Land allocation case
-
భూ కుంభకోణం.. సీఎం సిద్దరామయ్య భార్యపై కేసు
బెంగళూరు: కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య భార్య పార్వతి, ఆమె సోదరుడు మల్లికార్జున్, మరొకరిపై పోలీసులకు కేసు నమోదైంది. మైసూర్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ (ముడా) కుంభకోణంలో పోలీసులు ముగ్గురిపై కేసు నమోదు చేశారు. భూకేటాయింపుల కుంభకోణంలో సిద్ధరామయ్య, ఆయన సతీమణి పార్వతి, ముడా అధికారులతోపాటు మైసూరు జిల్లా కలెక్టర్, ఇతర ప్రభుత్వ అధికారులు ప్రమేయం ఉందని ఆరోపిస్తూ సామాజిక కార్యకర్త స్నేహమయి కృష్ణ ఈ ఫిర్యాదు చేశారు. ఈ వివాదంపై విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తూ కృష్ణ కర్ణాటక గవర్నర్, చీఫ్ సెక్రటరీ, రెవెన్యూ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీకి లేఖ కూడా రాశారు.స్నేహమయి కృష్ణ ఫిర్యాదు మేరకు.. సిద్ధరామయ్య బావమరిది మల్లికార్జున్ ఇతర ప్రభుత్వ, దేవాదాయ శాఖ అధికారుల సహకారంతో 2004లో అక్రమంగా భూమిని సేకరించి నకిలీ పత్రాలతో రిజిస్ట్రేషన్ చేయించుకున్నారని ఆరోపించారు. సీఎం సతీమణి పార్వతి, మల్లికార్జున్, మరో వ్యక్తి ఈ పత్రాలను ఉపయోగించి ముడాకు చెందిన కోట్లాది రూపాయలను మోసం చేశారని ఆరోపించారు.తన ఫిర్యాదుపై పోలీసులు అంగీకారపత్రం అందించారని, కానీ కేసు దర్యాప్తు కోసం ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) ఏర్పాటు చేసినందున ప్రత్యేక ఎఫ్ఐఆర్ నమోదు చేయలేదని ఆమె చెప్పారు.తన ఫిర్యాదు మేరకు ఏడు రోజుల్లోగా విచారణ జరిపి తగిన చర్యలు తీసుకోవాలని సామాజిక కార్యకర్త పోలీసులను కోరారు.కాగా 2021లో రాష్ట్రంలో బీజేపీ హయాంలో సిద్దరామయ్య భార్య ముడా ఆర్డర్‌కు లబ్ధిదారుగా ఉన్నందున భూ కేటాయింపుల కుంభకోణం వార్తల్లో నిలిచింది. ఆ సమయంలో ఆమెకు సంబంధించిన 3.16 ఎకరాల భూమిని అక్రమంగా సేకరించినందుకు పరిహారంగా... మైసూరులోని ప్రధాన ప్రదేశాలలో 38,284 చదరపు అడుగుల భూమిని తనకు కేటాయిచారు. మైసూరులోని కేసరే గ్రామంలోని 3.16 ఎకరాల భూమిని సోదరుడు మల్లికార్జున్ ఆమెకు బహుమతిగా ఇచ్చారు. అయితే ఈ భూమిని అభివృద్ధి కోసం ముడా స్వాధీనం చేసుకోగా.. పార్వతికి 2021లో బీజేపీ దక్షిణ మైసూర్‌లోని ప్రధాన ప్రాంతమైన విజయనగర్ 3, 4వ దశ లేఅవుట్లలోని సైట్లను ఆమెకు పరిహారం చెల్లించింది, ఇది కేసరే గ్రామంలోని అసలు భూమి కంటే చాలా ఎక్కువగా ఉందని ఆరోపణలు వచ్చాయి.అయితే, ఈ కేటాయింపును గత బీజేపీ ప్రభుత్వ హయాంలో జరిగిందని పేర్కొంటూ సిద్ధరామయ్య సమర్థించారు. కేసరెలోని దేవనూరు 3వ స్టేజీ లేఅవుట్లో స్థలాలు అందుబాటులో లేకపోవడంతో విజయనగరంలో ఉన్న స్థలాలకు పరిహారం చెల్లించాలని ముడా నిర్ణయించిందని ఆయన పేర్కొన్నారు. -
రూ.5 కోట్ల విలువైన భూమి రూ.5 లక్షలా..!
