Korukkupeta
-
పగడ్బందీ వ్యూహంతో వీరప్పన్‌ను హతమార్చాం
సాక్షి, చెన్నై(కొరుక్కుపేట): పగడ్బందీ ప్రణాళికలు, స్పెషల్ టాస్క్‌ఫోర్స్ బృందం నేర్పుతో గంధపు చెక్కల స్మగ్లర్ వీరప్పన్‌ను హతమార్చామని తమిళనాడు స్పెషల్ టాస్క్‌ఫోర్స్ (ఎస్టీఎఫ్)కి నాయకత్వం వహించిన మాజీ ఐపీఎస్ అధికారి కె.విజయ్ కుమార్ తెలిపారు. మంగళవారం చెన్నై తరమణిలోని ఏసియన్ కాలేజ్ ఆఫ్ జర్నలిజంలో జరిగిన కార్యక్రమంలో.. మాజీ ఐపీఎస్ అధికారి విజయకుమార్ రాసిన (వీరప్పన్ ఛేజింగ్ ది బ్రిగాండ్) పుస్తకం ఆధారంగా 20 ఎపిసోడ్ల ఆడియో రికార్డులను ఆసియావిల్లే వ్యవస్థాపకుడు, సీఈఓ తుహిన్ ఆవిష్కరించారు. మాట్లాడుతున్న మాజీ ఐపీఎస్ అధికారి విజయ్ కుమార్ ఈ సందర్భంగా థ్రిల్లింగ్ ట్రూ–క్రైమ్ పై ఆడిబుల్ ఒరిజినల్ పాడ్‌కాస్ట్ సర్వీస్‌ను ప్రారంభించారు. ఇందులో 1952లో గోపీనాథంలో పుట్టినప్పటి నుంచి 2004లో మరణించే వరకు వీరప్పన్ జీవితానికి సంబంధించిన అంశాలు మాజీ ఐపీఎస్ కె. విజయ్ కుమార్ రాసిన పుస్తకం ఆధారంగా రూపొందించామని వివరించారు. అనంతరం ఇందులో పాల్గొన్న విజయకుమార్ మాట్లాడుతూ మూడు రాష్ట్రాల పోలీసులను ముప్పుతిప్పలు పెట్టిన వీరప్పన్‌ను ఎలాగైనా మట్టికరిపించాలనే లక్ష్యంతో పక్కా వ్యూహంతో హతమార్చగలిగామన్నారు. ఇందులో ఏకే 47 గన్ను వినియోగించామని చెప్పారు. ఎంతో మంది పోలీసులను, సాధారణ ప్రజలను కిరాతకంగా వీరప్పన్ చంపారని గుర్తు చేశారు. లా అండ్ ఆర్డర్‌కు ఎవరూ భంగం కలిగించినా ఇలాంటి పరిస్థితే ఎదురవుతుందే విషయాన్ని ఈ ఆపరేషన్ ద్వారా ప్రపంచానికి తెలిసేలా చేశాం.. అని ఆయన పేర్కొన్నారు. -
మహానాడుకు తరలిరండి
కొరుక్కుపేట: ఉగాది పేరుతో 28న నగరంలో నిర్వహిం చనున్న తెలుగు మహానాడుకు తెలుగువారంతా తరలివచ్చి విజయవంతం చేయాలని ఆలిండియా తెలుగు ఫెడరేషన్( ఏఐటీఎఫ్) అధ్యక్షులు డాక్టర్ సీఎంకే రెడ్డి పిలుపునిచ్చారు. తెలుగు మహానాడుకు తెలుగు క్రైస్తవ సంఘాల నాయకులు మద్దతు పలకడం ఆనందంగా ఉందని ఆయన పేర్కొన్నారు. మంగళవారం ఏఐటీఎఫ్ ప్రధానకార్యాలయంలో తెలుగు క్రైస్తవ సంఘాల పాస్టర్లతో డాక్టర్ సీఎంకే రెడ్డి సమావేశమయ్యారు. టామ్స్ వ్యవస్థాపకులు గొల్లపల్లి ఇజ్రాయేల్ అధ్యక్షత ఈ కార్యక్రమం జరిగింది. ముందుగా టామ్స్ అధ్యక్షులు నేలటూరి విజయకుమార్ స్వాగతోపన్యాసం చేశారు. రాష్ట్రంలో తెలుగువారి హక్కుల పరిరక్షణ కోసం డాక్టర్ సీఎంకే రెడ్డి తలపెట్టిన తెలుగు మహానాడుకు ప్రతి ఒక్కరు తరలిరావాలని కోరారు. గొల్లపల్లి ఇజ్రాయేల్ మాట్లాడుతూ తెలుగువారి సమస్యల పరిష్కారానికి తెలుగుమహానాడు వేదికకానుందని అందువల్ల తెలుగువారంతా మహానాడుకు తరలిరావాలని కోరు. అదేవిధంగా ఏఐటీఎఫ్ ఉపాధ్యక్షులు చిరంజీవి,ప్రధాన కార్యదర్శి నందగోపాల్ మాట్లాడుతూ 30 శాతం పైబడి తెలుగు ప్రజలు ఉన్న ఈ రాష్ర్టంలో తెలుగు వారి హక్కులను ప్రభుత్వాలు హరిస్తున్నాయని ఆందోళన వ్యక్తంచేశారు. అనంతరం క్రైస్తవ సంఘాల నాయకులు మాట్లాడుతూ తమవంతు పూర్తిసహకారం అందిస్తామని అన్నారు. చివరిగా డాక్టర్ సీఎంకే రెడ్డి మాట్లాడతూ తెలుగు మహానాడును ఈనెల 28న చెన్నై మీనంబాక్కంలోని ఏఎం జైన్ కాలేజీ గ్రౌండ్స్‌లో నిర్వహిస్తున్నామని అన్నారు.దీనికి తెలుగువారంతా తరలివచ్చి రాష్ట్ర ప్రభుత్వానికి తెలుగువారిసంఖ్య బలాన్ని చాటాలని పిలుపునిచ్చారు.గత 50 ఏళ్ళలో రాష్ట్ర ప్రభుత్వాలు తెలుగువారికి ఎటువంటి మంచి పనిచేయలేదని అన్నారు. ఏఐటీఎఫ్ యూత్వింగ్ ప్రెసిడెంట్ టి.సురేష్, కోశాధికారి శంకరన్, టామ్స్‌కు చెందిన స్వర్ణజయపాల్, ఐసయ్య, దేవదానం పాల్గొన్నారు. -
ఐఏఎస్‌ల బదిలీలు
కొరుక్కుపేట: రాష్ట్రంలోని పలు జిల్లాల్లో పని చేస్తున్న ఐఏఎస్ అధికారులను బదిలీ చేస్తూ శుక్రవారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. జాబితాను ప్రభుత్వ చీఫ్ సెక్రటరీ కె.జ్ఞానదేశికన్ విడుదల చేశారు. కో ఆపరేటివ్ సొసైటీస్ రిజిస్ట్రారర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్న ఆర్.కిర్లోష్ కుమార్ టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్ డెరైక్టరుగా బదిలీ అయ్యారు. తిరుచిరాపల్లి జిల్లా కలెక్టర్‌గా విధులు నిర్వహిస్తున్న జయశ్రీ మురళీధరన్ కో ఆపరేటివ్ సొసైటీస్ రిజిస్ట్రారర్‌గా బదిలీ అయ్యారు. తేనిజిల్లా కలెక్టర్‌గా పని చేస్తున్న డాక్టర్ కేఎస్పళనిస్వామి తిరుచిరాపల్లి జిల్లా కలెక్టర్‌గా బదిలీ అయ్యారు. దిండుగల్‌జిల్లా కలెక్టర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్న ఎన్.వెంకటాచలం తేని జిల్లా కలెక్టర్‌గా బదిలీ అయ్యారు. విరుదునగర్ జిల్లా కలెక్టర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్న టిఎన్ హరిహరన్నున దిండుకల్ కలెక్టర్‌గా బదిలీ చేశారు. శివగంగై జిల్లా కలెక్టర్ వి.రాజారామన్ విరుదునగర్ జిల్లా కలెక్టర్‌గా బదిలీ అయ్యారు. నాగపట్టణం జిల్లా కలెక్టర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్న టి.మునుసామిని శివగంగై జిల్లా కలెక్టర్‌గా బదిలీ చేశారు. స్కూలు ఎడ్యుకేషన్ డిపార్టుమెంట్ ప్రభుత్వ డెప్యూటీ సెక్రటరీ ఎస్.పళనిస్వామిని నాగపట్టణం జిల్లా కలెక్టర్‌గా బదిలీ చేశారు. -
