డాక్టర్ కావాలనుకుంది కానీ..
14 ఏళ్ల ఈషా డాక్టర్ కావాలనుకుంది. కానీ తానే పేషంట్‌గా మారి ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. న్యూఢిల్లీలోని ఎయిమ్స్‌లో చికిత్స పొందుతున్న ఆమెను ఆదివారం జమ్ముకశ్మీర్ ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీ పరామర్శించారు. కశ్మీర్‌లోయలో జరుగుతున్న అల్లర్లలో స్థానిక బాలిక అయిన ఈషా పెల్లెట్ల కారణంగా తీవ్రంగా గాయపడింది. దీంతో మెరుగైన చికిత్స అందించేందుకు ఆమెను ఢిల్లీలోని ఎయిమ్స్‌కు తరలించారు.
ఆమెను పరామర్శించిన అనంతరం సీఎం మెహబూబా ముఫ్తీ మాట్లాడుతూ డాక్టర్ కావాలని కలలు కన్న ఈషా ఇప్పుడు ఆస్పత్రిలో బాధితురాలిగా ఉండటం బాధ కలిగిస్తున్నదని తెలిపారు. 'నేను ప్రభుత్వంలోకి వచ్చి మూడు నెలలే. ఓ ఎన్కౌంటర్ తర్వాత ఇలాంటి పరిస్థితి నెలకొనడంలో నేను చేసిన తప్పు ఏముంది?' అని ఆమె అన్నారు. కశ్మీర్లో హింసను వ్యతిరేకిస్తూ.. శాంతిని పునరుద్ధరించడంలో సహకరించే వారందరితో చర్చలు జరిపేందుకు ప్రభుత్వం సిద్ధంగా ముఫ్తీ తెలిపారు. వేర్పాటువాదులతో చర్చలకు ప్రభుత్వం వ్యతిరేకంగా లేదనే సంకేతాలు ఇచ్చారు.
హిజ్బుల్ ముజాహిద్దీన్ కమాండర్ బుర్హాన్ వనీ ఎన్కౌంటర్ నేపథ్యంలో కశ్మీర్ లోయలో గత 51 రోజులుగా కొనసాగుతున్న ఆందోళనల్లో 70మంది చనిపోయిన సంగతి తెలిసిందే. ఈ సమస్య పరిష్కారానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రయత్నిస్తున్నప్పటికీ, భద్రతా దళాలు, ఆందోళనకారుల మధ్య ఘర్షణలు కొనసాగుతూనే ఉన్నాయి.