Lalitha Kumari
-
‘పచ్చ’ నేతల కక్ష
తెల్లారి లేస్తే ప్రజాస్వామ్య పరిరక్షణ గురించి, ప్రజాస్వామిక విలువల గురించి ముఖ్యమంత్రి చంద్రబాబు లెక్చర్లు దంచేస్తూంటారు. అమరావతిలో ఆకాశాన్నంటేలా అంబేడ్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేసేస్తామని, ఆయన బాటలోనే నడుస్తామని ఆర్భాటాలు చేసేస్తారు. తీరా చూస్తే వల్లె వేస్తున్న ఆదర్శాలకు భిన్నంగా చంద్రబాబు ఆచరణ ఉంటోంది. అదే బాటలో ఆయన పార్టీ నాయకులు కూడా నడుస్తున్నారు. వైఎస్సార్ సీపీ సానుభూతిపరులుగా ఉన్నారన్న కారణంతో ఓ కుటుంబంపై ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా ఐదేళ్లుగా సామాజిక బహిష్కరణ అమలు చేస్తున్నారు. కోనసీమ కేంద్రమైన అమలాపురం పట్టణంలోనే ఈ దుర్మార్గానికి బరితెగించారు. తూర్పుగోదావరి, అమలాపురం టౌన్: విశ్రాంత బ్యాంక్ అధికారి అయిన టి.పల్లేశ్వరరావు, భార్య లలితాకుమారి, పిల్లలతో కలిసి అమలాపురం దుడ్డివారి అగ్రహారంలో నివసిస్తున్నారు. వైఎస్సార్ సీపీ సానుభూతిపరులైన ఆ కుటుంబ సభ్యులపై స్థానిక టీడీపీ నేతలు కొందరు రాజకీయంగా కక్ష కట్టారు. వివక్ష చూపడం మొదలు పెట్టారు. ఆ ప్రాంతంలో ఎక్కువమంది టీడీపీ వారే ఉండడంతో క్రమంగా ఆ కుటుంబంపై సామాజిక బహిష్కరణ మొదలుపెట్టారు. వారితో చుట్టుపక్కల వారు మాట్లాడరు. ఒకవేళ వీరు మాట్లాడేందుకు ప్రయత్నించిన ముఖం తిప్పుకొని వెళ్లిపోతారే తప్ప పట్టించుకోరు. మంచికీ చెడ్డకీ దేనికీ వారిని పిలవరు. 2014 ఎన్నికల ముందు రగిలిన ఈ ‘వెలి’ కాష్టం ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. కొందరు టీడీపీ ప్రజాప్రతినిధులు ఒత్తిళ్లు తేవడంతో అధికారులు కూడా ఆ కుటుంబం పట్ల సహాయ నిరాకరణ ధోరణి చూపారు. ఫలితంగా సాంఘిక వెలితో ఆ కుటుంబం ఐదేళ్లుగా అవస్థలు పడుతూనే ఉంది. మధ్యలో జిల్లా అధికార యంత్రాంగానికి, అమలాపురం ఆర్డీవో, మున్సిపల్ కమిషనర్ వంటి అధికారులకు ఫిర్యాదులు చేసుకున్నా ఫలితం లేకపోయింది. మొత్తం పల్లేశ్వరరావు కుటుంబ సభ్యులందరూ సాంఘిక వెలి బాధితులే. పోలీసు రక్షణతో ఓటు హక్కు వినియోగం సాంఘిక వెలితో అవస్థలు పడుతున్న లలితాకుమారి కుటుంబ సభ్యులు ఈ నెల 11న జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఓటు వేసుకోవడమెలా అన్నదానిపై కూడా ఆందోళన చెందారు. తమను ప్రశాంత వాతావరణంలో ఓట్లు వేసుకోనివ్వరని.. వైఎస్సార్ సీపీకే ఓట్లు వేస్తామన్న ఉద్దేశంతో తమను అడ్డుకుంటారని భావించారు. దీంతో ఎన్నికల సంఘాన్ని ఆశ్రయించారు. తమ కుటుంబ సభ్యులు స్వేచ్ఛగా ఓటు వేసుకునే అవకాశం కల్పించాలని అమలాపురం పార్లమెంటరీ నియోజకవర్గ ఎన్నికల సాధారణ పరిశీలకుడు, సీనియర్ ఐఏఎస్ అధికారి ఎక్కాకు లలితకుమారి లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేశారు. దీనికి స్పందించిన ఎక్కా ఆ కుటుంబ సభ్యులతో