌లవల్ల కొంపలు గుల్లవుతున్నాయని అనేకులు ఆందోళనపడుతున్నారు. వాటిని నిషేధించాలన్న డిమాండ్ పెరుగుతున్నది. ఈ నేపథ్యంలో క్రికెట్‌లాంటి జనాకర్షణ క్రీడకు దాన్ని అంటిస్తే మధ్యతరగతి, పేద జనం అందులో కొట్టుకుపోవడం ఖాయం. రాత్రికి రాత్రే శ్రీమంతులం కావాలన్న పేరాశతో అనేకులు తమ ఆదాయాన్ని కాస్తా అందులో తగలేసి కుటుంబాల్ని రోడ్డున పడేసే ప్రమాదం ఉంటుంది. దావూద్ ఇబ్రహీంవంటి డాన్లు తమ ముఠాలద్వారా బుకీలనూ, వారి మనుషుల్ని జిల్లాల్లో నడిపిస్తూ బెట్టింగ్‌ల్లో ఏటా కోట్లాది రూపాయలు ఆర్జిస్తున్నారన్నది నిజమే. అలాంటి ఆర్ధిక నేరాల వెన్ను విరగాలంటే బహుళవిధ చర్యలు అవసరమవుతాయి. ఫిక్సింగ్‌లకు పాల్పడి క్రికెట్‌కు కళంకం తెచ్చే క్రీడాకారులు మొదలుకొని ఈ నేరానికి దోహదపడే ప్రతి ఒక్కరిపైనా పటిష్టమైన నిఘా వేయడం అవసర మవుతుంది. అలాంటి నేరాలపై సత్వర విచారణ జరిగి కఠినమైన శిక్షలుపడేలా చేయగలగాలి. బెట్టింగ్‌ను నిరోధించలేం గనుక దాన్ని చట్టబద్ధం చేయాలను కోవడం సరైన ఆలోచన కాదు. ఏదేమైనా జస్టిస్ లోధా కమిటీ సిఫార్సులపై కూలంకషంగా చర్చ జరగాలి. అందులో ఆచరణయోగ్యమైన సిఫార్సులను అమలు చేసి బీసీసీఐ పనితీరులో పారదర్శకత తీసుకురాగలిగితే, వృత్తి నైపుణ్యం పెరగడంతోపాటు క్రికెట్‌కు మళ్లీ విశ్వసనీయత కలుగుతుంది. దేశంలో క్రీడా సంస్కృతి వెల్లివిరుస్తుంది.