‘కంతనపల్లి’కి రూపం
మరో 12 విద్యుదుత్పాదక గేట్లు
ఎల్ఎండీ తరహాలో బ్యారేజీ
ఐదు గ్రామాలకు ముంపు ముప్పు
ఛత్తీస్‌గఢ్‌తో సమస్యలు ఉత్పన్నం కాకుండా జాగ్రత్తలు
సర్కార్‌కు డీపీఆర్ అందజేత
రేపో.. మాపో ఆమోదముద్ర
హన్మకొండ : కంతనపల్లి బహుళార్థ సాధక ప్రాజెక్ట్ రూపురేఖలు సంతరించుకుంది. ఎట్టకేలకు నీటిపారుదల శాఖ అధికారులు ప్రాజెక్ట్ మ్యాప్ ఖరారు చేశారు. కంతనపల్లి నిర్మాణానికి సంబంధించి సుమారు ఆరు నెలలపాటు సర్వే చేసిన అధికారులు... డిటైల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ (డీపీఆర్) తయూరు చేసి ఇటీవల రాష్ట్ర ప్రభుత్వానికి అందజేశారు. బ్యారేజీ ప్రతిపాదనకు సర్కారు అతి త్వరలో గ్రీన్‌సిగ్నల్ ఇవ్వనున్నట్లు అధికారులు చెబుతున్నారు. మొత్తం 131 గేట్లతో అతి పెద్ద బ్యారేజీ నిర్మాణానికి ప్రణాళిక రూపుదిద్దుకుంది.
ఈ బ్యారేజీ నిర్మాణంలో బ్యాక్ వాటర్ నిల్వ కోసం 10,306 ఎకరాల భూమి సేకరించనున్నారు. ప్రాజెక్ట్ నిర్మాణంతో జిల్లాలోని ఐదు గ్రామాలు ముంపునకు గురికానున్నట్లు అధికారులు సర్వేలో గుర్తించారు. ఛత్తీస్‌గఢ్ రాష్ట్ర పరిధిలోని రెండు గ్రామాలు కూడా ముంపునకు గురవుతున్న నేపథ్యంలో బ్యారేజీ నిర్మాణ మ్యాప్‌లో సవరణలు చేశారు. అంతర్రాష్ట్ర సమస్యలు ఉత్పన్నమైతే కంతనపల్లి ప్రాజెక్ట్ నిర్మాణంలో తీవ్ర జాప్యం జరుగుతుందనే కారణంతో బ్యారేజీ నిర్మాణ స్థలాన్ని కొంత మేరకు మన రాష్ట్రం వైపుకు పెంచారు. మొత్తానికి 75 మీటర్ల ఎత్తులో... 85 మీటర్ల పరిధి జలాశయంతో తొలి దశ ప్రాజెక్ట్‌ను నిర్మాణం చేసేందుకు డీపీఆర్ సిద్ధం చేసి ప్రభుత్వానికి సమర్పించారు.
చకచకా..
కంతనపల్లిప్రాజెక్ట్ నిర్మాణం కోసం టెండర్ల ప్రక్రియ ముగిసి, అగ్రిమెంట్ కూడా పూర్తరుుంది. మొదటి దశ బ్యారేజీ నిర్మాణం పనులకు ఈపీసీ పద్ధతిన రూ. 1809 కోట్లతో టెండర్లు పిలిచారు. 9.13 శాతం లెస్తో షూ- రిత్విక్ జాయింట్ వెంచర్ రూ.1,643 కోట్లకు పనులు దక్కించుకుంది. ఈ మేరకు సంస్థ ఓ వైపు భూ స్వభావ పరీక్షలు పూర్తి చేయగా... మరోవైపు అధికారులు నిర్మాణానికి అవసరమయ్యే భూ సేకరణ, గోదావరిలో లోతు (ఎఫ్ఆర్ఎల్) తదితర అంశాలపై పూర్తిస్థాయిలో సర్వే చేసి నివేదికలిచ్చారు. అంతేకాకుండా ఏటూరునాగారం నుంచి లక్ష్మీపురం వరకు ఇప్పుడున్న 24 కిలోమీటర్ల రోడ్డులో 12 కిలోమీటర్ల వరకు రహదారిని తిరిగి నిర్మించనున్నారు.
బ్యారేజీ నిర్మాణం కంటే ముందుగా ఈ రోడ్డును వేయాలని అధికారులు సూచించారు. అదేవిధంగా ఏటూరునాగారంలో ఒక డివిజన్, 4 సబ్ డివిజన్ కార్యాలయాలు, కంతనపల్లి వద్ద 12 క్వార్టర్లను నిర్మాణం చేయనున్నారు. ఇక ప్రాజెక్ట్ నిర్వహణ కోసం మొత్తం 586 మెగావాట్ల విద్యుత్ వినియోగం ఉండగా... వీటిలో బ్యారేజీ వద్దే 280 మెగావాట్ల విద్యుత్‌ను ఉత్పత్తి చేసుకునే విధంగా రూపకల్పన చేశారు.
10,360 ఎకరాల భూమి
బ్యారేజీ నిర్మాణం కోసం మొత్తం 10,360 ఎకరాల భూమిని సేకరించాల్సి ఉంటుందని అధికారులు ప్రాజెక్ట్ రిపోర్టులో పేర్కొన్నారు. తొలుతగా కంతనపల్లి వద్ద 10,360 ఎకరాల భూమిని సేకరించాలని, ఇందులో అటవీ శాఖ భూమి లేదని, ప్రభుత్వ భూమి 20 శాతం మేరకు ఉన్నా... మిగిలినదంతా పట్టా భూమిగా గుర్తించారు. ఇక్కడ 10వేల ఎకరాల భూమిని సేకరించే క్రమంలో సుమారు 5 గ్రామాలు ముంపునకు గురవుతాయని నివేదికలో స్పష్టం చేశారు. నిర్వాసితులకు భూ కేటాయింపు ఎక్కడ చేస్తారనే అంశం, భూ సేకరణ కోసం ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేయాలని సూచించారు.
75 మీటర్లు... 3.8 కిలోమీటర్లు
గోదావరిలో నీటిమట్టం, పొడవుపై అధికారులు సర్వే పూర్తి చేశారు. ఖమ్మం జిల్లా వెంకటాపూర్ నుంచి వరంగల్ జిల్లాలోని ఏటూరునాగారం మండలం కంతనపల్లి వరకు చేపట్టాల్సిన పనులపై ఇంజనీర్లు నివేదికలు సమర్పించారు. మొత్తం 3.8 కిలోమీటర్ల పరిధిలో 75 మీటర్ల ఎత్తులో బ్యారేజీ నిర్మాణం చేయాల్సి ఉంటుం దని తేల్చారు. 75 మీటర్ల ఎత్తులో బ్యారేజీని నిర్మిస్తే... 22.25 టీఎంసీల నీటిని నిల్వ చేయవచ్చని, ఎండాకాలంతో పాటుగా ఏడాది మొత్తంలో 170 రోజుల పాటు 50 టీఎంసీల నీటి ని కాల్వలు, సొరంగంద్వారా పంపిం గ్ చేయవచ్చని సర్వేలో గుర్తించారు.
85 మీటర్ల జలాశయం
కంతనపల్లి ప్రాజెక్ట్‌లో పూర్తి జలాశయ మట్టాన్ని 85 మీటర్లకు నిర్ధారించారు. ప్రాజెక్టును 75 మీటర్ల ఎత్తు వరకే నిర్మాణం చేయాలని ప్లాన్‌లో పేర్కొన్నారు. బ్యారేజీ 75 మీటర్లు దాటి నిర్మాణం చేస్తే... జలాశయ మట్టం 85 మీటర్ల పైమేరకు చేరిపోయి ఛత్తీస్‌గఢ్ పరిధిలోని గ్రామాలు ముంపునకు గురవుతాయని, దీంతో అంతర్ రాష్ట్ర సమస్యలు ఉత్పన్నమవుతాయని స్పష్టంగా పేర్కొన్నారు.
131 గేట్ల ఏర్పాటు
బ్యారేజీకి గేట్ల డిజైన్‌ను ఇంజనీర్లు ఖరారు చేశారు. ప్రస్తుతం కరీంనగర్ జిల్లాలోని ఎల్ఎండీ రిజర్వాయర్ తరాహాలోనే 131 గేట్లను ఏర్పాటు చేయనున్నారు. వీటితోపాటుగా అదనంగా 12 నీటి విద్యుత్ ఉత్పాదక గేట్లు, 5 ప్రధాన తూము గేట్లు, స్కోర్ స్లూచెస్ కోసం 4 గేట్లను ఏర్పాటు చేసే విధంగా డిజైన్ చేశారు.
త్వరలో గ్రీన్‌సిగ్నల్
మొత్తం తొలి దశ బ్యారేజీ మ్యాప్‌తో సహా డీపీఆర్‌ను కంతనపల్లి నిర్వహణ ఇంజనీరింగ్ అధికారులు ఇటీవలే ప్రభుత్వానికి పంపించారు. దీనిపై ప్రభుత్వం కూడా రిటైర్డ్ ఇంజనీర్లతో పరిశీలన చేసింది. వారు చిన్న చిన్న తేడాలను సరి చేసి ప్రభుత్వానికి సమర్పించారు. టెండర్లు అగ్రిమెంట్ చేసి దాదాపు ఏడాది గడుస్తున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం అతి త్వరగా కంతనపల్లి డీపీఆర్‌పై ఆమోదముద్ర వేయనున్నట్లు అధికారులు చెబుతున్నారు. ఈ ప్రాజెక్ట్ నిర్మాణ కాలం ఐదేళ్లు.