చర్చించారు. వారి భయాన్ని చూసి, వారి అభియోగాన్ని విన్న ఎక్కా.. ఆ కుటుంబ సభ్యులు ఓటు హక్కు వినియోగించుకునేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఆ కుటుంబ సభ్యులను పోలింగ్ బూత్‌కు పోలీసు బందోబస్తు నడుమ తీసుకువెళ్లి, ఓట్లు వేసిన తరువాత తిరిగి బందోబస్తుతో ఇంటి వద్ద విడిచిపెట్టాలని పట్టణ సీఐ రజనీకుమార్‌ను ఆదేశించారు. ఈ మేరకు ఆ కుటుంబ సభ్యులను ఎన్నికల రోజున పోలీసు బందోబస్తు నడుమ తీసుకు వెళ్లి ఓటు వేసే అవకాశం కల్పించారు. విముక్తి ఎప్పుడో..! ఈ ఘటనతోనై ఇకపై ఆ కుటుంబానికి సాంఘిక వెలి నుంచి విముక్తి లభిస్తుందా? అనే ప్రశ్నకు ఇంకా పూర్తిస్థాయి సమాధానం దొరకడం లేదని ఫిర్యాదీ, బాధితురాలు లలితాకుమారి అన్నారు. గతంలో ఓ పని మీద మున్సిపల్ కార్యాలయానికి వెళ్తే అక్కడి అధికారులు, సిబ్బంది సహాయ నిరాకరణ చేశారని, ఏవిధంగానూ స్పందించ లేదని ఆవేదన వ్యక్తం చేశారు. సాంకేతికంగా ఎంతో అభివృద్ధి చెందామని చెప్పుకొంటున్న ఈ రోజుల్లో కూడా సాంఘిక వెలి అంటూ ఓ కుటుంబం సమాజంలో స్వేచ్ఛగా బతికే హక్కును కొందరు టీడీపీ నేతలు హరించడం బాధాకరమని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. -
ఇండిపెండెంట్ అభ్యర్థిగా లలితకుమారి
బంగారుపాళ్యం/యాదమరి: పూతలపట్టు మాజీ ఎమ్మెల్యే లలితకుమారికి టీడీపీ అధిష్టానం టికెట్ కేటాయించకపోవడంతో ఆమె ఇండిపెండెంట్‌గా బరిలోకి దిగాలని నిర్ణయించుకున్నారు. మంత్రి అమరనాథరెడ్డి మంగళవారం అర్ధరాత్రి వరకు మంతనాలు జరిపినా ఆమె, ఆమె వర్గీయులు ససేమిరా అన్నారు. ఈ క్రమంలో ఆ పార్టీ టికెట్ దక్కించుకున్న పూర్ణం ఆందోళనతో అనారోగ్యానికి గురై ప్రయివేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. మూడు నెలల క్రితం సీటు నీకేనంటూ పార్టీ అధిష్టానం చెప్పడంతో లలితకుమారి వర్గం ఆశలు పెంచుకుంది. తీరా అధిష్టానం తవణంపల్లె మండలానికి చెందిన పూర్ణంకు ఎమ్మెల్యే టికెట్ ఇచ్చింది. దీంతో ఆమె కన్నీరుమున్నీరయ్యారు. మంత్రి మంతనాలు జరిపినా శాంతించలేదు. పార్టీ తనను నమ్మించి మోసం చేసిందని, ఈ నెల 22న ఇండిపెండెంట్‌గా నామినేషన్ వేస్తానని లలితకుమారి బుధవారం స్పష్టం చేశారు. పార్టీ కోసం ఎంత కష్టపడినా లాభం లేకపోయిందని ఆమె వాపోయారు. మంత్రి నచ్చచెప్పినా లలితకుమారి వినకపోవడంతో టీడీపీ అభ్యర్థి పూర్ణం ఆందోళనకు గురై చాతినొప్పితో ఆస్పత్రిలో చేరారు. పరీక్షలు చేసిన వైద్యులు ఆయనకు ఎలాంటి ఇబ్బందీ లేదని రాత్రికి రాత్రే ఇంటికి పంపినట్లు సమాచారం. ఇదిలావుండగా గ్రామాల్లో పర్యటించినా ఎవరూ సహకరిం చకపోవడంతో పోటీ నుంచి తప్పుకోవాలని భావించి బుధవారం బీ ఫారం తీసుకోవడానికి కూడా వెళ్లలేదని సమాచారం. దీంతో టీడీపీ అధిష్టానం అభ్యర్థి విషయం మళ్లీ అయోమయంలో పడింది. -
చంద్రబాబుకు షాకిచ్చిన ఎమ్మెల్యే అభ్యర్థి..!
