నా మాటేంటి..?
Published Mon, Mar 17 2014 2:05 AM | Last Updated on Fri, Aug 10 2018 6:50 PM
సాక్షి ప్రతినిధి, విజయనగరం: తానున్నానంటూ ఎస్.కోట శాసనసభ నియోజక వర్గాని కి టీడీపీ టిక్కెట్ కోసం మరో అభ్యర్థి రేసులోకొచ్చారు. దీంతో ఇప్పటి వరకు జరిగిన వివాదం సద్దుమణిగిందంనుకుంటు న్న తరుణంలో టీడీపీలో మరో చిచ్చు రేగిం ది. సిట్టింగ్ శాసనసభ్యురాలు కోళ్ల లలితకుమారిపై నియోజక వర్గంలో ఉన్న అసంతృప్తిని క్యాష్ చేసుకునేందుకు మరో నేత తెరపైకొచ్చారు. టీడీపీ టిక్కెట్ ఆమెకిస్తే నెగ్గడం కష్టమని, ఈసారి టిక్కెట్ తనకే ఇవ్వాలంటూ టీడీపీ రాష్ట్ర బీసీ సెల్ కార్యదర్శి, లక్కవరపుకోట నాయకుడు రంధి మార్కండేయులు అకస్మాత్తుగా రేసులోకి వచ్చారు. ఇప్పటికే పార్టీ అధిష్ఠానం దూతల భరోసా కూడా తీసేసుకున్నారని తెలుస్తోంది. పార్టీపొలిట్ బ్యూరో సభ్యుడు పూసపాటి అశోక్ గజపతిరాజును, పార్టీ జిల్లా అధ్యక్షుడు ద్వారపురెడ్డి జగదీష్‌ను కలిసి బయోడేటా కూడా ఇచ్చారు. దీంతో కోళ్ల లలితకుమారి అయోమయ పరిస్థితికి చేరుకున్నారు. ఇంతవరకు పార్టీ రాష్ట్ర మహి ళా అధ్యక్షురాలు శోభా హైమావతి రూపంలో ఎదురైన పోటీని ఆమెకు ఇతరత్రా అవకాశా లు చూపించి అడ్డు తప్పించుకోగా తాజాగా తన సన్నిహితుడు, సొంత మండల నేత రేసులోకి రావడంతో కోళ్ల లలిత కుమారి జీర్ణించుకోలేకపోతున్నారు.
తొలుత శోభతో మానసిక క్షోభ..
ఎమ్మెల్యే లలితకుమారికి నియోజకవర్గంలో తీవ్ర వ్యతిరేకత కన్పిస్తున్న నేపథ్యంలో శోభాహైమావతి ఆ టిక్కెట్‌ను ఆశించారు. అందుకోసం తీవ్రంగా పోటీ పడ్డారు. ఒకానొక సందర్భంలో వేర్వేరు గ్రూపులు కట్టి, ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేసుకుని, ఒకరిపైఒకరు కత్తులు దూసుకున్నారు. టిక్కెట్ తమదంటే తమదేనంటూ కేడర్‌కు సంకేతాలిచ్చి గందరగోళం సృష్టించారు. పార్టీలో ఇద్దరు మహిళా నేతల మధ్య కుమ్మలాట ముదురుపాకాన పడడంతో అధినేత రంగంలోకి దిగాల్సి వచ్చింది. శోభాహైమావతి కుమార్తె స్వాతిరాణికి అరుకు పార్లమెంట్ టిక్కెట్ లేదా జెడ్పీ చైర్‌పర్సన్ రేసులో నిలబెడతానని హామీ ఇవ్వడంతో శోభా హైమావతి టిక్కెట్ రేసు నుంచి తప్పుకున్నారు. దీంతో పార్టీలో అంతవరకు నెలకొన్న వివాదం కొంతమేర తగ్గింది. ఇదేదో సద్దుమణిగిందనుకుంటే ఇప్పుడు మరో ఆశావహుడు తెరపైకొచ్చారు. రాజకీయ కురువృద్ధుడు, మాజీ మంత్రి కోళ్ల అప్పలనాయుడికి తెరవెనుక ఎంతో సహకరించిన లక్కవరపుకోట మండలానికి చెందిన దివంగత నేత రంధి అప్పలనాయుడు కుమారుడు మార్కండేయులు తాజాగా టిక్కెట్ రేసులోకి వచ్చారు.
గతంలో మాటిచ్చారు
టీడీపీ రాష్ట్ర బీసీ సెల్ కార్యదర్శిగా, రాజకీయ నేపథ్యం కలిగిన కుటుంబం నుంచి వచ్చిన వ్య క్తిగా తనకు టిక్కెట్ ఇవ్వాలని కోరుతున్నారు. అంతే కాకుండా గత ఎన్నికల్లో టిక్కెట్ కోసం ప్రయత్నించగా వచ్చేసారి చూద్దామని అధిష్ఠా నం చెప్పిందని, అప్పట్లో ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని డిమాండ్ చేస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే విశాఖ జిల్లా కీలక నేత, చంద్రబాబు కు సన్నిహితుడైన పారిశ్రామిక, వ్యాపార వేత్తను కలిసి భరోసా తీసుకున్నట్లు తెలుస్తోం ది. అలాగే పార్టీ సీనియర్ నేత పూసపాటి అశోక్ గజపతిరాజు, జిల్లా అధ్యక్షుడు ద్వారపురెడ్డి జగదీష్‌లను కలిసి తన గోడు వెళ్లబోసుకున్నారు. అంతటితో ఆగకుండా ఎస్.కోట టీడీపీ టిక్కెట్ తనకే వస్తుందంటూ నియోజకవర్గంలో ప్రత్యేకంగా కార్యకలాపాలు సాగిస్తున్నారు. దీంతో కోళ్ల లలితకుమారికి వ్యవహారం మింగుడుపడని పరిస్థితి వచ్చింది. సన్నిహిత నేతే టిక్కెట్ పోరులో నిలబడడంతో ఏం చేయాలో తేల్చుకోలేక ఆమె సతమతమవుతున్నారు.
Advertisement