kodikonda
-
ఆటోను ఢీకొన్న ట్రాక్టర్.. వ్యక్తి మృతి
చిలమత్తూరు : ఆటోను వెనుక వైపు నుంచి ట్రాక్టర్ ఢీకొన్న ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందిన సంఘటన గురువారం కొడికొండ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల సమీపంలో చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల మేరకు.. కర్ణాటక జిల్లా జర్ల గ్రామం వైపు నుంచి కొడికొండ వైపు ఆటో వస్తోంది. సోమఘట్ట వైపు నుంచి కొడికొండ వైపు వస్తున్న ట్రాక్టర్లో చెడిపోయిన బైక్‌ను తీసుకుని బలిజపల్లి గ్రామానికి చెందిన నాగరాజు (39) వస్తున్నాడు. ఈ క్రమంలో ఆటోను వెనుక వైపు నుంచి ట్రాక్టర్ ఢీకొంది. ట్రాక్టర్లో ఉన్న నాగరాజు తలకు, కాళ్లు, చేతులకు బలమైన గాయలయ్యాయి. చిక్సిత నిమిత్తం అతడిని హిందూపురం ఆస్పత్రికి తరలించగా.. అక్కడ మృతి చెందాడు. అతడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. -
గ్రానైట్ లారీ సీజ్
చిలమత్తూరు : కర్ణాటకలోని వన్నంపల్లి నుంచి చెక్‌పోస్టు వైపు వస్తున్న గ్రానైట్ లారీని గురువారం ఉదయం విజిలెన్స్ అధికారులు చెక్‌పోస్టు డాబా సమీపంలో సీజ్ చేశారు. ఎలాంటి రికార్డులు, ధ్రువీకరణ పత్రాలు లేకపోవడంతో లారీని సీజ్ చేసి, పోలీస్ స్టేషన్‌కు తరలించారు. అపరాధ రుసుం చెల్లించినట్లు రసీదులు స్టేషన్లోఅందజేస్తే లారీని వదులుతామని పోలీసులు తెలిపారు. -
పే..ద్ద లారీ
చిలమత్తూరు : లారీకి సాధారణంగా 10 లేదా 16 చక్రాలు అంతకంటే పెద్ద లారీకి 90 చక్రాల వరకు ఉంటాయి. కానీ తమిళనాడు తిరుచునారు నుంచి పరిశ్రమలకు సంబంధించిన అతి పెద్ద పరికరంతో గుజరాత్ వెళ్తున్న ఓ లారీకి ఏకంగా 134 చక్రాలు ఉన్నాయి. శుక్రవారం కొడికొండ చెక్‌పోస్టులో తనిఖీలో భాగంగా ఈ లారీని ఆపారు. ఇంత పెద్ద లారీని చూసిన స్థానికులు ఆశ్చర్యాన్ని వ్యక్తం చేశారు. -
గొర్రెలను తరలిస్తున్న లారీల సీజ్
చిలమత్తూరు (హిందూపురం) : ధర్మవరం ప్రాంతం నుంచి గొర్రెలతో వెళ్తున్న ఆరు లారీలను చిలమత్తూరు మండలం కొడికొండ చెక్‌పోస్టులో పెనుకొండ ఆర్టీఓ మురళీ ఆధ్వర్యంలో అధికారులు బుధవారం సీజ్ చేశారు. రికార్డులు, లైసెన్సులు తదితర అనుమతి పత్రాలు సక్రమంగా లేని కారణంతో పట్టుకున్నట్లు అధికారులు తెలిపారు. ఇందులో సక్రమంగా రికార్డులు ఉన్న లారీలను వదిలేశామన్నారు. డ్రైవర్ లైసెన్సు తదితర పత్రాలు లేని రెండు లారీలను పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. అపరాధ రుసుం చెల్లించి లారీలను తీసుకెళ్లాలని అధికారులు సూచించారు. కాగా తమకు ఇలాంటి నిబంధనలు తెలియవని, పశుగ్రాసం కోసం ధర్మవరం మండలం రావులచెరువు నుంచి ఆరు లారీలను మాట్లాడుకుని కర్ణాటకలోని చిక్బళ్లాపురం సమీప గ్రామాలకు వెళ్తున్నామని గొర్రెల పెంపకందారుడు రామాంజి ఆవేదన వ్యక్తం చేశారు. కాగా ఎండకు లారీల్లోని గొర్రెలు విలవిల్లాడటంతో పెంపకందారులు చూడలేకపోయారు. -
మహిళ అనుమానాస్పద మృతి
చిలమత్తూరు(హిందూపురం) : చిలమత్తూరు మండలం కొడికొండ చెక్‌పోస్టులోని మార్కెట్ తనిఖీ కేంద్రం సమీపంలో ఊరు, పేరు తెలియని ఓ మహిళ(39) అనుమానాస్పదస్థితిలో మరణించి ఉండగా ఆదివారం కనుగొన్నట్లు ఎస్ఐ జమాల్‌బాషా తెలిపారు. చెక్‌పోస్టు మార్కెట్ తనిఖీ కేంద్రం పరిసర ప్రాంతంలో గుర్తు తెలియని మహిళ మృతదేహం పడి ఉందని, భరించరాని దుర్వాసన వస్తోందంటూ తమకు సమాచారం అందిందన్నారు. సిబ్బందితో కలసి వెంటనే అక్కడికి వెళ్లి పరిశీలించినట్లు వివరించారు. మృతదేహాన్ని పరిశీలించిన అనంతరం పోస్టుమార్టం నిమిత్తం హిందూపురం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. మృతురాలు ఎవరు, ఏ ప్రాంతం వాసి, ఇది హత్యనా, కాదా? ఒక వేళ హత్య అయితే హంతకులు ఎవరు, ఎందుకు చంపారనే వివరాలు పోలీసుల దర్యాప్తులో తేలాల్సి ఉంది. -
‘ఎర్ర’ దొంగల అరెస్టు
చిలమత్తూరు (హిందూపురం) : విలువైన ఎర్రచందనం దుంగలను కర్ణాటకకు అక్రమంగా తరలిస్తూ గతంలో తప్పించుకున్న ముగ్గురు దొంగలను ఎట్టకేలకు అరెస్టు చేసినట్లు హిందూపురం రూరల్ సీఐ నాగరాజానాయుడు శనివారం చిలమత్తూరు పోలీస్ స్టేషన్లో విలేకరులకు తెలిపారు. అరెస్టైన వారిలో అనంతపురం రాణినగర్‌కు చెందిన పి.బాబ్జాన్, జి.వెంకటరాజు, ఉప్పర హరి అనే వ్యక్తులు ఉన్నారని వివరించారు. వీరిని కొడికొండ చెక్‌పోస్టు సమీపంలోని టూరిజం హోటల్ సమీపంలో ఉండగా ఎస్ఐ శ్రీధర్, తమ సిబ్బందితో వెళ్లి పట్టుకున్నారని సీఐ తెలిపారు. ఇదే కేసులోని హైదరాబాద్‌కు చెందిన హరీ అనే మరో దొంగ పరారీలో ఉన్నాడని, అతని కోసం గాలిస్తున్నామని వెల్లడించారు. ఏఎస్ఐ సూర్యనారాయణ, సిబ్బంది పాల్గొన్నారు. -
జపనీస్ పిల్ల.. అగ్గిపుల్ల.. సిగరెట్ మళ్లా
వేలమైళ్లు ప్రయాణించి తెలుగు నేలపై అడుగుపెట్టింది. ఆమెను గిరీశం ఆవహించాడు. పైగా మరుజన్మలో దున్నపోతై పుట్టడం ఇష్టంలేదామెకు. అందుకే పెదవులమధ్య సిగరెట్ ను బంధించి.. చాకచక్యంగా అగ్గిపుల్లతో వెలిగించుకుని.. గుండెల నిండా(నిజానికి కడుపు నిండా అనాలేమో!) పొగపీల్చి, గుప్పున వదిలింది. అలా ఓ ఐదారు దమ్ములు. అంతే, గిరీశం ఆమెను వదిలిపెట్టి వెళ్లాడు. అనంతపురం జిల్లాలోని పుట్టపర్తిలోని సత్యసాయి ఆలయానికి వచ్చిన జపనీస్ మహిళా భక్తురాలు అకానే ష్నోమియా.. మార్గం మధ్యలోని కొడికొండ చెక్ పోస్ట్ వద్ద బహిరంగంగా ధూమపానం చేస్తూ కంటపడింది. బహిరంగ ప్రదేశాల్లో స్మోకింగ్ రిస్ట్రిక్టెడ్ కాబట్టి, మహిళా స్మోకర్లు మన దేశంలో చాలా తక్కువ కాబట్టి, ఆమె వచ్చిందొక ఆథ్యాత్మిక క్షేత్రానికి కాబట్టి.. అకానే చర్య వార్త అయింది. -
కొడికొండలో టీడీపీ కార్యకర్తల దౌర్జన్యం
అనంతపురం : ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సభలో గురువారం ఉద్రిక్తత చోటుచేసుకుంది. కొడికొండలో రాగమయూరి ఎలక్ట్రానిక్ పార్క్‌కు చంద్రబాబు నాయుడు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా సీఎం సభలో మాట్లాడుతుండగా కొందరు మహిళలు ఆయన ప్రసంగాన్ని అడ్డుకున్నారు. తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ ఆందోళనకు దిగారు. హిందూపూర్‌లో రావత్ మసాలా కంపెనీ యాజమాన్యం ఉన్నఫళంగా 130మందిని విధుల నుంచి తొలగించిందని, వెంటనే యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని కోరుతూ మహిళలు నినాదాలు చేశారు. దీంతో అక్కడే ఉన్న టీడీపీ కార్యకర్తలు రెచ్చిపోయారు. సాక్షాత్తూ ముఖ్యమంత్రి సభలోనే ఆందోళనకారులపై దౌర్జన్యానికి దిగారు. మహిళలు, కార్మికులపై దాడికి పాల్పడ్డారు. ఈ సంఘటనలో సీఐటీయూ నేత వెంకట నారాయణకు తీవ్ర గాయాలయ్యాయి. అయితే టీడీపీ కార్యకర్తలు దాడి చేస్తున్నా పోలీసులు మాత్రం ప్రేక్షక పాత్ర వహించారు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.