-
పత్తా లేకుండా పోయిన టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి..!
సాక్షి, చిత్తూరు : టికెట్ల కేటాయింపుల పర్వం ముగిసి నామినేషన్ల ప్రక్రియ మొదలైనా కొందరు టీడీపీ అభ్యర్థులు మాత్రం పోటీకి ససేమిరా అంటున్నారు. పూతల పట్టు నియోజనవర్గం ఎమ్మెల్యే అభ్యర్థి తెర్లాం పూర్ణం ఆ పార్టీకి షాక్ ఇచ్చారు. టికెట్ కేటాయించి 36 గంటలైనా గడవకముందే పోటీ చేయలేనని ఆయన చేతులెత్తేశారు. తనకు టికెట్ వద్దంటూ పూర్ణం అందుబాటులో లేకుండా పోయారు. రెండు రోజుల క్రితమే ఐవీఆర్ఎస్ సర్వేల ద్వారా తనను ఎంపిక చేశారని అతను వెల్లడించినట్టు సమాచారం. పూతలపట్టు టీడీపీ ఇన్చార్జ్గా ఉన్న మాజీ ఎమ్మెల్యే లలితకుమారికే టికెట్ అని మొదటి నుంచి చెబుతూ వచ్చారు. అందులో భాగంగానే నియోజకవర్గంలో లలితకుమారి ప్రచారం చేసుకుంటూ ఉన్నారు. సోమవారం రాత్రి ఆమెకు ఒక్కసారిగా షాక్ తగిలింది. టీడీపీ విడుదల చేసిన తుది జాబితాలో పూతలపట్టు టికెట్‌ను పూర్ణం అనే కొత్త వ్యక్తికి కేటాయిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఇక ఈ స్థానం నుంచి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరపున ఎంఎస్ బాబు బరిలోకి దిగుతున్న సంగతి తెలిసిందే. -
ఇంట్లోకి దూసుకెళ్లిన ట్రాక్టర్..మహిళ మృతి
తాడేపల్లి: గుంటూరు జిల్లా తాడేపల్లి పట్టణంలోని మహానాడు కాలనీలో విషాదం చోటు చేసుకుంది. ఆదివారం అర్ధరాత్రి దాటిన తర్వాత సుమారు ఒంటి గంట సమయంలో ఓ ట్రాక్టర్ అదుపుతప్పి ఇంట్లోకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో ఇంట్లో నిద్రిస్తున్న లలిత కుమారి(32) అనే మహిళ అక్కడికక్కడే మృతిచెందగా..మరో చిన్నారికి గాయాలయ్యాయి. గాయపడిన చిన్నారిని సమీప ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. వీరు రాజస్తాన్ నుంచి 30 సంవత్సరాల క్రితం వచ్చి స్థిరపడినట్లు తెలిసింది. -
నా మాటేంటి..?
