చతుష్చక్రే... పేషంటే...!
నవ్వింత: మా రాంబాబు దగ్గరికి వెళ్లే సమయానికి వాడు తన టేబుల్ వెనక ఛైర్లో గిర్రున తిరుగుతూ, ‘రా రా... రా’ అంటూ ఆహ్వానించాడు. ‘కొత్తగా రివాల్వింగ్ ఛైర్ కొన్నా. చూశావా?’ అన్నాడు. వేగంగా అక్కణ్నుంచి తప్పుకోడానికి ప్రయత్నించా. కానీ ఆలస్యమైంది. మామూలు ఛైర్కూ రివాల్వింగ్ ఛైర్కూ మధ్య తేడా మొదలుకొని కుర్చీల పరిణామక్రమం గురించి స్పీచ్ మొదలుపెట్టాడు వాడు. వాడి బ్రహ్మాండోపన్యాసం ప్రకారం...
ధర్మం కంటే కుర్చీయే ఘనమైనదట. కృతయుగం నుంచి ధర్మం యుగానికి ఒక్కటి చొప్పున కాళ్లను వదులుకొని, కలియుగానికి ఒంటికాలిపై కుంటుతోందట. కానీ కుర్చీ అప్పట్నుంచీ నాలుగు పాదాలనే కలిగి ఉందట. ఆధునిక కుర్చీలు మరికొన్ని అదనపు పాదాలను సంతరించుకుని, వాటికింద చక్రాలను మొలిపించుకుని, ధర్మాన్ని మించిన ప్రగతి సాధించాయట. అక్కడితో ఆగకుండా కుర్చీ చక్రాల గురించీ ఏకరవు పెట్టాడు. ‘‘ఏకచక్రే మహాభోగే, ద్విచక్రే రాజభోగే అని ఏదో అంటుంటారు గానీ... కుర్చీ కింద ఐదు చక్రాలున్నాయంటే అది గొప్ప పోస్టేరా. కాకపోతే... నాలుగు చక్రాలుండి అందులో రెండు పెద్దవీ, రెండు చిన్నవీ ఉంటే మాత్రం చతుష్చక్రే పేషంటే... అప్పడది వీల్‌ఛైర్ అవుతుంది కదా!’’
‘‘సరేరా... ఇవ్వాళ్ల బయటేదో ధర్నా ఉంది. త్వరగా వెళ్తా. లేదంటే అందులో చిక్కుబడిపోతా’’ అంటూ తప్పించుకోడానికి మళ్లీ ప్రయత్నం చేశా. కానీ కుర్చీ గురించిన మరో గొప్పదనాన్ని చెప్పడానికి నేనే స్వయంగా ముడిసరుకు అందించానని నాకు అప్పటికిగానీ అర్థం కాలేదు. ‘‘ధర్నాలూ, ఊరేగింపులూ ఇత్యాది ఆగ్రహ ప్రదర్శనలకూ కుర్చీ యమ బాగా పనిచేస్తుందిరా. ఈ మధ్య ఏదైనా నిరసన చూపాలంటే ఆల్రెడీ కుర్చీలను ఎత్తికుదేస్తున్నారనుకో. దీన్ని చూసే నాకో ఆలోచన వచ్చింది. బంద్, ధర్నా, ఘెరావ్, జైల్‌భరో, దిష్టిబొమ్మ దగ్ధం... ఈ నిరసన కార్యక్రమాల జాబితాకు ‘కుర్సీ తోడో’ అనో ‘ఆసన్ ఫోడో’ అనో ఏదైనా కొత్త పేరు పెట్టి విజయవంతంగా అమలు పరచామనుకో... ఔట్‌డేటెడ్ నిరసనల స్థానంలో సరికొత్తది వచ్చి చేరుతుంది. దీనికి మరికాస్త టెక్నాలజీ జోడించి కుర్చీని విరగొట్టే కార్యకర్తలు అది ఏ బాణాసంచాలాగో పేలుతూ, నిప్పులు విరజిమ్ముతూ ఉండేలా తయారు చేయాలి. కాకపోతే ఈ పేలుళ్లు ఘనంగానూ, ఆ నిప్పులు నిరపాయకరంగానూ, ఎలాంటి ప్రమాదాలకూ తావివ్వకుండా ఉండి తీరాలి. అప్పుడీ కుర్చీలు అటు కూర్చోడానికీ, ఇటు విరగ్గొట్టుకోవడానికీ బహుళార్థకసాధకంగా పనికి వస్తాయి’’ అన్నాడు రాంబాబు. ‘‘ఏంట్రా నీవన్నీ డిస్ట్రక్టివ్ ఆలోచనలే! ఎప్పుడూ మంచిగా ఆలోచించవు కదా’’ అన్నా వాడిని ఈసడించుకుంటూ.