సాక్షి, హైదరాబాద్: సినీ దర్శకుడు ఎన్.శంకర్‌కు ఎకరం రూ.5 కోట్ల విలువైన భూమిని రూ.5 లక్షల చొప్పున ఐదెకరాలను కేటాయించడాన్ని ఏ విధంగా సమర్థించుకుంటారో తెలియజేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు వివరణ కోరింది. సినీ స్టూడియో కోసం ఔటర్ రింగ్‌రోడ్‌కు సమీపంలోని నివాస ప్రాంతంలో ఖరీదైన భూమిని ఏవిధంగా కేటాయించారో, ఈ చర్యను ఎలా సమర్థించుకుంటారో కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించింది. భూమిని కేటాయిస్తూ ప్రభుత్వం జారీ చేసిన జీవోను రద్దు చేయాలని కరీంనగర్ జిల్లా ధర్మపురికి చెందిన జె.శంకర్ దాఖలు చేసిన ప్రజాప్రయోజన వ్యాజ్యాన్ని సోమవారం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆర్ఎస్ చౌహాన్, న్యాయమూర్తి జస్టిస్ ఎ.అభిషేక్‌రెడ్డిల ధర్మాసనం మరోసారి విచారించింది. పిటిషనర్ తరఫు న్యాయవాది సరసాని సత్యంరెడ్డి వాదనలు వినిపిస్తూ, ఇదే తరహాలో ప్రభుత్వం పలువురికి కోట్లాది రూపాయల విలువైన భూముల్ని తక్కువ ధరలకే కేటాయించడాన్ని సవాల్ చేసిన వ్యాజ్యాలు హైకోర్టు విచారణలో ఉన్నాయని చెప్పారు. దీనిపై ధర్మాసనం స్పందిస్తూ, ఆ కేసులన్నింటనీ కలిపి విచారిస్తామని, ఈ కేసుల్లో మున్సిపల్ శాఖ ముఖ్య కార్యదర్శిని ప్రతివాదిగా చేస్తున్నట్లు స్పష్టం చేసింది. విచారణను 2 వారాలకు వాయిదా వేసింది. -
హూడా, వోరాలపై సీబీఐ చార్జిషీట్
న్యూఢిల్లీ: భూ కేటాయింపు కేసులో హరియాణా మాజీ ముఖ్యమంత్రి భూపిందర్‌సింగ్ హూడా, కాంగ్రెస్ నేత మోతీలాల్ వోరాలపై సీబీఐ చార్జిషీట్ దాఖలు చేసింది. పంచకులలో అసోసియేటెడ్ జర్నల్స్ లిమిటెడ్ (ఏజేఎల్)కు కేటాయించిన స్థలం విషయంలో అవకతవకలు జరిగాయని దర్యాప్తు సంస్థ ఆరోపించింది. పంచకులలోని స్థలం మోతీలాల్ వోరా చైర్మన్‌గా ఉన్న ఏజేఎల్‌కు కేటాయించిన విషయంలో ఖజానాకు రూ.67 లక్షలు నష్టం వాటిల్లిందని ప్రత్యేక కోర్టులో సీబీఐ చార్జిషీట్ దాఖలు చేసింది. ఏజేఎల్ గాంధీ కుటుంబ సభ్యులు, ఇతర కాంగ్రెస్ పెద్దల అధీనంలో నడుపబడుతున్న సంస్థ. నేషనల్ హెరాల్డ్ పత్రిక ఏజేఎల్ ఆధ్వర్యంలో వెలువడుతున్న విషయం విదితమే. -
వైఎస్ఆర్సీపీ నేత బాలశౌరిపై దాఖలైన పిటిషన్ కొట్టివేత
హైదరాబాద్: నెల్లూరులో బాలశౌరి చెందిన కంపెనీకి జరిపిన భూకేటాయింపులపై దాఖలైన పిటిషన్ ను హైకోర్టు కొట్టివేసింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ నేత బాలశౌరీకి జరిపిన భూకేటాయింపులపై వరప్రసాద్ అనే వ్యక్తి పిటిషన్ దాఖలు చేశారు. సీబీఐ దర్యాప్తు అంటూ ప్రతీ ఒక్కరూ హైకోర్టును ఆశ్రయించడంపై హైకోర్టు తప్పపట్టింది. గతంలో సీబీఐకి అధికారాలు లేవని గౌహతి కోర్టు స్పష్టం చేసిన విషయాన్ని పిటిషనర్ దృష్టికి తీసుకువచ్చింది. సీబీఐకి ఏం అధికారముందని హైకోర్టు ప్రశ్నించింది. ఏమైనా అభ్యంతరాలుంటే స్థానిక పోలీసులను ఆశ్రయించాలని పిటిషనర్‌కు హైకోర్టు సూచించింది.