సాక్షి ప్రతినిధి, విజయనగరం: తానున్నానంటూ ఎస్.కోట శాసనసభ నియోజక వర్గాని కి టీడీపీ టిక్కెట్ కోసం మరో అభ్యర్థి రేసులోకొచ్చారు. దీంతో ఇప్పటి వరకు జరిగిన వివాదం సద్దుమణిగిందంనుకుంటు న్న తరుణంలో టీడీపీలో మరో చిచ్చు రేగిం ది. సిట్టింగ్ శాసనసభ్యురాలు కోళ్ల లలితకుమారిపై నియోజక వర్గంలో ఉన్న అసంతృప్తిని క్యాష్ చేసుకునేందుకు మరో నేత తెరపైకొచ్చారు. టీడీపీ టిక్కెట్ ఆమెకిస్తే నెగ్గడం కష్టమని, ఈసారి టిక్కెట్ తనకే ఇవ్వాలంటూ టీడీపీ రాష్ట్ర బీసీ సెల్ కార్యదర్శి, లక్కవరపుకోట నాయకుడు రంధి మార్కండేయులు అకస్మాత్తుగా రేసులోకి వచ్చారు. ఇప్పటికే పార్టీ అధిష్ఠానం దూతల భరోసా కూడా తీసేసుకున్నారని తెలుస్తోంది. పార్టీపొలిట్ బ్యూరో సభ్యుడు పూసపాటి అశోక్ గజపతిరాజును, పార్టీ జిల్లా అధ్యక్షుడు ద్వారపురెడ్డి జగదీష్‌ను కలిసి బయోడేటా కూడా ఇచ్చారు. దీంతో కోళ్ల లలితకుమారి అయోమయ పరిస్థితికి చేరుకున్నారు. ఇంతవరకు పార్టీ రాష్ట్ర మహి ళా అధ్యక్షురాలు శోభా హైమావతి రూపంలో ఎదురైన పోటీని ఆమెకు ఇతరత్రా అవకాశా లు చూపించి అడ్డు తప్పించుకోగా తాజాగా తన సన్నిహితుడు, సొంత మండల నేత రేసులోకి రావడంతో కోళ్ల లలిత కుమారి జీర్ణించుకోలేకపోతున్నారు. తొలుత శోభతో మానసిక క్షోభ.. ఎమ్మెల్యే లలితకుమారికి నియోజకవర్గంలో తీవ్ర వ్యతిరేకత కన్పిస్తున్న నేపథ్యంలో శోభాహైమావతి ఆ టిక్కెట్‌ను ఆశించారు. అందుకోసం తీవ్రంగా పోటీ పడ్డారు. ఒకానొక సందర్భంలో వేర్వేరు గ్రూపులు కట్టి, ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేసుకుని, ఒకరిపైఒకరు కత్తులు దూసుకున్నారు. టిక్కెట్ తమదంటే తమదేనంటూ కేడర్‌కు సంకేతాలిచ్చి గందరగోళం సృష్టించారు. పార్టీలో ఇద్దరు మహిళా నేతల మధ్య కుమ్మలాట ముదురుపాకాన పడడంతో అధినేత రంగంలోకి దిగాల్సి వచ్చింది. శోభాహైమావతి కుమార్తె స్వాతిరాణికి అరుకు పార్లమెంట్ టిక్కెట్ లేదా జెడ్పీ చైర్పర్సన్ రేసులో నిలబెడతానని హామీ ఇవ్వడంతో శోభా హైమావతి టిక్కెట్ రేసు నుంచి తప్పుకున్నారు. దీంతో పార్టీలో అంతవరకు నెలకొన్న వివాదం కొంతమేర తగ్గింది. ఇదేదో సద్దుమణిగిందనుకుంటే ఇప్పుడు మరో ఆశావహుడు తెరపైకొచ్చారు. రాజకీయ కురువృద్ధుడు, మాజీ మంత్రి కోళ్ల అప్పలనాయుడికి తెరవెనుక ఎంతో సహకరించిన లక్కవరపుకోట మండలానికి చెందిన దివంగత నేత రంధి అప్పలనాయుడు కుమారుడు మార్కండేయులు తాజాగా టిక్కెట్ రేసులోకి వచ్చారు. గతంలో మాటిచ్చారు టీడీపీ రాష్ట్ర బీసీ సెల్ కార్యదర్శిగా, రాజకీయ నేపథ్యం కలిగిన కుటుంబం నుంచి వచ్చిన వ్య క్తిగా తనకు టిక్కెట్ ఇవ్వాలని కోరుతున్నారు. అంతే కాకుండా గత ఎన్నికల్లో టిక్కెట్ కోసం ప్రయత్నించగా వచ్చేసారి చూద్దామని అధిష్ఠా నం చెప్పిందని, అప్పట్లో ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని డిమాండ్ చేస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే విశాఖ జిల్లా కీలక నేత, చంద్రబాబు కు సన్నిహితుడైన పారిశ్రామిక, వ్యాపార వేత్తను కలిసి భరోసా తీసుకున్నట్లు తెలుస్తోం ది. అలాగే పార్టీ సీనియర్ నేత పూసపాటి అశోక్ గజపతిరాజు, జిల్లా అధ్యక్షుడు ద్వారపురెడ్డి జగదీష్‌లను కలిసి తన గోడు వెళ్లబోసుకున్నారు. అంతటితో ఆగకుండా ఎస్.కోట టీడీపీ టిక్కెట్ తనకే వస్తుందంటూ నియోజకవర్గంలో ప్రత్యేకంగా కార్యకలాపాలు సాగిస్తున్నారు. దీంతో కోళ్ల లలితకుమారికి వ్యవహారం మింగుడుపడని పరిస్థితి వచ్చింది. సన్నిహిత నేతే టిక్కెట్ పోరులో నిలబడడంతో ఏం చేయాలో తేల్చుకోలేక ఆమె సతమతమవుతున్నారు. -
ముదిరిన అంతర్యుద్ధం
శృంగవరపుకోట, న్యూస్‌లైన్ : ఎస్. కోట నియోజకవర్గం ఒకప్పుడు తెలుగుదేశం పార్టీకి కంచుకోట. కానీ ప్రస్తుతం పార్టీలో అంతర్గత కుమ్ములాటలు...నాయకుల మధ్య ఆదిపత్య పోరు వల్ల ఆ పరిస్థితి తారుమారైంది. ముఖ్యంగా వచ్చే ఎన్నికల్లో ఇక్కడి నుంచి శాసనసభకు పోటీ చేసే విష యంలో తాజా ఎమ్మెల్యే కోళ్ల లలితకుమారి, మాజీ ఎమ్మెల్యే శోభా హైమవతి మధ్య నెలకొన్న ఆదిపత్య పోరు రోజుకో మలుపు తిరుగుతోంది. తాజాగా ఆది వారం ఆ పార్టీ స్థానిక నేతలు చేసిన ప్రకటనతో వారి మధ్య నలుగుతున్న అంతర్యుద్ధం మరింత ముది రింది. ఇద్దరిలో ఎవరికి ఎమ్మెల్యే టిక్కెట్ వస్తుందో తెలి యక.. ద్వితీయ శ్రేణి నాయకులు, కార్యకర్తలు ఇరకాటంలో పడుతున్నారు. లలితకు ఎమ్మెల్యే టికెట్ ఖాయమా ? ఎస్. కోటలో ఎమ్మెల్యే లలితకుమారి నేతృత్వంలో ఆదివారం పార్టీ బలోపేతంపై కార్యకర్తలకు శిక్షణ జరి గింది. ఈ సమావేశంలో ఆ పార్టీ నియోజకవర్గ పరిశీల కుడు కరెడ్ల ఈశ్వరరావు మాట్లాడుతూ వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యేగా లలితకుమారిని గెలిపించాలంటూ కార్యక ర్తలను కోరారు. నియోజకవర్గంలో పార్టీకి పెద్దదిక్కుగా చెప్పుకునే జెడ్పీ మాజీ చైర్మన్ లగుడు సింహాద్రి కూడా ఎమ్మెల్యేగా లలితకుమారిని గెలిపించాలని, ఆమె గెలుపునకు అంతా సమష్టిగా పని చేయాలని పిలుపునిచ్చా రు. ఆ ఇద్దరి నేతల