జస్టిస్ ఆర్‌ఎం లోధా కమిటీ పేర్కొన్న గరిష్ట వయస్సు ప్రతిపాదనను బీసీసీఐ వ్యతిరేకిస్తున్న విషయం తెలిసిందే.
బీసీసీఐ సభ్యులకు సుప్రీం ప్రశ్న
న్యూఢిల్లీ: జస్టిస్ ఆర్‌ఎం లోధా కమిటీ పేర్కొన్న గరిష్ట వయస్సు ప్రతిపాదనను బీసీసీఐ వ్యతిరేకిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ రోజుల్లో రాజకీయ నాయకులు 70 ఏళ్లకు రిటైర్మెంట్ తీసుకుంటుండగా బోర్డు ఆఫీస్ బేరర్లు మాత్రం ఆ నియమాన్ని ఎందుకు పాటించరని దేశ అత్యున్నత న్యాయస్థానం ప్రశ్నించింది. లోధా ప్యానెల్ సూచించిన కొన్ని ప్రతిపాదనలను అమలు చేయడం సాధ్యం కాదని తమిళనాడు క్రికెట్ సంఘం తరఫు వాదనలపై సుప్రీం విచారణ జరిపింది.
అసలు 60 ఏళ్లకే పదవి నుంచి వైదొలగాలి. ప్రస్తుతం నాయకులను బలవంతంగానైనా 70 ఏళ్లకు రిటైర్ అయ్యేలా చేస్తున్నారు. మరి బీసీసీఐ అధికారులు మాత్రం ఎందుకు ఇలా చేయరు. అంతకుమించి వయస్సు కలిగిన వారు తమ అనుభవంతో సలహాదారుని పాత్ర పోషిస్తే చాలు. దాల్మి యా 75 ఏళ్ల వయస్సులో అసలు సరిగా మాట్లాడే స్థితిలో కూడా లేరు. ఇలాంటి స్థితిలో బోర్డు కార్యకలాపాలు ఎలా సాగుతాయి?’ అని చీఫ్ జస్టిస్ టీఎస్ ఠాకూర్‌తో కూడిన బెంచ్ ప్రశ్నించింది.