విమానాల్లో ఇక ఒళ్లు దగ్గరపెట్టుకోవాల్సిందే!
సియోల్: ఇటీవల ఫ్లైట్లలో ఉన్మాదులు రెచ్చిపోతున్న సందర్భాలు పెరిగిపోతున్నాయి. విమానం గాల్లో ఉండగానే సిబ్బంది, తోటి ప్రయాణికులపై సైకోలు దాడులకు పాల్పడుతున్న ఘటనలు చూస్తున్నాం. రెచ్చిపోతున్న ఇలాంటి దుండగులను ఆపడం విమాన సిబ్బందికి తలకు మించిన భారంగా మారింది. అయితే ఇక నుంచి మాత్రం ఇలాంటి వారు విమాన ప్రయాణాల్లో కాస్త ఒళ్లు దగ్గర పెట్టుకోవాల్సి ఉంటుందని దక్షిణ కొరియా ఎయిర్ లైన్స్ చెబుతోంది.
విమానాల్లో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కట్టుదిట్టమైన చర్యలకు దిగుతోంది దక్షిణ కొరియా. ప్రయాణికులు రెచ్చిపోయి ప్రవర్తిస్తున్న సమయంలో విమాన సిబ్బంది ఇక నుంచి స్టన్ గన్స్ వాడుతారని కొరియన్ ఎయిర్ లైన్స్ స్పష్టం చేసింది. దీనికి సంబంధించి సిబ్బందికి ప్రత్యేక తర్ఫీదు ఇస్తున్నట్లు వెల్లడించింది. ఇక నుంచి ఇలాంటి ఘటనలు ఎదురైనప్పుడు స్టన్ గన్స్ వాడటానికి ఎలాంటి సిబ్బందికి అభ్యంతరం ఉండదని వెల్లడించారు.
గతవారం అమెరికా సింగర్ మార్క్స్ వియత్నాం నుంచి దక్షిణ కొరియాకు ప్రయాణిస్తున్న సమయంలో ఓ సైకో ఇలాగే రెచ్చిపోయాడు. ఆ సైకోను బంధించడంలో విమాన సిబ్బంది విఫలం కావడంతో మార్క్స్ రంగంలోకి దిగాల్సి వచ్చింది. దీనిపై సోషల్ మీడియాలో.. విమాన సిబ్బందికి రక్షణ విషయంలో కనీస అవగాహన ఉండటం లేదని మార్క్స్‌తో పాటు అతడి భార్య విమర్శలు గుప్పించారు. దీనిపై కొరియన్ ఎయిర్‌లైన్స్ అధికారులు స్పందిస్తూ.. సిబ్బంది దగ్గర అప్పుడు టేజర్ గన్స్ ఉన్నప్పటికీ వాటిని అత్యంత క్లిష్టమైన, ప్రయాణికుల ప్రాణాలకు ముప్పు ఉన్నప్పుడే వాడాలని ఆదేశాలు ఉన్నందున వారు వాటిని ఉపయోగించలేదని వెల్లడించారు. ఈ నేపథ్యంలోనే సిబ్బందికి స్టన్ గన్స్ వాడే అవకాశం కల్పించారు.