ప్రకటనతో కార్యకర్తలు ఆశ్చర్యపోయారు. అయితే ఈ పరిణామంతో హైమవతి వర్గీయు లు ఖంగుతిన్నారు. నేతల ప్రకటనతో లలితకుమారికి ఎమ్మెల్యే టికెట్ ఖాయమయినట్టేనా....? హైమవతి ఆశలు అడియాసలేనా అన్న ప్రశ్నలు కార్యకర్తల మది లో మొదలయ్యూయి. ఇదే వాస్తవమైతే పార్టీలో మరిన్ని నాటకీయ పరిణామాలు చోటుచేసుకునే అవకాశం ఉం దని ఆ పార్టీ నాయకులే చెబుతున్నారు. కాగా ఎస్. కోట నుంచి పార్టీ అభ్యర్థులుగా పోటీ చేసేందుకు కోళ్ల లలితకుమారి, హైమవతి ఎవరికి వారే చాపకింద నీరులా ప్రయత్నాలు సాగిస్తున్నారు. ఇటీవల లలితకుమారి పార్టీ టిక్కెట్ తనకే వస్తుందని, చం ద్రబాబు స్పష్టమైన హామీ ఇచ్చారని ప్రచారం చేశారు. ఈ ప్రచారాన్ని మాజీ ఎమ్మెల్యే హైమవతి బహిరంగాం గా ఖండించిన విషయం తెలిసిందే. తాజాగా శనివారం ఉదయం లలితకుమారి జామి, కొత్తవలస మండలా ల్లో పార్టీ సమావేశం ఏర్పాటు చేశామని హాజరుకావాలంటూ హైమవతికి ఫోన్ చేశారు. దీనిపై స్పందించి హైమవతి...తాను హైదరాబాద్‌లో ఉన్నంతసేపూ కనీ సం మాట మాత్రం చెప్పలేదు... ఇప్పుడు షిర్డీలో ఉ న్నానని తెలిసీ..ఆకస్మికంగా సమావేశాలు ఏర్పాటు చేయడం దేనికని ప్రశ్నించారు. దీంతో లలితకుమారి ఫోన్‌ను పక్కనే ఉన్న పార్టీ జిల్లా అధ్యక్షుడు జగదీష్‌కు ఇచ్చారు. ఆయన కూడా ఎంత చెప్పినా.. ఆమె వినలేదని సమాచారం. ఇంత జరిగినా ఆదివారం ఎస్. కోట సమావేశంలో స్థానిక నేతలు ఎమ్మెల్యే అభ్యర్థిగా లలితకుమారిని ప్రకటించడం గమనార్హం. కాగా లలితకుమారి తన వర్గీయులు, సామాజిక వర్గాన్ని అండగా చేసుకుని హైమవతి అభ్యర్థిత్వాన్ని అడ్డుకునేందుకు సిద్ధమవుతున్నట్టు కొందరు చెబుతున్నారు. -
దేశం ‘కోట’లో అంతర్యుద్ధం
శృంగవరపుకోట, న్యూస్‌లైన్ : తెలుగుదేశం పార్టీకి జిల్లాలో కంచుకోటగా ఉన్న ఎస్.కోటలో అంతర్యుద్ధం మొదలయింది. టికెట్ కోసంప్రస్తుత, మాజీ ఎమ్మెల్యేలయిన ఇద్దరు మహిళామణులు పోటీ పడుతుండడంతో పార్టీ శ్రేణులు అయోమయంలో కొట్టుమిట్టాడుతున్నాయి. ఈ దఫా ఎన్నికల్లో ఎస్.కోట శాసనసభ స్థానం నుంచి పోటీచేసేందుకు మాజీ ఎమ్మెల్యే, తెలుగుదేశం రాష్ట్ర మహిళాధ్యక్షురాలు శోభా హైమావతి, ప్రస్తుత ఎమ్మెల్యే కోళ్ల లలితకుమారి తీవ్రంగా పోటీ పడుతున్నారు. దీంతో వీరి మధ్య విభేదాలు తారస్థాయికి చేరుకున్నాయి. నిన్నమొన్నటి వరకూ కలిసిమెలిసి.. లోలోపల ఏమున్నా ఇటీవల కాలం వరకూ పార్టీ కార్యక్రమాల్లో కలిసిమెలిసి పాల్గొన్న ఎమ్మెల్యే లలితకుమారి, మాజీ ఎమ్మెల్యే హైమావతి మధ్య పోరు ప్రారంభమయింది. ఎస్.కోట శాసనసభ స్థానం నుంచి 2014 ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఈ ఇద్దరూ సిద్ధమవుతున్నారు. కొంతకాలంగా వీళ్లిద్దరూ ఎవరికి వారే చాపకింద నీరులా తమ ప్రయత్నాలు చేస్తున్నారు. దీని కోసం వారు తమ వర్గాలను సమాయత్తం చేసి, తమ బలం చాటుకుని, అధిష్టానం ఆశీస్సులు పొందేందుకు ఆరాటపడుతున్నారు. ఇప్పుడు ఎవరికి వారు విడివిడిగా పార్టీ కార్యక్రమాలను వేగవంతం చేశారు. టికెట్‌పై ఎవరి ధీమా వారిదే... ఎన్నికల వాతావరణం వేడెక్కడంతో ఎమ్మెల్యే లలితకుమారి గ్రామాల్లో పార్టీ ప్రచారం జోరు పెంచారు. ఈ సందర్భంగా ఆమె ఈ దఫా పార్టీ టికెట్ తనకే వస్తుందని, చంద్రబాబు స్పష్టమైన హామీ ఇచ్చారని చెబుతున్నారు. ఈ ప్రచారంతో చిర్రెత్తుకొచ్చిన మాజీ ఎమ్మెల్యే హైమావతి విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి, పార్టీ టికెట్ ఎవ్వరికీ ప్రకటించలేదని, అధిష్టానం సరైన సమయంలో అభ్యర్థిని ప్రకటిస్తుందని, అ వాస్తవాలతో పార్టీ క్యాడర్లో గందరగోళం సృష్టించడం సరికాదంటూ ఎమ్మెల్యే లలితకుమారికి అటాక్ ఇచ్చారు. దీంతో నిన్నటి వరకూ వీరి మధ్య సాగిన కోల్డ్‌వార్ ఇప్పుడు బహిర్గతమయింది. వెలమ సామాజిక వర్గానికి ఎస్.కోట స్థానం కేటాయిస్తారని, 2009లో రాజన్న హవాను తట్టుకున్న లలితకుమారిని కాదని టికెట్ వేరెవరికీ ఇవ్వరంటూ లలితకుమారి వర్గీయులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. కాగా గతంలో ఎమ్మెల్యేగా వ్యవహరించిన హైమావతి పనితీరు, ప్రజాఉద్యమాల్లో చురుకైన పాత్ర పోషించడం, పార్టీక్యాడర్పై మంచి పట్టుఉన్నందున సామాజిక వర్గాలకు అతీతంగా హైమావతికి టికెట్ వస్తుందని, ఇప్పటికే పార్టీ స్పష్టమైన సంకేతాలు ఇచ్చిందని ఆమె వర్గీయులు చెబుతున్నారు. అయోమయంలో పార్టీక్యాడర్ : ప్రజాదరణ తగ్గడం, క్యాడర్ పార్టీకి దూరంగా వెళ్లడం, రెండోస్థాయి లీడర్లంతా ఈ దఫా ఎన్నికల్లో పార్టీ మారేందుకు యత్నించడం, జిల్లాలో పలు స్థానాల్లో పార్టీలో ఉన్న గ్రూపు రాజకీయాలు, రెబల్స్‌తో అవస్థలు పడుతున్న చంద్రబాబుకు ఎస్.కోట మరో సమస్య అయింది. లలితకుమారి, హైమవతిల్లో ఎవరిని కాదన్నా పార్టీ కొంత బలగాన్ని, వర్గాన్ని వదులుకోవాల్సి వస్తుంది. ఈ పరిణామాలతో ఎస్.కోట స్థానాన్ని చేజేతులా వదులుకోవాల్సి వస్తుందన్న గుబులు పార్టీ వర్గాల్లో వ్యక్తమవుతోంది. ఎవరి వైపు వెళ్తే భవిష్యత్‌లో ఏ ఇబ్బందులు ఎదురవుతాయో అన్న ఆందోళన కార్యకర్తల్లో నెలకొంది.