Jwala-Ashwini
-
రెండో రౌండ్లో జ్వాల జోడి
ఇండోనేసియా బ్యాడ్మింటన్ జకర్తా: భారత స్టార్ డబుల్స్ ప్లేయర్ జ్వాల-అశ్విని జోడి.... ఇండోనేసియా సూపర్ సిరీస్ ప్రీమియర్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో రెండో రౌండ్లోకి ప్రవేశించింది. బుధవారం జరిగిన మహిళల డబుల్స్ తొలిరౌండ్లో జ్వాల-అశ్విని 21-7, 20-22, 21-10తో ద్విపుజి కుసుమ-రిబ్కా సుగియార్తో (ఇండోనేసియా)పై గెలిచారు. 39 నిమిషాల పాటు జరిగిన ఈ మ్యాచ్‌లో భారత ద్వయం రెండో గేమ్ చేజార్చుకున్నా.... కీలక సమయంలో బాగా పుంజుకుంది. పురుషుల డబుల్స్ తొలిరౌండ్లో మను అత్రి-సుమీత్ రెడ్డి 21-13, 21-16తో పీటర్ గాబ్రియెల్-అల్విన్ మోరాడా (ఫిలిప్పిన్స్)పై నెగ్గి తదుపరి రౌండ్లోకి అడుగుపెట్టారు. పురుషుల సింగిల్స్‌లో మాత్రం సమీర్ వర్మకు చుక్కెదురైంది. 11-21, 13-21తో రెండోసీడ్ లీ చోంగ్ వీ (మలేసియా) చేతిలో పరాజయం చవిచూశాడు. -
క్వార్టర్స్‌లో సింధు, ప్రణయ్
► జ్వాల-అశ్విని జంట కూడా ► చైనా మాస్టర్స్ టోర్నీ జియాంగ్సు (చైనా): సింగిల్స్‌లో బరిలో ఉన్న ఏకైక భారత క్రీడాకారిణి పీవీ సింధు చైనా మాస్టర్స్ గ్రాండ్‌ప్రి గోల్డ్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో క్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లింది. గురువారం జరిగిన మహిళల సింగిల్స్ ప్రిక్వార్టర్ ఫైనల్లో ప్రపంచ పదో ర్యాంకర్ సింధు 21-9, 21-17తో చియెన్ హు యు (చైనీస్ తైపీ)పై అలవోకగా గెలిచింది. శుక్రవారం జరిగే క్వార్టర్ ఫైనల్లో ప్రపంచ 18వ ర్యాంకర్ పోర్న్‌టిప్ బురానాప్రాసెర్ట్సుక్ (థాయ్‌లాండ్)తో సింధు తలపడుతుంది. ముఖాముఖి రికార్డులో సింధు 5-3తో ఆధిక్యంలో ఉంది. మరోవైపు పురుషుల సింగిల్స్ విభాగంలో ఏడో సీడ్ హెచ్ఎస్ ప్రణయ్ కూడా క్వార్టర్ ఫైనల్లోకి అడుగుపెట్టాడు. ప్రిక్వార్టర్ ఫైనల్లో ప్రణయ్ 21-10, 21-15తో డారెన్ లూ (మలేసియా)ను ఓడించాడు. శుక్రవారం జరిగే క్వార్టర్ ఫైనల్లో ప్రపంచ నంబర్‌వన్ చెన్ లాంగ్ (చైనా)తో ప్రణయ్ ఆడతాడు. మహిళల డబుల్స్ విభాగంలో గుత్తా జ్వాల-అశ్విని పొన్నప్ప ద్వయం ముందంజ వేసింది. ప్రిక్వార్టర్ ఫైనల్లో జ్వాల-అశ్విని 21-12, 21-12తో సెయి పె చెన్-వు తి జుంగ్ (చైనీస్ తైపీ) లపై విజయం సాధించారు. పురుషుల డబుల్స్ ప్రిక్వార్టర్ ఫైనల్లో ప్రణవ్ చోప్రా-అక్షయ్ దేవాల్కర్ ద్వయం 17-21, 12-21తో వాంగ్ యిల్యు-జాంగ్ వెన్ (చైనా) జంట చేతిలో ఓడిపోయింది. -
మూడు జోడీలు క్వార్టర్స్‌కు...
