మొగల్తూరు నుంచి ఢిల్లీ వరకు 'రెబెల్'గా సాగిన కృష్ణంరాజు జీవితం
కృష్ణంరాజు పేరులోనే కాదు గుణంలోనూ రాజే.. రౌద్రానికి రారాజుగా అభిమానులకు మనసున్న మారాజుగా తెలుగు ప్రజల గుండెల్లో ఎప్పుడూ ఆయన పేరు చిరస్మరణీయం. ఆరడుగుల దాటిన ఎత్తు… మొహంలో కొట్టొచ్చినట్టు కనిపించే గాంభీర్యం.. రౌద్రంతో నిండిన చురకత్తుల్లాంటి ఆ చూపులు... ఆయన ఎదురుగా ఉంటే ఇంత పెద్దాయనతో మాట్లాడగలమా.. అసలు నిలబడగలమా అనే ఆలోచన రావడం సహజం... కానీ కొంత సమయం తర్వాత ఆయన్ను తరచి చూస్తే సుతిమెత్తని మనసుతో పాటు ఆప్యాయంగా ప్రేమతో పలకరించే మాటలు వింటారు..
ఆపై వచ్చిన వారిని గౌరవించే పెద్దరికాన్ని ఆయనలో చూస్తారు. మొగల్తూరు ముద్దుబిడ్డగా వెండితెరపై రారాజుగా వెలిగిన రెబల్‌స్టార్ మనల్ని వదిలి వెళ్లి ఏడాది దాటింది.. ఆయన పేరు ఒక చరిత్ర ఎప్పటికీ వెలుగులోనే ఉంటుంది. నేడు ఆయన జయంతి.. కృష్ణంరాజు పుట్టిన రోజు సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆయన ఫ్యాన్స్ పలు సేవా కార్యక్రమాలు చేస్తున్నారు.
కుటుంబ నేపథ్యం
183 సినిమాల్లో హీరోగా, విలన్‌గా మెప్పించిన కృష్ణంరాజు పశ్చిమ గోదావరి జిల్లా మొగల్తూరులో జన్మించారు. ఉప్పలపాటి నారాయణ మూర్తిరాజు లక్ష్మీదేవమ్మ దంపతులకు ఇద్దరు కుమారులు, ఆరుగురు కుమార్తెలు. వారిలో కృష్ణంరాజు మూడో సంతానం. 1940 జనవరి 20న మొగల్తూరులో ఆయన జన్మించారు. ఆయన బాల్యంతో పాటు విద్యాభ్యాసం అంతా కూడా మొగల్తూరు, నరసాపురం, హైదరాబాద్‌లో జరిగింది. రోడ్డు ప్రమాదంలో మొదటి భార్య మృతితో 1996లో శ్యామలాదేవిని ఆయన రెండో వివాహం చేసకున్నారు. ఈ దంపతులకు ముగ్గురు కుమార్తెలు వారి పేర్లు ప్రసీద, ప్రకీర్తి, ప్రదీప్తిగా ఉన్నాయి. ప్రసీద ‘రాధేశ్యామ్’తో నిర్మాతగా పరిచయం అయ్యారు. రెండో కుమార్తె ప్రకీర్తి సినీ ప్రొడక్షన్ డిజైన్ రంగంలో పనిచేస్తున్నారు.
హీరోగా ఎంట్రీ ఎలా జరిగిందంటే
సంపన్న కుటుంబంలో పుట్టిన కృష్ణంరాజు హైదరాబాద్ బద్రుకా కళాశాలలో కామర్స్ నుంచి పట్టా పొందారు. అప్పటికే శాసనసభ్యునిగా ఉన్న చింతలపాటి వరప్రసాద మూర్తిరాజు హైదరాబాద్‌లో ఉన్నారు. కృష్ణంరాజుకు ఆయన పినతండ్రి కావడంతో ఆయన వద్దే కొంత కాలం ఉన్నారు. ఆయన ఆరంభించిన ‘ఆంధ్రరత్న’ పత్రిక నిర్వహణతో పాటు ఆయన సినీ సౌండ్ స్టూడియో నిర్వహణ కూడా కృష్ణంరాజు చూస్తుండేవారు.
ఆ స్టూడియోలు 'బావమరదళ్లు' సినిమా నిర్మాణం జరిగింది. ఆ చిత్రాన్ని నిర్మించిన పద్మనాభరావు ప్రోత్సాహంతో 1963లో కృష్ణంరాజు మద్రాసు చేరుకున్నారు. తాను తీయబోయే సినిమాలో ఛాన్స్ ఇస్తానని కృష్ణంరాజుకు మాట ఇచ్చి స్క్రీన్ టెస్టు నిర్వహించాడు. ఆపై నటనలొ కొన్ని మెలుకవలు నేర్చుకుని 1965 ఆగస్టు 6న సొంత చిత్రం 'చిలకా గోరింకా'లో నటించారు. అందులో సీనియర్ నటి కృష్ణకుమారి సరసన కృష్ణంరాజు హీరోగా పరిచయం అయ్యారు.
నర్సాపురం నుంచి భారీ మెజారిటీతో గెలుపు
కృష్ణంరాజు 1991లో కాంగ్రెస్ పార్టీ ద్వారా రాజకీయాల్లో వచ్చినప్పటికీ 1996లో బీజేపీలో చేరారు. 1998 కాకినాడ పార్లమెంట్ నియోజకవర్గం నుంచి విజయం సాధించారు. 1999 మధ్యంతర ఎన్నికలలో నర్సాపురం పార్లమెంట్ స్థానం నుంచి లక్షా 50 వేలపైగా ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. ఆ సమయంలో అటల్ బిహారీ వాజ్‌పేయి టీమ్‌లో ఆయన కేంద్ర మంత్రిగా ఉన్నారు. పరిశ్రమలు, విదేశీ వ్యవహారాలు, గ్రామీణాభివృద్ధి శాఖల మంత్రిగా ఆయన సొంత రాష్ట్రం అయిన ఏపీకి ఎనలేని సేవ చేశారు. కృష్ణంరాజుకు నర్సాపురం, మొగల్తూరు అంటే ఎంతో మమకారం ఉండేది. ఆ ప్రాంత ప్రజల కష్ట సుఖాల్లో ఆయన పాలు పంచుకునేవారు.
నర్సాపురం నియోజకవర్గంలోని ప్రతి పల్లెకు కేంద్ర గ్రామీణ సడక్ యోజన పేరుతో సిమెంట్ రోడ్లు నిర్మించారు. అప్పటి వరకు ఏ గ్రామంలోను సిమెంట్ రోడ్లు ఉండేవి కావు. అలా ఆయన ఎనలేని సేవలు అక్కడి ప్రజలకు అందించారు. కానీ 2004 ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిగానే బరిలోకి దిగినప్పటికీ ఆయన ఓటమి చెందారు. తిరిగి ఆయన చిరంజీవి కోరికమేరకు 2009లో ప్రజారాజ్యంలో చేరి, రాజమహేంద్రవరం పార్లమెంట్ నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓటమి చెందారు. ఆ తర్వాత ప్రజారాజ్యం కాంగ్రెస్‌లో విలీనం కావడంతో ఆయన తిరిగి బీజేపీలో చేరారు.
సతీమణితో అనుబంధం
తన అర్ధాంగి అయని శ్యామలాదేవి గురించి ఒక ఇంటర్వ్యూలో కృష్ణంరాజు ఇలా అన్నారు. 'నా మొదటి భార్యను కోల్పోవడం నా జీవితంలో అత్యంత విషాద సంఘటన. కానీ ఆ తర్వాత శ్యామల నా జీవితంలోకి అడుగుపెట్టింది. నా జీవితంలో ఎన్నో వెలుగులు నింపింది. ఆమె రాకతో నా జీవితమే మారిపోయింది. నాకు అన్నీ తానైంది. మాకు ముగ్గురు పిల్లలు. వాళ్లతో పాటు నన్నూ ఓ పిల్లాడిలా భావించి నాకేం కావాలో చూసుకుంటుంది. నాకు అనారోగ్యం వస్తే తనూ నిద్ర కూడా పోదు. ఎప్పుడూ ప్రతి క్షణం నా వెంటే ఉండేది. శ్యామల నాకు దేవుడు ఇచ్చిన వరం.' అంటూ తన అర్ధాంగి గురించి గొప్పగా చెప్పారు కృష్ణంరాజు.
తన సినీ వారసుడిగా ప్రభాస్
కృష్ణంరాజు, ప్రభాస్‌ల అనుబంధం తండ్రీకొడుకుల లాంటిది. కృష్ణంరాజు తమ్ముడు, నిర్మాత ఉప్పలపాటి సూర్య నారాయణరాజు కుమారుడే ప్రభాస్. చిన్నతనం నుంచే ప్రభాస్ ఎక్కువగా కృష్ణంరాజు వద్దే ఉండే వాడు. తన పెదనాన్న అడుగుజాడల్లో నటుడిగా మారాడు. 2010లో ప్రభాస్ తండ్రి మరణించిన తర్వాత ప్రభాస్‌కు ఒక తండ్రిలా వెన్నంటి కృష్ణంరాజు నిలబడ్డారు. ప్రభాస్ జీవితంలో ఎత్తుపల్లాల మధ్య ఒక గురువులా ఆయన ఉన్నారు. దీంతో ప్రభాస్‌కు ఆయనంటే విపరీతమైన గౌరవం. కానీ ప్రభాస్ విషయంలో చివరి కోరిక కృష్ణంరాజుకు తీరలేదు. రాధేశ్యామ్ సినిమా సమయంలో ప్రభాస్ పెళ్లి గురించి మాట్లాడుతూ.. "అతను వీలైనంత త్వరగా పెళ్లి చేసుకోవడం నాకు చాలా ఇష్టం. నేను అతని కొడుకు లేదా కుమార్తెతో ఆడాలనుకుంటున్నాను.' అని ఆయన అన్నారు.
ఆయన కోరుకున్నట్లే జీవితాన్ని ముగించారు
అనారోగ్యంతో 2022 సెప్టెంబర్ 11న కృష్ణంరాజు కన్నుమూశారు. మరణం గురించి ఒక ఇంటర్వ్యూలో ఇలా చెప్పారు. గతంలో ఒక ఇంటర్వ్యూలో ఆయనకు ఒక ప్రశ్న ఎదురైంది. 'మీరు జీవితంలో ఇంకా ఏమైనా సాధించాల్సినవి ఉన్నాయా...? దానికి ఆయన నుంచి వచ్చిన జవాబు ఇదే 'జీవిత చరమాంకంలో ఉన్నప్పుడు.. ఓ పచ్చని చెట్టు కింద కూర్చుని, గుండె మీద చేయి వేసుకుని… దేవుడా, నాకిచ్చిన ఈ మానవ జన్మలో నేనెవరికీ ద్రోహం చేయలేదు, నావల్ల ఎవరికీ బాధ కలగలేదనే భావనతో హాయిగా కన్నుమూయాలి.' అని చెప్పారు. అదే రీతిలో ఆయన జీవితం ముగిసింది.
నేడు మెగా వైద్య శిబిరం
కృష్ణంరాజు జయంతి సందర్భంగా ఆయన కుటుంబ సభ్యులు మొగల్తూరు అబ్యాస్ కళాశాలలో నేడు మెగా ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటుచేశారు. కృష్ణంరాజు సతీమణి శ్యామలాదేవి వారి పిల్లలు గత రెండు రోజులుగా మొగల్తూరులోనే ఉంటున్నారు. దేశ, విదేశాలకు చెందిన 30 మంది ప్రముఖ వైద్యులతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు.
కృష్ణంరాజు జీవితంలో ఇవన్నీ ఆసక్తి కలిగిస్తాయి
► కృష్ణంరాజు కెరీర్లో 'భక్తకన్నప్ప' మైలురాయిలాంటి సినిమా. ఈ చిత్రాన్ని ప్రభాస్ హీరోగా మళ్లీ రీమేక్ చేయాలని కృష్ణంరాజు అనుకున్నారు. అందుకు అనుగుణంగా స్క్రిప్ట్ కూడా తయారు చేశారు. ఈ సినిమాను తన సొంత బ్యానర్‌పై తానే దర్శకత్వం వహించాలని కూడా ఆయన ఆశపడ్డారు. కానీ, ప్రభాస్ వేరే ప్రాజెక్టులతో బిజీ అయిపోవడంతో పాటు పాన్ ఇండియా స్టార్‌గా మారడంతో 'భక్తకన్నప్ప' పట్టాలెక్కలేదు
► కృష్ణంరాజుకు 'మన ఊరి పాండవులు' చిత్రం కూడా చాలా ఇష్టం. దాన్ని రీమేక్ చేసే అవకాశం వస్తే, ప్రభాస్‌ను పెట్టి తీయాలనుకున్నారు
► 1984 సమయంలో కృష్ణంరాజు హీరోగా నటించిన 'భారతంలో శంఖారావం' వందరోజుల వేడుక ప్లాన్ చేశారు. అదే సమయంలో తుపాను వల్ల చాలామంది రోడ్డున పడ్డారు. దీంతో ఆ వేడుక కోసం అయ్యే ఖర్చు నిర్మాత నుంచి రూ.70 వేలు ఆపై తన నుంచి రూ. 1,30,000 కలిపి వరద బాధితుల సహాయార్థం విరాళం ఇచ్చారు
► కటకటాల రుద్రయ్య, రంగూన్ రౌడీ తదితర చిత్రాలు కృష్ణంరాజుని రెబల్‌స్టార్‌గా మార్చేశాయి
► ‘గోపీకృష్ణా మూవీస్’ అనే సంస్థను నెలకొల్పి ఆయన నిర్మాతగా మారారు. ఆ బ్యానర్లో వచ్చిన తొలి చిత్రం ‘కృష్ణవేణి’. ఆ తర్వాత ఆ బ్యానర్‌పై తాండ్ర పాపారాయుడు, బొబ్బిలి బ్రహ్మన్న, భక్త కన్నప్ప, బిల్లా తదితర ఎన్నో హిట్ చిత్రాలు వచ్చాయి
► తెలుగులో ఎన్నో విజయవంతమైన చిత్రాలను నిర్మించిన కృష్ణంరాజు హిందీలోనూ ఓ సినిమా నిర్మించారు. అదే ‘ధర్మాధికారి’. దిలీప్ కుమార్, జితేంద్ర, శ్రీదేవి, రోహిణీ హట్టంగడి ప్రధాన పాత్రల్లో నటించారు. దీన్ని కె.రాఘవేంద్రరావు తెరకెక్కించారు
► కృష్ణ.. కృష్ణంరాజులు ఇద్దరూ కలిసి అత్యధికంగా 17కి పైగా చిత్రాల్లో నటించారు
► కృష్ణంరాజు అభిమాన నటుడు అక్కినేని నాగేశ్వరరావు. ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన రోజుల్లో నటుడిగా ఆయన్ని వెన్నుతట్టి ప్రోత్సహించిన అగ్రతారల్లో ఏయన్నార్ ఒకరు
► కృష్ణంరాజు, ప్రభాస్ ఇద్దరూ కలిసి బిల్లా చిత్రంలో మొదటిసారి నటించారు. ఆ తర్వాత రెబల్, రాధేశ్యామ్ చిత్రాల్లో కనిపించారు
- సాక్షి, వెబ్‌డెస్క్ ప్రత్యేకం