సాగర్ రెండో జోన్‌కు సాగునీరు సరఫరా చేయాలి
కల్లూరు : నాగార్జున సాగర్ ఎడమ కాల్వ రెండో జోన్ పరిధిలోని ఆయకట్టు రైతులకు ఖరీఫ్ సీజన్‌కు సత్వరమే సాగునీరందించాలని కల్లూరు డివిజన్ డిస్ట్రిబ్యూటరీ కమిటీ అధ్యక్షుడు కొండపల్లి శ్రీమన్నారాయణ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కల్లూరులో విలేకరులతో ఆదివారం ఆయన మాట్లాడారు. సాగర్ ఎడమ కాల్వ మొదటి జోన్ పరిధిలో సాగర్ ఆయకట్టు భూములు రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిందని, అదే క్రమంలో రెండో జోన్‌కు కూడా సత్వరమే సాగునీరు అందించాల్సిన అవసరం ఉందని అన్నారు. ఇప్పటికే రైతులు సరైన వర్షాలు లేక నష్టపోయారని పేర్కొన్నారు.
ప్రాజెక్ట్ ఎగువ భాగంలోని భారీ నీటిపారుదల ప్రాజెక్ట్‌లో పుష్కలంగా వరద నీరు చేరి నీటిమట్టం పెరిగిన నేపథ్యంలో అధికారులు తగిన విధంగా నిర్ణయం తీసుకుని షెడ్యూల్ ప్రకారం ఆగస్టు 15 నుంచి రెండో జోన్‌కు సాగునీరు విడుదల చేయాలని కోరారు. సాగు నీటి విడుదల విషయంలో టేకులపల్లి సర్కిల్ ఎస్ఈ అప్పలనాయడు రెండో జోన్‌కు సాగునీరు విడుదల చేసే విషయమై ఈనెల 15 తర్వాత నిర్ణయం తీసుకుంటామని ప్రకటించడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు.
సాగర్ ప్రాజెక్ట్ పరిధిలో మొదటి జోన్ ఆయకట్టు రైతులకు నీటి పంపిణీ విషయంలో ఏ విధంగైతే వాటా హక్కు ఉందో ఆదే ధామాషా ప్రకారం రెండో జోన్ ఆయకట్టు రైతులకు నీటి సరఫరా విషయంలో వాటా హక్కు ఉందని పేర్కొన్నారు. రైతులు రెండో జోన్ పరిధిలో సాగర్ జలాలు వస్తాయనే ఆశతో వరిసాగుకు వేలాది ఎకరాల్లో నార్లు ముమ్మరంగా పోసి సిద్ధంగా ఉన్నారన్నారు. ప్రభుతం, ఎన్ఎస్పీ అధికారులు స్పందించి రెండో జోన్‌కు నీటిని విడుదల చేయాలని కోరారు.