ఆక్లాండ్: న్యూజిలాండ్ ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నీలో భారత్ నుంచి మూడు జోడీలు క్వార్టర్‌ఫైనల్‌కు చేరుకున్నాయి. మహిళల డబుల్స్ ప్రిక్వార్టర్స్‌లో నాలుగోసీడ్ జ్వాల-అశ్విని 10-21, 23-21, 21-15తో మయు మత్సుముటో-వాకన నగహారా (జపాన్)పై నెగ్గారు. పురుషుల డబుల్స్ ప్రిక్వార్టర్స్‌లో మను అత్రి-సుమీత్ రెడ్డి 21-15, 21-16తో రోనెల్ స్టానిస్లావో-పాల్ జెఫర్సన్ (ఫిలిప్పీన్స్)పై గెలవగా; ప్రణవ్-అక్షయ్ దివాల్కర్ 14-21, 17-21తో ఏడోసీడ్ చెన్ హుంగ్ లింగ్-చి లిన్ వాంగ్ (చైనీస్ తైపీ) చేతిలో ఓడారు. మిక్స్డ్ డబుల్స్ ప్రిక్వార్టర్స్‌లో ప్రణవ్ చోప్రా-సిక్కి రెడ్డి 21-16, 21-13తో టకుటో ఇనోయ్-నరు షినోయా (జపాన్)లపై నెగ్గి క్వార్టర్స్‌కు అర్హత సాధించింది. -
పోరాడి ఓడిన జ్వాల-అశ్విని
బిట్బర్జర్ ఓపెన్ సార్బ్రూకెన్ (జర్మనీ): భారత బ్యాడ్మింటన్ డబుల్స్ జోడి జ్వాల-అశ్విని.. బిట్బర్జర్ ఓపెన్ గ్రాండ్‌ప్రి గోల్డ్ టోర్నీలో నిరాశపర్చారు. తొలిరౌండ్లో బై లభించిన ఈ జంట రెండో రౌండ్లో పోరాడి ఓడింది. గురువారం జరిగిన మహిళల డబుల్స్ రెండోరౌండ్లో రెండోసీడ్ జ్వాల-అశ్విని 21-23, 21-13, 24-26తో సమంతా బర్నింగ్-ఐరిస్ టెబ్లింగ్ (నెదర్లాండ్స్) చేతిలో ఓడారు. మరోవైపు పురుషుల సింగిల్స్ రెండోరౌండ్లో బి. సాయి ప్రణీత్ 24-22, 21-17తో ఆండ్రీ కుర్నివాన్ (ఇండోనేసియా)పై నెగ్గి ప్రిక్వార్టర్స్‌లోకి చేరాడు. -
‘టాప్’లోకి జ్వాల, అశ్విని
కేంద్ర క్రీడాశాఖ నిర్ణయం న్యూఢిల్లీ : భారత బ్యాడ్మింటన్ డబుల్స్ మేటి క్రీడాకారిణిలు జ్వాల-అశ్విని జోడిని ‘టార్గెట్ ఒలింపిక్ పోడియం’ (టాప్) స్కీమ్‌లో చేర్చనున్నారు. ఈ మేరకు కేంద్ర క్రీడాశాఖ ప్రణాళికలు సిద్ధం చేసింది. వచ్చే జాబితాలో ఈ ఇద్దరి పేర్లను చేరుస్తామని మంత్రిత్వ శాఖ అధికారి ఒకరు ధ్రువీకరించారు. ‘బ్యాడ్మింటన్ ప్లేయర్స్ కోసం డబుల్స్ కోచ్ ఉండాలని మేం ఆమోద ముద్ర వేశాం. కాబట్టి మేటి ఆటగాళ్లను టాప్‌లోకి తీసుకురావాలని నిర్ణయించాం. ప్రస్తుతం జ్వాల-అశ్విని కంటే మెరుగైన క్రీడాకారిణిలు లేరు. వాళ్లను టాప్‌లో చేరుస్తాం. గోపీచంద్‌పై వాళ్లు అనవసరంగా ఆరోపణలు చేస్తున్నారు. టాప్ సమావేశాల్లో కనీసం ఒక్కసారి కూడా గోపీ వాళ్ల గురించి వ్యతిరేకంగా మాట్లాడలేదు. కేవలం అతని వల్లే మేం డబుల్స్ కోచ్‌ను తీసుకునేందుకు అంగీకరించాం’ అని సదరు అధికారి పేర్కొన్నారు. -
ఎన్నాళ్లకెన్నాళ్లకు...
జ్వాల-అశ్విని జంటకు కెనడా ఓపెన్ టైటిల్ న్యూఢిల్లీ: తన ఘాటైన విమర్శలతో తరచూ వార్తల్లో నిలిచే భారత బ్యాడ్మింటన్ స్టార్ గుత్తా జ్వాల ఈసారి తన అద్వితీయ ఆటతీరుతో ఆకట్టుకుంది. తన భాగస్వామి అశ్విని పొన్నప్పతో కలిసి జ్వాల కెనడా ఓపెన్ గ్రాండ్‌ప్రి టోర్నమెంట్లో డబుల్స్ టైటిల్‌ను సొంతం చేసుకుంది. కెనడాలోని కాల్గరీ పట్టణంలో భారత కాలమానం ప్రకారం ఆదివారం అర్ధరాత్రి దాటాక జరిగిన మహిళల డబుల్స్ ఫైనల్లో మూడో సీడ్ జ్వాల-అశ్విని ద్వయం 21-19, 21-16తో టాప్ సీడ్, ప్రపంచ ఎనిమిదో ర్యాంక్ జంట ఎఫ్‌జి ముస్కెన్స్-సెలెనా పీక్ (నెదర్లాండ్స్)పై సంచలన విజయం సాధించింది. విజేతగా నిలిచిన జ్వాల-అశ్వినిలకు 3,950 డాలర్ల ప్రైజ్‌మనీ (రూ. 2 లక్షల 52 వేలు)తోపాటు 5,500 ర్యాంకింగ్ పాయింట్లు లభించాయి. 2010లో ఢిల్లీ కామన్వెల్త్ గేమ్స్‌లో స్వర్ణ పతకం నెగ్గాక జ్వాల-అశ్విని జంట మరో అంతర్జాతీయ టోర్నమెంట్లో విజేతగా నిలువడం ఇదే తొలిసారి. లండన్‌లో జరిగిన 2011 ప్రపంచ చాంపియన్‌షిప్‌లో ఈ జంట కాంస్య పతకం సాధించింది. 2013లో స్వదేశంలో జరిగిన టాటా ఓపెన్ అంతర్జాతీయ టోర్నీలో... 2014 గ్లాస్గో కామన్వెల్త్ గేమ్స్‌లో జ్వాల-అశ్విని జోడీ రన్నరప్‌గా నిలిచింది. మొత్తానికి నిలకడైన ఆటతీరుతో ఆలస్యంగానైనా ఈ జంట టైటిల్ లోటును తీర్చుకొని మళ్లీ ఫామ్‌లోకి వచ్చింది. ప్రధాని, సీఎం అభినందన: కెనడా గ్రాండ్ ప్రి టైటిల్ సాధించిన జ్వాల జోడీని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు అభినందించారు. -
సెమీస్‌లో జ్వాల జోడి
కాల్గారి (కెనడా) : భారత బ్యాడ్మింటన్ డబుల్స్ జోడి జ్వాల-అశ్విని... కెనడా గ్రాండ్ ప్రి టోర్నీలో సెమీస్‌లోకి దూసుకెళ్లారు. శుక్రవారం అర్ధరాత్రి జరిగిన మహిళల డబుల్స్ క్వార్టర్ఫైనల్లో జ్వాల-అశ్విని 21-19, 21-13తో హాంకాంగ్ ద్వయం చాన్ కాకా-యున్ సిన్ యంగ్లపై నెగ్గారు. మరో మ్యాచ్‌లో ప్రద్నా గాద్రె-సిక్కి రెడ్డి 18-21, 25-23, 15-21తో పున్లాక్ యన్-సి యింగ్ సుయెట్ (హాంకాంగ్)ల చేతిలో ఓడారు. పురుషుల క్వార్టర్స్‌లో 10వ సీడ్ సాయి ప్రణీత్ 13-21, 21-18, 11-21తో లీ చోంగ్ వీ (మలేసియా) చేతిలో; అజయ్ జయరామ్ 16-21, 15-21తో మార్క్ జ్విబ్లెర్ (జర్మనీ) చేతిలో ఓడారు.