లోధా ప్యానెల్ ప్రతిపాదనలపై బీసీసీఐ
కోర్టులో పోరాటానికే సిద్ధం
న్యూఢిల్లీ: జస్టిస్ ఆర్‌ఎం లోధా కమిటీ సూచించిన సంస్కరణల అమలుపై బీసీసీఐ మరోసారి పోరాటానికే సిద్ధమవుతోంది. ప్యానెల్ సూచించినట్టుగా అన్నింటినీ అమలు చేయాల్సిందేనని ఇప్పటికే సుప్రీం కోర్టు తేల్చి చెప్పినా కూడా భారత క్రికెట్ బోర్డు మాత్రం తమ పట్టు వీడడం లేదు. శనివారం జరిగిన తమ ప్రత్యేక సర్వసభ్య సమావేశంలోనూ సభ్యుల మధ్య ఇదే అభిప్రాయం వ్యక్తమైంది. ముఖ్యంగా ఒక రాష్ట్రం ఒక ఓటు, ఒక వ్యక్తికి ఒకే పదవి, గరిష్ట వయస్సు పరిమితి, కూలింగ్ ఆఫ్ పీరియడ్ నిబంధనలపై బోర్డు సభ్యుల్లో వ్యతిరేకత వ్యక్తమవుతోంది. మరోవైపు సోమవారం ఈ ప్రతిపాదనల విషయంలో సుప్రీం కోర్టు తుది తీర్పునివ్వనుంది.
‘ప్యానెల్ పేర్కొన్న కొన్ని సంస్కరణలు వాస్తవికంగా అమలుకు వీలు కాకుండా ఉన్నారుు. ఇదే విషయమై సోమవారం మా లీగల్ కౌన్సిల్ కపిల్ సిబల్ కోర్టులో వాదనలు కొనసాగిస్తారు’ అని సీనియర్ బోర్డు అధికారి ఒకరు తెలిపారు. అలాగే అనురాగ్ ఠాకూర్ సోమవారం తన అఫిడవిట్ దాఖలు చేస్తారని చెప్పారు. ఇదిలావుండగా సస్పెన్షన్‌లో ఉన్న రాజస్తాన్ క్రికెట్ సంఘం డిప్యూటీ ప్రెసిడెంట్ మెహమూద్ అబ్ది ఎస్‌జీఎంలో పాల్గొనడంతో పాటు కార్యదర్శి షిర్కేను కలుసుకున్నారు.