kaudipalli
-
ఏ తప్పూ లేకున్నా సస్పెండ్ చేశారు
సాక్షి, కౌడిపల్లి(నర్సాపూర్): ఏ తప్పూ చేయనప్పటికీ అకారణంగా సస్పెండ్ చేశారని మండలంలోని మహ్మద్‌నగర్ పంచాయతీ కార్యదర్శి ప్రవీణ్‌కుమార్ వాపోయారు. ఈనెల 1న కలెక్టర్ గ్రామంలో పర్యటించి పంచాయతీ కార్యదర్శిని సస్పెండ్ చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఆయన కౌడిపల్లిలో మంగళవారం విలేకరులతో మాట్లాడారు. సర్పంచ్ చేసిన తప్పలకు తనను బలిచేశారని ఆరోపించారు. గత ఏప్రిల్ నుంచి డిప్యూటేషన్‌పై పంచాయతీ కార్యదర్శిగా విధులు నిర్వర్తిస్తున్నానని తెలిపారు. సర్పంచ్ గతంలో చేసిన పనులకు సంబంధించి డబ్బులు డ్రా చేసుకోవడం జరిగిందన్నారు. అధికారులు మరోసారి ఆలోచించి సస్పెన్షన్ తొలగించాలని కోరారు. -
‘మధ్యాహ్నం’ గుడ్డు మాయం
కౌడిపల్లి: మధ్యాహ్న భోజనంలో విద్యార్థులకు కోడిగుడ్డు కరువైంది. వారంలో రెండుసార్లు పిల్లలకు కోడిగుడ్డు ఇవ్వాల్సి ఉన్నప్పటికీ కేవలం ఒక్కసారే ఇస్తున్నారు. అయినా పాఠశాలల హెచ్ఎంలు మాత్రం పట్టించుకోవడంలేదు. మండలంలోని బండపోత్గళ్, కౌడిపల్లి ప్రాథమిక పాఠశాలలో విద్యాసంవత్సరం ప్రారంభం అయినప్పటి నుంచి ఇప్పటి వరకు వారంలో ఒకేరోజు కోడిగుడ్డు ఇస్తున్నారు. బండపోత్గళ్ ప్రాథమిక పాఠశాలలో 98 మంది విద్యార్థులు ఉన్నారు. కాగా ఇద్దరు మధ్యాహ్న భోజనం కార్మికుల వంట చేస్తున్నారు. కాగా పాఠశాల ప్రారంభం అయినప్పటి నుంచి కేవలం ఒకేరోజు కోడిగుడ్డు ఇస్తున్నారు. దీంతోపాటు కౌడిపల్లి ప్రాథమిక పాఠశాలలో 200 మంది విద్యార్థులు ఉండగా ఇక్కడ సైతం కేవలం వారంలో ఒకేసారి పిల్లలకు కోడిగుడ్డు ఇస్తున్నారు. విద్యార్థులకు పౌష్టికాహారాన్ని అందించడంలో భాగంగా ప్రభుత్వం వారానికి రెండురోజులు సోమ, గురువారం రెండుసార్లు విద్యార్థులకు కోడిగుడ్డు పెట్టాల్సి ఉంది. సెలవులు వగైరాలున్నప్పుడు ఆ మరుసటి రోజు ఇవ్వాల్సి ఉంటుంది. అయినా ఈ పాఠశాలల్లో ఇవ్వడంలేదు. నిర్వాహకుల పేరిట మాత్రం ఆ పాఠశాలల హెచ్ఎంలు రెండురోజులు కోడిగుడ్డు పెడుతున్నట్లు బిల్లులు వేస్తుండటం గమనార్హం. అధికారి వివరణ ఈ విషయమై శుక్రవారం బండ పోత్ గళ్ ఇన్చార్జి హెచ్ఎం వెంకటరమణ, కౌడిపల్లి ఇన్చార్జి హెచ్ఎం బీమ్‌లను వివరణ అడగగా వారంలో ఒకేరోజు కోడిగుడ్డు ఇస్తున్నారని తెలిపారు. బిల్లుమాత్రం రెండుసార్లు ఇస్తున్నట్లు చెప్పడం గమనార్హం. ఇదే విషయమై స్థానిక ఎంఈఓ రాజారెడ్డిని వివరణ కోరగా కచ్చితంగా వారంలో రెండురోజులు కోడిగుడ్డు ఇవ్వాలని తెలిపారు. లేనట్లయితే ఎన్నిసార్లు కోడిగుడ్లు వండిపెడితే అన్నింటికి మాత్రమే బిల్లు చేయాలన్నారు. ఆ పాఠశాలలపై విచారణ చేసి చర్య తీసుకుంటామన్నారు. నిజమని తేలితే రికవరీ చేస్తామన్నారు. -
