కాంగ్రెసోళ్లు ఖరారు
సాక్షి ప్రతినిధి, ఆదిలాబాద్ : కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల జాబితాపై నెలకొన్న అనిశ్చితి ఎట్టకేలకు తొలగింది. సుదీర్ఘ కసరత్తు అనంతరం ఆ పార్టీ తరఫున పోటీ చేయనున్న అభ్యర్థుల జాబితాను కాంగ్రె స్ అధిష్టానం సోమవారం సాయంత్రంప్రకటించింది. సిర్పూర్ నియోజకవర్గం కాంగ్రెస్ అభ్యర్థిగా కొక్కిరాల ప్రేంసాగర్‌రావును ఖరా రు చేసింది. చెన్నూరు నుంచి జి.వినోద్, బోథ్ నుంచి అనీల్‌జాదవ్, ఖానాపూర్ నుంచి అజ్మీరా హరినాయక్, ముథోల్ నుంచి విఠల్‌రెడ్డిల పేర్లను ప్రకటించింది.
సిట్టింగ్ ఎమ్మెల్యేలందరికీ ఈసారి టిక్కెట్లు దక్కాయి. ఆసిఫాబాద్(ఎస్టీ) ఆత్రం సక్కు, నిర్మల్ నుంచి ఏలేటి మహేశ్వర్‌రెడ్డి, మంచిర్యాల నుంచి గడ్డం అరవిందరెడ్డి పేర్లు ఖరారయ్యాయి. ఆదిలాబాద్ అభ్యర్థిగా అనూహ్యంగా ఎన్ఎ స్యూఐ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు భార్గవ్‌దేశ్ పాండే పేరు ను అధిష్టానం ప్రకటించింది. డీసీసీ ప్రతిపాదించిన జా బితాలో నుంచి అభ్యర్థులను ఖరారు చేసింది. పొత్తులో భాగంగా బెల్లంపల్లి స్థానాన్ని సీపీఐకి కేటాయించారు.
డీసీసీ అధ్యక్షునికి నిరాశే..
ఆదిలాబాద్ నియోజకవర్గం నుంచి టిక్కెట్ ఆశించిన డీసీసీ అధ్యక్షుడు సి.రాంచంద్రారెడ్డికి, పీసీసీ కార్యదర్శి గండ్రత్ సుజాతలకు నిరాశే మిగిలింది. నిర్మల్ టిక్కెట్‌పై ఆశలు పెట్టుకుని కాంగ్రెస్‌లో చేరిన అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డికి కూడా టిక్కెట్ దక్కలేదు. సిర్పూర్ నుంచి కోనేరు కోనప్ప టిక్కెట్ ఆశించినా ఫలితం లేకుండా పోయింది. ఖానాపూర్ టిక్కెట్ ఆశించిన భుక్యా రమేష్‌కు, ముథోల్ అభ్యర్థిత్వాన్ని ఆశించిన నారాయణరావు పటేల్‌లకు కూడా నిరాశే మిగిలింది. బోథ్ అభ్యర్థిత్వం కోసం కొమురం కోటేష్ చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. ఖానాపూర్ నుంచి భక్షినాయక్, భరత్‌చౌహాన్‌లు కూడా టిక్కెట్ ఆశించారు. కానీ వారికి ఫలితం దక్కలేదు. చెన్నూరు టిక్కెట్ ఆశించిన కాంగ్రెస్ నేతలు సొత్కు సంజీవరావు, దాసారపు శ్రీనివాస్ తదితరులకు వినోద్ రాకతో చెక్ పడినట్లయింది.
జన రల్ స్థానాలు ఓసీలకే..
జిల్లాలో మొత్తం పది అసెంబ్లీ స్థానాలకు ఐదు స్థానాలు ఎస్టీ, ఎస్సీలకు రిజర్వు అయ్యాయి. మిగిలిన ఐదు జనరల్ స్థానాల్లో ఒక్కరికి కూడా బీసీలకు అవకాశం ఇవ్వలేదు. అదేవిధంగా మహిళలకు కూడా అభ్యర్థుల జాబితాలో చోటు దక్కలేదు. మైనార్టీల ఊసే లేకుండా కాంగ్రెస్ అధిష్టానం జాబితాను ప్రకటించింది. ఎస్టీలకు రిజర్వు అయిన మూడు స్థానాల్లో రెండు స్థానాలను లంబాడా సామాజిక వర్గాలకు కేటాయించారు. ఆసిఫాబాద్ నుంచి మాత్రం గోండు సామాజిక వర్గానికి చెందిన ఆత్రం సక్కుకు అవకాశం లభించింది.