konark temple
-
కోణార్క్ సూర్య రథచక్రం రాష్ట్రపతి భవనంలో...
ఒడిశాలోని కోణార్క్ సూర్య దేవాలయం యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశం. ఈ కోణార్క్ సూర్య రథ చక్రాన్ని పోలిన నాలుగు ఇసుకరాయి ప్రతిరూపాలను ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్ కల్చరల్ సెంటర్ అమృత్ ఉద్యాన్ లో ఏర్పాటు చేశారు.కోణార్క్ చక్రం భారతదేశ సాంస్కృతిక వారసత్వానికి చిహ్నం. సాంస్కృతిక, చారిత్రక అంశాలను సందర్శకులకు పరిచయం చేసే దశల్లో భాగంగా, భారతదేశం గొప్ప వారసత్వాన్ని తెలుసుకోవడానికి ప్రోత్సహించే లక్ష్యంతో దీనిని ఏర్పాటు చేసినట్టు రాష్ట్రపతి కార్యాలయం ఓ ప్రకటనలో తెలిపింది.కోణార్క్ సూర్య దేవాలయం యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్లో ఒకటి. ఒడిషా ఆలయ నిర్మాణ శైలికి పరాకాష్టగా దీనిని చెప్పుకోవచ్చు. ఇది సూర్య భగవానుడిని మోసుకెళ్లే బృహత్తర రథం ఆకారంలో నిర్మించబడింది. (చదవండి: అమెరికాలో ... శాస్త్రీయ నృత్య రూపకంగా దుర్యోధనుడు) -
భావ ప్రకటనా స్వేచ్ఛే ఓ జోక్!
సాక్షి, న్యూఢిల్లీ : ఒడిశాలోని కోణార్క్ సూర్య దేవాలయంపైనున్న శిల్పాల గురించి అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు రక్షణ శాఖ విశ్లేషకుడు అభిజిత్ ఐయ్యర్ మిత్రాపై ఒడిశా అసెంబ్లీలో పెద్ద దుమారం రేగడం, ఆయనపై రాష్ట్ర అసెంబ్లీ సభా హక్కుల నోటీసు జారీ చేయడం, రాష్ట్ర పోలీసులు వివిధ సెక్షన్ల కింద ఆయన్ని అరెస్ట్ చేయడం, తక్షణమే అభిజిత్‌కు బెయిల్ మంజూరవడం గురువారం ఒక్క రోజే వేగంగా జరిగిన పరిణామాలు. ఒడిశా పాలకపక్ష బిజూ జనతాదళ్ నుంచి ఇటీవలనే బయటకు వచ్చిన మాజీ పార్లమెంట్ సభ్యుడు బైజయంత్ జైపాండేకు చెందిన హెలికాప్టర్లో అభిజిత్ ఐయ్యర్ మిత్రా, జర్నలిస్ట్ ఆర్తి టికూ సింగ్ కొణార్క్ పర్యటనకు వెళ్లారు. బుధవారం కోణార్క్ సూర్య దేవాలయాన్ని సందర్శించిన అభిజిత్ ఐయ్యర్, అక్కడి ఆలయ గోడలపై అసభ్య భంగిమల్లో ఉన్న దేవతా విగ్రహాలను చూసి ‘ఇదేమీ విగ్రహాలు! హిందువులను అవమానించేందుకే ముస్లింలు ఈ విగ్రహాలను ఇలా చెక్కించారేమో (అసభ్య పదాలను మినహాయించాం). రేపు కట్టబోయే మా రామమందిరంలో ఇలాంటి విగ్రహాలు ఉండవు’ అని వ్యాఖ్యానించారు. అనంతరం తన వ్యాఖ్యలకు సంబంధించిన వీడియోను ఆయన ట్విట్టర్లో పోస్ట్ చేశారు. దీనిపై ఒడిశా అసెంబ్లీ, ఒడిశా పోలీసులు తీవ్ర స్థాయిలో స్పందించారు. రాష్ట్ర అసెంబ్లీ సభా హక్కుల ఉల్లంఘన నోటీసును జారీ చేయగా, పోలీసులు భిన్న మతాల మధ్యన వైషమ్యాలను రెచ్చగొట్టేందుకు