మోదీకి కోణార్క్ టెంపుల్ తెలియదా!
న్యూఢిల్లీ: భారతీయ సాంస్కృతిక చరిత్ర గురించి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అమెరికాలో మాట్లాడుతూ మళ్లీ తప్పులో కాలేశారు. చరిత్ర పట్ల ఆయనకున్న అవగాహనను ట్విట్టర్‌లో కొంత మంది అవహేళన చేశారు. ఒడిశాలోని కోణార్క్ ఆలయం అంటే మోదీ, మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియం అనుకున్నట్టున్నారంటూ జోకులు వేశారు. భారతీయ సాంస్కతిక సంపద అప్పగింత సందర్భంగా వాషింగ్టన్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో నరేంద్ర మోదీ మాట్లాడుతూ కోణార్క్ ఆలయం గురించి ప్రస్తావించారు. నేటి ఆధునిక యువతుల్లాగా మినీ స్కర్టులు ధరించిన, పర్సులను పట్టుకున్న విగ్రహాలను రెండు వేల సంవత్సరాల క్రితమే మన కళాకారులు చెక్కారని మోదీ చెప్పారు.
మోదీ మాటల్లో మొదటి తప్పు కోణార్క్ ఆలయం రెండు వేల సంవత్సరాల క్రితంది కాదు. 13వ శతాబ్దంలో, అంటే 1250 ప్రాంతంలో నిర్మించింది. దాన్ని నిర్మించి నేటికి 766 సంవత్సరాలు దాటిందంతే. రెండో తప్పు మినీ స్కర్టుల గురించి మాట్లాడం. కోణార్క్ ఆలయంపై ఎక్కువగా స్త్రీ, పురుషుల నగ్న లైంగిక దశ్యాలే ఉంటాయి.
కొన్ని స్త్రీ విగ్రహాలకు మాత్రమే నడుముకు నగలు ధరించినట్లుగా అచ్చాదన ఉంటుంది. వాటిని ఆధునిక స్కర్టులతో పోల్చలేం. ‘ఇంకా నయం కోణార్క్ విగ్రహాల్లోలాగా కాకుండా మన ఆధునిక స్త్రీలు మినీ స్కర్టులు ధరించి వారి మానాన్ని కాపుడుకుంటున్నారు’ అని ఓ ట్విట్టర్ వ్యాఖ్యానించారు. ముచ్చటగా మూడో తప్పు పర్సు గురించి మాట్లాడడం. అది పర్సులాగా కాకుండా బ్యాగులాంటి ఆకారంలో ఉంటుంది. అది బ్యాగని కూడా చెప్పలేం. అది ఉన్న పోజిషన్ గురించి ఆ విగ్రహాన్ని చూసిన వారైతే మాట్లాడలేరు. పూర్తి నగ్నంగా వున్న స్త్రీ, పురుషుల లైంగిక అవయవాలు కనిపించకుండా అది అడ్డుగా ఉంటుందంతే. ‘మోదీ కూడా కోణార్క్ ఆలయంపైనున్న విగ్రహాలను పరికించి చూడకపోయి ఉండవచ్చుగానీ, ఆయనకు బ్రీఫింగ్ ఇచ్చిన ప్రజా సంబంధాల అధికారులు చరిత్ర తెలియని వారై ఉంటారు’ అని మరో ట్విట్టర్ ట్వీట్ చేశారు. ‘ఏదైమైనా మీరు భారత చరిత్ర చదువుకోవాలి గురువు గారూ!’ ఇంకొకరు ట్వీట్ చేశారు. నరేంద్ర మోదీ గతంలో కూడా తక్షశిల, గయా గురించి తప్పుగా మాట్లాడారు.