ధరణిపై దండుగా కదలాలి
చేవెళ్ల: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ధరణి పోర్టల్‌పై అన్ని రాజకీయపార్టీలు, రైతులు దండుగా కదిలి పోరాడాలని భూ చట్టాల నిపుణుడు, నల్సార్ విశ్వవిద్యాలయ అనుబంధ ఆచార్యులు భూమి సునీల్ పిలుపునిచ్చారు. తెలంగాణలో భూములు రీ సర్వే చేస్తేనే ధరణి, భూ సమస్యలు పరిష్కారం అవుతాయన్నారు. రైతులు ఎదుర్కొంటున్న ఈ ప్రధాన అంశాన్ని అన్ని రాజకీయ పార్టీలు ఎజెండాగా చేసుకుని ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని కోరారు.
రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం కందవాడ గ్రామంలో శనివారం లీగల్ ఎంపవర్మెంట్ అండ్ అసిస్టెన్స్ ఫర్ ఫార్మర్స్ సొసైటీ (లీఫ్స్), గ్రామీణ న్యాయపీఠం సంస్థ, తెలంగాణ సోషల్‌మీడియా ఫోరం, తెలంగాణ రెవెన్యూ మాసపత్రిక ఆధ్వర్యంలో భూ న్యాయ శిబిరాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా భూ సమస్యలు ఎదుర్కొంటున్న రైతులకు ఉచిత న్యాయ సలహాలు అందించారు. ఈ సందర్భంగా సునీల్ మాట్లాడుతూ..రాష్ట్ర ప్రభుత్వం ధరణి పోర్టల్ తీసుకొచ్చి గ్రామస్థాయిలో పరిష్కరించుకోవాల్సిన సమస్యల్ని కలెక్టరేట్ వరకు తీసుకుపోయిందని ఆరోపించారు.
ధరణి పోర్టల్ సమస్యలపై త్వరలో గవర్నర్‌ను, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని కలిసి నివేదికను సమర్పిస్తామని పేర్కొన్నారు. ఈ శిబిరంలో తహసీల్దార్ల సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు, తెలంగాణ మాసపత్రిక సంపాదకులు వి.లచ్చిరెడ్డి, సోషల్ మీడియా ఫోరం అధ్యక్షుడు కరుణాకర్‌రెడ్డి, కిసాన్‌సెల్ నాయకులు కోదండరెడ్డి, బీజేపీ నేత కొండావిశ్వేశ్వర్‌రెడ్డి పాల్గొన్నారు.