వెన్నులో వణుకుపుట్టించిన ఘటన.. నూర్‌పై కిరాతకం
మరో ఘోర ఘటన అంతర్జాతీయ సమాజంలో ఆడవాళ్ల భద్రత-రక్షణల మీద చర్చకు దారి తీసింది. నూర్ ముకదమ్ అనే యువతిని అతికిరాతకంగా హత్య ఘటన పాక్ అట్టుడుకిపోయేలా చేస్తోంది. పాక్ మాజీ దౌత్యవేత్త కూతురైన నూర్‌ను ఆమె స్నేహితులే క్రూరంగా హింసించి చంపారు. అయితే ఈ కేసులో ప్రధాన నిందితుడి మానసిక స్థితి బాగోలేదని పోలీసులు చేసిన ప్రకటనపై పెద్ద ఎత్తున్న దుమారం రేపుతోంది. #Justicefornoor హ్యాష్‌ట్యాగ్ సోషల్ మీడియాలో ప్రకంపనలు సృష్టిస్తోంది.
నూర్ ముకదమ్.. పాకిస్థాన్ మాజీ దౌత్యవేత్త షౌకత్ ముకదమ్ కూతురు. గతంలో ఆయన సౌత్ కొరియా, కజకస్థాన్‌లకు రాయబారిగా పని చేశారు. ఈయన కూతురు నూర్(27).. మంగళవారం రాత్రి ఇస్లామ్‌బాద్ సెక్టార్ ఎఫ్-7/4లోని ఓ ఇంట్లో ఘోర హత్యకు గురైంది. ఆ ఇల్లు ఆమె స్నేహితుడు జహీర్ జకీర్ జాఫర్‌ది. అయితే ఈ హత్య జహీర్ చేసిందనేనని నిర్ధారించిన పోలీసులు.. శనివారం దాకా అతన్ని అరెస్ట్ చేయలేదు. అంతేకాదు అతని మానసిక స్థితి సరిగాలేదని, అతన్ని చికిత్స కోసం తరలించాలని ఇస్లామాబాద్ పోలీసులు కోర్టును ఆశ్రయించడంపై జనాల్లో ఆగ్రహావేశాలు రాజుకున్నాయి. వేల సంఖ్యలో బ్యానర్లు చేతబడ్డి రోడ్డెక్కి నిరసన వ్యక్తం చేస్తున్నారు.
రెండు రోజుల్లో వస్తా!
మంగళవారం ఉదయం బక్రీద్ కోసమని గొర్రెను కొనడానికి రావల్పిండికి వెళ్లాడు షౌకత్. ఆయన భార్య కొత్త బట్ల కోసం బయలకు వెళ్లింది. వచ్చి చూసేసరికి కూతురు ఇంట్లో లేదు. తన స్నేహితులతో బయటకు వెళ్తున్నానని, ఒకటి రెండు రోజుల్లో తిరిగి వస్తానని చెప్పిందామె. మంగళవారం మధ్యాహ్నం నూర్ ఫోన్ స్విచ్ఛాఫ్ రాగా.. ఆమె తన దగ్గర లేదని జకీర్ బదులిచ్చాడు. అదేరోజు రాత్రి ఆమె మృతదేహం దొరికినట్లు ఖోహ్‌సర్ పోలీసులు షౌకత్‌కు సమాచారం అందించారు.
తగలబెట్టి.. గొంతు కోసి
నూర్ ముకదమ్ పోస్ట్ మార్టం రిపోర్ట్‌లో విస్తుపోయే విషయాలు వెలుగుచూశాయి. బతికుండగానే ఆమెను చిత్రవధ చేశారు. ఆమె ఒంటిపై అన్ని చోట్లా కత్తి గాట్లు పెట్టారు. సూదులతో వీపులో గుచ్చారు. జుట్టు కత్తించేశారు. ఆపై ఆమె శరీరాన్ని తగలబెట్టి.. పదునైన ఆయుధంతో పీక కోశారు. తల, మొండాన్ని వేరు చేసి.. దూరంగా పడేశారు. ఈ పైశాచిక ఘటన ఒక్కసారిగా పాక్ ఉలిక్కిపడింది. అయితే అత్యాచారానికి గురైందన్న బాధితురాలి తండ్రి షౌకత్ అనుమానాలపై డాక్టర్ల నుంచి పోలీసుల నుంచి ఎలాంటి సమాచారం అందలేదు. మరోవైపు ఈ ఘటన యావత్ దేశాన్ని దిగ్భ్రాంతికి గురి చేసింది. బాధితురాలికి న్యాయం జరగాలని, నిందితుడిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ ఉద్యమిస్తున్నారు. రాజకీయ ఒత్తిళ్ల నేపథ్యంలో జకీర్‌ను శనివారం అరెస్ట్ చేశారు. పరారీలో ఉన్న మరో నిందితుడి కోసం గాలిస్తున్నారు.
The barbaric murder of young woman, Noor, in Islamabad is yet another horrifying reminder that women have been & are brutalized & killed with impunity. This must end. We are committed to ensuring no one is above the law & culprits having influence & power cannot simply "get away"
— Shireen Mazari (@ShireenMazari1) July 21, 2021
పలుకుబడితో..
ఇస్లామాబాద్‌లో ఓ పెద్ద కార్పొరేట్ కంపెనీకి సీఈవో జకీర్ జాఫర్. అతని కొడుకే జహీర్ జకీర్ జాఫర్.. పైగా జహీర్ కొన్నాళ్లు అమెరికాలో ఉండొచ్చాడు. జహీర్ జకీర్ జాఫర్ మానసిక స్థితి బాగానే ఉందని, పోలీసులు తప్పుదోవపట్టిస్తున్నారని, రాజకీయ పలుకుబడితో బయటపడే ప్రయత్నం చేస్తున్నారని జనాలు ఆరోపిస్తున్నారు. అయితే నిందితుడు ఎట్టి పరిస్థితుల్లో తప్పించుకోలేడని, కఠినంగా శికక్షించి తీరతామని కేంద్ర మంత్రులు హామీ ఇస్తున్నారు.