J.V.Ramudu
-
'ఏపీలో మావోయిస్టుల ప్రభావం తగ్గింది'
కర్నూలు: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రోడ్డు ప్రమాదాల నియంత్రణపై ప్రత్యేక దృష్టి పెట్టిందని డీజీపీ రాముడు తెలిపారు. ఆయన సోమవారమిక్కడ మాట్లాడుతూ ఏపీలో మావోయిస్టుల ప్రభావం తగ్గిందన్నారు. నకిలీ మావోయిస్టులు ఎక్కువయ్యారని డీజీపీ వ్యాఖ్యానించారు. ఎర్ర చందనం, ఇసుక అక్రమ రవాణా నియంత్రించేందుకు టాస్క్‌ఫోర్స్ ఏర్పాటు చేసినట్లు డీజీపీ రాముడు తెలిపారు. -
ఫ్యాక్షనిజంపై ఉక్కుపాదం మోపండి
కర్నూలు : ఫ్యాక్షనిజంపై ఉక్కుపాదం మోపాలని డీజీపీ జె.వి.రాముడు రాయలసీమ పోలీసు అధికారులను ఆదేశించారు. స్వాతంత్య్ర వేడుకల ఏర్పాట్లను పరిశీలించేందుకు కర్నూలుకు వచ్చిన ఆయన సోమవారం సాయంత్రం జిల్లా పోలీసు కార్యాలయంలో రాయలసీమ అధికారులతో సమావేశమయ్యారు. పోలీసు శాఖలో ఇటీవల బదిలీలు చేపట్టడం.. రాయలసీమలో అందరూ కొత్త ఎస్పీలు కావడంతో సమావేశంలో వారితో జిల్లాల్లోని శాంతి భద్రతలపై చర్చించారు. ఫ్యాక్షనిస్టుల పట్ల కఠినంగా వ్యవహరించాలని ఆదేశించారు. శాంతి భధ్రతలకు విఘాతం కలిగించేలా ఎవరు వ్యవహరించినా ఉపేక్షించవద్దని సూచించారు. ముఖ్యంగా ఫ్యాక్షన్ ప్రభావిత గ్రామాలపై నిరంతరం నిఘా ఏర్పాటు చేయాలన్నారు. స్వాతంత్య్ర వేడుకల సందర్భంగా అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా ముందస్తు చర్యలు చేపట్టాలన్నారు. అనంతరం కర్నూలు, వైఎస్సార్ కడప, అనంతపురం, చిత్తూరు జిల్లాల్లో నమోదైన ఎర్ర చందనం అక్రమ రవాణా కేసుల విషయంపై ఆరా తీశారు. అటవీ శాఖ అధికారుల సమన్వయంతో కేసుల పరిష్కారానికి తక్షణ చర్యలు చేపట్టాలని సూచించారు. సమావేశంలో కర్నూలు రేంజ్ డీఐజీ మురళీకృష్ణ, అనంతపురం డీఐజీ బాలకృష్ణ, కర్నూలు, చిత్తూరు, అనంతపురం, కడప, తిరుపతి అర్బన్ ఎస్పీలు ఆకే రవికృష్ణ, శ్రీనివాసరావు, రాజశేఖర్‌బాబు, నవీన్ గులాఠి, గోపీనాథ్ జట్టీ తదితరులు పాల్గొన్నారు. -
'డీజీపీ అండ చూసుకుని రెచ్చిపోతున్నారు'
ఆంధ్రప్రదేశ్ డీజీపీ జె.వి.రాముడిపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి శనివారం అనంతపురంలో నిప్పులు చెరిగారు.వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయాన్ని జీర్ణించుకోలేక బత్తనపల్లిలో తమ పార్టీ కార్యకర్తలపై రాళ్ల దాడికి దిగారని ఆయన విమర్శించారు. ఆ దాడికి పాల్పడింది డీజీపీ బంధువులే అని ఆయన ఆరోపించారు. ఆ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేసిన వారు చూసి చూడనట్లుగా వ్యవహరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. డీజీపీ అండ చూసుకుని టీడీపీ ఎమ్మెల్యే వరదాపురం సూరి రెచ్చిపోతున్నారని ఆరోపించారు. జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు, కార్యకర్తలపై దాడులు పెచ్చురిల్లాయని వెల్లడించారు. అంతేకాకుండా తమ పార్టీ కార్యకర్తలపై అక్రమ కేసులు బనాయిస్తున్నారని విమర్శించారు.