ఆరోగ్యమే మహాభాగ్యం
Published Mon, Sep 23 2013 3:57 AM | Last Updated on Fri, Sep 1 2017 10:57 PM
కొరుక్కుపేట, న్యూస్‌లైన్: ఆరోగ్యమే మహాభాగ్యమని, ప్రతి ఒక్కరూ ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఇన్‌కంటాక్స్ కమిషనర్ మురళీ కుమార్ పేర్కొన్నారు. చెన్నై తెలుగు అసోసియేషన్, వలసరవాక్కం ఆధ్వర్యంలో ఉచిత సూపర్ స్పెషాలిటీ హెల్త్ క్యాంప్‌ను నిర్వహించారు. చెన్నై, వలసరవాక్కంలోని ఎస్‌జే కల్యాణ మండపంలో ఏర్పాటు చేసిన ఉచిత వైద్య శిబిరాన్ని మురళీకుమార్ ప్రారంభించారు. చెన్నై తెలుగు అసోసియేషన్, గ్లోబల్ హెల్త్ సిటీ సంయుక్తంగా ఏర్పాటు చేసిన ఉచిత వైద్య శిబిరానికి అసోసియేషన్ సభ్యుల కుటుంబ సభ్యులు, నగరంలోని పలు ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో హాజరై వైద్య పరీక్షలు చేయించుకున్నారు.
అసోసియేషన్ అధ్యక్షులు కేఆర్‌కే బాలాజీరావు అధ్యక్షత వహించారు. ఈ కార్యక్రమంలో మురళీకుమార్ మాట్లాడుతూ ప్రస్తుతం ప్రతి ఒక్కరు వ్యాపారపరంగా, ఉద్యోగ పరంగా బిజీ బిజీగా గడపడం వల్ల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవడం మరిచిపోతున్నారని అన్నారు. ఆరోగ్యమే మహాభాగ్యమని ఆరోగ్య నియమాలు పాటిస్తూ ఆరోగ్యాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. ప్రపంచ వ్యాప్తంగా పేరుగాంచిన గ్లోబల్ హెల్త్ సిటీ ఆసుపత్రి వైద్యులు ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించడం సంతోషంగా ఉందన్నారు.
99 శాతం మంది ఆసుపత్రికి రాకుండా వైద్యంపై అమూల్యమైన సలహాలను సూచనలు అందించిన గ్లోబల్ హెల్త్ సిటీ వైస్ ప్రెసిడెంట్ భాస్కర్ రెడ్డిని ప్రత్యేకంగా అభినందించారు. అనంతరం భాస్కర్ రెడ్డి మాట్లాడుతూ ప్రపంచంలోనే భారతీయ వైద్యులు మొటి స్థానంలో ఊన్నారన్నారు. ప్రజల్లో వ్యాధుల పట్ల, వైద్య చికిత్సల పట్ల అవగాహన పెంచుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ప్రతిరోజూ గంట పాటు క్రమం తప్పకుండా వ్యాయా మం చేయాలని, దీంతోపాటు ఆహార అలవాట్లు మార్పులు చేసుకోవాలని సూచించారు.
ఈ కార్యక్రమానికి ప్రత్యేక అతిథిగా సినీ నటుడు, మురళీ మోహన్ హాజరయ్యారు. చెన్నై తెలుగు అసోసియేషన్ నిర్వాహకులను, గ్లోబల్ హెల్త్ సిటీ వైద్య బృందాన్ని ఆయన అభినందించారు. వైద్య శిబిరంలో న్యూరాలజిస్టు డాక్టర్‌లోకేష్, హార్ట్ స్పెషలిస్టు గురుప్రసాద్, వెన్నెముక, ఆర్థోపెడిక్ వైద్యులు ఫణికిరణ్, అంకాలజిస్టు సుగుణ ప్రేమ్‌కుమార్ పాల్గొని సూచనలు అందించారు. బీపీ, షుగర్, గుండె, మెదడు, నరాలు, క్యాన్సర్ తదితర పరీక్షలు చేసి, సూచనలు అందించారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు.
Advertisement