ప్రయత్నించారంటూ భారతీయ శిక్షాస్మృతిలోని 153ఏ సెక్షన్ కింద, వ్యక్తుల మత విశ్వాసాలను కించపరిచారంటూ 295ఏ, 298 సెక్షన్ల కింద అభిజిత్‌పై కేసులు నమోదు చేశారు. సాహితీవేత్తలు, విద్యావేత్తలు, కళాకారుల సృజనాత్మక చర్యలను అణచివేసేందుకు ప్రభుత్వాలు ఎక్కువగా 295ఏ, 298 సెక్షన్లను ఉపయోగిస్తాయి. ఇక ప్రభుత్వం పట్ల అసంతృప్తి వ్యక్తం చేస్తే 12ఏ సెక్షన్ కింద ఏకంగా దేశద్రోహం కేసులనే పెడతాయి. దేశంలో భావ ప్రకటనా స్వేచ్ఛను హరించి వేస్తున్న ఈ సెక్షన్లు బ్రిటీష్ కాలం నాటివి. రాజకీయ కక్ష సాధింపు చర్యల కోసం ప్రభుత్వాలు ఈ సెక్షన్లను ఎక్కువగా దుర్వినియోగం చేస్తున్నాయి. పార్టీని విడిచిపెట్టి వెళ్లిన బైజయంత్ జయ్ పాండే అతిథిగా వచ్చి ఇలాంటి వ్యాఖ్యలు చేసినందుకే ఒడిశా ప్రభుత్వానికి ఎక్కువ కోపం వచ్చినట్లుంది. చిలికీ సరస్సు మీదుగా వెళ్లిందన్న కారణంగా పాండే హెలికాప్టర్‌ను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పర్యావరన పరిస్థితుల పరిరక్షణలో భాగంగా చిలికీ సరస్సు మీదుగా హెలికాప్టర్‌ను అనుమతించమని ప్రభుత్వం చెబుతోంది. తన వ్యాఖ్యల్ని తీవ్రంగా పరిగణించరాదని, జోక్ చేశానని అభిజిత్ సమర్థించుకునేందుకు ఎంత ప్రయత్నించినా పోలీసులుగానీ, రాష్ట్ర ప్రభుత్వంగానీ ఆయన్ని వదిలి పెట్టడం లేదు. ఈ నెల 28వ తేదీన ఆయన విచారణకు హాజరుకావాల్సిందే. నిజంగా అభిజిత్ వ్యాఖ్యల్లో జోక్ లేదుగానీ దేశంలో భావ ప్రకటనా స్వేచ్ఛ ఉందనుకోవడం మాత్రం పెద్ద జోకే! -
కేంద్రానికి నవీన్ పట్నాయక్ లేఖ
భువనేశ్వర్ : ప్రపంచ వారసత్వ కట్టడంగా గుర్తింపు పొందిన కోణార్క్ సూర్య దేవాలయంలో పునరుద్ధరణ కార్యక్రమాలు చేపట్టాల్సిందిగా ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ కేంద్రానికి లేఖ రాశారు.13వ శతాబ్దంలో నిర్మించిన అత్యంత పురాతన దేవాలయంలో డ్రైనేజీ వ్యవస్థ సరిగా లేని కారణంగా సందర్శకులు ఇబ్బంది పడుతున్నారని ఆయన పేర్కొన్నారు. ఎక్కడిక్కడ నీరు నిలిచి పోవడంతో ఆలయాన్ని సందర్శించకుండా చాలా మంది పర్యాటకులు వెనుదిరిగి వెళ్లిపోతున్నారని కేంద్ర సాంస్కృతిక శాఖ మంత్రి మహేశ్ శర్మకు రాసిన లేఖలో పేర్కొన్నారు. సమస్య తీవ్రతను అర్థం చేసుకుని శాశ్వత నివారణ చర్యలు చేపట్టి వారసత్వ కట్టడాన్ని రక్షించాల్సిందిగా నవీన్ పట్నాయక్ విఙ్ఞప్తి చేశారు. కేంద్రం, భారత పురావస్తు శాఖ నుంచి అనుమతి లభిస్తే ఆలయ పునరుద్ధరణ దిశగా చర్యలు చేపట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలిపారు. -
మోదీకి కోణార్క్ టెంపుల్ తెలియదా!
