పెరుగుతున్న గంజాయి ఖైదీలు
సెంట్రల్ జైలులో శిక్ష అనుభవిస్తున్న 200 మంది
కోర్టు వాయిదాలకు నిందితుల
తరలింపులో ఇబ్బందులు
గతేడాది 8,079 కేజీలు స్వాధీనం
రాజమహేంద్రవరం సెంట్రల్ జైలులో గంజాయి స్మగ్లర్ల సంఖ్య నానాటికీ పెరుగుతోంది. వారిని కోర్టు వాయిదాలకు తరలించడంలో ఇబ్బందులు తలెత్తుతున్నాయి. ఒకే సారి 50,60 మందిని కోర్టుకు తరలించడం, వారిని తిరిగి జైలుకు తీసుకురావడం ఎస్కార్టు సిబ్బందికి కత్తిమీద సాములా తయారైంది.
రాజమహేంద్రవరం క్రైం :
గంజాయి సాగు, రవాణాపై ప్రభుత్వం ఉక్కుపాదం మోపడంతో గంజాయి స్మగ్లింగ్ చేస్తూ పట్టుబడుతున్న నిందితుల సంఖ్య రోజు రోజుకూ పెరుగుతోంది. వారందరినీ రాజమహేంద్రవరంలోని సెంట్రల్ జైలుకు తరలిస్తున్నారు. అక్కడ నుంచి వారిని విచారణ కోసం కోర్టుకు తీసుకువెళ్లడం, తిరిగి తీసుకురావడంలో ఎస్కార్టు సిబ్బంది అప్రమత్తంగా వ్యవహరించాలి.
ఏ ఒక్కరు తప్పించుకున్నా వారి ఉద్యోగానికే ఎసరు వస్తుంది. జిల్లాకు సరిహద్దు రాష్ట్రం అయిన ఒడిశా, విశాఖ జిల్లాల నుంచి కూడా జిల్లా మీదుగా గంజాయి రవాణా జరుగుతోంది. హైవే ప్రాంతం ఆనుకొని జిల్లా ఉండడంతో విశాఖ జిల్లా , తూర్పు గోదావరి జిల్లాలోని తుని, జగ్గంపేట, రాజమహేంద్రవరం, అనపర్తి, రావులపాలెం తదితర ప్రాంతాల్లో గంజాయి నిల్వ చేసి రవాణా చేస్తున్నారు. గంజాయిని జిల్లా నుంచి ట్రావెల్ బస్సులు, రైలు మార్గాల ద్వారానే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి సరుకులు లోడ్‌తో వెళ్తున్న లారీల్లో తరలిస్తున్నారు. పుచ్చకాయలు, చిలగడ దుంపల లోడుల మధ్య గంజాయి మూటలను ఉంచి తరలిస్తున్నారు. ఈ ఏడాది నాలుగు నెలల కాలంలో జిల్లా వ్యాప్తంగా వివిధ పోలీస్ స్టేషన్ల పరిధిలో గంజాయి సాగు, రవాణా కేసుల్లో అనేక మందిని అరెస్టు చేశారు. వివిధ కేసుల్లో 2 లారీలు, 6 వ్యా¯ŒSలు, ఒక జీప్, 6 కార్లు, ఒక ఆటో, 3 మోటారు సైకిళ్లను స్వాధీనం చేసుకున్నారు.
200 మందికి పైగా శిక్ష అనుభవిస్తున్న ఖైదీలు
రాజమహేంద్రవరం సెంట్రల్ జైల్లో గంజాయి కేసుల్లో శిక్ష అనుభవిస్తున్న ఖైదీలు మిగిలినకేసుల్లోని వారి కంటే ఎక్కువగా ఉన్నారు. గంజాయి కేసుల్లో అరెస్టయిన నిందితులు 200 మందికి పైగానే ఉన్నారు. వీరిలో మహారాష్ట్ర, తమిళనాడు, తెలంగాణ రాష్ట్రాలతో పాటు హైదరాబాద్, తూర్పు, పశ్చిమ గోదావరి తదితర జిల్లాలకు చెందిన వారు ఉన్నారు. వీరిలో కొందరికి శిక్ష ఖరారు కాగా, మరి కొంత మంది రిమాండ్ ఖైదీలుగా ఉన్నారు. పోలీస్ రికార్డుల ప్రకారం ఐదేళ్ళుగా గంజాయి సాగు, అక్రమ రవాణా కేసులలో ఎక్కువ మంది అరెస్ట్ అయిన వారు ఉన్నారు. 2015, 16 సంవత్సరాల్లో మొత్తం 38 మంది గంజాయి కేసుల్లో జైలుకు వెళ్లారు. 8,079 కేజీల 900 గ్రాముల గంజాయి స్వాధీనం చేసుకున్నారు.
కోర్టుకు తరలింపులో ఇబ్బందులు
గంజాయి కేసులు ఏళ్ళ తరబడి సాగడంతో కొంత మంది ముద్దాయిలు శిక్ష పడకుండానే జైలు జీవితం అనుభవిస్తున్నారు. గంజాయి కేసులు పీడీ యాక్ట్ కిందకు వస్తాయి గనుక వారికి బెయిల్ దొరకడం కష్టం. కానీ వాయిదాల మేరకు వారిని కోర్టులకు తరలించక తప్పదు. వారికి సెక్యూరిటీ కల్పించడం, ఇంత మందిని ఒకేసారి కోర్టుకు హాజరు పరిచి తిరిగి సెంట్రల్ జైల్‌కు తరలించడం ఎస్కార్ట్ పోలీసులకు కత్తిమీద సాములా తయారైంది.