జోహార్ అంబేద్కర్
కొరుక్కుపేట, న్యూస్‌లైన్: భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీ.ఆర్.అంబేద్కర్ 123వ జయంతి వేడుకలు రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా జరుపుకున్నారు. అంబేద్కర్ సేవలను కీర్తిస్తూ పలు సాంస్కృతిక కార్యక్రమాలు అబ్బురపరిచాయి. బడుగు బలహీన వర్గాల ఆరాధ్యుడైన అంబేద్కర్ అందరికీ ఆదర్శమని వివరించారు. చెన్నై నగరంలోనూ అంబేద్కర్ జయంతి కోలాహలంగా జరిగింది. రాష్ట్ర ముఖ్యమంత్రి జయలలిత డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులను అర్పించారు. అదే విధంగా టామ్స్ సంస్థ ఆధ్వర్యంలో సోమవారం చెన్నై పట్టినపాక్కంలోని మనిమండపంలో అంబేద్కర్ విగ్రహానికి పూల మాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. కార్యక్రమంలో టామ్స్ అధ్యక్షుడు ఇజ్రాయేల్, ప్రధాన కార్యదర్శి ఎన్.విజయకుమార్, వైస్ ప్రెసిడెంట్ ఆశీర్వాదం, టామ్స్ స్టేట్ సెక్రటరీ బి.ఎన్.బాలాజీ, ప్రభుత్వ డెప్యూటీ సెక్రటరీ జి.పి.నాగూర్, తమిళనాడు తెలుగు యువ శక్తి అధ్యక్షుడు కేతిరెడ్డి జగదీశ్వర్ రెడ్డి, రచయిత ప్రణవి, పారిశుద్ధ్య కార్మికులు రాష్ట్ర కార్యదర్శి ఎల్.సుందరం పాల్గొన్నారు. పారిశుద్ధ్య కార్మికుల ఉద్యోగుల ఆధ్వర్యంలో... చెన్నై కార్పొరేషన్ పారిశుద్ధ్య కార్మికులు, ఉద్యోగుల అసోసియేషన్ ఆధ్వర్యంలో చెన్నై, హార్బర్లో డాక్టర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. సం ఘం అధ్యక్షుడు జెపి నాగభూషణంతోపాటు కేసీ కొండ య్య, గోపి, వేణు, హజరత్ దేవదానం తదితరులు పాల్గొన్నారు. ఎంఆర్పీఎస్ ఆధ్వర్యంలో జరిగిన అంబేద్కర్ 123వ జయంతి వేడుకల్లో అధ్యక్షుడు ఆదిశేషయ్య, తమిళనాడు తెలుగు యువశక్తి అధ్యక్షుడు కేతిరెడ్డి జగదీశ్వర్ రెడ్డి పాల్గొన్నారు. ద్రావిడ దేశం ఆధ్వర్యంలో చెన్నైలోని హార్బర్లో జరిగిన కార్యక్రమంలో ద్రవిడ దేశం అధ్యక్షుడు వి.కృష్ణారావు పాల్గొన్నారు. అంబేద్కర్ సేవలు చిరస్మరణీయం తిరువళ్లూరు: ఎస్సీ, ఎస్టీల కోసం అంబేద్కర్ చేసిన సేవలు చిరన్మరణీయమని పలువురు నేతలు వ్యాఖ్యానించారు. తిరువళ్లూరు జిల్లా వ్యాప్తంగా బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతిని ఘనంగా నిర్వహించారు. ఆవడిలోని రామలిం గాపురం తెలుగు కాలనీలో ఫ్రెండ్స్ ఆఫ్ లవ్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో తెలుగు ప్రముఖులు దేవయ్య, డేవిడ్, రవి, ఆంటోని, బాబు, భాస్కర్ పాల్గొన్నారు. తిరువళ్లూరులో జరిగిన కార్యక్రమంలో పీబీకే నేతలు మహ, శ్రీధ ర్, సీపీకుమార్తో పాటు పలువురు పీబీకే నేతలు హాజరయ్యారు. అదే విధంగా వీసీకే ఆధ్వర్యంలో అంబేద్కర్ జయంతిని ఘనంగా నిర్వహించారు. మొదట ఊరేగింపుగా వెళ్లిన నేతలు, ఆయిల్‌మిల్ వద్ద అంబేద్కర్ విగ్రహనికి పూల మాల వేసి నివాళి అర్పించారు. ఈ కార్యక్రమంలో దళపతి సుందరం, సిద్దార్థతోపాటు ఇతర నేతలు పాల్గొన్నారు. దీం తో పాటు బీఎస్పీ ఆధ్వర్యంలో అంబేద్కర్ జయంతి ఉత్స వాలను ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో పలువురు పార్టీ నేతలు,పెద్ద ఎత్తున కార్యకర్తలు హాజరయ్యారు. -
మారథాన్‌కు విశేష స్పందన
కొరుక్కుపేట, న్యూస్‌లైన్:మెదడువాపు సమస్యతో బాధపడుతున్న చిన్నారుల సహాయార్థం నాథెల్లా జ్యువెలరీస్, డౌన్ టు డస్క్ మారథాన్ - 2014 సంయుక్తంగా ఆదివారం ఉదయం చేపట్టిన డౌన్ టు డస్క్ మారథాన్‌కు విశేష స్పందన లభించింది. ఈ కార్యక్రమాన్ని చెన్నై గిండీలోని ఐఐటీ- మద్రాసు ఆవరణలో ప్రముఖ సినీ నటులు, డౌన్ టు డస్క్ బ్రాండ్ అంబాసిడర్లైన కార్తీ, అరవింద్ స్వామి జెండా ఊపి ప్రారంభించారు. ఈ మారథాన్‌లో రన్ మారథాన్, సైకిల్ మారథాన్ నిర్వహించారు. ఉదయం 8.30 గంటల రన్ మారథాన్‌లో పెద్ద సంఖ్యలో చిన్నారులు, యువకులు, ప్రజలు పాల్గొన్నారు. మధ్యాహ్నం 2.30 గంటలకు నిర్వహించిన సైకిల్ మారథాన్ చెన్నై ఐఐటీ - మద్రాసు నుంచి మహాబలిపురం వరకు సాగింది. దీనిని చెన్నై, పోలీసు జాయింట్ కమిషనర్ రాజేష్ దాస్, టీపీఎస్ డెరైక్టర్ శ్రీనాథ్ రాజెం జెండా ఊపి ప్రారంభించారు. రన్ మారథాన్‌లో, సైకిల్ మారథాన్‌లో 6,300 మంది పాల్గొని మారథాన్‌ను విజయవంతం చేశారు. డౌన్ టు డస్క్ మారథాన్ - 2014 నిర్వాహకులు మాట్లాడుతూ బాల సంజీవని సిరెబ్రల్ పల్సీ రెహబ్ సెంటర్లోని మెదడు సమస్యతో బాధపడుతున్న చిన్నారులకు థెరపీ సౌకర్యార్థం మారథాన్‌లో వచ్చిన మొత్తాన్ని విరాళంగా అందించనున్నామన్నారు. పెద్ద సంఖ్యలో యువకులు, చిన్నారులు పాల్గొని మారథాన్‌ను విజయవంతం చేయడం సంతోషంగా ఉందని, వారం దరికీ అభినందనలు తెలిపారు. -
ఆరోగ్యమే మహాభాగ్యం
కొరుక్కుపేట, న్యూస్‌లైన్: ఆరోగ్యమే మహాభాగ్యమని, ప్రతి ఒక్కరూ ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఇన్‌కంటాక్స్ కమిషనర్ మురళీ కుమార్ పేర్కొన్నారు. చెన్నై తెలుగు అసోసియేషన్, వలసరవాక్కం ఆధ్వర్యంలో ఉచిత సూపర్ స్పెషాలిటీ హెల్త్ క్యాంప్‌ను నిర్వహించారు. చెన్నై, వలసరవాక్కంలోని ఎస్జే కల్యాణ మండపంలో ఏర్పాటు చేసిన ఉచిత వైద్య శిబిరాన్ని మురళీకుమార్ ప్రారంభించారు. చెన్నై తెలుగు అసోసియేషన్, గ్లోబల్ హెల్త్ సిటీ సంయుక్తంగా ఏర్పాటు చేసిన ఉచిత వైద్య శిబిరానికి అసోసియేషన్ సభ్యుల కుటుంబ సభ్యులు, నగరంలోని పలు ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో హాజరై వైద్య పరీక్షలు చేయించుకున్నారు. అసోసియేషన్ అధ్యక్షులు కేఆర్కే బాలాజీరావు అధ్యక్షత వహించారు. ఈ కార్యక్రమంలో మురళీకుమార్ మాట్లాడుతూ ప్రస్తుతం ప్రతి ఒక్కరు వ్యాపారపరంగా, ఉద్యోగ పరంగా బిజీ బిజీగా గడపడం వల్ల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవడం మరిచిపోతున్నారని అన్నారు. ఆరోగ్యమే మహాభాగ్యమని ఆరోగ్య నియమాలు పాటిస్తూ ఆరోగ్యాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. ప్రపంచ వ్యాప్తంగా పేరుగాంచిన గ్లోబల్ హెల్త్ సిటీ ఆసుపత్రి వైద్యులు ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించడం సంతోషంగా ఉందన్నారు. 99 శాతం మంది ఆసుపత్రికి రాకుండా వైద్యంపై అమూల్యమైన సలహాలను సూచనలు అందించిన గ్లోబల్ హెల్త్ సిటీ వైస్ ప్రెసిడెంట్ భాస్కర్ రెడ్డిని ప్రత్యేకంగా అభినందించారు. అనంతరం భాస్కర్ రెడ్డి మాట్లాడుతూ ప్రపంచంలోనే భారతీయ వైద్యులు మొటి స్థానంలో ఊన్నారన్నారు. ప్రజల్లో వ్యాధుల పట్ల, వైద్య చికిత్సల పట్ల అవగాహన పెంచుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ప్రతిరోజూ గంట పాటు క్రమం తప్పకుండా వ్యాయా మం చేయాలని, దీంతోపాటు ఆహార అలవాట్లు మార్పులు చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమానికి ప్రత్యేక అతిథిగా సినీ నటుడు, మురళీ మోహన్ హాజరయ్యారు. చెన్నై తెలుగు అసోసియేషన్ నిర్వాహకులను, గ్లోబల్ హెల్త్ సిటీ వైద్య బృందాన్ని ఆయన అభినందించారు. వైద్య శిబిరంలో న్యూరాలజిస్టు డాక్టర్లోకేష్, హార్ట్ స్పెషలిస్టు గురుప్రసాద్, వెన్నెముక, ఆర్థోపెడిక్ వైద్యులు ఫణికిరణ్, అంకాలజిస్టు సుగుణ ప్రేమ్‌కుమార్ పాల్గొని సూచనలు అందించారు. బీపీ, షుగర్, గుండె, మెదడు, నరాలు, క్యాన్సర్ తదితర పరీక్షలు చేసి, సూచనలు అందించారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు.