ప్రక్షాళనకు మార్గం | editorial on Justice RM Lodha committee Cleansing to BCCI | Sakshi
Sakshi News home page

ప్రక్షాళనకు మార్గం

Published Wed, Jan 6 2016 1:00 AM | Last Updated on Mon, Jul 29 2019 7:43 PM

ప్రక్షాళనకు మార్గం - Sakshi

ప్రక్షాళనకు మార్గం

ఎవరి అజమాయిషీ లేకుండా, ఎవరికీ జవాబుదారీకాకుండా కొందరు పెద్దల ఇష్టారాజ్యంగా సాగుతున్న భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ)పై జస్టిస్ ఆర్‌ఎం లోధా నేతృత్వంలోని కమిటీ కొరడా ఝళిపించింది. నిలువెల్లా లోపాలతో లుకలుకలాడుతున్న బోర్డు సమూల ప్రక్షాళనకు విలువైన సూచనలు చేస్తూ సుప్రీంకోర్టుకు సవివరమైన నివేదికను సమర్పించింది. ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)లో బయటపడి సంచలనం రేపిన స్పాట్ ఫిక్సింగ్ కుంభకోణం నేపథ్యంలో సుప్రీంకోర్టు నిరుడు జనవరిలో ఈ కమిటీని నియమించింది. కమిటీ ఇచ్చిన 159 పేజీల నివేదిక అనేక అంశాలను స్పృశించింది.

క్రియకొచ్చేసరికి వీటిలో ఎన్ని సిఫార్సులు అమల్లోకొస్తాయి...ఏమేరకు బోర్డు బాగుపడుతుందన్న సంగతలా ఉంచితే కమిటీ ప్రస్తావించిన అనేక అంశాలు విస్తృతమైన చర్చకు దోహదపడతాయి. వాటిలో కొన్నయినా అమలు చేయగలిగితే ఆ క్రీడకు విశ్వసనీయత లభిస్తుంది. అయితే బెట్టింగ్‌ను చట్టబద్ధం చేయాలన్న సిఫార్సు వివాదాస్పదమైనదే. ‘మర్యాదస్తుల ఆట’గా మన్నన పొందిన క్రికెట్ క్రీడలోకి ప్రతిభావంతుల్ని ఆకర్షించి అంతర్జాతీయంగా మన దేశానికి కీర్తిప్రతిష్టలు తీసుకు రావడానికి కృషి చేయాల్సిన బోర్డు పెద్దలు...నిరంతరం ఎత్తులూ పెయైత్తులతో తమ తమ పీఠాలను పటిష్టం చేసుకోవడానికే శ్రమిస్తున్నారన్నది వాస్తవం. ఒక్కమాటలో దేశం పరువుతో వారు ఇష్టానుసారం ఆడుకుంటున్నారు. ఫలితంగా కుంభకోణాలు గుప్పుమంటున్నాయి.
 
బోర్డును ముసురుకున్న అనేకానేక ఆరోపణలపై లోధా కమిటీ దృష్టిసారిం చింది. వాటికి దారితీసిన పరిస్థితులను మార్చడానికి అనువైన విధివిధానాలను సూచించింది. బీసీసీఐలోగానీ, రాష్ట్ర స్థాయి క్రికెట్ సంఘాల్లోగానీ 70 ఏళ్ల వయసు పైబడినవారి సారథ్యం ఉండరాదన్నది ముఖ్యమైన సిఫార్సు. ఒక రాష్ట్రానికి ఒక సంఘం ఉండాలి తప్ప నగరం పేరిటో, ప్రాంతం పేరిటో సంఘాలు, వాటికి ఓటింగ్ హక్కులూ కుదరవని చెప్పింది. బోర్డు కార్యనిర్వాహక పదవుల్లో దేనికైనా ఒక సభ్యుడు గరిష్టంగా మూడుసార్లు మాత్రమే ఎన్నిక కావొచ్చుననీ, కానీ ప్రతి దఫాకూ విరామం పాటించాలనీ సూచించింది.

అధ్యక్ష పదవికి సంబంధించినం తవరకూ ఆ పదవిలో మూడేళ్ల చొప్పున రెండు దఫాలు మాత్రమే ఎవరైనా ఉండొచ్చునని, ఆ తర్వాత వారు మరే పదవీ చేపట్టరాదని పేర్కొంది. ఒక వ్యక్తి బహుళ పదవుల్ని ఏకకాలంలో చలాయించడం చెల్లదని చెప్పింది. మంత్రులుగా ఉండేవారూ, ఇతరత్రా ప్రభుత్వ పదవుల్లో ఉండేవారూ బీసీసీఐలో ఎలాంటి పదవులూ స్వీకరించరాదని తెలిపింది. జాతీయ ఎంపిక కమిటీలో ముగ్గురు సభ్యు లుండాలనీ, వారు మాజీ టెస్ట్ క్రికెటర్లే అయి ఉండాలనీ స్పష్టం చేసింది. బీసీసీఐని సమాచార హక్కు చట్టం పరిధిలోకి తీసుకురావాలని సూచించింది. బోర్డు నిర్వ హణ కంపెనీ స్థాయిలో ఉండాలని, రోజువారీ వ్యవహారాల కోసం సీఈఓను నియమించాలన్నది.

అధ్యక్షుడికి ఇప్పుడుండే మూడు ఓట్లకు బదులు రెండు ఓట్లే ఉండాలనీ...తాను ప్రాతినిధ్యంవహించే సంఘం తరఫున ఉండే ఓటు కాక ఫలితం టై అయినప్పుడు  మరో ఓటు వినియోగించుకోవచ్చునని తెలిపింది. అధ్యక్షత వహించినందుకుండే ఓటు రద్దు చేయాలని ప్రతిపాదించింది. ఈ సిఫార్సులన్నీ ఎంతో కీలకమైనవి. వీటిల్లో చాలా భాగం ఇప్పుడు పీఠాధిపతులుగా ఉంటున్న  వారికి ఎసరు తెచ్చేవే. 70 ఏళ్ల వయో పరిమితిని ఒప్పుకుంటే శరద్ పవార్, శ్రీనివాసన్, నిరంజన్ షా, ఐఎస్ బింద్రా వంటివారు బోర్డు వైపు కన్నెత్తి చూడలేరు. రాష్ట్రానికొక క్రికెట్ సంఘం ఉండాలనడమూ ముఖ్యమైనదే. అలాగే ఇంతవరకూ బీసీసీఐకి కలలోనైనా రాని ఆలోచనను కమిటీకి తెరపైకి తీసుకొచ్చింది. బోర్డులో మహిళలకు కూడా తగిన స్థానం ఇవ్వాలని సిఫార్సు చేసింది. మన మహిళా క్రికెటర్లు ఆటలో ఎంతో ప్రతిభను ప్రదర్శిస్తున్నారు. దేశానికి పేరుప్రతిష్టలు తీసు కొస్తున్నారు. అయినా మహిళా క్రికెటర్లకు ఇవ్వాల్సిన ప్రోత్సాహం గురించీ, అందు కవసరమైన చర్యలగురించీ దృష్టిపెట్టే దిక్కులేదు.  

అయితే బెట్టింగ్‌ను చట్టబద్ధం చేయాలన్న కమిటీ చేసిన ప్రతిపాదన  వివా దాస్పదమైనది. ఇది అమలైనంత మాత్రాన మ్యాచ్ ఫిక్సింగ్, స్పాట్ ఫిక్సింగ్ వంటివి పోతాయనుకోవడం భ్రమే. బెట్టింగ్‌లవల్ల ఫిక్సింగ్‌లు పోవడం మాట అటుంచి అవి మరింత వికృతరూపం తీసుకోవచ్చుకూడా. ఇప్పటికే గుర్రప్పం దాలూ, లాటరీల వంటి బెట్టింగ్‌లవల్ల కొంపలు గుల్లవుతున్నాయని అనేకులు ఆందోళనపడుతున్నారు. వాటిని నిషేధించాలన్న డిమాండ్ పెరుగుతున్నది. ఈ  నేపథ్యంలో క్రికెట్‌లాంటి జనాకర్షణ క్రీడకు దాన్ని అంటిస్తే మధ్యతరగతి, పేద జనం అందులో కొట్టుకుపోవడం ఖాయం. రాత్రికి రాత్రే శ్రీమంతులం కావాలన్న పేరాశతో అనేకులు  తమ ఆదాయాన్ని కాస్తా అందులో తగలేసి కుటుంబాల్ని రోడ్డున పడేసే ప్రమాదం ఉంటుంది.

దావూద్ ఇబ్రహీంవంటి డాన్‌లు తమ ముఠాలద్వారా బుకీలనూ, వారి మనుషుల్ని జిల్లాల్లో నడిపిస్తూ బెట్టింగ్‌ల్లో ఏటా కోట్లాది రూపాయలు ఆర్జిస్తున్నారన్నది నిజమే. అలాంటి ఆర్ధిక నేరాల వెన్ను విరగాలంటే బహుళవిధ చర్యలు అవసరమవుతాయి. ఫిక్సింగ్‌లకు పాల్పడి క్రికెట్‌కు కళంకం తెచ్చే క్రీడాకారులు మొదలుకొని ఈ నేరానికి దోహదపడే ప్రతి ఒక్కరిపైనా పటిష్టమైన నిఘా వేయడం అవసర మవుతుంది. అలాంటి నేరాలపై సత్వర విచారణ జరిగి కఠినమైన శిక్షలుపడేలా చేయగలగాలి. బెట్టింగ్‌ను నిరోధించలేం గనుక దాన్ని చట్టబద్ధం చేయాలను కోవడం సరైన ఆలోచన కాదు. ఏదేమైనా జస్టిస్ లోధా కమిటీ సిఫార్సులపై కూలంకషంగా చర్చ జరగాలి. అందులో ఆచరణయోగ్యమైన సిఫార్సులను అమలు చేసి బీసీసీఐ పనితీరులో పారదర్శకత తీసుకురాగలిగితే, వృత్తి నైపుణ్యం పెరగడంతోపాటు క్రికెట్‌కు మళ్లీ విశ్వసనీయత కలుగుతుంది. దేశంలో క్రీడా సంస్కృతి వెల్లివిరుస్తుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement