వన్ డే సీపీ ఇషాన్
‘సమయం మధ్యాహ్నం మూడు గంటలు. గచ్చిబౌలిలోని రాచకొండ పోలీసు కమిషనరేట్ కార్యాలయంలో సందడి నెలకొంది. రాచకొండ పోలీసు కమిషనర్ మహేశ్ భగవత్‌తో పాటు ఇతర పోలీసు ఉన్నతాధికారులు, సిబ్బంది ప్రవేశద్వారం వద్ద కోలాహలం కనిపించింది. అంతలోనే పోలీసు కమిషనర్ కారులో సీపీ డ్రెస్‌లో ఉన్న ఓ బాలుడు దిగాడు.
మహేశ్ భగవత్ పుష్పగుచ్ఛం ఇచ్చి అతనికి స్వాగతం పలికారు. ఆరుగురు సాయుధ పోలీసులు ఆయుధాలతో గౌరవ వందనం చేశారు.భగవత్ ఆ చిన్నారిని మూడో అంతస్తులోని తన చాంబర్‌కు తీసుకెళ్లి అక్కడున్న ఆయన సీటులో కూర్చొబెట్టాడు.
అతను నవ్వుతూ తన చేతిలోని కమిషనర్ కర్రను తిప్పుతూ అందరినీ చూస్తూ ఉండిపోయాడు’. ఏంటీ ఇదంతా చూస్తుంటే రాచకొండ పోలీసు కమిషనర్‌గా కొత్తగా వచ్చిన వ్యక్తికి మహేశ్ భగవత్ బాధ్యతలు అప్పగిస్తున్నట్టు అనిపిస్తుందా.. అయితే చదవండి.
సాక్షి, సిటీబ్యూరో/రాయదుర్గం: విషయమేమిటంటే బ్లడ్ క్యాన్సర్‌తో బాధపడుతూ నగరంలోని ఎంఎన్‌జే క్యాన్సర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న మెదక్ జిల్లా, కూచన్‌పల్లికి చెందిన ఆరేళ్ల బాలుడు దూదేకుల ఇషాన్. తన కోరికను నెరవేర్చేందుకు మహేష్ భగవత్ ‘వన్ డే పోలీసు కమిషనర్’గా అవకాశం కల్పించారు. పోలీసు ఆఫీసర్ కావాలన్న అతడి కోరికను మేక్ ఏ విష్ ఫౌండేషన్ సభ్యులు శశిచంద్ర, ప్రియాజోషి సీపీ దృష్టికి తీసుకెళ్లడంతో ఆయన అంగీకరించారు.
ఈ సందర్భంగా ఆయన ఆ కుర్రాడి మోములో ఆనందం చూశారు. ఒకరోజు రాచకొండ కమిషనర్‌గా ఎలా అనిపిస్తుందని మీడియా ఇషాన్‌ను ప్రశ్నించగా ‘భహుత్ కుష్ హూ’ అని నవ్వుతూ తెలిపాడు. అందరితో కరచలనం చేస్తూ ఎంతో సంతోషంగా చేతిలోని కర్రను తిప్పుతున్న దృశ్యాన్ని చూసిన అతని తల్లిదండ్రులు చాంద్‌పాషా, హసీనా కన్నీటి బాష్ఫాలు రాల్చారు.
కోరిక తీరిందిలా...
మెదక్ జిల్లా కూచన్‌పల్లిలో వాల్‌పేయింటింగ్ చేస్తూ జీవనం సాగించే దూదేకుల చాంద్‌పాషా, హసీనా దంపతులకు ముగ్గురు సంతానం. స్థానిక ప్రభుత్వ పాఠశాలలో సోఫియా మూడో తరగతి, ఇషాన్ రెండో తరగతి చదువుతున్నారు. ఐదేళ్ల తహసీన్ ఇంటివద్దే ఉంటుంది. భార్య హసీనా బీడీలు చుడతారని తెలిపాడు.
చిన్నతనం నుంచే పోలీసు అవుతానని చెప్పే ఇషాన్‌కు బ్లడ్ క్యాన్సర్ ఉందని తేలడంతో తమకు దిక్కుతోచడం లేదన్నాడు. నగరంలోని ఎంఎన్‌జే ఆస్పత్రిలో చేర్పించామని, వైద్యులు బాగానే చికిత్స చేస్తున్నట్లు తెలిపాడు. ఇదే సమయంలో ‘మేక్ ఏ విష్ ఫౌండేషన్’ సభ్యులు తమ పిల్లాడి కోరికను తెలుసుకొని రాచకొండ కమిషనర్ మహేశ్ భగవత్ దృష్టికి తీసుకొచ్చి నెరవేర్చడం ఆనందంగా ఉందన్నారు.
ఒకరోజు సీపీతో మహేశ్‌భగవత్ సంభాషణ
మహేశ్‌భగవత్: కైసా లగ్రే... ఇషాన్...?
ఇషాన్: అచ్చా లగ్రా... హ.. హ.. హ..(నవ్వుతూ..)
మహేశ్‌భగవత్: క్యాకరింగే పోలీస్ ఆఫీసర్ బన్కే ?
ఇషాన్: లా అండ్ ఆర్డర్‌కు కంట్రోల్ కర్తా..
మహేశ్‌భగవత్: ఔర్ క్యా కరేగా.. ?
ఇషాన్: చోరోంకో పకడ్కే జైల్ మే దాలూంగా..
ఔర్ సిగరేట్ పీనేవాలోంకో, గుట్కా కానేవాలోంకో జైల్‌మే దాలూంగా.
మహేశ్‌భగవత్: ఔర్తోం కో క్యాకరేగా.. ?
ఇషాన్: ఔరతోంకో ముష్కిల్ పైదా కర్నే వాలోంకో జైల్‌మే దాల్కే మార్తా
మహేశ్‌భగవత్: ఔరతోంకో కైసా హెల్ప్ కర్తే.. ?
ఇషాన్: నవ్వుతూ.. నైమాలూమ్...
త్వరగా కోలుకోవాలి
ఇషాన్‌కు ఆరేళ్లకే క్యాన్సర్ వ్యాధి సోకడం చాలా బాధగా ఉంది. బాలుడు త్వరగా కోలుకోవాలి. మేక్ ఏ విష్ సంస్థ ప్రతినిధులు కలిసి బాలుడి కోరిక వివరించగా వెంటనే అం గీకరించాను. క్యాన్సర్ ఆస్పత్రిలో చికిత్స బాగా సాగుతోందని, తల్లిదండ్రులు కూడా చికిత్స తీరుపట్ల సంతృప్తిగా ఉన్నారు. విద్యార్థులు, యువకులు పోలీసులు, పోలీస్ ఆఫీస ర్లు కావాలనే కోరికను నెరవేర్చుకోవాలన్నారు. ఇప్పుడిప్పుడే చాలా మందికి పోలీసులమై ప్రజలకు న్యాయం చేయాలనే భావన కలుగుతోందన్నారు. –సీపీ మహేశ్‌భగవత్