కౌడిపల్లి తహశీల్దార్ సస్పెన్షన్
కౌడిపల్లి, న్యూస్‌లైన్: ఆత్మహత్యలకు పాల్పడిన రైతు కుటుంబాలను ఆదుకునేందుకు ప్రభుత్వం మంజూరు చేసిన నిధులను బాధితులకు చెల్లించేందుకు ముడుపులు అడిగిన స్థానిక తహశీల్దార్‌పై వేటు పడింది. బాధితుల నుంచి రూ. పదివేలు డిమాండ్ చేయగా వారు అధికారులకు ఫిర్యాదు చేశారు. దీంతో జేసీ శరత్ బుధవారం కౌడిపల్లి తహశీల్ కార్యాలయంలో విచరణ చేపట్టారు. విచారణలో వాస్తవాలు వెలుగు చూడడంతో స్థానిక తహశీల్దార్ సుభాష్‌రెడ్డిని సస్పెండ్ చేస్తూ జేసీ ఆదేశాలు జారీ చేశారు. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. కౌడిపల్లి మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన 19 మంది రైతులు ఆత్మహత్యలకు పాల్పడ్డారు. దీంతో వారి కుటుంబాలను ఆదుకునేందుకు ప్రభుత్వం గత డిసెంబర్లో రూ .లక్ష చొప్పున మంజూరు చేసింది. కాగా ఈ డబ్బులను బాధిత కుటుంబాలకు ఇప్పటికే పంపిణీ చేయాల్సి ఉంది. ఒక్కో కుటుంబానికి రూ. లక్ష చెక్కు పంపిణీ చేసేందుకు స్థానిక తహశీల్దార్ సుభాష్‌రెడ్డి ఒక్కొక్కరి నుంచి రూ. 10వేలు డిమాండ్ చేశారు. దీంతో బాధితులు అధికారులకు ఫిర్యాదు చేయడంతో జేసీ శరత్ బుధవారం విచారణ చేపట్టారు. ముడుపుల విషయమై తహశీల్దార్‌ను జేసీ ప్రశ్నించగా రెడ్‌క్రాస్ సొసైటీ పేరిట డబ్బులు అడిగిన మాట వాస్తవమేనన్నారు. మరి కొందరు బాధితులు సైతం తహశీల్దార్ డబ్బులు ఇస్తేనే చెక్కు ఇస్తానని బెదిరింపులకు పాల్పడినట్లు తెలిపారు. వారి వాంగ్మూలం మేరకు జేసీ తహశీల్దార్‌ను సస్పెండ్ చేశారు. బాధితులకు పంపిణీ చేయాలి బాధితులకు ప్రభుత్వం పంపిణీ చేసిన డబ్బులను గురువారం బాధితులను కార్యాలయానికి పిలిపించి పంపిణీ చేయాలని మెదక్ ఆర్డీఓ వనజాదేవిని జేసీ శరత్ ఫోన్లో ఆదేశించారు. -
ఎవరు అడ్డుకున్నా తెలంగాణ ఆగదు
కౌడిపల్లి, న్యూస్‌లైన్: ఎవరు అడ్డుకున్నా తెలంగాణ ఏర్పాటు ఆగబోదని, రానున్న పార్లమెంట్ సమావేశాల్లో తెలంగాణ బిల్లు పాసవుతుందని రాష్ట్ర మహిళ, శిశు సంక్షేమశాఖ మంత్రి సునీతారెడ్డి అన్నారు. శుక్రవారం కౌడిపల్లిలో మల్లికార్జున స్వామి ఆలయంవద్ద జరిగిన ఎల్లమ్మదేవి విగ్రహ ప్రతిష్ట ఉత్సవాల్లో ఆమె పాల్గొన్నారు. ఆలయ కమిటీ సభ్యులు మంత్రికి పూర్ణకుంభంతో స్వాగతం పలకగా, మంత్రి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ, కేంద్రం తెలంగాణను ప్రకటించడంతోపాటు, అసెంబ్లీలో తెలంగాణ బిల్లును సైతం ప్రవేశపెట్టినందున అందరూ సహకరించాలని ఆమె కోరారు. తెలంగాణను అడ్డుకునేందుకు చివరి వరకూ పోరాడతామని సీఎం వ్యాఖ్యానించడం అతని వ్యక్తిగతమన్నారు. తెలంగాణను అడ్డుకుంటామంటున్న సీమాంధ్ర నేతలు వారి ప్రాంత