న్యూఢిల్లీ: భారతీయ సాంస్కృతిక చరిత్ర గురించి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అమెరికాలో మాట్లాడుతూ మళ్లీ తప్పులో కాలేశారు. చరిత్ర పట్ల ఆయనకున్న అవగాహనను ట్విట్టర్లో కొంత మంది అవహేళన చేశారు. ఒడిశాలోని కోణార్క్ ఆలయం అంటే మోదీ, మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియం అనుకున్నట్టున్నారంటూ జోకులు వేశారు. భారతీయ సాంస్కతిక సంపద అప్పగింత సందర్భంగా వాషింగ్టన్లో జరిగిన ఓ కార్యక్రమంలో నరేంద్ర మోదీ మాట్లాడుతూ కోణార్క్ ఆలయం గురించి ప్రస్తావించారు. నేటి ఆధునిక యువతుల్లాగా మినీ స్కర్టులు ధరించిన, పర్సులను పట్టుకున్న విగ్రహాలను రెండు వేల సంవత్సరాల క్రితమే మన కళాకారులు చెక్కారని మోదీ చెప్పారు. మోదీ మాటల్లో మొదటి తప్పు కోణార్క్ ఆలయం రెండు వేల సంవత్సరాల క్రితంది కాదు. 13వ శతాబ్దంలో, అంటే 1250 ప్రాంతంలో నిర్మించింది. దాన్ని నిర్మించి నేటికి 766 సంవత్సరాలు దాటిందంతే. రెండో తప్పు మినీ స్కర్టుల గురించి మాట్లాడం. కోణార్క్ ఆలయంపై ఎక్కువగా స్త్రీ, పురుషుల నగ్న లైంగిక దశ్యాలే ఉంటాయి. కొన్ని స్త్రీ విగ్రహాలకు మాత్రమే నడుముకు నగలు ధరించినట్లుగా అచ్చాదన ఉంటుంది. వాటిని ఆధునిక స్కర్టులతో పోల్చలేం. ‘ఇంకా నయం కోణార్క్ విగ్రహాల్లోలాగా కాకుండా మన ఆధునిక స్త్రీలు మినీ స్కర్టులు ధరించి వారి మానాన్ని కాపుడుకుంటున్నారు’ అని ఓ ట్విట్టర్ వ్యాఖ్యానించారు. ముచ్చటగా మూడో తప్పు పర్సు గురించి మాట్లాడడం. అది పర్సులాగా కాకుండా బ్యాగులాంటి ఆకారంలో ఉంటుంది. అది బ్యాగని కూడా చెప్పలేం. అది ఉన్న పోజిషన్ గురించి ఆ విగ్రహాన్ని చూసిన వారైతే మాట్లాడలేరు. పూర్తి నగ్నంగా వున్న స్త్రీ, పురుషుల లైంగిక అవయవాలు కనిపించకుండా అది అడ్డుగా ఉంటుందంతే. ‘మోదీ కూడా కోణార్క్ ఆలయంపైనున్న విగ్రహాలను పరికించి చూడకపోయి ఉండవచ్చుగానీ, ఆయనకు బ్రీఫింగ్ ఇచ్చిన ప్రజా సంబంధాల అధికారులు చరిత్ర తెలియని వారై ఉంటారు’ అని మరో ట్విట్టర్ ట్వీట్ చేశారు. ‘ఏదైమైనా మీరు భారత చరిత్ర చదువుకోవాలి గురువు గారూ!’ ఇంకొకరు ట్వీట్ చేశారు. నరేంద్ర మోదీ గతంలో కూడా తక్షశిల, గయా గురించి తప్పుగా మాట్లాడారు.