koyambathur
-
అక్షరాలా సహాయం
తమిళనాడు, కోయంబత్తూరులోని ఓ అన్నాచెల్లికి ఎదురైన కరోనా కష్టాల గురించి జూలై 24వ తేదీన ఒక వీడియో సోషల్ మీడియాలో పోస్ట్ అయింది. ఆ వీడియోలో కోయంబత్తూరులోని మరుధామలైకి చెందిన ఆరేళ్ల జోయ, ఏడేళ్ల తన్వీర్ అక్షరాలు కొనడానికి రోడ్డు మీద పూలమ్ముతున్నారు. చక్కగా గులాబీ రంగు ముఖమల్ డ్రస్ వేసుకుని అదే రంగు క్యాప్ పెట్టుకున్న జోయ, నీలం రంగు డ్రస్, అదే రంగు క్యాప్‌తో తన్వీర్ పూల కవర్లు పట్టుకుని రోడ్డు మీద వచ్చే కార్లు, బైకు చోదకులను ఆకర్షిస్తున్నారు. పిల్లలు చూడడానికి ముచ్చటగా ఉన్నారు. ఎర్రటి ఎండలో రోడ్డు మీద నిలబడి వచ్చే వాహనాలను ఆపి పూలు కొనమని అడుగుతున్నారు. వాళ్లకు కొంచెం దూరంలో రోడ్డు పక్కన ఒక వ్యక్తి కూర్చుని పూలను చిన్న చిన్న కవర్లలో పోస్తున్నాడు. అతడి పేరు షబ్బీర్. ఆ పిల్లల తండ్రి. ‘చిన్న పిల్లల చేత పూలమ్మించడం ఏమిటి’ అని అడిగిన వాళ్లకు అతడు చెబుతున్న సమాధానం ఆన్లైన్ క్లాసులు. ‘‘నేను రైళ్లలో పైనాపిల్ ముక్కలు, ఇతర చిరుతిండ్లు అమ్మేవాడిని. ఇప్పుడు లాక్డౌన్ కారణంగా రైళ్లు లేవు, తిరుగుతున్న రైళ్లలో కూడా మాలాంటి చిరుతిండి అమ్ముకునే వాళ్లకు అనుమతి లేదు. బతకడానికి ఏదో ఒకటి చేయాలి కదా! అందుకే పూలమ్ముతున్నాను. లాక్డౌన్ నుంచి పరిస్థితి చక్కబడే లోపు స్కూళ్ల వాళ్లు ఆన్లైన్లో పాఠాలు చెప్తున్నారు. ఇంకా ఎక్కువ ఖర్చవుతుంది. నాకు మరో మార్గం కనిపించలేదు’’ అన్నాడు షబ్బీర్. ఆ వీడియో చూసి చాలా మంది సామాన్యులతోపాటు ధర్మపురి పార్లమెంట్ సభ్యుడు సెంథిల్ కుమార్ కూడా స్పందించారు. పిల్లల ఫీజులు కట్టడానికి ముందుకు వచ్చారు. సోమవారం సాయంత్రానికి షబ్బీర్ బ్యాంకు అకౌంట్లో ఒక లక్షా ముప్పై ఆరు వేల రూపాయలు జమయ్యాయి. జోయ, తన్వీర్ చదువు కోసం ఆర్థిక సహాయం చేసిన వాళ్లు షబ్బీర్‌కు ‘‘ఎంత కష్టమైనా సరే, తండ్రిగా నువ్వు శ్రమ పడు. అంతేకాని పిల్లలను రోడ్డు మీదకు తీసుకురావద్దు’’ అని హితవు పలికారు. -
ఫిబ్రవరి 5న పెళ్లి.. వస్తే క్వార్టర్ ఫ్రీ
సాక్షి, చెన్నై : తమిళనాడు కోయంబత్తూరులో ఓ జంట విభిన్నమైన రీతిలో వివాహ ఆహ్వాన పత్రికను ముద్రించింది. తమ పెళ్లికి వస్తే క్వార్టర్ ఇస్తామంటూ పెళ్లి పత్రికలో ముద్రించారు. ఇది సోషల్ మీడియాలో శనివారం నుంచి వైరల్‌గా మారింది. వివాహ ఆహ్వాన పత్రికలను ఇటీవల విభిన్నమైన ఆలోచనలు, వ్యతాసమైన డిజైన్లతో తయారుచేస్తున్నారు. ఇలా ఉండగా కోయంబత్తూరులో వచ్చే ఫిబ్రవరి 5వ తేదీ జరగనున్న ఈ వివాహ మహోత్సవానికి వినూత్నంగా ఆహ్వానం పలికారు. ‘‘మా పెళ్లికి రండి.. వచ్చే వివాహితులకు సైడ్ డిష్‌తో పాటు ఒక క్వార్టర్, అవివాహితులకు రెండు క్వార్టర్లు అందజేస్తాం’’ అంటూ ఆహ్వానం పలికారు. అయితే ఈ ఆహ్వాన పత్రిక అసలైనదా లేదా నకిలీదా అనే విషయం తెలియలేదు. -
మహిళ శవాన్ని పీక్కుతున్న పిల్లి
సాక్షి ప్రతినిధి, చెన్నై: అనాథ శవాన్ని పిల్లి పీక్కుతింటున్నా పట్టించుకోని దారుణ సంఘటన కోయంబత్తూరు జిల్లా ప్రభుత్వ ఆస్పత్రి నిర్లక్ష్యానికి పరాకాష్టగా నిలిచింది. కోయంబత్తూరు జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిలోని మహిళా వార్డులో ఒక మహిళా రోగి చికిత్స పొందుతూ సోమవారం రాత్రి 9 గంటల ప్రాంతంలో మృతిచెందింది. అయితే మృతురాలి వివరాలు తెలియకపోవడంతో మార్చురీకి తరలించకుండా వార్డులో ఒక మూల నిర్లక్ష్యంగా నేలపై పడేశారు. ఆస్పత్రి పరిసరాల్లో తిరిగే పిల్లి శవం కాలి భాగాన్ని తినడం ప్రారంభించింది. పరిసరాల్లోని రోగులు సిబ్బంది దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోకపోవడంతో ఆందోళన చేపట్టారు. దీంతో శవాన్ని మార్చురీకి తరలించారు. -
విమానాశ్రయంలో బంగారం పట్టివేత
కోయంబత్తూరు(కేరళ): కోయంబత్తూరు విమానాశ్రయంలో సోమవారం రూ.25 లక్షల విలువైన బంగారం పట్టుబడింది. రెవెన్యూ ఇంటలిజెన్స్ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. కేరళలోని పలక్కడ్ ప్రాంతానికి చెందిన ప్రభాకరన్ సోమవారం ఉదయం షార్జా నుంచి కోయంబత్తూర్ విమానాశ్రయంలో దిగాడు. అతని తీరును అనుమానించిన అధికారులు లగేజిని క్షుణ్ణంగా తనిఖీ చేశారు. దీంతో అతని స్పీకర్ బాక్స్‌లో దాదాపు 700 గ్రాముల బరువున్న బంగారు కడ్డీలు లభించాయి. ఈ మేరకు విచారణ నిమిత్తం ప్రభాకరన్‌ను పోలీసులకు అప్పగించారు.