అభివృద్ధి గురించి అసెంబ్లీలో మాట్లాడితే ఫలితం ఉంటుందన్నారు. మంత్రి వచ్చిన విషయం తెలుసుకున్న స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థులు, అధ్యాపకులు మల్లికార్జుస్వామి గుడివద్దకు వచ్చి మంత్రికి కళాశాల సమస్యలు విన్నవించారు. సానుకూలంగా స్పందించిన ఆమె సమస్యలన్నీ పరిష్కరిస్తానన్నారు. అనంతరం ఆమె భుజిరంపేటలోగల శ్రీకృష్ణనందాశ్రమానికి వెళ్లి రాంపూర్ పీఠాధిపతి మాదవానంద స్వామిని దర్శించుకున్నారు. కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ నారాయణరెడ్డి, డీసీసీ ప్రధానకార్యదర్శి యాదాగౌడ్, ఉపాధ్యక్షుడు ఎన్ దుర్గారెడ్డి, మాజీ సీడీసీ దుర్గారెడ్డి, నాయకులు ఎంసీ విఠల్, సాయిరెడ్డి, సంగాగౌడ్, రాజిరెడ్డి, వడ్ల శ్రీనివాస్ పాల్గొన్నారు. సమస్యలపై చర్చిస్తే ప్రయోజనం నర్సాపూర్: తెలంగాణను అడ్డుకుంటామంటున్న సీమాంధ్ర నేతలు తెలంగాణ ఏర్పాటు అనంతరం సీమాంధ్రలో ఉత్పన్నమయ్యే సమస్య గురించి అసెంబ్లీలో చర్చిస్తే ఆ ప్రాంత ప్రజలకు మేలు జరుగుతుందని మంత్రి సునీతారెడ్డి అన్నారు. శుక్రవారం నర్సాపూర్‌లో విలేకరులతో మాట్లాడిన ఆమె, జనవరిలో జరగనున్న అసెంబ్లీ సమావేశాల్లో తెలంగాణ బిల్లుపై చర్చించి ఈ బిల్లును రాష్ట్రపతికి తిప్పి పంపేందుకు తమ పార్టీ కృషి చేస్తోందన్నారు. సీఎం పార్టీ పెడతారంటూ వస్తున్న వార్తల గురించి కొందరు విలేకరులు ఆమె వద్ద ప్రస్తావించగా, పార్టీ పెట్టడం ఆయన వ్యక్తిగత విషయమన్నారు. విలేకరుల సమావేశంలో స్థానిక సర్పంచ్ వెంకటరమణారావు, ఇతర కాంగ్రెస్ నాయకులు శ్రీనివాస్‌గుప్తా, సత్యంగౌడ్, లలిత, అనిల్‌గౌడ్ తదితరులు పాల్గొన్నారు. నర్సాపూర్‌కు పీజీ కళాశాల నర్సాపూర్: నర్సాపూర్‌కు పీజీ కళాశాల మంజూరు అయినట్లు రాష్ట్ర మహిళా, శిశు సంక్షేమ శాఖల మంత్రి సునీతారెడ్డి చెప్పారు. శుక్రవారం ఆమె స్థానిక విలేకరులతో మాట్లాడారు. నర్సాపూర్‌లో వచ్చే విద్యా సంవత్సరం నుంచి పీజీ కళాశాలలో తరగతులు కొనసాగుతాయని చెప్పారు. ఎమ్మెస్సీలో ఆర్గానిక్ కెమిస్ట్రీ, ఇనార్గనిక్ కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్, ఎంబీఏ, ఎంసీజే కోర్సులుంటాయన్నారు. పీజీ కళాశాల కోసం ఐదు ప్రొఫెసర్ పోస్టులతో పాటు 10 అసోసియేట్ ప్రొఫెసర్ పోస్టులు, 16 అసిస్టెంటు ప్రొఫెసర్ల పోస్టులు కూడా మంజూరు అయినట్లు ఆమె తెలిపారు. అంతేకాకుండా శిథిలావస్థకు చేరిన మెదక్ ఆర్డీఓ కార్యాలయానికి నూతన భవనం నిర్మించేందుకు గానూ రూ.2 కోట్లు మంజూరు చేయించినట్లు ఆమె తెలిపారు. నర్సాపూర్ నియోజక వర్గంలోని ఉన్నత పాఠశాలలకు కొత్త భవనాలను నిర్మించేందుకు రూ. 5 కోట్ల 95 లక్షల 47 వేలు మంజూరయినట్లు మంత్రి సునీతారెడ్డి చెప్పారు.