‘‘అరె... ఇదెంత గొప్ప ఆలోచనో తెలుసా! ఇలాంటి కుర్చీల తయారీ కంపెనీలకు సింగిల్‌విండోలో లెసైన్సులివ్వాలి. నిరుద్యోగులు ఈ యూనిట్లు పెట్టుకునేలా ప్రభుత్వ విధానాలు రూపొందాలి. వాళ్లకు స్వయం ఉపాధీ దక్కుతుంది, కొన్నాళ్లు కూర్చోడానికి పనికి వచ్చి, ఉద్యమాలకూ అక్కరకొస్తాయి. ఆ తర్వాత అవి ఒక ప్రయోజనం కోసం నాశనమవుతాయి. వాటి జన్మా సార్థకమవుతుంది. ఎప్పటికప్పుడు నశిస్తుంటాయి కాబట్టి కొత్త కుర్చీల తయారీకీ గిరాకి ఉంటుంది. కాకపోతే డిమాండూ-సప్లైలకు సరుకు సరిపోయేలా ఉద్యమాలు ప్లాన్ చేసుకోవాలి. ఎప్పుడూ మూసపోసిన పాత నిరసనలే కాకుండా ఇలా భళ్లున పేలేవీ... నిరపాయకరంగానే నిప్పులెగజిమ్మేవీ ఉద్యమ తీవ్రతకు అద్దం పడుతుంటాయి కాబట్టి ఉద్యమకారులకూ కాస్త ఉత్తేజకరంగా ఉంటుంది. పగలగొట్టుకోడానికి కుర్చీలున్నాయి కాబట్టి బస్సులూ, వాటి అద్దాల జోలికి వెళ్లకూడదంటూ ఒక జీవో పాస్ చేస్తే సర్వజనామోదయోగ్యమే. ఏమంటావ్?’’ అన్నాడు మా రాంబాబు.
‘‘ఒరే బాబూ... కుర్చీ అంటేనే రాజకీయం. ఇక నువ్వు రాజకీయాలు మొదలుపెడితే ఆగవు. ఇప్పటికే ఎక్కువైంది వస్తా’’ అంటూ బయటికి వెళ్లబోయా. ‘‘రాజకీయాలను అస్సలు టచ్ చేయకుండానే సాహిత్యంలోనూ కుర్చీ గొప్పదనం చెబుతా వినురా. నన్నయ్యను ‘ఆదికవి’ స్థానంలో కూర్చోబెట్టి మనం గౌరవిస్తున్నామా? ఠాట్ అదేం కాదు... నన్నయ్య కంటే ముందే నన్నెచోడుడు ఆ కుర్చీలో కూర్చోదగ్గ వ్యక్తి అంటూ మానవల్లి రామకృష్ణ కవి అనే పరిశోధక మహాశయుడు నన్నయ్య గార్ని సదరు ‘ఆదికవి’ కుర్చీలోంచి లాగి కిందపడేయడానికి ట్రై చేశారట. ఈ కుర్చీలతో వచ్చే చిక్కులవీ తెలుసుకాబట్టి కరుణశ్రీకి ఒళ్లుమండి ‘కూర్చుండ మా ఇంట కుర్చీలు లేవు’... కాబట్టి ఎవడేం లాగేసుకుంటాడో లాక్కోఫోం....డి, నన్నెవ్వడూ నా స్థానం లోంచి లాగేయలేడంటూ ధీమా వ్యక్తం చేశారు. కుర్చీల హైన్యం, అది లేనివాడి దైన్యం తెలిసి తెలివిగా ఎత్తు వేసిన కరుణశ్రీ గారి గొప్పదనమది...’’ అంటూ మా రాంబాబు గాడు ఏదో చెబుతున్నాడు. రాజకీయాలు చెప్పనంటూనే సాహిత్యంలోని రాజకీయాలు చెబుతున్నప్పుడు ఏదీ వినిపించడం లేదు గానీ... ఏదో ఒక మాట మాత్రం లీలగా వినిపించింది. ‘‘అదేంట్రా... నీ తల అచ్చం నా రివాల్వింగ్ ఛైర్లాగే తిరుగుతోంది’’ అని.
- యాసీన్